ఒత్తిడిని పోగొట్టే 7 నియమాలు
‘ఆంధ్ర మహాభారతం’లో అరణ్యపర్యంలో ఎర్రాప్రగడ రచించిన పద్యం ఆధారంగా ఒత్తిళ్ల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంటున్నాం.
‘ఆలస్యం బొక ఇంతలేదు
శుచి ఆహారంబు నిత్యక్రియాజాలంబే వరము
అర్చనీయుల్ అతిథుల్ సత్యంబు బల్కన్ బడున్
మేలవు శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తుము
అట్లవుట ఎక్కాలంబున్ పటు, మృత్యు
రోగభయశంకన్ బొందమే మిమ్ములన్’
ఏ
పనీ ఆలస్యం చేయకపోవడం ఉత్తమం. దానివల్ల ఏ రకమైన ఒత్తిడీ ఉండదు. ఇది మొదటి
నియమం! శుచితో కూడిన ఆహారం అంటే శుభ్రమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యపరమైన
ఒత్తిళ్లు ఉండవు. ఇది రెండో నియమం! ఒక కాగితం మీద పనులను ఎప్పటికప్పుడు
రాసుకుని దాన్ని జేబులో పెట్టుకోవాలి. ఇది మూడో నియమం!
గుర్తొచ్చినప్పుడల్లా చేయాల్సిన పనులను ఆ కాగితం మీద రాసుకోవాలి.
అత్యవసరమైన పని వెంటనే చేసేస్తాం. సాయంత్రం చేయాల్సిన పని ఏదైనా ఉంటే
దాన్ని కాగితం మీద రాసుకుంటాం. రేపు చేయాల్సిన పని, ఎల్లుండి చేయాల్సిన పని
గుర్తురాదుగా! అందుకని రాసుకుంటాం. ‘అర్చనీయుల్ అతిథుల్’ అంటే ఇది
త్యాగానికీ, సేవకు సంబంధించినది. నాలుగో నియమం! ఇంటికొచ్చిన బంధువులకూ,
స్నేహితులకూ సేవ చేయడం ఒక రకం. మన కుటుంబంతో సంబంధం లేని వ్యక్తులకు మనం ఏం
చేయగలమో చూడాలి. ఓ వృద్ధాశ్రమానికి వెళ్లి ఏమైనా చేయగలమా? ఓ ఆసుపత్రికి
వెళ్లి ఎవరికైనా సేవ చేయగలమా? అనేది ఆలోచించాలి. ఇవన్నీ అతిథి సేవల కిందకే
వస్తాయి. దీనివల్ల త్యాగభావం పెరుగుతుంది. జీవితం పట్ల, మన శరీరం పట్ల ఒక
పవిత్రభావం ఏర్పడుతుంది. మన జీవితం మన కోసమే కాదు, ఇంకొకరి కోసం కూడా
అనిపించినప్పుడు మన జీవితం పట్ల మనకు ప్రేమ ఏర్పడుతుంది.
‘సత్యంబు
బల్కన్ బడున్’ అంటే సత్యమే మాట్లాడాలి. ఇది అయిదో నియమం! ఎవడో పీక మీద
కత్తిపెడితే అబద్ధం చెప్పారంటే తప్పు లేదు. ఏమీలేకుండానే అన్నింటికీ
అబద్ధాలాడటం సరి కాదు. ‘మేలవు శాంతియు’ అంటే చేసేదేదో చేశాం. ఇక మనస్సులో
శాంతి ఉండాలి. సమాజంలో జరిగే అన్ని విషయాల గురించి అస్తమానం ఆలోచించొద్దు.
ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సమయాన్ని వృథా చేసేవి చూడటం
మానేయాలి. ఇది ఆరో నియమం! బ్రహ్మచర్యం ఏడో నియమం! పెళ్లి కానంత వరకు
స్త్రీసాంగత్యాన్ని పురుషుడు, పురుషుని సాంగత్యాన్ని స్త్రీ కోరకూడదు.
దీనివల్ల కలిసొచ్చేదేమిటి? ఈ ఏడు నియమాలనూ పాటించగలిగితే మృత్యు భయం ఉండదు.
రోగ భయం ఉండదు. ఇది మన పెద్దలు చెప్పిన మంచి మాట! మనందరం అనుసరించాల్సిన
బాట!!
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565