ఆ ఆరు వికారాలూ లేనిదే.. శివ
‘శామ్యతి,
పరమానందరూపత్వాన్నిర్వికారో భవతి యితి శివః’ అంటుంది అమర్చకోశం. శివుడు
నిర్వికారుడు. మనకు వికారములు ఉంటాయి. ఈ జగత్తులో సమస్తప్రాణులకు, సమస్త
జీవులకు ఆరు వికారాలుంటాయి. వాటిని షడ్వికారాలంటారు. కాలంలో ఏదైనా కొత్తగా
వచ్చినట్లయితే దానికి పుట్టినతేదీ అని ఒకటి ఉంటుంది. పుట్టినతేదీ ఉన్నదీ
అంటే.. అది షడ్వికారాలకు లోనయిపోతుందన్నమాట. జీవుడు పుట్టడంతోనే వానికి
జన్మము అనే తేదీ కాలంలో వచ్చింది. ఒక జన్మతేదీ ఏర్పడింది. అంతకుముందు
లేనిది ఇప్పుడు పుట్టింది. ఆ జీవి ఇప్పుడు భూమిపై ఉంది. తర్వాత ఆ జీవి
పెరుగుతుంది. పెరిగి కొంతకాలానికి మళ్లీ తరగడం ప్రారంభిస్తుంది.
కొంతకాలానికి శరీరం వడిలిపోయి క్షీణించడం ప్రారంభిస్తుంది. ఇంకా కొంతకాలం
గడిచేటప్పటికి ఆ శరీరం నశించిపోతుంది. అంత్యేష్టి సంస్కారం చేయబడుతుంది. ఈ
ఆరు వికారాలూ సమస్త ప్రాణులకూ ఉండి తీరుతాయి. ఈ ఆరు వికారాలూ లేనిది ఏదైనా
ఉందా? ఉన్నది. అదే శివ. అది కాలంలో పుట్టలేదు. కాలంలో పెరగలేదు. కాలంలో
ఉండలేదు. కాలంలో నశించదు. జీవి ఎవరి నుండి వచ్చిందో ఎవరియందు పెరిగిందో
ఎవరియందు లయించిందో.. వాడు మాత్రం అలాగే ఉండిపోతున్నాడు. అలా ఉండిపోయినవాడు
ఎవడు? వాడు పరబ్రహ్మం. వానికి కదలిక లేదు. వాడు ముందరా ఉన్నాడు. చివరా
ఉన్నాడు. అలా ఉన్నవాడు ఎవడో వాడు నిర్వికారుడు. వానికి వికారములు లేవు.
కాబట్టి వాని జుట్టు తెల్లబడదు. వానికి ముసలితనం లేదు. వానిని కాలం
లొంగదీయలేదు. కాబట్టి వాడునిత్యయౌవనుడు. అందుకే మనం శివుని గురించి
చెప్పినా, అమ్మవారి గురించి చెప్పినా.. ‘నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్ట వపుర్థరాభ్యాం’ అంటాం. వారికి వార్థక్యం రాదు. ఎందుచేత? మనం
కాలమునకు వశులవడం చేత కాలమునందు మనకు మార్పు వస్తుంది. కాలస్వరూపంలో
మనయందు మార్పులు తెచ్చేవాడు ఎవడున్నాడో వాడు మార్పునకు అతీతుడిగా సాక్షిగా
ఉన్నాడు. కదిలే వస్తువుకు కదలని వస్తువు ఆధారమై ఉంటుంది. వికారాలు కలిగిన
జగత్తుకు.. ఏది వికారాలకు అతీతమై ఉన్నదో అది ఆధారమై ఉన్నది. దానియందే ఈ
సమస్త జగత్తూ పుట్టి పెరిగి లయిస్తున్నది. అటువంటిది ఏదో అది వికారాతీత
స్థితి కలిగిన పరబ్రహ్మం. దానిని ఒక నామవాచకంతో పిలవాలని అనుకుంటే ‘శివ’
అని పిలువవచ్చు. కాబట్టి శివ శబ్దం పరబ్రహ్మం గురించి చెబుతోంది.ఆయన
నిర్వికారమై, నిరంజనమై ఉంటాడు. అమరకోశంలో అమరసింహుడు ఆయన్ను
‘పరమానందరూపత్వ’ అంటాడు. అంటే.. నిత్యానందాన్ని రాశీభూతం చేస్తే అదే ‘శివ’.
చాగంటి కోటేశ్వరరావు శర్మ
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565