నూతన యజ్ఞోపవీత
ధారణా విధానము
జంధ్యాల పౌర్ణమి నాడు నాకు బాగా గుర్తు. నా చిన్నప్పుడు మా నాన్న, తాతగారితో బాటు పొద్దున్నే నిద్ర లేచి స్నానం చేసి కూర్చునేవాడిని. అదొక సరదా. మా ఇంటికి చాల మంది బ్రాహ్మణులు అందులో చాల మంది పురోహితులు వచ్చేవారు. వాళ్ళు ఆశీర్వచనం చేసి కొత్త జంధ్యం ఇచ్చేవారు. వాళ్లకి సంభావన ఇచ్చి పంపేవారు మా తాతగారు. ఈ జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన పాత జంధ్యం విసర్జించి కొత్త జంధ్యం (యజ్ఞోపవీతం) మార్చుకుంటారు. అయితే ప్రవాసంలో ఈ పర్వ దినం జరుపుకోవడానికి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అయినా వీలైనంతలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. నాకు ఈ విషయం లో పరిజ్ఞానం తక్కువ. కాని నాకు దొరికిన ఈ విధానం యొక్క సారాంశాన్ని నలుగురితో పంచుకోవాలని నా బ్లాగు లో వ్రాస్తున్నాను. తప్పులు వుంటే చదువరులు క్షమించగలరు. ముఖ్యంగా ఈ విధానం అమెరికాలో ఉన్నవారికి వెదుక్కోకుండా వెంటనే చూసుకోవడానికి ఉపయోగ పడుతుందని నా ఆశ.
ప్రార్థన:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరభ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతో పివా |
యః స్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్శుచిః ||
(ఈ మంత్రమును అనుకొనుచు శిరస్సు పై నీళ్ళు చల్లుకొనవలెను)
ఆచమనము:
ఓం మహా గణాధిపతయే నమః
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని ముమ్మారు ఆచమనము చేయవలెను. తదుపరి చేయి కడుగుకొనవలెను.)
"గోవిందా, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజా, నారసింహ, అచ్యుత, జనార్ధన, ఉపేంద్ర, హరే శ్రీ కృష్ణాయ నమః " (అని నమస్కరించవలెను.)
అటు పిమ్మట:
ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమి భారకా ఏతేషా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే
(చేతిలో ఉద్ధరిణి తో, లేకపొతే చెంచాతో నీరు పోసుకుని యీ మంత్రమును చదివిన పిమ్మట భూమి పై నీళ్ళు జల్లవలెను.)
ఓం భూః, ఓం భువః, ఓ గమ్ సువః, ఓం మహః,
ఓం జనః, ఓం తపః, ఓ గమ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్*గృహస్తులు ఐదు వ్రేళ్ళతో నాసికాగ్రమును పట్టుకుని మంత్రమును చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక కనిష్టిక వ్రేళ్ళతో ఎడమ ముక్కును పట్టుకుని మంత్రము చెప్ప వలెను.
సంకల్పం: కుండలీకరణము లో ఇచ్చినది అమెరికాలో ఉన్న వారికి వర్తిస్తుంది.
శుభే, శోభన ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రాహ్మనః, ద్వితీయ పరార్థే, శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే (ఇండియాకు) లేదా క్రౌంచ ద్వీపే (అమెరికాకు), భరత వర్షే (ఇండియా) లేదా రమణక వర్షే (అమెరికా), భరత ఖండే (ఇండియాకు) లేదా ఇంద్ర ఖండే (ఉత్తర అమెరికాకు), ...... నగరే (ఉన్న పట్టణం), స్వగృహే (స్వంత ఇంట్లో) / లేదా ..... నదీ తీరే (నది ఒడ్డున చేసుకుంటే), /లేదా .......క్షేత్రే (కోవెలలో చేసుకుంటే), అస్మిన్ వర్తమాన వ్యవహారిక, చంద్ర మానేన, వర్ష ఋతౌ, శ్రావణ మాసే, శుక్ల పక్షే, పౌర్ణమి తిథే, స్థిర (శని) వాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే, ఏవం గుణ విశేషణ విశిష్టాయాం, శ్రీమాన్ ...........గోత్రస్య (గోత్రము), .......నామ దేయస్య (పేరు), శ్రీమతః (భార్య) .....గోత్రస్య, ........నామధేయస్య (పేరు), ధర్మ పత్నీ సమేతస్య, మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం, నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే.
(బ్రహ్మచారులు "శ్రీ మతః .....గోత్రస్య, .......నామధేయస్య ధర్మ పత్నీ సమేతస్య" చెప్పనఖ్ఖర లేదు)
యజ్ఞోపవీతము యొక్క ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలము వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి ఉంచుకొనవలెను. తదుపరి ఆచమనము చేసి యజ్ఞోపవీత ధారణా మంత్రము
"యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః"
అని చెప్పుచు, ఒక పోగు "నిత్య కర్మానుష్టాన ఫల సిధ్యర్థం ప్రథమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని ధరించవలెను.
మరల ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ, రెండు పోగులను "గృహస్తాశ్రమ ఫల సిద్ద్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని జంటగా ధరించవలెను.
తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ "ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను.
మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.
తదుపరి పాత, క్రొత్త జంధ్యములను కలిపి కుడి చేతి బొటన వ్రేలు-చూపుడు వ్రేలు మధ్యన పట్టుకుని "దశ గాయత్రి" (పది మారులు గాయత్రి మంత్రమును) జపించి, యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను. (బ్రహ్మ చారులు ఒక్క ముడినే ధరించవలయును)
గాయత్రీ మంత్రము:
"ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్"
తదుపరి ఈ క్రింది విసర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.
"ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణ కర్మల దూషితం
విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తు మే"
తిరిగి ఆచమనం చేసి నూతన యజ్ఞోపవీతము తో కనీసం పది సారులైనను గాయత్రి మంత్రము జపించి యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను. తరువాత గాయత్రీ దేవత నుద్దేశించి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించ వలెను.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565