ఆదిశంకరులు...
ఆర్ష సంస్కృతి పరిరక్షణకు కంకణం కట్టుకున్న ధీబలశాలి. బుద్ధి జీవులందరినీ ఒక తాటి మీద నడిపించిన మేధావి. తన సమకాలీన మత పరిస్థితులన్నిటినీ సమన్వయం చేసి... భావితరాలకు జ్ఞానమార్గం చూపిన దార్శనికుడు గురువులకు గురువు. జగత్తంతా అనుసరించిన మహాగురువు. ‘నువ్వు వేరు... నేను వేరు’ అనే సంకుచిత మార్గం నుంచి ‘నువ్వూ నేనూ, అందరమూ, అన్నీ ఒకటే’ అన్న విశాల మార్గంలోకి ప్రజలనందరినీ రప్పించిన వేదాంత నాయకులు ఆది శంకరులు. ఆయన జీవన గమనంలోని అనేక ఘట్టాలు ఇప్పటికీ దారిచూపే దీపాలు...
జీవుడే బ్రహ్మం. బ్రహ్మమే జీవుడు. ఆ ఇద్దరికీ తేడాలేదు. చుట్టూ కనిపించేదంతా మాయమాత్రమే. జీవుడు అవిద్య కారణంగా ఆ మాయను గుర్తించలేకపోతున్నాడు. అవిద్య నుంచి బయటపడి తనను తాను తెలుసుకోగలగాలి.
జన్మస్థలం: కాలడి, కేరళ
తల్లిదండ్రులు: ఆర్యాంబ, శివగురువు
జనన కాలం: క్రీ.శ.788
గురువు: గోవింద భగవత్పాదులు
రచనలు: 108 గ్రంథాలు రాశారు. కనకధారా స్తోత్రం, గణేశ పంచరత్న స్తోత్రం, భజగోవిందం, శివానందలహరి, సౌందర్యలహరి, లక్ష్మీనృసింహకరావలంబం శంకర విరచితాలు.
సిద్ధాంతం: అద్వైతం
* దేశ సమైక్యత
‘వీడు నా వాడు, వాడు పరాయివాడు అన్నది అల్ప బుద్ధుల ఆలోచన. ఈ ప్రపంచమంతా నా కుటుంబమే. అనేది విజ్ఞుల దృష్టి. ఆది శంకరాచార్యులు రెండో కోవకు చెందిన వారు. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ యావద్భారతాన్ని రెండుసార్లు చుట్టారు. మన సంస్కృతీసంప్రదాయాల్లో ఉన్న భిన్నత్వాన్ని చూశారు. వీటి మధ్య ఏకత్వాన్ని సాధించాలనుకున్నారు. భారతదేశంలో తూర్పు దిక్కున పూరీలో గోవర్థన పీఠాన్ని, దక్షిణాన శృంగేరిలో శారదా పీఠాన్ని, పశ్చిమాన ద్వారకలో కాళికా పీఠాన్ని, ఉత్తర దిక్కున బదరిలో శ్రీ పీఠాన్ని స్ధాపించారు. దేశం మొత్తం ఐక్యంగా ఉండాలన్న దూరదృష్టిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆయన అప్పుడే విశదీకరించారు.
* ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులోనే
ఒకసారి శంకరులకు ఓ ఎనభై ఏళ్ల వృద్ధుడు ‘డుకృజ్ఞ్ కరణే’ అంటూ వ్యాకరణ సూత్రాలు వల్లెవేస్తూ కనిపించాడు. అప్పుడు జగద్గురువు..
భజగోవిందం భజగోవిందం గోవిందంభజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి డుకృజ్ఞ్కరణే
‘ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావు. కుటుంబ పోషణ కోసం వ్యాకరణం చదవాల్సిందే. నీ అవసరం, వయస్సు అయిపోయాయి. ఇప్పుడు కావాల్సింది భగవత్ చింతన. అంటూనే మరికొన్ని విషయాలను కూడా చెప్పారు. మన జీవితాలు హాయిగా గడవడానికి లౌకిక విద్యలు నేర్చుకోవాలి. కానీ పారమార్థికచింతనే అన్ని చింతలనూ దూరం చేస్తుంది. మనిషికి ఉన్నతమైన మార్గాలను ఉపదేశిస్తుందని వివరించారు.
* ఆదర్శమార్గం
ఆది శంకరులు జగద్గురువు. అంటే ఆయన చేసిన బోధనలన్నీ తత్త్వ సంబంధమైనవే కదా... నేటియువతకు ఉపయోగమేంటి? అనే సందేహం కలుగుతుంది. దీనికి సమాధానం శంకరుని జీవితంలోని సంఘటనలే చెబుతాయి. సనందుడు అనే విద్యార్థి శంకరుల వద్ద చదువుకోడానికి వచ్చాడు. చెప్పింది చెప్పినట్లు చదవడంతో అతనంటే శంకరులకు ఇష్టం పెరిగింది. అది మిగిలినవారికి కష్టమనిపించింది. ఆ విషయాన్ని శంకరాచార్యులు గమనించి వాస్తవాన్ని అందరికీ తెలియజెప్పాలనుకున్నారు. ఓ రోజున సనందుడు, ఇతర శిష్యులు నదికి అవతల వైపు ఉన్నారు. ఇవతలి వైపు శంకరుడు, సనందుడిని కేకవేసి పిలిచారు. నది దాటడానికి అక్కడ ఓ సాధనమూ లేదు. సనందుడు గురువు పిలిచాడు కాబట్టి నేను వెళ్లాలి అనే దృఢ సంకల్పంతో నది మీద అడుగులేసుకుంటూ సనందుడు నది దాటాడు. సంకల్ప బలంతో అతడి అడుగుల కింద నీటి మీద తేలే పద్మాలు పుట్టుకొచ్చాయి. అప్పటినుంచి ఆయన పద్మపాదుడనే పేరు పొందారు. ఆ సంఘటన ద్వారా గురువు మాట మీద గురి ఎలా ఉండాలో నిరూపించారు.
ఆది శంకరుల ఆదర్శ గుణాల్లో జ్ఞాపకశక్తి ఒకటి. కేరళ రాజు రాజశేఖరుడు ఓ మూడు నాటకాలు రాసి వాటిని శంకరాచార్యుల ముందు వినిపించాడు. ఆ తర్వాత చాలా కాలానికి మళ్లీ శంకరాచార్యుడు ఆయన దగ్గరకొచ్చినప్పుడు తాను రాసిన మూడు నాటకాలు అగ్ని ప్రమాదంలో మసి అయిపోయాయని బాధ పడ్డాడు రాజశేఖరుడు. అప్పుడు శంకరాచార్యులు ‘నువ్వు నాకు వినిపించిన నాటకాలు విన్నదివిన్నట్లు మళ్లీ చెబుతాను రాసుకో’ అని మూడు నాటకాలను, అక్షరం పొల్లుపోకుండా తిరిగి చెప్పాడు. శంకరుల మేథోశక్తికి ఇదో మచ్చుతునక.
* దురాచారాల మీద తిరుగుబాటు
పీత్వా పునః పీత్వా, యావత్పతతి భూతలే
పురుత్థాయవై పీత్వా, పునర్జన్మ న విద్యతే
‘మద్యం తాగండి, ఇంకా తాగండి, నేలమీద పడిపోయేంత వరకు మరలా తాగండి, స్పృహ వచ్చాక లేచి మళ్లీ తాగి పూజ చేయండి. దీంతో మీకు పునర్జన్మ అనేదే ఉండదు...’ శంకర భగవత్పాదుల వారు జన్మించే నాటికి వామాచారులు అనుసరిస్తున్న అవైదిక పూజా విధానమిది. శైవం, వైష్ణవం, సౌరం, గాణాపత్యం, శాక్తేయం, స్కాందం... వీటిని షణ్మతాలంటారు. ఇవన్నీ వైదిక మార్గానికి చెందిన సంప్రదాయాలే. కానీ కాలాంతరంలో వీటిలోకి వేద విరుద్ధమైన, జుగుప్సాకరమైన ఆచార, వ్యవహారాలు ప్రవేశించాయి. రామసేతువులో మద్యపానం చేసి దేవీ పూజ చేసే శాక్తులున్నారు. కాంచీపురంలో తాంత్రికులున్నారు. విదర్భలో భైరవోపాసకులున్నారు. కర్ణాటకలో కాపాలికులున్నారు. సౌరాష్ట్ర, ద్వారకవంటి చోట్ల పాషండులు, కణాదులు, సాంఖ్యులు, పాంచరాత్రులు వంటివారున్నారు. దురాచారాలతో అశాంతి సృష్టిస్తున్న వీరిని ఎదుర్కోవడం అంటే ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. శంకరాచార్యులు అనితర సాధ్యమైన ప్రయత్నం చేసి వాటిలో పాతుకుపోయిన కుసంప్రదాయాలను తొలగించారు. అన్నిటినీ వైదిక మార్గంలోకి మళ్లించారు
- డా.. పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565