నూడుల్స్ కేకు తిన్నారా...
చింపిరి జుట్టు కుక్కపిల్లా ఒళ్లంతా ఊలుదారాల్లాంటి జుట్టుతో ముద్దుగా ఉన్న పిల్లిపిల్లా టర్కీ టవల్‌ను కప్పుకున్నట్లున్న యాంగ్రీబర్డ్ బొమ్మా... చూడ్డానికి భలే ఉన్నాయి కదూ... అందుకే, ‘షగ్ రగ్’ పేరుతో వస్తున్న ఈ కేకులు ఇప్పుడు పార్టీల్లో సందడి చేసేస్తున్నాయి. రకరకాల బొమ్మల రూపాల్లో తయారుచేసినవీ ఫొటో ప్రింటెడ్ కేకులూ పూలబొకేల్లా ఉన్నవీ బార్బీబొమ్మల్లా రూపొందించినవీ... ఇలా కేకుల్లో ఇప్పటివరకూ చాలారకాలే వచ్చాయి. అయితే, ఎంత వినూత్నంగా ఉన్నా మొదటిసారి చూసినపుడు కలిగే ఆశ్చర్యం మూడోసారీ నాలుగోసారీ చూసినపుడు కలగదు. పైగా ఈ వాట్సాప్, ఫేస్‌బుక్‌ల కాలంలో ఏది కనిపించినా ఫొటో తియ్యడం షేర్ చెయ్యడం క్షణాల్లో అయిపోతోంది. దాంతో ఎంత కొత్తగా వచ్చిన కేకులైనా కొద్ది రోజుల్లోనే అందరూ చూసేస్తున్నారు. మరోపక్కేమో సెలెబ్రేషన్‌కి చిహ్నంగా కట్‌చేసే కేకు చూసేవాళ్ల కళ్లను కట్టిపడేసేలా వీలైనంత కొత్తగా ఉండాలని కోరుకుంటోంది ఈతరం. అందుకే, దుస్తుల్లో నూతన ఫ్యాషన్లు వచ్చినట్లే కేకుల్నీ ఎప్పటికపుడు కొత్తగా ముస్తాబు చెయ్యడం మొదలుపెట్టారు ఫుడ్ డిజైనర్లు. అలా అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌కు చెందిన అలానా జోన్స్-మన్ రూపొందించినవే ఈ షగ్ రగ్ కేకులు. బటర్ క్రీమ్‌తో కేకుమీద ఊలు దారాలూ నూడుల్సూ వేలాడుతున్నట్లు రూపొందించిన వీటిని ఒక్కసారిగా చూస్తే గిన్నెమీద రంగుల్లో ఉన్న చిన్నసైజు టర్కీటవల్‌ని కప్పారా అన్నట్లే ఉంటాయి. అందుకే, అలానా వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చెయ్యగానే లైకులమీద లైకులు రావడంతో పాటు ఇంటర్నెట్‌లో తెగ ప్రాచుర్యంపొందాయి. అదక్కడితో ఆగిపోలేదు. షగ్ రగ్ కాన్సెప్ట్‌తోనే బొచ్చు కుక్కలూ బాగా జుట్టు పెరిగిన పిల్లి పిల్లల్లా ఉన్న కేకుల్నీ తయారుచేయడం మొదలుపెట్టారు. ఇవి కూడా అచ్చం నిజమైన వాటిలా ఉండి అతిథుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇంకెందుకాలస్యం... మీ కేకునీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిపేయండి మరి...
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565