MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీమహావిష్ణువు నామాలు... పుణ్యమార్గాలు.._Vishnusahasranamam


విష్ణు సహస్రనామ స్తోత్రము ===వేయి నామములు===  vishnu sahasram   విష్ణువు వేయి నామములు- 1-1000


శ్రీమహావిష్ణువు నామాలు... పుణ్యమార్గాలు..

శ్రీమహావిష్ణువు పూజ చేసే సందర్భంలో స్వామికి సంబంధించిన కొన్ని నామాలు వినిపిస్తుంటాయి. ఆ నామాలలో ఎన్నెన్నో అంతరార్థాలు ఉన్నాయి. అవన్నీ ఆ స్వామి విశేషాలను ప్రకటిస్తుంటాయి. ఈ విశేషాలను తెలియజేసే కథా సందర్భమే ఇది. మహా భారతం శాంతిపర్వంలో సాక్షాత్తూ శ్రీమహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదంతా వివరించి చెప్పాడు. విష్ణుపూజలో వినిపించే ఓ మధురమైన నామం హృషీకేశుడు. జగత్తుకంతటికీ హర్షాన్ని ప్రసాదించేవారు అగ్నిసోములు అని పిలుపులందుకుంటున్న సూర్యచంద్రులు. వీరినే హృషీ అని కూడా అంటారు. సూర్యచంద్రుల కిరణాలను హృషీకేశాలు అని అనటం కూడా ఉంది. ఈ మొత్తం అర్థాన్ని కలిపి చూస్తే సూర్యచంద్రుల కిరణాలు కేశాలుగా ఉన్నవాడు అనే అర్థం వస్తుంది. అలా ఉన్నవాడే శ్రీమన్నారాయణుడు.

అందుకే ఆయన గోవిందుడు..
హరి అని విష్ణువును పిలవటానికి సముచితమైన అర్థముంది. యజ్ఞాలలో మంత్రాలలో ఆ స్వామిని ఆవాహన చేస్తారు. అప్పుడాయన తన యజ్ఞభాగాన్ని తాను హరిస్తాడు. అంటే స్వీకరిస్తాడు. అలాగే ఆయన శరీర వర్ణం హరితం. ఈ వర్ణంతో ఉన్నందువల్ల, తన యజ్ఞభాగాలను తాను స్వీకరిస్తున్నందువల్ల హరి అనే పేరు వచ్చింది. శ్యామవర్ణదేవుడు కనుక శ్యాముడు అని అంటారు. ప్రాణసారానికి ధామం అని పేరు. రుతం అంటే సత్యమని అర్థం. ఆ స్వామి ప్రాణసారమైన సత్యస్వరూపుడు కనుక రుతధాముడు అని పేరుంది.

అందరికీ బాగా పరిచయమైన గోవిందా నామంతో ఆయనను కీర్తించటానికి చక్కని కారణమే ఉంది. పూర్వం భూమండలమంతా రసాతలానికి వెళ్లిపోయింది. అప్పుడు ఆ స్వామి వరాహ రూపాన్ని ధరించి భూమిని పైకి ఉద్ధరించాడు. అందుకే ఆయనకు గోవిందుడు అని పేరొచ్చింది. గాం విందతి ఇతి గోవిందః అనే దానికి అర్థం భూమిని ప్రప్తింపచేసిన వాడు అని. అందుకే గోవిందుడయ్యాడు. శ్రీమహావిష్ణువును శిపివిష్ణుడు అని అంటారు. శిపి అనంటే రోమ, ఆకారరహితమైన ప్రాణి అని అర్థం. విష్ణ అని అంటే వ్యాపించటమని అర్థం. ఆ జగన్నాయకుడు నిరాకార రూపంలో సమస్తజగత్తున వ్యాపించి ఉంటాడు. అందుకే ఆయనకు శిపివిష్ణుడు అని పేరొచ్చింది. అలాగే పూర్వం యాస్కుడు అనే ఓ రుషి తాను చేస్తున్న యజ్ఞాలలో శిపివిష్ణ అనే నామంతో స్తుతించి తాను కోల్పోయిన నిరుక్త శాస్త్రాన్ని మళ్లీ పొందాడు. ఆ నామానికి అంతటి మహిమ ఉంది.

ఆది, అంతాలు లేని స్వామి
విష్ణువును అజుడు అని అంటారు. అదెలాగంటే ఆ స్వామికి ఆది, అంతాలు లేవు. స్వయంభువు. ప్రాణుల శరీరాలలో క్షేత్రజ్ఞుడైన ఆత్మగా ఉంటాడు. అందుకే అజుడు అని పేరొచ్చింది. ఆ స్వామిని సత్యం అని అంటారు. దీనికి కారణమేమంటే ఆయన ఎప్పుడూ అశ్లీలమైన మాటలు పలుకలేదు. సత్యస్వరూపురాలైన సరస్వతి ఆ స్వామికి వాక్కు. అలాగే సత్‌, అసత్‌లను ఆయనలోనే ఉంచుకున్నాడు. ఇన్ని కారణాలవల్ల ఆ పద్మనాభుడి నాభికమలంలో ఉండే రుషులు సత్యం అనే పేరుతో ఆయనను కీర్తిస్తుంటారు. సత్వరజస్తమోగుణాలలో సత్వగుణానికి విశిష్టత ఉంది. ఆ సత్వగుణాన్ని ఎప్పుడూ అంటిపెట్టికొనే ఉంటాడు. అలాగే సాత్వత జ్ఞానస్వరూపుడు కూడా అయినందువల్ల సాత్వతుడు అని పేరొచ్చింది. ఇనుమును కృష్ణలోహం అని అంటారు. రైతులు భూమిని దున్నే నాగలి కర్రు ఇనుముతో చేసి ఉంటుంది. ఆ నాగలి కర్రులో శ్రీమహావిష్ణువు ఉంటాడు. అందుకే ఆయనకు కృష్ణుడు అనే పేరొచ్చింది. కృష్ణవర్ణం అనంటే నల్లని రంగు అని అర్థం ఉంది. ఆ స్వామి అదే రంగులో ఉంటాడు కనుక అలా ఆ పేరు స్థిరపడింది. భూమిని జలంతో, ఆకాశాన్ని వాయువుతో, వాయువును తేజస్సుతో కలపటమనేది మరెవరికీ సాధ్యంకాని పని. అలాంటి పనిని వైకుంఠత్వం అని అంటారు. అందుకే ఆయనకు వైరుంఠుడు అనే పేరొచ్చింది.

బ్రహ్మమే పరమ ధర్మం. ఆ పరమధర్మంనుంచి ఆయన ఎప్పుడూ చ్యుతుడు కాలేదు. అంటే జారిపోలేదు. ఈ కారణంగా అచ్యుతుడు అని అన్నారు. స్వామికున్న పేర్లలో అధోక్షజుడు అనేది విశేషమైన పేరు. అధః అనే పదానికి పృథ్వీ అని, అక్షం అంటే ఆకాశం అని, జ అంటే పృథ్వీ ఆకాశాన్ని రెండింటిని ధరించేవాడు అని ఉన్న అర్థాలవల్ల అధోక్షజుడు అని పేరొచ్చింది. పృథ్వీ, ఆకాశం రెండూ అన్ని వైపులకు విస్తరించి ఉంటాయి. ఈ రెండింటినీ ధరించటం అంటే ఎవరికీ వీలయ్యే పనికాదు. ఒక్క ఆ అధోక్షజుడికి తప్ప. అలాగే యజ్ఞశాలలో ఉండే ప్రాగ్వంశం అనే భాగంలో కూర్చొని వేదవేత్తలు అధోక్షజ అనే నామంతో ఆ స్వామిని కీర్తిస్తుంటారు. జీవులు ఆయనను కీర్తించినందువల్ల అధోగతిపాలు కాకుండా, క్షీణించకుండా ఉంటారు కనుక అధోక్షజుడు అనే పేరొచ్చింది. పూర్వం మహర్షులు అధోక్షజ అనే శబ్దాన్ని మూడు భిన్న పదాల సముదాయంగా భావించారు. ‘అ’ అంటే లయస్థానం. ‘ధోక్షం’ అంటే పాలన స్థానం. ‘జ’ అంటే ఉత్పత్తిస్థానం. ఈ భిన్నర్థాలను కలిపిచూస్తే సృష్టి, స్థితి, లయాలకు కారకుడైన వాడే అధోక్షజుడు. ఆయనే నారాయణుడు అని అర్థం. యజ్ఞంలోని జ్వాలలను ఆ స్వామి జాగృతం చేస్తుంటాడు. అందుకే ఘృతార్చి అనే పేరొచ్చింది. ఇలా శ్రీ మహావిష్ణువుకున్న కొన్ని అరుదైన పేర్లను గురించి మహాభారతంలోని శాంతిపర్వం వివరిస్తోంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list