రామానుజ జయంతి
జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు సత్యాలే. సృష్టి అంతా ఆవరించి ఉండేది ఈశ్వరశక్తి. ఈశ్వరుడంటే పరమాత్మ లేదా శ్రీమన్నారాయణుడు. ఆయన అంశే జీవుడిలో ఉంటుంది. ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు ఒకదానికొకటి ఆధారంగా ఉంటాయి... ఇక్కడ మాయకు తావులేదు. సర్వత్రా ఉండేది ఈశ్వరాంశ అయినప్పుడు కుల, వర్గ బేధాలకు తావులేదు.
భగవత్ రామానుజులు...
భక్తివినయాలకు, సర్వమత సామరస్యతకు, సర్వప్రాణికోటి దయకు పెద్దపీట వేసే విశిష్టాద్వైత సిద్ధాంతకర్త...
120 ఏళ్ల సుదీర్ఘ జీవనయానంలో ఆయన వేసిన ప్రతి అడుగూ సంఘాన్ని సంస్కరించే బాటలోనే....
సామాజికంగా ఉన్న అసమానతలన్నీ తొలగాలని అసలుసిసలైన సమసమాజం వర్థిల్లాలని ఆయన అభిలషించారు.
పాంచరాత్ర ఆగమానికి విశిష్ట సేవను అందించేందుకు శ్రీ వైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించారు. జీవిత లక్ష్యాన్ని చేరడానికి వినయం, శరణాగతి అవసరం ఏ మేరకు ఉంటుందో రామానుజుల జీవితం, బోధనల నుంచి మనం తెలుసుకోవచ్చు...
జన్మ స్థలం: శ్రీపెరుంబుదూరు, తమిళనాడు
కాలం: క్రీ.శ 1017- 1137
తల్లిదండ్రులు: కాంతిమతి, ఆసూరి కేశవాచార్యులు
రచనలు: భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలను ప్రస్థానత్రయం అంటారు. వీటికి గీతాభాష్యం, శ్రీభాష్యం పేర్లతో వ్యాఖ్యానం రాశారు.
తిరువాయ్‌మొళిలాంటి ద్రవిడ దివ్య ప్రబంధాలను సంస్కృతంలోకి అనువదించారు.
సిద్ధాంతం: విశిష్టాద్వైతం
* తిరు వేంకటాధీశుని సేవ
ఆ రోజుల్లో తిరుమలలో శైవ, వైష్ణవ మత భేదాలు, ఆధిపత్య పోరాటాలు జరుగుతుండేవి. తిరుమల ఆలయంలో ఉంది శివుడేనని శైవులు, కాదు విష్ణువని వైష్ణవులు భావించేవారు. ఇదంతా ఆ రోజుల్లో నారాయణవనాన్ని పాలిస్తున్న యాదవ రాయలు ప్రభువుకు కూడా నచ్చలేదు. ఇదేదో తేల్చాలని తిరుమల ప్రాంతంలో శైవులకు నాయకుడిగా ఉన్న గొప్ప పండితుడు, తాత్త్వికుడు అయిన శివజ్ఞానిని, విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేస్తున్న రామానుజులను ఒకచోట సమావేశపరిచి చర్చలు జరిపించారు. వారం రోజుల పాటు ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలకు యాదవ రాయలే మధ్యవర్తిగా ఉన్నాడు. రామానుజాచార్యులు తిరుమల ఆలయంలో ఉన్నది శ్రీమహా విష్ణువేనని స్థల పురాణాలు, శాస్త్రాల్లోని ఉదాహరణలను రుజువు చూపిస్తూ నిర్ధరించారు. తిరుమల ఆలయాన్ని నిర్మించిన తొండమానుడు, తొలి అర్చకుడుగా ఉన్న గోపీనాథుడు ఇద్దరూ వైష్ణవులేనన్న విషయాన్ని నిరూపించారు. కాలక్రమంలో శైవమతాన్ని అనుసరించిన రాజుల ప్రాబల్యం వల్ల తిరుమల ఆలయం శైవుల ఆధీనంలోకి వెళ్లిందని ఉదాహరణలతో సహా వివరించారు. ఎలాంటి ఘర్షణలు లేకుండా సామరస్య పూర్వకంగా ఆయన సమస్యను ఇలా పరిష్కరించారు. ఒక శుభముహూర్తాన తిరుమల వేంకటేశ్వరుడి విగ్రహానికి శంఖుచక్రాలను, ఊర్థ్వపుండ్రాలను అలంకరించారు.
* ధైర్యం మానుష రూపేణా
రామానుజులు కంచిలో తన గురువు యాదవ ప్రకాశకుల దగ్గర విద్య నేర్చుకుంటున్నప్పుడు.. ఛాందగ్యోపనిషత్తులోని ‘తస్య యథా కప్యాసం పుండరీక మేవ మక్షిణీ’ అనే విషయాన్ని వివరిస్తున్నారు గురువు. ఆయన చెప్పిన వ్యాఖ్యానం రామానుజులకు నచ్చలేదు. సందర్భానికి, స్థాయికి తగ్గట్లు పోలిక ఉండాలని వాదించారు. ఇలా మరికొన్ని సందర్భాల్లో కూడా యాదవ ప్రకాశకుడితో నిక్కచ్చిగా మాట్లాడేసరికి ఆ గురువుకు కోపం వచ్చింది. చివరకు పుణ్య తీర్థయాత్ర పేరుతో రామానుజుడిని అంతం చేయాలని కూడా ఆయన ప్రయత్నించి విఫలమయ్యాడు. అలాంటి కష్టాలకు తట్టుకుని తన విశిష్ఠాద్వైతాన్ని ప్రచారం చేస్తూ ఆ తర్వాత కంచికి తిరిగి వచ్చిన రామానుజుడి ప్రతిభకు తలవొగ్గి యాదవ ప్రకాశకుడు ఆయనకు శిష్యుడిగా మారిపోయాడు.
* నంబికి మర్యాద
రామానుజుల చిన్ననాడు ఆయన కుటుంబానికి కంచిలో ఉండే తిరుక్కచ్చినంబితో బాగా పరిచయం ఉండేది. అప్పట్లో చెన్నపట్టణానికి సమీపంలో ఉన్న పూనమల్లిలోని దేవాలయంలో వైష్ణవభక్తుల సమావేశాలు ఎక్కువగా జరుగుతుండేవి. తిరుక్కచ్చినంబి కంచి నుంచి బయలుదేరి రామానుజులు నివాసం ఉంటున్న శ్రీ పెరుంబుదూరు మీదుగా పూనమల్లి వెళ్లి వస్తుండేవారు. ఈ క్రమంలో పెరుంబుదూరులోని చెన్నకేశవస్వామి ఆలయం దగ్గర మజిలీ చేసేవారు. ఆయన భక్తి, పాండిత్యాల గురించి రామానుజులు విన్నారు. అలాంటి వ్యక్తికి ఎలాగైనా తన ఇంట్లో భోజనం పెట్టి గౌరవించాలనుకున్నారు. అదే విషయాన్ని ఆయన ఓ రోజు తిరుక్కచ్చినంబికి చెప్పారు. రామానుజుల కంటే తక్కువ కులం వారైన నంబి సందేహిస్తుంటే ఆ విషయాన్ని లెక్క చేయవద్దని చెప్పారు. రామానుజుల తల్లి కూడా ఎంతో భక్తితో, గురుభావంతో తిరుక్కచ్చినంబికి భోజనం పెట్టారు. ఆయన తిన్న విస్తరాకును రామానుజులు స్వయంగా ఎత్తి కులరహితమైన భావజాలాన్ని చాటారు. ఆయన దగ్గర కొన్నాళ్లు విద్యాభ్యాసం కూడా చేశారు.
* అందరికీ ఆలయ ప్రవేశం
ఆ రోజుల్లో దేవాలయాల్లోకి కొందరికి ప్రవేశం ఉండేది కాదు. విశిష్ఠాద్వైతం దీన్ని సమ్మతించదు. రామానుజులు దేశాటన చేస్తూ మైసూరు చేరుకున్నారు. అక్కడికి సమీపంలో మెల్కోటలో మహమ్మదీయుల దండయాత్రలో దెబ్బతిన్న విష్ణ్వాలయాన్ని పునరుద్ధరించమని ఆ గ్రామస్థులు రామానుజులకు విన్నవించారు. ఆయన ఆ గ్రామానికి వెళ్లి అంతా చూసి ఆ సమీపంలో పడి ఉన్న విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. ఆనాటి ఉత్సవ విగ్రహం సుల్తాన్ దగ్గర ఉందని తెలుసుకుని తన వాక్చాతుర్యంతో సుల్తాన్‌ను మెప్పించారు. ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించి నిమ్న జాతులకు కూడా ప్రవేశాన్ని కల్పించారు. అప్పుడు అక్కడున్న కొందరు అడ్డుకోవాలని చూసినా రామానుజులు పట్టించుకోలేదు. దేవుడి దృష్టిలో మనుషులంతా ఒక్కటేనని ఆయన చాటిచెప్పారు.
- డా.. యల్లాప్రగడ మల్లికార్జునరావు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565