విషానికి విరుగుడు మారేడు!
‘‘మా రేడు (రాజు) నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు’’ .. అంటూ నిత్యం కోట్లాది హిందువులు శివుడిని బిల్వపత్రాలతో పూజిస్తూ ఉంటారు. కానీ.. శివుడి మెడలో ఉండే నాగుపాము విషానికి విరుగుడు ఆ బిల్వవృక్షమేనన్న విషయం చాలామందికి తెలియదు. తిరువనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ ట్రాపికల్ బోటానికల్ గార్డెన్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ ఎస్. శివకుమార్ ఈ విషయాన్ని ఇటీవలే శాస్త్రీయంగా నిరూపించారు. ‘ప్రత్యామ్నాయ వైద్య పద్ధతుల్లో పాము కాటుకు అనేక వైద్యాలున్నాయి. దాదాపు 350 రకాల ఔషధ మొక్కలకు చెందిన భాగాలను ఉపయోగించవచ్చని మనకు తెలుసు. కానీ దానిని శాస్త్రీయంగా నిరూపించడం మాత్రం బహుశా ఇదే తొలిసారి’ అని ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివకుమార్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల్లో ముఖ్యాంశాలు..
60 చెట్లను గుర్తించగా..
‘మన దేశంలో నాలుగు ప్రధాన రకాల పాముల కాట్లతో ప్రజలు చనిపోతున్నారు. వీటికి విరుగుడుగా ప్రత్యామ్నాయ వైద్య పద్ధతుల్లో ఉపయోగించే 60 చెట్లను మేము గుర్తించాం. వీటిలో మారేడుపై మేము చేసిన ప్రయోగాలు ఫలించాయి. మిగిలిన మొక్కలపై కూడా పరిశోధనలు చేసి ఒక ఫార్ములా తయారుచేస్తాం. ఇది అన్ని రకాల పాము విషాలకూ పనికొస్తుంది’ అని హైదరాబాద్‌కు చెందిన లాకోన్స్‌కు చెందిన డాక్టర్ కార్తికేయన్ వాసుదేవన్ వెల్లడించారు. ప్రాంతాల బట్టి కూడా పాముల విషాల్లో తేడాలుంటాయని ఆయన వెల్లడించారు. ‘ఉదాహరణకు రాజస్థాన్‌లో పాముల విషం తెలంగాణా పాముల విషం కన్నా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం మన పద్ధతిలో అందరికీ ఒకే విధమైన విరుగుడు ఇస్తాం. దీని వల్ల పేషెంట్ల ప్రాణాలకు ముప్పు వస్తుంది. ప్రస్తుతం మేము వివిధ పాముల విషాల మధ్య తేడా కనుగొనటానికి ప్రయత్నిస్తున్నాం. మన దేశంలో ఈ తరహా పరిశోధనలు మేమే చేస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు.
పాముకాటుకు విరుగుడు ఎలా తయారుచేస్తారు?
పాము కాటుకు గుర్రం రక్తం నుంచి విరుగుడును తయారుచేస్తారు. ఆరోగ్యమైన గుర్రాలను ఎంపిక చేసుకొని వాటికి పాము విషాన్ని ఎక్కిస్తారు. అప్పుడు గుర్రం రక్తంలో తయారయ్యే యాంటీ బాడీలను సేకరించి వాటి ద్వారా విరుగుడు తయారుచేస్తారు. అయితే ఈ విధంగా తయారుచేసిన విరుగుడు కేవలం ఆరునెలల వరకూ మాత్రమే నిల్వ ఉంటుంది. అందువల్ల ఎక్కువ మొత్తాల్లో విరుగుడు మందు తయారుచేయటానికి వీలు కాదు. పాము విషానికి విరుగుడు తయారుచేసే కంపెనీ మన దేశంలో ఒకటే ఉంది. అది తమిళనాడులో ఉంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565