ఎండల్లో కూల్ కూల్..!
అవి... కొందరికి ఫ్యాషన్. మరికొందరికి ప్యాషన్. కానీ చాలామందికి మాత్రం తప్పనిసరి యాక్సెసరీ. అవే చలువ కళ్లద్దాలు ఉరఫ్ కూలింగ్ గ్లాసెస్... మండే ఎండల్లో చల్లని నేస్తాలు..!
సన్‌గ్లాసెస్... నిజంగా అంత అవసరమా అని ఈరోజుల్లో కూడా ఎవరైనా అడిగితే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికీ చాలామంది వాటిని సెలెబ్రిటీ యాక్సెసరీగానే భావిస్తారు. ఫ్యాషన్ కోసమో చల్లగా ఉండేందుకో మాత్రమే పెట్టుకుంటారు అనే అనుకుంటారు. కానీ మిట్టమధ్యాహ్నవేళలో మనరోడ్లమీద ప్రయాణించాలన్నా కూడా సన్‌గ్లాసెస్ ఎంతో అవసరం. శీతాకాలమైనా ఎండాకాలమైనా ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఉండే సూర్యకాంతిలో యూవీ కిరణాల శాతం ఎక్కువ. వీటివల్ల చర్మానికే కాదు, కళ్లకీ హాని కలుగుతుంది. ఆయా కిరణాలు దీర్ఘకాలంపాటు కంటిని చేరితే అనేక కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి కొద్దిసేపు వాటి కాంతి కళ్లమీద ప్రతిఫలించినా కంటి కటకం పైభాగం దెబ్బతినే అవకాశం ఉంది. అదే కళ్లకు చలువ కళ్లజోడు ఉంటే, అవి 99 శాతం వరకూ అతినీలలోహిత కాంతిని అడ్డుకుంటాయి. కళ్లలో దుమ్మూధూళీ పడకుండానూ వెలుగు కళ్లమీద పడి అలసిపోకుండానూ కాపాడతాయి. పెద్దలకే కాదు, పిల్లలకీ ఇవి అవసరమే. కనుపాప లేత రంగులో ఉన్నవాళ్లకి మరీ అవసరం. కాంటాక్ట్ లెన్సులు పెట్టుకునేవాళ్లు కూడా సన్‌గ్లాసెస్ వాడాలని చెబుతున్నారు. దాంతో ఒకప్పుడు సెలెబ్రిటీలకే పరిమితమైన ఈ ఫ్యాషన్ యాక్సెసరీ, నేడు అందరికీ తప్పనిసరిగా మారుతోంది.
టెకీల కోసం..!
రోజురోజుకీ పెరుగుతోన్న వాడకాన్ని దృష్టిలో పెట్టుకునే స్థానిక కంపెనీలతోబాటు రేబాన్, ఓక్లీ, గూచి, పోలీస్, డీజిల్, అర్మాణీ... వంటి బ్రాండెడ్ కంపెనీలు సాధారణ సన్‌గ్లాసెస్‌తోబాటు డిజైనర్ గ్లాసెస్‌నూ రూపొందిస్తున్నాయి. కార్టీయై, డోచె అండ్ గబానా, స్వరోవ్‌స్కీ, చోపార్డ్... వంటి కంపెనీలు రత్నాలను ఫ్రేముల్లో పొదిగి ఈ యాక్సెసరీని ఓ ఆభరణంగానూ మార్చేశాయి. ఓక్లీ, రీబక్, నైక్... వంటి కంపెనీలయితే క్రీడాకారులకోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు మనమే ఎప్పటికప్పుడు మార్చుకోగలిగే అద్దాల్నీ రూపొందిస్తున్నాయి. టెక్ యువతకోసం డిజిటల్ ప్లేయర్, కెమెరా, సెల్‌ఫోన్... ఇలా రకరకాల గాడ్జెట్స్‌లా ఉపయోగపడే గ్లాసెస్‌నూ తయారుచేస్తున్నాయి. పార్టీలకు వెళ్లినప్పుడు ఎవరూ గుర్తించకుండా పెట్టుకునే ఎంబరాసింగ్ ఫొటో సెక్యూరిటీ సన్‌గ్లాసెస్ కూడా వచ్చాయి.
కళ్లకెన్ని అద్దాలో..!
ఎవరెన్ని రకాలుగా డిజైన్ చేసినా సన్‌గ్లాసెస్‌కి ప్రాథమికంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. సాధారణంగా వీటిని ప్లాస్టిక్ లేదా ఆక్రిలిక్‌తో తయారుచేస్తుంటారు. వీటిల్లో బొమ్మ స్పష్టంగానే ఉన్నా మన్నిక తక్కువ. పాలీకార్బొనేట్ అద్దాలయితే బరువు తక్కువ. దృశ్యం చక్కగా కనిపిస్తుంది. వీటితో పోలిస్తే పాలీయురిథేన్‌తో చేసినవి నాణ్యమైనవి. కానీ ఖరీదెక్కువ.
లెన్సుమీద పూసే రంగు లక్షణాన్ని బట్టీ గ్లాసెస్‌లో రకాలున్నాయి. ఏదైనా లోహాన్ని అద్దాలమీద పూసి కళ్లకు చేరే దృశ్యకాంతిని తగ్గించే మిర్రర్డ్ లెన్స్, పై భాగంలో మాత్రమే రంగుని పూసే గ్రేడియెంట్, వాతావరణానికి అనుగుణంగా ముదురు నుంచి లేత రంగులోకి మారే ఫొటోక్రోమిక్, మంచు వంటి నున్నని ఉపరితలంమీద ప్రతిఫలించే కాంతిని అడ్డుకునే పోలరైజ్డ్... ఇలా రకరకాల లెన్సులు ఉంటాయి. అయితే ఇటీవల ఈ లక్షణాలన్నీ ఒకే అద్దాల్లో ఉండేలా రూపొందిస్తున్నారు. లెన్సు మాదిరిగానే ఫ్రేములు సైతం స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం, టైటానియం, నైలాన్... ఇలా విభిన్న ఫ్రేములతో వస్తున్నాయి. అయితే ప్రస్తుతం నైలాన్ ఫ్రేములదే రాజ్యం.
ఎలాంటివి కొనాలి?
సన్‌గ్లాసెస్ కొనేముందు కొన్ని విషయాలను తప్పక పరిశీలించాలి. ముందుగా 99-100 యూవీ కాంతినీ, 70-90శాతం దృశ్యకాంతినీ అడ్డుకుంటాయని లేబుల్ మీద ఉందో లేదో సరిచూడాలి. మొహానికి వదులుగానూ బిగుతుగానూ ఉండకుండా చూసుకోవాలి. అద్దం మధ్య భాగం కచ్చితంగా కనుపాపమీదకి వచ్చేలా చూడాలి. ఫ్రేము మరీ వెడల్పుగా ఉంటే యూవీకాంతి, పక్కనుండే ఖాళీలోంచి కంటిని చేరవచ్చు.
ఏవియేటర్, వేఫరర్, క్యాట్ ఐ, గుండ్రం, అసమతలం, చదరం, నలుచదరం, షట్కోణం, ర్యాప్‌ఎరౌండ్... ఇలా రకరకాల ఆకారాల్లో అద్దాలు వస్తున్నాయి. మన ముఖానికి ఏది బాగుంటుందో చూసుకుని కొనుక్కోవడం ఉత్తమం. మంచు, నీటిక్రీడలు, సైక్లింగ్... వంటి వాటిల్లో పాల్గొనేవాళ్లు కళ్లకు చుట్టూ ఉండే ఫ్రేముల్ని ఎంపికచేసుకోవడం మేలు.
అవసరాన్ని బట్టి అద్దాలమీద రంగునీ దృష్టిలో పెట్టుకోవాలి. బయట ఎక్కువగా తిరిగేవాళ్లకు ముదురు రంగు సన్‌గ్లాసెస్ కంటికి శ్రమను తగ్గిస్తాయి. బూడిద, ఆకుపచ్చ వర్ణాల్లో అయితే దృశ్యం రంగు మరీ ఎక్కువ మారదు. అయితే అన్ని రంగులతో పోలిస్తే బూడిద వర్ణం కాంతి ప్రకాశాన్ని తగ్గించి, స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి డ్రైవింగ్ చేసేవాళ్లకివే మేలు. ఎరుపు, ముదురు గోధుమ రంగు అద్దాలు కూడా కాంతి ప్రకాశాన్ని బాగా అడ్డుకుంటాయి. దృశ్యం మరీ చీకటిగా కాకుండా కాస్త ప్రకాశవంతంగా కనిపించాలనుకునేవాళ్లకి పైభాగంలో ముదురు రంగులోనూ కింది భాగంలో లేత రంగులోనూ ఉండే గ్రేడియెంట్ లెన్స్ బెటర్. అయితే యూవీ కాంతి నుంచి ఎక్కువ రక్షణనిచ్చేది మాత్రం గోధుమ లేదా తామ్ర వర్ణమే. కనుపాపలు లేత రంగులో ఉండేవాళ్లకయితే నీలం, గ్రే లేదా ఆకుపచ్చ వాడాలి. అయితే ఒకటికన్నా ఎక్కువ కోటింగ్‌లు వేసిన గ్లాసెస్ అయితే అన్ని రకాల వాతావరణాలకీ బాగా పనిచేస్తాయి. కొన్ని కంపెనీలు కావలసిన రంగు అద్దాలను ఎప్పటికప్పుడు మార్చుకోగలిగేలా అన్ని రంగుల లెన్సుల కిట్‌నీ తయారుచేస్తున్నాయి. మొత్తమ్మీద సన్‌గ్లాసెస్ ఎంత తేలికగా ఉంటే అంత మేలు సో, ఎండల్లో కళ్లు దెబ్బతినకుండా
మీకిష్టమైన కలర్డ్ గ్లాసెస్‌తో కూల్ కూల్‌గా తిరిగేయండిక..!
ఎంత ఖరీదో..!
సన్‌గ్లాసెస్...
కొందరికి మాత్రం కచ్చితంగా స్టేటస్ కమ్ ఫ్యాషన్ సింబల్.
అలాంటివాళ్లకోసం రూపొందించిన ఖరీదైన గ్లాసెస్ ఇవే... అచ్చంగా 24 క్యారెట్ల
బంగారంలో ఏకంగా 51 వజ్రాలను పొదిగి చోపార్డ్ కంపెనీ చేసిన అద్దాల ధర
సుమారు 2.6 కోట్ల రూపాయలు. ప్రపంచంలోకెల్లా ఖరీదైన అద్దాలివే. వీటి తరవాత
డోచె అండ్ గబానా రూ.రెండున్నర కోట్లతో తయారుచేస్తే, ఆ తరవాతి స్థానాన్ని
షీల్స్ జ్యువెలర్స్ సొంతం చేసుకుంది. ఈ కంపెనీ పచ్చలతో రూపొందించిన
అద్దాల ధర కోటీ ముప్ఫైలక్షల రూపాయలు.
|
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565