వేసవిలో వర్ణరంజితంగా...
ఈ కాలంలో ఎంచుకునే దుస్తుల నుంచి కాలికి వేసుకునే చెప్పులవరకూ అన్నీ వేడిని గ్రహించి చల్లదనాన్ని అందించేవై ఉండాలి. పైగా ట్రెండీగా ఉండాలి... ఫ్యాషన్‌గానూ కనిపించాలి. అలాంటివి కూడా ఉంటాయా అంటారా... ఉంటాయి. ఆ వివరాలే చెబుతున్నారు డిజైనర్ నిహారికారెడ్డి.* వస్త్రం: ఇప్పటివరకూ షిఫాన్‌లూ, జార్జెట్‌లూ, రాసిల్క్ అంటూ వెచ్చదనాన్ని అందించే వస్త్రశ్రేణిని ఎంచుకున్నాం కానీ కాలంతో పాటు వాటికిచ్చే ప్రాధాన్యం మారుతుంది. అందుకే ఈ వేసవికి తగ్గట్లు అప్‌డేట్ అవ్వాల్సిందే. మీరు క్యాజువల్ వేర్‌గా ఎంచుకునే ప్రతిదీ మీకు అదనపు అందాన్నీ, అంతే సౌకర్యాన్ని తెచ్చిపెట్టాలి. అలాంటివాటిల్లో నూలు, లినిన్, రేయాన్, పోచంపల్లి ఇకత్, మంగళగిరి కాటన్, పొందూరు ఖద్దరుతో పాటు ఇప్పుడు నారతో చేసిన వస్త్రం అందుబాటులో ఉంటుంది. ఇవి ఎంతో సౌకర్యంగా ఉండటమే కాదు, చెమటనూ పీల్చేసుకుంటాయి. వీటితో పాటు ఇకత్, కలంకారీ, మధుబనీ, టై అండ్ డై వంటి రకాలతోనూ ఆకట్టుకోవచ్చు.
* డిజైన్లు: కలంకారీ, ఇకత్, బాందినీ అనార్కలీ గౌన్‌లూ, వదులుగా ఉండే నెక్ డిజైన్ల వంటివి బాగుంటాయి. వీలైనంతవరకూ ఈ కాలంలో హైనెక్‌లూ, కాలర్ నెక్‌ల వంటివాటికంటే రౌండ్ నెక్‌లూ, కోల్డ్‌షోల్డర్‌ల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. కుర్తీలకు ఫ్రంట్, సైడ్ స్లిట్ డిజైన్‌లు నప్పుతాయి.* నగలు: ఈ కాలంలో వీలైనంత తక్కువ నగల్ని వేసుకోవడమే మేలు. టెర్రకోట, చెక్క, డై -ఫ్లవర్ జ్యూయలరీ బాగుంటుంది. వీటితో పాటు కలంకారీ చెవిపోగులూ, నెక్లెస్‌లు హుందాతనాన్ని తెచ్చిపెడుతన్నాయి. ఇవన్నీ కాస్త కలర్‌ఫుల్‌గానూ ఉండటంతో మీరూ కొత్తగానూ కనిపిస్తారు. ఈ కాలంలో ఆక్సిడైజ్డ్ సిల్వర్, సిల్క్ త్రెడ్ జ్యూయలరీని వాడకపోవడమే మేలు. వీటన్నింటికీ మించి తేలిగ్గా ఉండి ఇట్టే ఆకర్షించే ఫెదర్ జ్యుయలరీ ఎప్పటికీ అమ్మాయిల హాట్‌ఫేవరెట్టే కాబట్టి వాటిని ప్రయత్నించొచ్చు. * ఇతర యాక్సెసరీలు: వెదురు నారతో చేసిన చెప్పులు ఈ వేసవికి సరిగ్గా నప్పుతాయి. ఇవి కాకుండా కలంకారీ, జీన్స్‌తో చేసిన చెప్పుల రకాలెన్నో అందుబాటులో ఉన్నాయి. ఇక జనపనారతో చేసిన జ్యూతీలూ, ఫ్లిఫ్‌ఫ్లాప్స్ సంగతి చెప్పనే అక్కర్లేదు. అలానే జ్యూట్, కలంకారీ, జీన్స్ హ్యాండ్‌బ్యాగ్‌లూ, బ్యాక్‌ప్యాక్‌లూ చల్లదనాన్ని ఇచ్చేవే. అచ్చంగా వాటినే ఎంచుకోవచ్చు లేదా వేరే వస్త్రంతో కలిపి డిజైన్ చేసిన వాటినీ మీ అవసరానికి తగ్గట్లుగానూ ప్రయత్నించొచ్చు. ఇవేకాదు ప్రింటెడ్ లినిన్, ఇకత్ స్కార్ఫ్‌లూ వేసుకోవచ్చు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565