ప్రయాణం పరివర్తన కోసం!
కొత్త ప్రదేశాలు చూడాలి... తీర్థయాత్రలు చేసిరావాలి...
అనుకున్నదే తడవుగా బట్టలు సర్దుకుంటాం...
బ్యాగులు నింపేస్తాం...
కానీ మనం సర్దుకోవాల్సింది మనసును...
నింపాల్సింది హృదయాన్ని...
’‘ప్రయాణం మొదలైంది
అనుభూతుల్ని గుండెల్లో పదిలపరుచుకోడానికి!
పయనం ఆరంభమైంది
మనసుల్ని కలిపి కుట్టుకోడానికి!
యాత్రకు తొలి అడుగుపడింది
సుదూర తీరాలకు చేరువ కావడానికి!
గమనం ప్రారంభమైంది
మనిషిగా నన్ను నేను నిలబెట్టుకోడానికి!’’
చలన శీలత మనిషికి సహజ లక్షణం. నాగరికత విలసిల్లడానికి, సంస్కృతి వర్థిల్లడానికి మనిషి సంచార జీవన సంవిధానం ఎంతగానో దోహదపడింది. కొత్త ప్రదేశాల సందర్శన, విహార యాత్రలు, తీర్థయాత్రలు మనలో నవ చైతన్యాన్ని నింపుతాయి. విభిన్న సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాల్ని పరిశీలించడానికి, ఏకత్వంలో భిన్నత్వాన్ని అవలోకించడానికి యాత్రలు ఉపకరిస్తాయి. బడిలో నేర్వని పాఠం, ప్రకృతి ఒడి నేర్పుతుంది. అందుకే ప్రకృతిని మించిన గురువు, మార్గదర్శి లేరు. ఈ ఛైత్రంలో ప్రకృతి అందమైన చిత్రంలా కనువిందు చేస్తుంది. ఈ అపురూప సందర్భంలో మన అస్తిత్వాన్నే మరచిపోతూ కొత్త ప్రదేశాల్లోనో, పావన దివ్యక్షేత్రాల్లోనో, పరిమళించే ప్రకృతి సమక్షంలోనో తనువు, మనసు సేద తీరాలని ఉవ్విళ్లూరతాయి. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకుంటూ నూతనోత్తేజం పొందాలని ఆరాటపడతాయి. ఆ అనుభూతుల్ని అందుకోడానికి, ఆ మధురిమల్ని ఆస్వాదించడానికి ప్రయణాలు చేయాలి. అవన్నీ అర్థవంతంగా, చిరస్మరణీయంగా ఉండాలి.
‘గాయన్తి దేవాః కిలగీతగాని
ధన్యాస్తుతే భారత భూమి భాగే
స్వర్గా పవర్గా స్సద మార్గ భూతే
భవన్తి భూయః పురుషాః సురత్వాత్’
ఈ భరత భూమిలో జన్మించిన వ్యక్తులు ఎంతో ధన్యులు. దేవతలమైన మనకు లేని మోక్షం వారికి అవలీలగా లభిస్తుంది. కావాలంటే వాళ్లు మన స్వర్గం కూడా అందుకోగలరు.... అని దేవతలే ఈ దివ్యధాత్రిని కీర్తిస్తూ ఉంటారని విష్ణు పురాణం ప్రస్తావించింది. ఆధ్యాత్మిక చింతన సహజంగా ఉన్న భారతీయుల జీవన విధానంలో దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రల దర్శనం ముఖ్య భూమిక వహిస్తుంది. తరింపజేసేది తీర్థం. శారీరకంగా, మానసికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు దారి చూపి తీర్థ యాత్రలు భక్తుల్ని తరింపజేస్తాయనేది పెద్దలు చెప్పిన మాట.
ఎలా చేయాలి!
పర్యాటక
ప్రాంతానికైనా, తీర్థయాత్రకైనా, చారిత్రక ప్రదేశాలకైనా తరలివెళ్లాలంటే
ముందుగా మనం తగిన ప్రణాళిక వేసుకుంటాం. సరంజామా సర్దుకుంటాం. యాత్ర
ఎలాంటిదైనా ఆ ప్రయాణం వ్యక్తులకు సంబంధించిన భౌతిక ప్రయాణం మాత్రమే
కాకూడదు. ఆత్మ ఉద్దీపనకు దోహదం చేయాలి. శరీరంతో పాటు మనసూ ప్రయాణం చేయాలి.
యాంత్రికత, వైవిధ్యంలేని జీవన విధానం నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండడానికి
యాత్రలు చేస్తాం కాబట్టి ఆ ప్రదేశాల్లో మనసు పరిపూర్ణంగా అనుభూతి చెందాలి.
పర్యటనలు జీవితంపై నవ్య దృక్పథాన్ని ఏర్పరచాలి. ఉరవడిలో, ఒరవడిలో ఉన్న
మనసు సరికొత్త సవాళ్లను అధిగమించేందుకు సంసిద్ధం కావాలి. చేసే ప్రతి
ప్రయాణానికి గమ్యం ఉండాలి. లక్ష్యం ఉండాలి. ఆ ప్రయాణం ఎక్కడికైనా మనలో
పరివర్తన తెచ్చేది కావాలి. లక్ష్యసిద్ధి, చిత్తశుద్ధి, పరిణామం,
కొనసాగింపు, పరివర్తన అనేవి ఏ ప్రయాణానికైనా మౌలికమైన లక్ష్యాలు.
తీర్థయాత్ర అయినా, విహార యాత్రయినా ఆ యాత్రా ఫలం దక్కాలంటే సందర్శించిన
ప్రాంతాల నుంచి ఎన్నో విషయాలు సమన్వయం చేసుకోవాలి. ఏదైనా ప్రయత్నం చేయడం,
విభిన్న జాతులు, వర్గాలు, సమూహాలు, ప్రజల నుంచి సరికొత్త అంశాల్ని
నేర్చుకోవడం, సమష్టి తత్వాన్ని అలవర్చుకోవడం, సంఘటితంగా ఎలా బతకాలో
దర్శించడం, మనం మనుషులమని గుర్తు చేసుకుంటూ మానవీయ విలువల్ని
వ్యక్తీకరించడం ... ఇలా ఎన్నో ఉద్దేశాలతో, లక్ష్యాలతో యాత్ర
ప్రస్ఫుటమవుతుంది.
మనుషులకి గతం, వర్తమానం, ఘనత ఉంటాయి. వాటిని స్పృశించాలంటే ఆ మట్టిని పలకరించాలి. ఆ మట్టి సువాసనల్ని ఆఘ్రాణించాలి. కావ్యాల నుంచి కట్టడాల దాకా, చిత్తరువుల నుంచి శిల్పాకృతుల దాకా జాతి మూలాల్ని చదవాలి. కాలంతో పాటు పరుగులు తీసే జీవన శైలి అనేక ఒత్తిళ్లమయం. రణగొణధ్వనులు, యాంత్రిక జీవనానికి సుదూరంగా మనసు, శరీరం కాస్త స్థిమిత పడేలా చేసుకోడానికే విహారయాత్రలు. ప్రకృతి సమక్షంలో మనలోకి తొంగి చూసుకోడానికి ఇవి ఉపయోగపడతాయి.
మన
దేశం ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఆలవాలం. ప్రకృతి సౌందర్యాల నెలవులైన
ప్రదేశాలను, సహజ వనరులతో శోభిల్లే ప్రాంతాల్ని భారతీయలు వినియోగించుకునే
తీరు, దృక్పథం ఎంతో విభిన్నంగా ఉంటుంది. దివ్య సుందర ప్రదేశాల్ని భోగలాలసలో
కాలక్షేపం చేసే ప్రాంతాలుగా కాక, ముముక్షత్వంతో ఆధ్యాత్మిక జీవన
విధానాన్ని కొనసాగించడానికి వినియోగిస్తారు. రసరమ్య ప్రకృతిలో అణువణువునా
ఆవహించిన భగవత్ చైతన్యాన్ని దర్శిస్తారు. ‘గంగానది మార్గంలో నయాగరా జలపాతం
ఉంటే, దాన్ని వినియోగించే పద్ధతి ఇప్పటి ధోరణికన్నా ఎంతో వైవిధ్యంగా
ఉండేద’నే వారు సిస్టర్ నివేదిత.
|
అనుభూతి చెందితే..
చీకటి
తెరలు తొలగి నిద్ర మత్తులో అరమోడ్పు కన్నులు తెరిస్తే ఎదురుగా అలల
సవ్వడులతో మహా సముద్రం ఎంత బాగుంటుంది? ఆ సముద్ర జలాల ఆవలి వైపు
తేలియాడుతున్న ఎర్రటి రబ్బరు బంతిలా అరుణుడి సౌందర్యాతిశయం అద్భుతంగా
ఉంటుంది. అభయారణ్యాలు, ఆకాశాన్ని తాకే ఎత్తైన వృక్షాలు, పక్షుల
కిలకిలారావాలు, జలపాతాల సవ్వడులు, అగాధాలను మించిన లోయలు, కొండల అగ్రభాగాన
శిరస్సులపై అమరిన మబ్బుల కిరీటాలు, పిల్లకాలువల తుళ్లింతలు, గుత్తులుగా
విరబూసి మత్తుగా నవ్వే అడవి పువ్వుల సోయగం, అల్లనల్లనసాగే పక్షుల సమూహాలు,
పర్వతాలతో కబుర్లలో మునిగిపోయే మేఘమాలికల కలవరింతలు... ఇలాంటి అద్భుత
దృశ్యాలన్నీ ప్రకృతితో మమేకమైనప్పుడే అనుభూతమవుతాయి.
- డాక్టర్ కావూరి రాజేష్ పటేల్
|
ఆ సొరకాయలా వద్దు...
కురుక్షేత్ర
యుద్ధం ముగిసింది. ధర్మరాజు పాలన సాగిస్తున్నాడు. ప్రజలంతా సుఖసంతోషాలతో
ఉన్నారు. ఆ తరుణంలో ధర్మరాజుకు తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం కలిగింది. తన
అభీష్టాన్ని తన బంధుమిత్రులందరికీ తెలియజేశాడు. ఎంతోమంది ధర్మరాజుతో
యాత్రలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. శ్రీకృష్ణ్ణుణ్ణి కూడా తనతో పాటు
యాత్రలకు రమ్మని ధర్మరాజు ఆహ్వానించాడు. అయితే తనకు తీరిక లేదంటూ తన
బదులుగా ఈ సొరకాయను యాత్రలకు తీసుకెళ్లమన్నాడు. ఆ సొరకాయను అన్ని నదుల్లో
ముంచి, దైవదర్శనం చేయించి తిరిగి తీసుకురమ్మని చెప్పాడు శ్రీకృష్ణుడు.
పరమాత్ముడి ప్రతినిధి కదా ఆ సొరకాయ... అందుకే ధర్మరాజు దాన్ని తలపై
పెట్టుకున్నాడు. శ్రీకృష్ణుడే తన వెంట వస్తున్న అనుభూతి చెందాడు. అనేక
తీర్థాలు, యాత్రల తరువాత ధర్మరాజు రాజ్యానికి తిరిగివచ్చాడు. ఇలా యాత్రలు
చేసిన వచ్చిన తరువాత అన్నదానం చేయడం మన సంప్రదాయం. ధర్మరాజు అన్న సమారాధనకు
అన్ని ఏర్పాట్లు చేశాడు. సొరకాయను తీసుకుని శ్రీకృష్ణ మందిరానికి
వెళ్లాడు. ఆయన చెప్పినట్లుగానే సకల తీర్థాల్లో సొరకాయను ముంచి, క్షేత్రాల
దర్శనం చేయించానని చెప్పాడు. సంతోషించిన శ్రీకృష్ణుడు ఆ సొరకాయతో పులుసు
చేయించి అందరికీ వడ్డించమన్నాడు. అన్నసమారాధనలో ఆ కూర తినగానే అందరికీ
వాంతులు, వికారం మొదలయ్యాయి... కారణం సొరకాయ చేదుగా ఉండడమే. ఆ పులుసును
కృష్ణుడి దగ్గరకు తీసుకెళ్లి మంచి సొరకాయ ఇస్తే బాగుండేది కదా బావా!
అన్నాడు ధర్మరాజు. ‘ధర్మనందనా! అది చేదు సొరకాయ అని నాకు ముందే తెలుసు.
తీర్థయాత్రలు చేసి, పుణ్యక్షేత్రాలు చూసి వచ్చింది కదా, దాని చేదుపోయి
ఉంటుందని భావించాను అయితే దానిలో చేదు తగ్గలేదన్నమాట’ అన్నాడు కృష్ణుడు.
దాంతో ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఆంతర్యం అర్థమైంది. తమకు సందేశాన్ని
ఇవ్వడానికి పరమాత్ముడు ఇలా చేశాడని అవగతమైంది.
మనసులో మకిలిని వదిలించుకోకుండా, హృదయంలో కల్మషాన్ని నివారించకుండా ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఆ ప్రయత్నాలు వృథా. హృదయ పరివర్తన, మానసిక పరిపక్వత, ప్రశాంతత యాత్రల వల్ల అందే మధుర ఫలాలు. పర్యటనల ద్వారా ఆత్మ పరిశుద్ధత చెందాలి. ఆ నిర్మలత్వాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. |
పక్షి ప్రయాణం ఆహారాణ్వేషణ కోసం... అదే మనిషి ప్రయాణం జ్ఞానాన్వేషణ కోసం. అర్థవంతమైన ప్రయాణం ఎన్నో అద్భుతాల్ని ఆవిష్కరిస్తుంది’
- స్వామి వివేకానంద
|
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565