జ్ఞానోదయం
ప్రపంచం ఒక నటనాలయం. ఇక్కడ అధికులు నటులే! తాము ఏది కాదో దాన్ని ప్రదర్శించడానికి తాపత్రయపడుతుంటారు. నిజ లక్షణాల్ని గుప్తంగా ఉంచుకుంటారు. మనసులో దుఃఖం పొర్లిపోతున్నా, హాస్యనటుడు పైకి నవ్వుతూ ఇతరుల్ని నవ్వించడానికి పలు పాట్లు పడతాడు. కటిక పేదవాడు రంగస్థలి మీద మహారాజు పాత్ర పోషిస్తే, అతడు ఆ కాసేపూ చక్రవర్తే! దైవ వేషధారి రస పోషణ బాగా చేస్తే, అందరూ ముగ్ధులై చేతులు జోడిస్తారు. వేదికపై అంతసేపూ అతడు దైవమే!
జీవితరంగంలోనూ మనిషి రెండు పాత్రలు పోషిస్తాడు. ఒకటి దేహ సంబంధం, రెండోది మనసుకు సంబంధించింది. అతడు ఆత్మసంబంధ పాత్రలో జీవించాలి కానీ, అది తప్ప అన్ని పాత్రలూ ధరిస్తుంటాడు. మేధ అనే సంపదను జీవన సౌఖ్యానికి ఉపయోగిస్తాడు.
మనసులోని ఆశలన్నీ విత్తనాలైతే, వాటికి ఎరువు మేధస్సు. దాన్నే నమ్ముకుని మానవుడు జీవనయానం సాగిస్తాడు. మహా సముద్రంలో చిన్న పడవ ప్రయాణం వంటిది జీవితం. అది ఎంతకాలం ఎంత దూరం సాగుతుందో, ఎప్పుడు ఏ జల జంతువు దాడి చేస్తుందో తెలియదు. పడవను ఏ ఉపద్రవం ఏ ఉప్పెన తలకిందులు చేస్తుందో, ఎప్పుడు ప్రయాణం ముగిసిపోతుందో... ఎవరూ ఊహించలేరు. ఊపిరి ఆగిపోయేవరకు ‘శరీరమే శాశ్వతం, సర్వస్వం’ అనే భ్రమ వదలదు. వ్యధాభరిత జీవితాలన్నీ చీకటి ప్రయాణాలే! చుక్కాని లేని నావ లాంటిది జీవితం. మనిషి అజ్ఞానమనే తెడ్లతో పడవను బలవంతంగా నెట్టుకు పోతుంటాడు. చీకటి ప్రయాణంలో నక్షత్రాలే దీపాలుగా మారతాయి. పెను విషాదం ఆవహించినప్పుడు, సుదూరంగా మిణుకుమిణుకుమనే ఆశలే అతణ్ని ముందుకు తీసుకు వెళుతుంటాయి.
మానవదేహానికి ఆహార్యం చేకూర్చే ప్రకృతి- పలు మౌన సందేశాలనిస్తుంటుంది. ‘ఇది నీ బాల్యం, ఆడుకో, ఆనందించు. ఇది నీ యౌవనం, చదువుకో, ప్రయోజకుడిగా జీవించు. ఇది నీ జీవితంలో మూడో దశ. ఇకనుంచి నీ శరీరంలో అందచందాలు, శక్తి సామర్థ్యాలు తరిగిపోతాయి. రూపురేఖలు మారిపోతాయి. చూస్తుండగానే కేశాలు రంగు మార్చుకుంటాయి.కండలు సడలిపోతాయి...’ అంటూ అద్దం మనిషి నిజస్థితిని వెల్లడిస్తుంటుంది. అయినా అతడిలో ఆత్మవిచారం ఆరంభం కాదు. మనసు భ్రమరంలా కాసేపు బాల్యంలో, మరి కొంతసేపు యౌవనంలో పరిభ్రమిస్తూ ఉంటుంది. వార్ధక్యం అంటే పొద్దువాలిపోవటం! జీవిత చరమాంకమంతా రానున్న రాత్రిలోని చీకటి గురించిన బెంగతోనే నిండిపోతుంది. ‘ఎలా బతికాను, ఏ విధంగా అయిపోయాను’ అనే చింత చితిలా కాల్చేస్తుంటుంది.
మహారాజు, సామాన్యుడు- అందరూ ఒక్కటే! అంతా దేహ ప్రయాణంలో ఒక్కో దశ దాటుతూ, వార్ధక్యం వాకిలి ముందు నిలవాల్సినవారే... మరణాన్ని ఆలింగనం చేసుకోక తప్పనివారే! చివరి మైలురాయి దగ్గర నిలిచిన మనిషి వెనక్కి చూసుకుంటే, దుఃఖం వెల్లువవుతుంది. ఎంతటి అమూల్య జీవితం వ్యర్థంగా మారిందో గ్రœహించలేకపోయాడు. కరిగే కొవ్వొత్తిలా ఆయువు తరిగిపోతుందని తెలుసుకోలేకపోయాడు. భ్రమలు, ఆశలతో జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు.‘భగవంతుడు మళ్లీ నాకు జీవితం తిరిగి ఇస్తే బాగుంటుంది. పద్ధతిగా జీవిస్తా. తిరిగి తప్పులు చేయకుండా జాగ్రత్తపడతా. తల్లిదండ్రుల్ని, గురువుల్ని దైవసమానులుగా చూస్తా. జీవిత భాగస్వామిని ఆరో ప్రాణంగా ఆదరిస్తా’ అనుకుంటాడు మనిషి. అసలైనవాడు ‘అంతర్యామి’నే మరిచిపోతాడు!
‘నేను నా జీవితాన్ని జ్ఞానం కోసం, భగవంతుడి అనుగ్రహం కోసం వెచ్చిస్తాను’ అనుకునేవారు చాలా అరుదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ సత్యాన్నే వర్గీకరిస్తూ చెబుతాడు. భగవంతుడి దృష్టిలో దేహాలకు ఎలాంటి ప్రాధాన్యం, ప్రత్యేకత ఉండవు. ఆయనది ఆత్మబంధం.
దేహకర్మలన్నీ మనిషి ఆర్జన. ఆత్మవెలుగులన్నీ దైవం కరుణ. జ్ఞానం అంటే ఆత్మవెలుగులు! అంతర్యామినే నమ్ముకుని అనుక్షణం తపించేవారికి అవి లభిస్తాయి. అంతే తప్ప- దేహం అస్తమిస్తున్నప్పుడు జ్ఞానం ఉదయించాలనుకునేవారికి కాదు!
- కె.విజయలక్ష్మి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565