హనుమద్ర్వతం
మార్గశీర్షే త్రయోదశ్యాం - శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్యా దేవీ జగన్మాతా - మహావీరేణ ధీమతా ||
మృగశిరానక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం, మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి, హనుమంతుని ఆయన శక్తిస్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహనచేసి పూజించి, హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకుంటారు. పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు . ఈవిధంగా పదమూడుసంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది అని శాస్త్రవచనం. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీతీరంలోనే చేసుకోవాలి. ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి బదులు పంపాకలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్ర్వతం ఆచరిస్తే హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు. దృష్ట్యా దేవీ జగన్మాతా - మహావీరేణ ధీమతా ||
ఆదర్శనీయ మూర్తిమత్వం, ఆచరణీయ వ్యక్తిత్వం, ఆరాధనీయ దైవత్వం కలబోసిన పరమేశ్వర చైతన్య స్వరూపం- ఆంజనేయస్వామి. రామాయణ గాథలో సీతారాములు, హనుమంతుడు పూర్ణ దేవతామూర్తులు. శ్రీరాముడి తరవాత హనుమకు అంతటి ప్రఖ్యాతి ఉంది. కార్య సాఫల్యం, మహా పరాక్రమం, లక్ష్యసాధనలో ఏకాగ్రత, కుశాగ్రబుద్ధి వంటి ఉదాత్త గుణాలకు ఆ కపి వీరుడు ప్రతీక. రామకార్య నిర్వహణలో నిరుపమాన భక్తిని, సుగ్రీవ అంగద జాంబవంతాది వానర వీరులతో మైత్రిని ఆయన ప్రదర్శించాడు. లక్ష్మణుడి ప్రాణాలు నిలపడంలో ధీరత్వాన్ని, రాక్షస సమూహాన్ని వధించడంలో అసమాన శూరత్వాన్ని చాటుకున్నాడు వాయునందనుడు!
శ్రీమద్రామాయణంలోని కిష్కింధ కాండలో గోచరమైన హనుమ- సుందరకాండలో విరాట్‌రూపాన్ని చూపి, ఆపై యుద్ధకాండ ముగిసే వరకు కీలక భూమిక పోషించాడు. లంకలో సీతను దర్శించి, ఆమె శోకాన్ని నివారించి అభయాంజనేయుడు అయ్యాడు. జానకి జాడను రాముడికి తెలిపి ఆనందాంజనేయుడిగా కీర్తి గడించాడు. కర్తవ్య దీక్ష చూపి, వానరజాతికి సార్థకత చేకూర్చి ప్రసన్నాంజనేయుడిగా వర్ధిల్లాడు. శ్రీరామదూతగా, నిరంతరమూ రామ చరణ సేవాతరంగిణిలో పునీతమైన దాసాంజనేయుడిగా ఖ్యాతి పొందాడు. అందరి సంకటాల్ని నివారించి, సర్వులకూ ఆహ్లాదం చేకూర్చి ప్రమోదాంజనేయుడిగా నిలిచాడాయన.
కర్మయోగిగా, మహావీరుడిగా, అనంత సుగుణాల రాశిగా ఆంజనేయస్వామి ప్రస్ఫుటమవుతాడు. ‘హనుమాన్ వాక్య కోవిదః’ అని మారుతిని వాల్మీకి అభివర్ణించాడు. వాక్కు అంటే, కేవలం మాట కాదు. అది ఎన్నో అంశాల సమ్మేళనం. బుద్ధిశక్తి, విశేష జ్ఞానం, దాన్ని వ్యక్తీకరించే నైపుణ్యం, నిశిత పరిశీలన, పదునైన ఆలోచన, సమయోచిత ప్రవర్తన, సందర్భోచిత ప్రసంగం... ఇలా ఎన్నో అంశాలు ‘వాక్కు’తో మమేకమై ఉంటాయి. ఈ లక్షణాలన్నింటినీ హనుమ తన కార్యసాధన పరంపరలో చూపించాడు.
మంత్రశాస్త్రపరంగా హనుమ నామధేయం- సుందరుడు. ఆ సుందరత్వాన్ని ఆయన త్రికరణశుద్ధిగా ప్రకటించాడు. మనోసంకల్పం, వాక్కు, కర్మాచరణలో ఆంజనేయుడిగా వ్యక్తమయ్యాడు. రాక్షస సంహారంలో నృసింహ తత్వాన్ని, జ్ఞానవంతుడిగా హయగ్రీవ అంశను, అనంత వేగ శక్తిలో గరుత్మంతుడి బలిమిని ప్రదర్శించాడు. సజ్జన శుభంకరుడిగా, దుర్జన భయంకరుడిగా విశ్వరూపం ప్రదర్శించి పంచముఖ ఆంజనేయుడిగా తేజరిల్లాడు. ఆ మహాశక్తికి సంకేతాలు అనేక విగ్రహాకృతుల్లో ప్రతిఫలిస్తున్నాయి.
ఆరాధించిన వెంటనే అనుగ్రహించే దైవంగా, హనుమను భక్తులు భావిస్తారు. సకల ప్రతికూల శక్తుల్ని నివారించి సర్వభయాల్నీ పరిహరించే దైవంగా పూజిస్తారు. మార్గశిర శుద్ధ త్రయోదశినాడు, లంకలో ఉన్న సీతను హనుమ తొలిసారిగా దర్శించాడని చెబుతారు. ఈ శుభ తిథినాడు హనుమద్వ్రతం నేపథ్యంగా ఆయనను ఆరాధిస్తారు. తనకు ఎనలేని సంతోషాన్ని అందించిన హనుమను మార్గశిర శుద్ధ త్రయోదశినాడు వ్రతపూర్వకంగా ఆరాధించినవారికి సమస్త మనోభీష్టాలు నెరవేరతాయని సీతాదేవి వరమిచ్చిందంటారు.
హనుమాన్ వ్రతాన్ని అరటితోటలో లేదా ఆ చెట్టు వద్ద నిర్వహిస్తారు. మంటపం ఏర్పాటుచేసి బియ్యపు పిండితో అష్టదళ పద్మాన్ని చిత్రించి, దానిపై ధాన్యం పోసి కలశ స్థాపన చేస్తారు. కలశాన్ని అలంకరించి, దాని సమీపంలో హనుమ విగ్రహం ఉంచుతారు. ఆ తరవాత 13 పోగులు ఉన్న తోరాన్ని స్వామి మూర్తి వద్ద ఉంచి పూజించి ధరిస్తారు.హనుమంతుడి వ్రత ఆచరణ వల్ల కార్యజయం, బుద్ధి వికాసం, మనోధైర్యం, ఆరోగ్య సిద్ధి వంటి శుభఫలితాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆయన ఆచరించి చూపిన జీవనసూత్రాలు అందరికీ ఆదర్శప్రాయాలు!
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565