బిల్వ వృక్షాల వనంలో వెలసిన.. వనపర్తి శివాలయం!
పరమ శివుడు వెలసిన అతి ప్రాచీన ఆలయం వనపర్తి ఆలయం. దీనిని 13వ శతాబ్దంలో కాకతీయ గణపతి దేవుడు నిర్మించారు. సింహద్వారం వద్ద శిలా శాసనం శివాలయం ప్రాశస్త్యాన్ని.. కాకతీయుల కళా తృష్ణను సూచిస్తుంది. నాటి చరిత్రకు, ఆధ్యాత్మిక వైభవానికి, కట్టడాలకు ఈ ఆలయం ఆనవాలుగా నిలుస్తున్నది. రామప్ప గుడి తర్వాత చెప్పుకోదగ్గ కాకతీయుల కళా వైభవానికి నిదర్శనంగా వరాలనిచ్చే వనపర్తి శివాలయం ఒక ఉదాహరణ. ఈ ఆలయ విశేషాలే ఈవారం దర్శనం.
ఎక్కడ ఉన్నది?:
జనగామ జిల్లా లింగాల ఘనాపురం మండలం వనపర్తిలో ఉంది.ఎలా వెళ్లాలి?:
హైదరాబాద్ నుంచి యాదాద్రి భువనగిరి మీదుగా జనగామ చేరుకోవాలి. అక్కడ్నుంచి సూర్యాపేట వెళ్లేదారిలో వనపర్తి చౌరస్తా నుంచి వెళితే శివాలయం వస్తుంది. జనగామ నుంచి 17 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఘనపురం నుంచి 7 కిలోమీటర్ల దూరం.పేరెలా వచ్చింది?
పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా దట్టమైన వనంతో నిండి ఉండేదట. శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వ పత్రాన్ని ఈ అటవీ ప్రాంతం నుంచే తీసుకెళ్లేవారట. అందుకే దీనిని వనపత్రిగా పిలిచేవారు. కాలక్రమేణా వనపత్రి కాస్తా వనపర్తి అయింది. శివాలయ మంటపంలో నందీశ్వరుడు సజీవంగా ఉన్నట్లు కనిపించడంతో నందివనపర్తిగా కూడా పిలుస్తుంటారు.ప్రత్యేకత:
అపురూపాల సృష్టిగా వనపర్తి శివాలయాన్ని పేర్కొంటున్నారు స్థానికులు. క్రీస్తుశకం 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది. ఆలయంలో నందీశ్వరుడు రామప్పగుడిలోని నంది విగ్రహంతో పోలి ఉన్నది. ఆలయం ముందు రెండంతస్థుల గాలి గోపురం అద్భుత నిర్మాణంతో ఉట్టిపడుతున్నది. ఈ కట్టడం విశిష్టతను సంతరించుకున్నది. ఈ ఆలయ పరిసరాలలో కాకతీయుల కాలం నాటి వీరగల్లు శిలల ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఆలయ నిర్మాణం 16 స్తంభాలతో మంటప నిర్మాణ శైలిలో చాలా అద్భుతంగా ఉన్నది. ఎటుచూసినా ఆశ్చర్యమనిపించే శిల్ప సృష్టి, కాకతీయుల వైభవాన్ని, చారిత్రాత్మక విశిష్టతను, నాటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకలుగా కనిపిస్తున్నాయి. గర్భాలయంలో శివుడి లింగం ప్రత్యేకతను సంతరించుకున్నది. పైకప్పు మీది శిల్ప కళారీతి చూడ చక్కగా ఉన్నది. అద్భుతమైన మంటపం, ఆధ్యాత్మికతను వెదజల్లే చారిత్రక కళా సంపద, ప్రశాంత వాతావరణం, రాతి కట్టడాల నిర్మాణం నాటి కాకతీయ రాజులకే సాధ్యమైంది.విశిష్టత :
శివాలయం ముందున్న రెండంతస్థుల నిర్మాణం మరెక్కడా లేదంటున్నారు స్థానికులు. కాకతీయ గణపతి దేవుడు నిర్మించిన వనపర్తి శివాలయం సూర్య చంద్ర రాజులు దర్శించి తరించారని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తున్నది. భక్తుల కోరికలు తీరుస్తూ వరాలనిచ్చే వనపర్తి శివుడు భక్తల కొంగు బంగారమై ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు. యుద్ధ సమయంలో విజయప్రాప్తికి స్వామివారిని నాటి రాజులు దర్శించుకొని వెళ్లేవారట. శిథిలావస్థకు చేరుకుంటున్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. కాకతీయుల కళావైభవం మరుగున పడిపోకుండా ఈ కట్టడాన్ని కాపాడుకోవాలి. తద్వారా మన చరిత్రను, సంస్కృతిని పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఉన్నదని వారంటున్నారు.మేటి ఆలయం:
మా తాత ముత్తాతల కాలం నుంచీ వనపర్తి శివాలయం అర్చకులుగా పనిచేస్తున్నాం. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉన్నది. దీనిని పునరుద్ధరిస్తే తెలంగాణలోనే మేటి ప్రాచీన శివాలయంగా, నాటి కాకతీయుల శిల్ప కళా వైభవానికి ప్రతీకగా విరాజిల్లుతుంది.సోమేశ్వర స్వామి, ఆలయ పూజారి
శివుడితో అనుబంధం:
చిన్నప్పట్నుంచి ఆలయాన్ని చూస్తున్నాం. దీనికి చాలా గొప్ప నేపథ్యం ఉన్నది. పరమశివుడికి దీనికి ప్రత్యక్ష అనుబంధం ఉన్నది. ఇలాంటి ఆలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది.-వంగ వెంకటేశ్వర్లు, ఆలయ చైర్మన్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565