కోరిన వరాలిచ్చే అన్నవరం సత్యదేవుడు..!
కోరిన వరాలు ఇచ్చే స్వామిగా, రత్నగిరీశుడిగా, సత్యానికి ప్రతీకగా భావించే సత్యనారాయణస్వామి కల్యాణోత్సవానికి అన్నవర క్షేత్రం అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. ఏటా వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి (ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి మే 1) వరకూ జరిగే ఈ వేడుకల్లో పాల్గొనడానికి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.
ఇల్లుకట్టినా, పెళ్లిచేసినా లేదా గృహంలో మరేదైనా శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పక ఆచరిస్తారు. ‘శ్రీసత్యనారాయణునీ సేవకు రారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా...’ అంటూ స్వామిని కీర్తిస్తూ పులకిస్తారు. అలాంటి సత్యదేవుడు తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో రత్నగిరి మీద అనంతలక్ష్మీ సమేత శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామిగా విరాజిల్లుతున్నాడు. ఈ క్షేత్రంలో స్వామి ఎడమవైపు అమ్మవారూ కుడివైపు ఈశ్వరుడితో కలిసి ఒకే పీఠంమీద దర్శనమిస్తారు.
స్థల పురాణం
వీరవేంకట సత్యనారాయణ స్వామి కొలువైన ఈ ప్రాంతం రత్నగిరిగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయానికి సంబంధించి రెండు స్థలపురాణాలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం రత్నాకరుడు అనే విష్ణుభక్తుడు స్వామి కోసం తపస్సు చేస్తాడు. అనుగ్రహించిన విష్ణుమూర్తి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ‘ఎప్పుడూ నేను నీతో కలిసి ఉండే భాగ్యాన్ని ప్రసాదించ’మని వేడుకుంటాడు. ‘కలియుగంలోని భక్తులను రక్షించడానికి శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామిగా వస్తాననీ అప్పుడు రత్నగిరి రూపంలో ఉన్న నీ కొండపై కొలువుతీరుతాననీ’ అభయం ఇస్తాడు విష్ణుమూర్తి. అలా ఈ యుగంలో స్వామి రత్నగిరీశుడు అయ్యాడు. ఇలాంటిదే మరో కథనం... దశాబ్దాల కిందట గోర్స జమిందారు రాజా ఇనుగంటి వేంకట రామనారాయణం ఏలుబడిలో అన్నవరం గ్రామం ఉండేది. ఆ ఊరికి గ్రామ పెద్దగా ఈరంకి ప్రకాశరావు ఉండేవాడు. ఒకనాటి రాత్రి ఇద్దరి కలల్లో ఏక సమయంలో విష్ణుమూర్తి సాక్షాత్కరించి ‘రాబోయే శ్రావణ శుక్ల విదియనాడు నేను రత్నగిరిపై వెలుస్తున్నాను. నన్ను శాస్త్రనియమానుసారం ప్రతిష్ఠించి, సేవించ’మని ఆజ్ఞాపించాడట. మర్నాడు ఇద్దరూ ఆ రత్నగిరికి చేరుకుని వెతికితే అక్కడ ఒక పుట్టలో సత్యనారాయణ స్వామి విగ్రహం కనిపించిందట. దీంతో వారు అక్కడే స్వామిని ప్రతిష్ఠించారట. తర్వాతి కాలంలో స్వామి ఉన్న ఈ క్షేత్రం సత్యదేవుని వ్రతాలకు విశిష్టమైందిగా ప్రాచుర్యం పొందింది. కార్తిక, శ్రావణ మాసాల్లో ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తారు.
ప్రత్యేక పూజలు
ఆలయంలో స్వర్ణపుష్పార్చనా, జన్మ నక్షత్ర పూజలూ ప్రధానంగా నిర్వహిస్తారు. సప్తగోప్రదక్షిణశాల, ఫలబాయంత్రం ఇక్కడ ప్రత్యేకం. సత్యనారాయణ స్వామివారి వార్షిక కల్యాణం, కార్తికమాసంలో తెప్పోత్సవం,
గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడి స్వామివారికి నిత్యం సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహిస్తారు.
ప్రసాదం ప్రత్యేకం
సత్యనారాయణస్వామి వ్రతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో స్వామి ప్రసాదానికీ అంతే విశిష్టత ఉంది. ఈ విషయ ప్రస్తావన వ్రత కథలో కూడా కనిపిస్తుంది. సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్లినా లడ్డూనో, పులిహోరో లేదూ అంటే చక్కెరపొంగలో ప్రసాదంగా అందిస్తుంటారు. కానీ ఈ సత్యదేవుని ఆలయంలో మాత్రం గోధుమ నూకతో ప్రత్యేకంగా తయారుచేసిన ప్రసాదాన్ని అందిస్తారు.
ఇలా చేరుకోవాలి
ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. అన్నవరం బస్‌స్టాండ్ నుంచి దేవస్థానం బస్సుల్లో రత్నగిరికి చేరుకోవచ్చు. రైలు విషయానికి వస్తే అన్నవరంలో రైల్వేస్టేషన్ ఉంది. అక్కడి నుంచి కూడా స్వామివారి దేవస్థానం బస్సులు ఉంటాయి.
- పాకలపాటి వెంకటరాజు, న్యూస్‌టుడే, అన్నవరం
--------------------------------------------------------------
--------------------------------------------------------------
అన్నవరం సత్యదేవుని పరిణయ వేడుక
భక్తుల పాలిట కొంగు బంగారం... తెలుగు ప్రజల ఇలవేల్పు అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి. వారి దివ్యకల్యాణ మహోత్సవాలకు తూర్పుగోదావరి జిల్లా, అన్నవరంలో గల రత్నగిరి ముస్తాబైంది. ఈ నెల 25, బుధవారం, వైశాఖ శుద్ధ దశమి నుంచి, మే 1, వైశాఖ బహుళ పాడ్యమి వరకు జరగనున్న ఈ వార్షిక కల్యాణ వేడుకలకు దేవస్థానం వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్లో వివాహమైనా, గృహప్రవేశమైనా, మరే ఇతర శుభకార్యమైనా శ్రీసత్యదేవుని వ్రతమాచరించాల్సిందే. తన వ్రతమాచరిస్తేనే కోరిన కోర్కెలు తీర్చే భక్తసులభుడు శ్రీఅనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేత శ్రీసత్యదేవుడు. అటువంటి మహత్తు కలిగిన స్వామివారిని దర్శించినా భాగ్యమే.
శ్రీసత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాల వివరాలు , ఏప్రిల్ 25, వైశాఖ శుద్ధ , దశమి, బుధవారం
సాయంత్రం నాలుగు గంటలకు రత్నగిరిపై అనివేటి మండపంలో శ్రీసత్యదేవుడు, అమ్మవార్లను వధూవరులను చేస్తారు. రాత్రి ఏడు గంటలకు కళావేదిక మీద స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం.
26, గురువారం
రాత్రి తొమ్మిది గంటలకు రత్నగిరి కల్యాణ వేదిక మీద శ్రీసత్యదేవుడు, అమ్మవారికి దివ్యకల్యాణ మహోత్సవం రత్నగిరి రామాలయం పక్కనే గల కల్యాణ వేదిక మీద స్వామి, అమ్మవార్లకల్యాణాన్నిసంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.
27, శుక్రవారం
మధ్యాహ్నం రెండు గంటలకు ఆస్థాన సేవలు. సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన ప్రవేశ స్థాలిపాక హోమాలు.
28, శనివారం
మధ్యాహ్నం 2–30 గంటలకు శ్రీసత్యదేవుడు, అమ్మవారి సమక్షంలో వేదపండిత సభ, అనంతరం పండిత సత్కారం. ఈ వేదపండిత సభ కు విచ్చేసి తమ విద్వత్తు ప్రదర్శించి స్వామి వారి సన్నిధిలో సత్కారాలు అందుకోవాలని 140 మంది వేదపండితులకు దేవస్థానం ఆహ్వానం పంపించింది.
29, ఆదివారం
సాయంత్రం నాలుగు గంటలకు శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు వనవిహార మహోత్సవం. ఈసారి కొండ దిగువన గల ఉద్యానవనంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 30, వైశాఖ పౌర్ణమి, సోమవారం:
ఉదయం ఎనిమిది గంటలకు పంపా రిజర్వాయర్ నందు శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు శ్రీచక్రస్నానం. సాయంకాలం నాలుగు గంటలకు నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన.
మే ఒకటి, వైశాఖ బహుళ పాడ్యమి, మంగళవారం
రాత్రి ఏడు గంటలకు శ్రీసత్యదేవుడు, అమ్మవారికి స్వామివారి నిత్యకల్యాణ మండపంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుండగా స్వామి, అమ్మవార్ల శ్రీపుష్పయోగ మహోత్సవం. అనంతరం నీరాజన మంత్రపుష్పాలు, ఆశీర్వచనం
శ్రీసత్యదేవుని కల్యాణ వేడుకల విశేషాలు శ్రీ సీతారాములే పెళ్లిపెద్దలు
శ్రీసత్యదేవుడు, అమ్మవారి దివ్యకల్యాణ మహోత్సవాలకు రత్నగిరి క్షేత్రపాలకులు శ్రీసీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. విశేషమేమిటంటే ఈ ఉత్సవాల ఏడు రోజులు మినహాయిస్తే ఏడాదిలో 358 రోజులు శ్రీసత్యదేవునికి నిత్య కల్యాణం నిర్వహిస్తారు. ఆ నిత్య కల్యాణానికి కూడా సీతారాములే పెళ్లి పెద్దలు. శ్రీరామనవమి నాడు జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి శ్రీసత్యదేవుడు, అమ్మవారే పెళ్లిపెద్దలుగా వ్యవహరిస్తారు.
5 రోజులు అంగరంగ వైభవంగా ఊరేగింపు
ఉత్సవాలలో ఐదు రోజులు రాత్రి తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ శ్రీసత్యదేవుడు, అమ్మవారిని అన్నవరం కొండదిగువన వివిధ వాహనాలపై ఘనంగా ఊరేగిస్తారు.
29, 30 తేదీలలో చాగంటి వారి ప్రసంగం
స్వామివారి కల్యాణ మహోత్సవాలలో 29, 30 వ తేదీలలో సాయంకాలం ఆరు గంటలకు రత్నగిరిపై ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శ్రీసత్యదేవుని వైభవం గురించి ఉపన్యసిస్తారు.
అన్నవరం రావాలంటే...
చెన్నయ్– కలకత్తా హైవే–15 మీద గల అన్నవరానికి చేరుకోవాలంటే రోడ్డు లేదా రైళ్ల ద్వారా రావచ్చు. రాజమండ్రి నుంచి గంటన్నర ప్రయాణం. విశాఖపట్నం నుంచి రెండున్నర గంటలు ప్రయాణం. అన్ని ముఖ్యమైన రైళ్లు అన్నవరం రైల్వేస్టేషన్‌లో ఆగుతాయి. విశాఖపట్నం, రాజమండ్రి (మధురపూడి) విమానాశ్రయాలు ఉన్నాయి.
– అనిశెట్టి వేంకట రామకృష్ణ సాక్షి, అన్నవరం
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565