MohanPublications Print Books Online store clik Here Devullu.com

పశ్చిమగోదావరి జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలివే..._West Godavari


పశ్చిమగోదావరి జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలివే... West Godavari Kovvuru Tanuku Bhimadolu Dwaraka Tirumala Pattisam Polavaram Perupalem Mogalturu Adi Jain Swethambar Temple Jeelakarragudem Papikondalu Godavari Districts Eluru bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu


పశ్చిమగోదావరి జిల్లాలో
చూడదగ్గ ప్రదేశాలివే...

ఎటు చూసినా పచ్చని పొలాలు... నిండుగా ప్రవహించే పంట కాలువలూ, గుబురుగా ఎదిగిన చెట్లు... పశ్చిమ గోదావరి జిల్లా ప్రకృతి రమణీయతకు ఆటపట్టు. ప్రసిద్ధి చెందిన అనేక పర్యాటక ప్రాంతాలకు నిలయం ఈ ప్రాంతం.
కొల్లేటి కొలనులో... కులికేటి అలలలో...
ఆసియాలో అతి పెద్ద మంచి నీటి సరస్సుగా ఖ్యాతి పొందిన కొల్లేరు సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ప్రస్తుతం ఈ సరస్సు 2.70 లక్షల ఎకరాలలో విస్తరించి ఉంది. మరబోటులో లేదా లాంచీలో కొల్లేటి కోట వరకూ ప్రయాణించడం గొప్ప అనుభూతి. దారి పొడవునా చేపల చెరువులు, పక్షులతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చాళుక్యరాజులు కొల్లేటి కోటను పరిపాలించారు. అప్పట్లో విశాలమైన కోట ఉన్న ప్రాంతం నేడు మట్టిదిబ్బగా మిగిలింది. సరస్సును పూర్తి నీటితో చూడాలంటే ఆగష్టు నుంచి ఫిబ్రవరి మధ్య సందర్శించాలి.
 
పక్షుల సంరక్షణ కేంద్రం
కొల్లేటి కోట నుంచి వెనక్కు వస్తే కైకలూరు సమీపంలోని ఆటపాక వద్ద కొల్లేటి పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది. వివిధ జాతుల పక్షులు చూపరులకు కనువిందు చేస్తాయి. పర్యాటకుల కోసం అటవీ, టూరిజం శాఖలు వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేశాయి.
ఎలా వెళ్ళాలి?: భీమవరం నుంచి 33 కి.మీ. దూరంలో కొల్లేరు ఉంది. వివిధ వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. కొల్లేరు సమీపంలోని కర్రల వంతెన వరకు కారులో వెళ్ళి... అక్కడ నుంచి కొల్లేరులో మరబోటులో కానీ, లాంచీలో కాని ప్రయాణించి కొల్లేటి కోట చేరుకోవచ్చు.
 
వెండితెర వెలుగు పట్టిసీమ
గోదావరి ప్రాంతంలో సినిమా తియ్యాలంటే ముందుగా గుర్తొచ్చే ప్రాంతం పట్టిసీమ. ఇక్కడ సువిశాలమైన ఇసుక తిన్నెలు పర్యాటకుల విహారానికి ఎంతో అనువుగా ఉంటుంది. సుప్రసిద్ధమైన వీరభద్రస్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. పట్టిసీమ దగ్గర నిర్మించిన ఎత్తిపోతల పథకం తప్పనిసరిగా చూడదగ్గది.
ఎలా వెళ్ళాలి?: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సమీపంలోని కొవ్వూరు నుంచి నుంచి గోదారి గట్టున ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొవ్వూరు గోష్పాద క్షేత్రం ఎంతో సుప్రసిద్ధం. కొవ్వూరు నుంచి ప్రత్యేక బోటు ద్వారా గోదావరిలో ప్రయాణం చేసి గోదావరి మధ్యలోని పట్టిసీమ వీరభద్ర స్వామి ఆలయం దర్శించుకోవచ్చు.
 
నవ్యాంధ్రకు వరం పోలవరం
ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలను మార్చే వరదాయినిగా పేరుపొందిన పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం సందర్శన ఒక మంచి అవకాశం. నేటి అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి మచ్చుతునకగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ పనుల్లో వేలాది మంది కార్మికులతో ఈ ప్రాంతం సందడిగా ఉంటుంది. ప్రాజెక్ట్‌ పనులు, ప్రయోజనాలను వివరించే పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చూసి తీరాల్సిందే.
ఎలా వెళ్ళాలి?: రాజమహేంద్రవరానికి సుమారు 40 కి.మీ. దూరంలో పోలవరం ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. ప్రస్తుతం పాపికొండలు టూర్‌ పోలవరం ప్రాజెక్టు ఎగువ నుండి ప్రారంభం అవుతోంది. రాజమహేంద్రవరంలో బయలుదేరితే, మార్గమధ్యంలో 170 ఏళ్ళ చరిత్ర కలిగిన ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజిని చూసుకుంటూ గోదావరి గట్టు వెంబడి కొవ్వూరు చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి పురాతన హేవలాక్‌ వంతెన, ఆర్చిలా నిర్మించిన రైలు వంతెన, కొత్తగా నిర్మించిన రెండు లైన్ల గమన్‌ వంతెనలను చూడవచ్చు.
వసతి: పోలవరం నుంచి పాపికొండలు సందర్శనకోసం ఒక రోజు ప్రత్యేక ప్యాకేజీలను టూరిజం శాఖ నిర్వహిస్తోంది. బస చెయ్యడానికి అనేక ప్రభుత్వ, ప్రైవేటు రిసార్టులున్నాయి. 
 
సొగసైన సాగరతీరం పేరుపాలెం
పేరుపాలెం బీచ్‌ ఈ జిల్లాలో సుప్రసిద్ధమైన సాగరతీరం. దాదాపు 19.5 కి.మీ. సువిశాలమైన బీచ్‌ ఇది. ఆలయాలు, చుట్టూ సరుగుడు, కొబ్బరి తోటలతో అలరారే ఈ బీచ్‌ పర్యాటకులకు స్వర్గధామం.
వసతి: ఇక్కడ బీచ్‌ రెస్టారెంట్‌, అతిథి గృహం ఉన్నాయి. ఇక్కడికి 14 కి.మీ. దూరంలోని నర్సాపురం గోదావరి తీరంలో రివర్‌వ్యూ రెస్టారెంట్‌, బోటింగ్‌ సదుపాయం ఉన్నాయి.
ఎలా వెళ్ళాలి?: భీమవరానికి 25 కి.మీ. దూరంలో పేరుపాలెం ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
  
దొంగరావిపాలెం తీరం
గోదావరి తీరంలోని దొంగరావిపాలెం పర్యాటకంగా ప్రాచుర్యాన్ని సంపాదించుకుంటోంది. ఇక్కడ బోటింగ్‌, గోదావరి వంతెనలు, పచ్చటి పంట పొలాలు ప్రధాన ఆకర్షణలు.
ఎలా వెళ్ళాలి?: రాజమండ్రికి 40 కి.మీ., పాలకొల్లుకు 10 కి.మీ. దూరంలో పెనుగొండ ఉంది. అక్కడి నుంచి 12 కి.మీ. దూరంలో ఉన్న దొంగరావిపాలెం గ్రామానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
వసతి: దొంగరావిపాలెం సూర్య రిసార్ట్‌లో పర్యాటకులు విడిది చెయ్యడానికి తగిన సౌకర్యాలున్నాయి.
 
ఎర్రకాలువ రిజర్వాయర్‌
జిల్లాలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ రిజర్వాయర్‌ ప్రకృతి సౌందర్యానికి పెట్టిందిపేరు. జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయిగూడెం మీదుగా ఏజెన్సీ ప్రాంతంలోకి వెళితే సమీపంలో జల్లేరు రిజర్వాయర్‌ అందాలను తిలకించవచ్చు. కాస్త సాహసం చేస్తే అక్కడికి 20 కి.మీ. దూరంలో ఉన్న అడవులలోని దేవత గుబ్బల మంగమ్మ దర్శనం చేసుకోవచ్చు. జంగారెడ్డిగూడెం సమీపంలోని మద్ది గ్రామంలో ప్రసిద్ధమైన ఆంజనేయస్వామి ఆలయం ఉంది.
ఎలా వెళ్ళాలి?: ఏలూరుకు సుమారు 56 కి.మీ. దూరంలో జంగారెడ్డిగూడెం ఉంది. అక్కడి నుంచి అశ్వారావు పేట మార్గంలో- బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో ఎర్రకాలువ, జల్లేరు ప్రాంతాలు చేరుకోవచ్చు.
‘మెగా’ల్తూరు కోట...
పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో శిథిలమైన పురాతన కోట ఉంది. దాన్లో చెక్కల్తో చేసిన ఇల్లు మాత్రం మిగిలింది. ఈ గ్రామంలో మెగాస్టార్‌ చిరంజీవి నివసించిన ఇల్లు, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, యువ హీరో ప్రభా్‌సల నివాసాలు ఉన్నాయి. చక్కటి మామిడి, జీడి మామిడి, కాయగూరల తోటలతో కళకళలాడే గ్రామం ఇది.
ఎలా వెళ్ళాలి?: నర్సాపురం నుంచి 11 కి.మీ., భీమవరం నుంచి 22 కి.మీ. దూరంలో మొగల్తూరు ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
 
120 ఏళ్ళ గ్రంథాలయం
జిల్లాలోని కుముదవల్లి గ్రామంలో సుమారు 120 ఏళ్ళ చరిత్ర కలిగిన వీరేశలింగ కవి గ్రంథాలయం ఉంది. దీనిని భూపతిరాజు తిరుపతి రాజు 1897లో ప్రారంభించారు. ఇందులో వందేళ్ళుగా సేకరించిన ఎన్నో గ్రంథాలు, పత్రికలు భద్రపరిచి ఉన్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పరిశోధకులు ఇక్కడికి వస్తారు.
ఎలా వెళ్ళాలి?: భీమవరానికి మూడు కి.మీ. దూరంలో కుముదవల్లి గ్రామం ఉంది. 
 
ఆదిజైన శ్వేతాంబర ఆలయం
జైన తీర్థంకరుల్లో ప్రసిద్ధుడైన ఆది జైన శ్వేతాంబరుని ఆలయం పెదఅమిరం గ్రామంలో ఉంది. వేంగీచాళుక్యులు నిర్మించిన ఈ ఆలయం కాలక్రమేణా శిథిలమైంది. దాదాపు నూట యాభై ఏళ్ళ కిందట పశువుల కాపరులకు ఈ ప్రాంతంలో ఒక విగ్రహం దొరికింది. దాన్ని జైన విగ్రహంగా గుర్తించి ప్రతిష్ఠించారు. 2016లో ఇక్కడ జైన మందిరాన్ని పునర్నిర్మించారు. అన్ని మతాల వారూ ఆదిజైన శ్వేతాంబరుడిని సందర్శించుకుంటారు. విదేశాలనుంచి కూడా భక్తులు వస్తారు.
ఎలా వెళ్ళాలి?: భీమవరం పట్టణానికి నాలుగు కి.మీ. దూరంలో పెదఅమిరం గ్రామం ఉంది.
 
జీలకర్ర గూడెం ఆరామాలు
బౌద్దుల కాలం నాటి చారిత్రక చిహ్నాలతో ఆకట్టుకునే జీలకర్రగూడెం బౌద్ధ క్షేత్రానికి ప్రపంచంలో అనేక దేశాల నుంచి పర్యాటకులు వస్తారు. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో ఇక్కడి కొండ మీద దాదాపు పన్నెండు బౌద్ధ స్థూపాల్ని నిర్మించినట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో సువిశాలమైన మహానాగపర్వతం మీద ఉన్న ఈ బౌద్ధ గుహల సందర్శన చక్కటి అనుభూతి కలిగిస్తుంది. వీటిని గుంటుపల్లి గుహలు అని కూడా అంటారు.
ఎలా వెళ్ళాలి?: ఏలూరు నుంచి సుమారు 60 కి.మీ. దూరంలో
ఈ గ్రామం ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list