రాముడు ఆరాధించిన తల్లి.. శ్రీరామ కాళి
వశిష్ఠ మహర్షి రామునికి యోగవాసిష్ఠాన్ని వివరిస్తూ అందులో కాళీదేవిని జగన్మాతగా, విశ్వరూపిణిగా వర్ణించాడు. అది విన్న రామునికి కాళీదేవి మీద భక్తి కలిగిందని, వశిష్ఠ మహర్షి నుండి శ్రీరాముడు కాళీమంత్ర ఉపదేశాన్ని పొందాడని కాళీతంత్ర గ్రంథాలు చెపుతున్నాయి. అయోధ్యలో దేవ కాళి మందిరం ఉంది. అక్కడ కాళీమాతను సీతాదేవి అర్చించేది. యుద్ధంలో రాముని పరాక్రమం ముందు నిలువలేక, తన మిత్రులు పాతాళ ప్రభువులు అయిన మహిరావణుని, అహిరావణుని తనకు సహాయం చేయమని రావణుడు అడిగాడు. వారిద్దరూ పాతాళకాళి ఉపాసకులు. ఆ తల్లి అనుగ్రహించిన శక్తులతో రావణునికి సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న విభీషణుడు హనుమంతుడికి తెలిపాడు.
అప్పుడు ఆంజనేయుడు తన వాలంతో కోటలాగా నిర్మించి, అందులో రామలక్ష్మణులకు విశ్రాంతిని ఏర్పాటు చేశాడు. అయితే తమ మాయోపాయంతో అహి, మహి రావణులు రామలక్ష్మణులను పాతాళ లోకానికి తీసుకువెళ్లి పాతాళకాళి దేవాలయంలో బంధించారు. వాళ్లని విడిపించటానికి హనుమంతుడు వెళ్తుంటే పాతాళలోక ముఖద్వార పాలకుడు మత్స్యనాథుడు అడ్డగించి, ఆంజనేయునితో యుద్ధం చేశాడు. ఇంతలో మత్స్యనాథుని తల్లి మత్స్యకాంత వచ్చి లంకకు రావటానికి హనుమంతుడు సముద్రం దాటుతుంటే రాలిన ఆయన స్వేద బిందువు వల్ల తను గర్భం ధరించాననీ, మత్య్సనాథునికి జన్మ యిచ్చాననీ చెప్పింది. హనుమంతుడు తన తండ్రి అని తెలియగానే మత్స్యనాథుడు ఆయనకు నమస్కరించి దారి ఇచ్చాడు.
అనంతర కాలంలో అతడు కాళీదేవిని గురించి తపస్సు చేసి మహాసిద్ధుడయ్యాడు. ఇక.. హనుమంతుడు పాతాళ కాళిని తన ప్రార్థనతో మెప్పించాడు. తత్ఫలితంగా కాళీశక్తి హనుమంతునిలోకి ప్రవేశించింది. అందుకే మంత్రశాస్త్రంలో హనుమత్కాళీ మంత్రం కనిపిస్తున్నది. అలా అమ్మవారి అనుగ్రహంతో రామలక్ష్మణులను మాయాశక్తి బంధనం నుంచి ఆంజనేయుడు విడిపించాడు. ఆ తరువాత శ్రీరాముడు కాళీమంత్రాన్ని ఏడు రోజులు ఉపాసించగా ఆమె చివరి రోజు రాత్రి ప్రత్యక్షమై రామునికి విజయాన్ని వరంగా యిచ్చినట్లు చెబుతారు. ఆ వరప్రభావంతోనే రాముడు రావణుని చంపి అశోకవనంలోని సీతాదేవి శోకాన్ని పోగొట్టాడనీ, అందుకని చైత్ర శుద్ధ అష్టమికి అశోకాష్టమి అన్న పేరు వచ్చిందని కనిపిస్తున్నది. రాముడు ఉపాసించిన కాళీమంత్రాన్ని అయోధ్యలోని దేవకాళీ దేవాలయంలో ఉపాసిస్తే విశేష ఫలితాలు వస్తాయని కాళీ ఉపాసకుల విశ్వాసం.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565