సత్యభామ యుద్ధం చేసింది ఇక్కడే
సత్యభామ యుద్ధం చేసింది ఇక్కడే..!
సురాసుర భేదం చూపని శివయ్య యుగాలనాడే అక్కడ స్వయంభూగా వెలిశాడని ప్రతీతి. రణరంగంలో సత్యభామ నరకాసురుడిని వధించిందీ ఇక్కడేనని పురాణాలు తెలియజేస్తున్నాయి. నరకాసుర సంహారం అనంతరం అతడికి ఈ నదీ తీరంలోనే శ్రీకృష్ణుడు స్వయంగా తర్పణం వదిలాడని చెబుతారు. ద్వాపర యుగం నుంచీ కలియుగం వరకూ ఆ దేవదేవుడు పూజలందుకుంటున్న క్షేత్రమే కృష్ణాజిల్లా నడకుదురులోని పృథ్వీశ్వరస్వామి దేవస్థానం.
దేవదానవులిద్దర్నీ సమదృష్టితో చూడగలిగిన మహాదైవం పరమేశ్వరుడొక్కడే. సముద్రంలాంటి ఆయన కృపాకటాక్ష వీక్షణాల్లో ఓలలాడిన వాళ్లలో అటు దేవతలతో పాటు ఇటు దానవులూ ఉన్నారు. స్వామి సమదృష్టికి తార్కాణంగా కనిపిస్తుంది కృష్ణా జిల్లా నడకుదురు క్షేత్రం. ఇక్కడే రాక్షసరాజైన నరకాసురుడు స్వామిని పాప ప్రాయశ్చిత్తం కోసం ప్రార్థించాడట. ఇదే లింగాన్ని నరక సంహారానంతరం శ్రీకృష్ణస్వామీ పూజించాడట. దేవదానవులిద్దరి పూజలూ అందుకున్న మహిమాన్విత లింగంగా ఇక్కడి పృథ్వీశ్వరుడు శోభిల్లుతున్నాడు.
స్థలపురాణం
ద్వాపర యుగంలో నరకుడు ప్రాగ్నోషికపురం అనే ప్రాంతాన్ని పాలించేవాడు. నరకుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి, తల్లి వల్ల తప్ప మరొకరి వల్ల మృత్యువు సంభవించకూడదనే వరాన్ని పొందాడు. ఒకనాడు నరకుడు వేటకు వెళ్లగా జంతువుని చంపడానికి వేసిన బాణం గురితప్పి ద్విముఖుడు అనే బ్రాహ్మణుడికి తగిలి, మరణిస్తాడు. విషయం తెలుసుకున్న నరకుడు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందడానికి ఏం చెయ్యాలో చెప్పమంటూ అతడి గురువును ఆశ్రయిస్తాడు. జరిగింది తెలుసుకున్న గురువు ‘కృష్ణానదీ తీరంలో భూమి నుంచి ఉద్భవించిన శివలింగం ఉంది. ఆ స్వామిని పుష్కర కాలంపాటు అర్చించడం ద్వారా ఈ దోషం నుంచి విముక్తి పొందగలవ’ని చెబుతాడు. అంతట నరకుడు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న నడకుదురు చేరుకుని పృథ్వీశ్వరస్వామిని ఆరాధిస్తూ ఉంటాడు. ఆ కాలంలోనే తనకున్న రాక్షస ప్రవృత్తి వల్ల ఈ ప్రాంతంలోని ఆడవారిని బంధించి, హింసించసాగాడు. దీంతో భయభ్రాంతులకు లోనైన వారందరూ తమని రక్షించమంటూ శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తారు. సత్యభామా సమేతుడై ఇక్కడకు వచ్చిన స్వామి ఆ స్త్రీలందర్నీ విముక్తులను చేస్తాడు. అందుకు ఆగ్రహించిన నరకాసురుడు శ్రీకృష్ణ భగవానుడిపై యుద్ధానికి సిద్ధపడతాడు. ఆ యుద్ధంలో శివుడి వరప్రభావం వల్ల శ్రీకృష్ణుడికి కొంతసేపు స్పృహ తప్పుతుంది. అంతట ఆగ్రహించిన సత్యభామ కదనరంగంలో దూకి నరకుడిని వధిస్తుంది. అందుకే ఈ ఆలయానికి నరకోత్తారకక్షేత్రంగా పేరొచ్చింది. కాలక్రమంలో నరకొత్తూరు, నరకదూరుగా ప్రస్తుతంనడకుదురుగా ప్రసిద్ధి చెందింది. నరక సంహారానికి గుర్తుగా నేటికీ ఇక్కడ నరక చతుర్దశినాడు నరకాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. నరకాసురుడికి శ్రీకృష్ణుడు ఈ కృష్ణానదీ తీరంలో తర్పణం వదిలాడనీ అందుకే ఈ ప్రాంతంలో పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తే మంచిదనీ భక్తుల విశ్వాసం. పృథ్వీశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న పాటలీ వృక్షాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటాయి. గొప్ప శివ భక్తుడైన నరకాసురుడిని సంహరించడం ద్వారా ప్రాప్తించిన దోషాన్ని పరిహరించుకోవడానికి స్వయంగా ఆ శ్రీకృష్ణుడే దేవలోకంలోని దేవేంద్రుడి పూదోటలో ఉన్న పాటలీ వృక్షాన్ని భూమి మీదకి తీసుకువచ్చాడట. ఆ పూలతోనే పృథ్వీశ్వర స్వామిని అర్చించి దోషవిముక్తుడు అయ్యాడన్న కథ ప్రచారంలో ఉంది. భక్తులపాలిట కొంగుబంగారంగా పూజలందుకుంటున్న మహాదేవుడు ఈ దేవాలయంలో పృథ్వీశ్వరస్వామిగా, పడమర ముఖంగా ఉన్న శ్వేతలింగంగా దర్శనమిస్తాడు.
బాలాత్రిపురసుందరి
ఈ దేవాలయంలో అమ్మవారు బాలాత్రిపురసుందరిగా కొలువై ఉంది. ఈ ఆలయప్రాంగణంలోనే వీరభద్రస్వామి, లక్ష్మీనారాయణస్వామి, నవగ్రహ మండపం, గ్రామదేవత వనమలమ్మ తల్లి విగ్రహాలూ దర్శనమిస్తాయి. ఇక్కడ అర్చన చేయిస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందనీ, వివాహంకాని వారికి త్వరగా వివాహం జరుగుతుందనీ భక్తుల విశ్వాసం. ఇక్కడ సంతానం కోసం నాగ ప్రతిష్ఠలు చేయడం ఆనవాయితీ.
ఇలా చేరుకోవచ్చు
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురులో ఉన్న శ్రీపృథ్వీశ్వరస్వామి ఆలయం విజయవాడకు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుంచి నడకుదురుకి బస్సు సదుపాయం ఉంది. కరకట్టమీదగా వెళ్లే ఆర్టీసీ బస్సు ప్రతి అరగంటకు ఒకటి అందుబాటులో ఉంటుంది. విజయవాడ నుంచి బందరురోడ్డు మార్గంలో కూచిపూడి మీదుగా ప్రయాణించి నడకుదురు క్షేత్రానికి చేరుకోవచ్చు.
- ముత్తా నారాయణరావు,
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565