MohanPublications Print Books Online store clik Here Devullu.com

ప్రపంచ మలేరియా దినం_world malaria day


ప్రపంచ మలేరియా దినం world malaria day malaria day malaria female anopheles mosquito female mosquito mosquito mosquito coil anopheles mosquito bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu

ప్రపంచ మలేరియా దినం


ప్రపంచ మలేరియా దినం సంకల్పం బాగానే తీసుకుంటున్నాం. అనాదిగా యుద్ధమూ చేస్తున్నాం. అస్త్రాలకూ కొదవలేదు. అయినా శత్రువు లొంగటం లేదు సరికదా.. మరింత బలమూ పుంజుకుంటోంది. చెట్టంత మనిషికి ‘చలి’ పుట్టిస్తోంది. ఒళ్లంతా ‘వణుకు’ తెప్పిస్తోంది. అవును.. మలేరియా మనకింకా కొరకరాని కొయ్యగానే మిగిలిపోయింది. దోమల సంతతో ముసురుకొచ్చే ఇప్పుడిది కొత్త వ్యూహాలు పన్నుతూ.. ఒకేసారి రెండు, మూడు పరాన్నజీవులతో.. ఉమ్మడిగానూ విరుచుకుపడుతోంది. ఇప్పటికైనా మేలుకోకపోతే మరిన్ని చిక్కులు తప్పవు. అందుకే ‘మలేరియాను ఓడించటానికి సిద్ధం కండి’ అంటూ పిలుపిస్తోంది ఈ ఏటి ప్రపంచ మలేరియా దినం.



మలేరియా మనకు కొత్త సమస్యేమీ కాదు. అనాదిగా మానవాళిని ముప్పు తిప్పలు పెడుతున్నదే. మనదేశంలో ఏటా కోటి మంది దీని బారినపడుతుండగా.. 40-50 వేల మంది మరణిస్తున్నారని అంచనా. పసిపిల్లలు, ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులకు ఇది మరింత ప్రమాదకరంగానూ పరిణమిస్తోంది. మలేరియా కారణంగా మరణిస్తున్నవారిలో 70% మంది ఐదేళ్లలోపు పిల్లలే కావటం గమనార్హం. నిజానికి ఈ మరణాలను ఆపటం పెద్ద విషయమేమీ కాదు. మలేరియాను మోసుకొచ్చే దోమల సంతను అడ్డుకోవటం, దోమలు కుట్టకుండా చూసుకోవటం ద్వారా వీటిని చాలావరకు నివారించుకోవచ్చు. ఒకవేళ మలేరియా వచ్చినా సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా బయటపడొచ్చు కూడా. కాకపోతే దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి, చికిత్స ఆరంభించటం ముఖ్యం. అవసరమైనప్పుడు పూర్తికాలం మందులు వాడటమే కాదు.. డాక్టర్‌ సలహా లేకుండా అనవసరంగా, విచక్షణా రహితంగా మందులు వాడకపోవటం కూడా కీలకమే. లేకపోతే పరాన్నజీవి మలేరియా మందులను తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. సమస్య మరింత మొండిగానూ తయారవుతుంది. ఇప్పటికే మనదేశంలో ఇలాంటి పరిణామాలు మొదలయ్యాయి. వీటికితోడు ఇప్పుడు ఒకే దోమ రెండు, మూడు రకాల మలేరియా పరాన్నజీవులను మోసుకొస్తూ.. ‘మిశ్రమ ఇన్‌ఫెక్షన్‌’కూ దారితీస్తోంది. దీంతో ఒకేసారి రెండు, మూడు రకాల మలేరియా కూడా కనబడుతోంది. దీన్ని పోల్చుకోలేకపోవటం, సరిగా గుర్తించలేకపోవటం వల్ల తీవ్ర సమస్యగానూ మారుతోంది. చికిత్స కూడా కష్టమైపోతోంది.


ప్రధానంగా రెండు రకాలు
మలేరియా జ్వరానికి మూలకారణం ‘ప్లాస్మోడియం’ పరాన్నజీవి. ఇది ఆడ అనాఫిలెస్‌ దోమల ద్వారా వ్యాపిస్తుంది. దోమలు తమ గుడ్లను వృద్ధి చేసుకోవటానికి రక్తం అవసరం. అందుకే ఇవి మనుషులను కుడుతుంటాయి. ఈ క్రమంలో అప్పటికే మలేరియాతో బాధపడుతున్న వ్యక్తిని కుట్టిన దోమలు అనంతరం మరొకరిని కుట్టటం ద్వారా మలేరియా కారక పరాన్నజీవి మనుషులకు వ్యాపిస్తుంది. ఈ పరాన్నజీవిలో ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌, ఒవేల్‌, మలేరియే అని నాలుగు రకాలున్నాయి. ఒవేల్‌లో మళ్లీ రెండు రకాలు కనబడతాయి. వీటితో పాటు కోతుల్లో కనబడే నోవలేసే రకం కూడా ఇప్పుడు మనుషులకు విస్తరిస్తోంది. వీటన్నింటిలోనూ ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌లతో వచ్చే మలేరియాలే తరచుగా కనబడుతుంటాయి. వీటిల్లోనూ ఫాల్సిఫారమ్‌ మలేరియా ఇంకా ఎక్కువ.


ఉమ్మడిగా దాడి..
మలేరియాతో ముంచుకొస్తున్న మరో సమస్య ఒకేసారి రెండు, మూడు ప్లాస్మోడియం రకాలు దాడి చేస్తుండటం. దీన్నే మిశ్రమ ఇన్‌ఫెక్షన్‌ అంటున్నారు. ఒకప్పుడు అరుదని భావించేవారు కానీ ఇదిప్పుడు తరచుగానూ కనబడుతోంది. కొన్నిసార్లు ఒకే దోమలో ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌ వంటి రకాలు ఉండొచ్చు. ఇవి కలిసి దాడి చేయటమే మిశ్రమ ఇన్‌ఫెక్షన్‌కు దోహదం చేస్తోంది. సాధారణంగా చికిత్స తీసుకున్నాక ఫాల్సిఫారమ్‌ రకం మలేరియా తిరగబెట్టటమనేది అరుదు. అయితే కొందరిలో చికిత్సతో మలేరియా తగ్గినా మళ్లీ మళ్లీ వస్తుండటంతో దీనికి కారణమేంటనేదానిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరిని మళ్లీ దోమ కుట్టిందా? కొత్తగా మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందా? అని పరిశీలించారు. అయితే మొదటిసారి దోమ కుట్టినపుడే ఒకటి కన్నా ఎక్కువ ప్లాస్మోడియం రకాలు ఒంట్లోకి ప్రవేశిస్తున్నట్టు బయటపడటం గమనార్హం. వీటిల్లో ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌ రకాలే ఎక్కువగా కనబడుతున్నాయి. తీవ్ర మలేరియా బారినపడుతున్నవారిలో సుమారు 5% మందిలో మిశ్రమ ఇన్‌ఫెక్షన్‌ ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.


చలీ, వణుకు..
మలేరియాలో విపరీతమైన చలి, వణుకుతో తీవ్రమైన జ్వరం ముంచుకొస్తుంది. సాధారణంగా మలేరియా పరాన్నజీవి రక్తంలోకి ప్రవేశించాక కాలేయంలోకి చేరుకొని వృద్ధి చెందుతుంది. అక్కడ్నుంచి రక్తంలో కలిసిపోయి రక్తకణాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో విషతుల్యాలు విడుదలై చలి, వణుకు వంటివి మొదలవుతాయి. తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు కూడా ఉండొచ్చు. చిన్నపిల్లల్లో కొందరికి నీళ్ల విరేచనాలూ కావొచ్చు. సమస్య తీవ్రమవుతున్నకొద్దీ రక్తహీనత, కామెర్ల వంటి సమస్యలూ వేధిస్తాయి. ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నం కావటం వల్ల హిమోగ్లోబిన్‌ కిడ్నీల ద్వారా బయటకు రావొచ్చు. దీంతో మూత్రం నల్లగా రావొచ్చు. ఒకప్పుడు గిరిజన ప్రాంతాలకే పరిమితమైన ఫాల్సిఫారమ్‌ ఇప్పుడు పట్టణ ప్రాంతాలకూ విస్తరించింది. ప్రస్తుతం నగరాల్లో ఫాల్సిఫారమ్‌ రకమే ఎక్కువగా కనబడుతోంది. ఇది వైవాక్స్‌ కన్నా ప్రమాదకరమైంది కూడా. దీంతో దుష్ప్రభావాలూ ఎక్కువే. కొందరిలో కాలేయం, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలూ దెబ్బతినొచ్చు. అంతేకాదు... ఫాల్సిఫారమ్‌ పరాన్నజీవుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి కేశరక్తనాళికల్లో చిక్కుకుపోవచ్చు. దీంతో అవయవాలకు ఆక్సిజన్‌ తగ్గుతుంది. రక్తకణాలు విచ్ఛిన్నం కావటం వల్ల రక్తహీనత రావొచ్చు. కాలేయం నుంచి పిత్తాశయానికి వెళ్లే నాళాల్లో అడ్డంకులూ తలెత్తొచ్చు. కొన్నిసార్లు ఊపిరితిత్తులు దెబ్బతిని ఏఆర్‌డీఎస్‌ వచ్చి, పలు అవయవాలు పనిచేయలేని స్థితికి చేరుకోవచ్చు. దీన్ని గుర్తించి, సరైన చికిత్స అందించకపోతే ప్రాణాపాయానికి దారితీస్తుంది.


నివారణ కీలకం
మలేరియా నివారణకు దోమలు కుట్టకుండా చూసుకోవటం ఒక్కటే మార్గం. ఇందుకోసం..
* అందరూ దోమ తెరలు వాడుకోవాలి. కిటికీలకు జాలీలు బిగించుకోవాలి. తెరలు వేలాడదీయాలి.
* దోమలు కుట్టకుండా పొడవు చేతుల చొక్కాలు వేసుకోవాలి. దోమలు కుట్టకుండా చూసే పూత మందులు కూడా చర్మానికి రాసుకోవచ్చు.
* ఇప్పుడు దోమలను చంపే మందు పూత పూసిన దోమ తెరలు కూడా వస్తున్నాయి. మలేరియా ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో వీటిని వాడుకోవటం మంచిది.
* దోమలను చంపటానికి ఇంట్లో స్ప్రేలతో మందు (ఇండోర్‌ రెసిడ్యుయల్‌ స్ప్రేయింగ్‌- ఐఆర్‌ఎస్‌) కూడా చల్లుకోవచ్చు. వీటిని ఒకసారి చల్లితే 3-6 నెలల వరకూ పనిచేస్తాయి.


సమర్థవంత పరీక్షలున్నాయి
మలేరియాను కచ్చితంగా, త్వరగా గుర్తించటానికి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ర్యాపిడ్‌ డయాగ్నొస్టిక్‌ టెస్ట్‌ (ఆర్‌డీటీ) ప్యారాసైట్‌ ఎఫ్‌, వి ద్వారా ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌ రకం మలేరియాలను గుర్తించొచ్చు. మలేరియా పరాన్నజీవిలో కనబడే ప్రత్యేకమైన ప్రోటీన్‌ ఆధారంగా ఇది సమస్యను నిర్ధరిస్తుంది. రెండు కన్నా ఎక్కువ రకాల పరాన్నజీవులను గుర్తించటానికి ఇప్పుడు ‘పారామ్యాక్స్‌ కిట్‌’ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ పరీక్షలకు పెద్దగా నైపుణ్యం అవసరం లేదు. ఎక్కడైనా చేయొచ్చు. ఖర్చు కూడా తక్కువ. వీటితో ఎలాంటి రకం మలేరియానైనా చాలా త్వరగా, కచ్చితంగా, చవకగా నిర్ధరించటానికి వీలుంది.
* మనదేశంలో ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌ రకం మలేరియాలే తరచుగా కనబడుతుంటాయి. అయితే ఇటీవలి కాలంలో ఆఫ్రికా వంటి దేశాలకు ప్రయాణాలు ఎక్కువైన నేపథ్యంలో అన్నిరకాల మలేరియా జ్వరాలను గుర్తించాల్సిన అవసరముంది.



ఏంటీ ప్రమాదం?





ఏదో ఒకరకం మలేరియాలో కన్నా మిశ్రమ మలేరియాలో జ్వరం మరింత తీవ్రంగా ఉంటుంది. జ్వరం తీరుతెన్నులను అంచనా వేయటం కూడా కష్టమే. సాధారణంగా వైవాక్స్‌ రకం మలేరియాలో జ్వరం రోజు విడిచి రోజు వస్తుంటుంది. ఫాల్సిఫారమ్‌లో రోజూ జ్వరం, జ్వరంలో విపరీతమైన చలి ఉంటాయి. అదే రెండు కలిసి ఉన్నప్పుడు జ్వరం మరింత ఉద్ధృతంగా వస్తుంది. జ్వరం రావటం, తగ్గటంలో ఒక పద్ధతంటూ ఉండదు. చలి, వణుకు వంటి లక్షణాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. మలేరియా మూలంగా తలెత్తే కామెర్లు, రక్తహీనత, కిడ్నీలు దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు కూడా వీరిలో మరింత త్వరగా వచ్చే అవకాశముంది. చికిత్స తీసుకున్నప్పుడు ఫాల్సిఫారమ్‌ రకం తగ్గినప్పటికీ.. వైవాక్స్‌ మూలంగా మళ్లీ మలేరియా దాడిచేయొచ్చు. అప్పటికే బలహీనంగా ఉన్నవారికిది మరింత హాని చేస్తుంది. ఈసారి జ్వరం మరింత ఉద్ధృతంగానూ ఉంటుంది.


చికిత్సలోనూ తేడా
ఫాల్సిఫారమ్‌ రకం మలేరియాకు 3 రోజుల పాటు మందులిస్తే సరిపోతుంది. ఆర్టీమినిసిన్‌ మందు దీనికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మలేరియా పరాన్నజీవి దీన్ని తట్టుకునే సామర్థ్యం సంతరించుకుంటుండటంతో ఆర్టీమినిసిన్‌కు లూమిఫాంటిన్‌, మెఫ్లోక్విన్‌, సల్ఫాడాక్సిన్‌/పైరిమెథమైన్‌ వంటి ఇతరత్రా మందులను కలిపి కాంబినేషన్‌ చికిత్స (ఏసీటీ) చేస్తున్నారు. దీంతో ఫాల్సిఫారమ్‌ మలేరియా పూర్తిగా నమయైపోతుంది. కానీ వైవాక్స్‌ అలా కాదు. ఇది క్లోరోక్విన్‌ మాత్రలతో ముందు తగ్గినా.. దోమలేవీ కుట్టకపోయినా కొన్నాళ్లకు మళ్లీ తిరగబెట్టొచ్చు. దీన్ని నివారించటానికి రెండు వారాల పాటు ‘ప్రైమాక్విన్‌’ అనే మందునూ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఒకే సమయంలో ఫాల్సిఫారమ్‌తో పాటు వైవాక్స్‌ వంటి ఇతర రకాలతో కూడిన మిశ్రమ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టయితే చికిత్స విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే సమస్య మళ్లీ మళ్లీ తిరగబెట్టొచ్చు. అది ఈసారి తీవ్రంగానూ దాడిచేయొచ్చు. పాల్సిఫారమ్‌తో కూడిన మిశ్రమ ఇన్‌ఫెక్షన్లకు మామూలుగా ఫాల్సిఫారమ్‌ చికిత్సనే ఇవ్వాలి. ఎందుకంటే ఆర్టిమినిసిన్‌ కాంపౌండ్‌ చికిత్స వైవాక్స్‌ వంటి వాటికి పనికిరాదు. అలాగే వీరికి ఈ చికిత్స అనంతరం రెండు వారాల పాటు ప్రైమాక్విన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వైవాక్స్‌ మలేరియా తిరగబెట్టకుండా చూసుకోవచ్చు. అయితే ప్రైమాక్విన్‌తో చిక్కేంటంటే- జీ6పీడీ ఎంజైమ్‌ లోపం గలవారికి దీంతో రక్తం విచ్ఛినమయ్యే (హిమోలైసిస్‌) అవకాశముంది. కాబట్టి ముందుగా జీ6పీడీ లోపాన్ని గుర్తించే రక్తపరీక్ష చేయటం తప్పనిసరి. ఈ పరీక్ష అందుబాటులో లేని ప్రాంతాల్లో జబ్బు తీవ్రతను బట్టి డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. అలాగే గర్భిణులకు, పిల్లలకు ప్రైమాక్విన్‌ ఇవ్వటంలోనూ జాగ్రత్తగా ఉండాలి. దీన్ని తీసుకుంటున్న సమయంలో మూత్రం ముదురురంగులో రావటం, కళ్లు పచ్చబడటం, పెదవులు నల్లబడటం, కడుపునొప్పి, వాంతి, వికారం, ఆయాసం వంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్‌ను సంప్రతించటం మంచిది.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list