వేసవిలో చార్‌ధామ్ యాత్ర
యమునాదేవి అక్కడ స్వేచ్ఛా తరంగిణి.. స్వచ్ఛ వాహిని! గంగమ్మతల్లి పాలవెల్లి.. కల్పవల్లి..! భవహరుడి పుణ్యక్షేత్రం.. శ్రీహరి దివ్యధామం.. అవే యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బదరీనాథ్. ఈ నాలుగు కలియ తిరిగితే.. చార్‌ధామ్ యాత్ర! దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో.. ఏడాదికోసారి జరిగే ఉత్సవానికి సమయం ఆసన్నమైంది. ఆరు నెలల పాటు హిమంతో కప్పి ఉండే ఈ పుణ్యక్షేత్రాలు.. మంచుతెరలు తొలగించుకొని.. పర్యాటక ప్రియులను స్వాగతిస్తున్నాయి. ఈనెల 18న ముందుగా యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తెరవనున్నారు. 29న కేదార్‌నాథ్ ఆలయాన్ని, 30 బదరీనాథ్ ఆలయాన్ని తెరుస్తున్నారు. ఈ సందర్భంగా ఆ మహాయాత్ర విశేషాలు మీ కోసం..
ఆధ్యాత్మికతకు, ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టు హిమగిరులు.. మంచుకొండల్లో సాగే మహాయాత్ర చార్‌ధామ్ యాత్ర.. సుమారు 12,000 అడుగుల ఎత్తులో.. ఇరుకైన దారుల వెంట పర్వతాల మీదుగా సాగుతుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయసానువుల్లో దాదాపు 10 రోజులపాటు 1,200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వందల అడుగుల లోతైన లోయల పక్కగా సాహసోపేతంగా సాగుతుందీ యాత్ర. బదరీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి ఈ నాలుగు పుణ్యక్షేత్రాల దర్శనానికి చార్‌ధామ్ యాత్ర అని పేరు. గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదార్‌నాథ్ ధామాల దర్శనాన్ని మినీ చార్‌ధామ్ యాత్రగా పేర్కొంటారు. ప్రస్తుతం దీనిని కూడా చార్‌ధామ్ యాత్రగా పిలుస్తున్నారు. ఏటా అక్షయ తృతీయ నుంచి దీపావళి మర్నాడు వచ్చే యమద్వితీయ వరకు ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయాలను భక్తుల కోసం తెరుస్తారు. మిగతా ఆరునెలల కాలం అక్కడంతా మంచుకప్పేసి ఉంటుంది. ఆలయాలను తెరిచే క్రతువు, చివరిరోజున మూసివేత క్రతువు అత్యంత వైభవంగా సాగుతాయి. తొలిదర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు.
యమునోత్రితో మొదలు..
ఈ నాలుగు ధామాల్లో ముందుగా ఎక్కడికి వెళ్లాలనే సందేహం రావడం సహజమే కానీ.. సాధారణంగా యాత్రికులు తూర్పు నుంచి పశ్చిమానికి ప్రయాణిస్తారు. అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బదరీనాథ్ ఇలా సాగుతుందన్నమాట. హరిద్వార్ నుంచి వాహనాల్లో డెహ్రాడూన్, ముస్సోరీల మీదుగా యమునోత్రికి బయల్దేరుతారు. ఈ మార్గంలో వాహనాలు జానకిచట్టి అనే ప్రాంతం వరకు వెళ్తాయి. ఇక్కడ అన్నిరకాల భోజన, వసతి సదుపాయాలు ఉంటాయి. అక్కడి నుంచి 8 కిలోమీటర్లు కాలినడకన యుమునోత్రికి చేరుకోవాలి. గుర్రాలు, నలుగురు మనుషులు మోసే పల్లకి (డోలీ)ల్లో మంచుపర్వతాల్లో ప్రయాణించి యమున జన్మస్థలమైన యమునోత్రికి చేరుకోవాలి. ఈ నడక దారి ఒక్కోచోట 10 అడుగుల వెడల్పే ఉంటుంది. వెళ్లేవారు, వచ్చేవారితోపాటు వచ్చిపోయే గుర్రాలను దాటుకుంటూ ముందుకు సాగాలి. అప్రమత్తంగా లేకపోతే గుర్రాలు తోసుకుంటూ వెళ్లిపోతాయి. ఒకవైపు వందల అడుగుల ఎత్తున పర్వతముంటే.. మరోవైపు ఐదారు వందల అడుగుల లోతైన లోయ ఉంటుంది. అందులో యమున వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. పర్వతాల మధ్య దారి చేసుకుంటూ నురుగలు కక్కుతూ నది సాగిపోయే దృశ్యం మహత్తరంగా ఉంటుంది. యమునోత్రి చేరుకున్న తర్వాత.. సూర్యకుండంలో (వేడినీళ్ల కుండం) స్నానాలు చేసి.. యమునాదేవి ఆలయాన్ని సందర్శించుకుంటారు.
మంచుగిరుల్లో వేడినీటి సుడులు
చుట్టూ మంచుకొండలు, గడ్డకట్టించే చలి.. అయినా అక్కడక్కడా భూమిలో నుంచి వేడి నీళ్లు ఉబికివస్తుంటాయి. దైవ మహిమ ఇదని భక్తులు భావిస్తే.. ప్రకృతి అద్భుతమిదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. నేల పొరల్లో ఉండే గంధకం కారణంగా పుట్టే వేడిమికి వేడి నీరు ఇలా ఉబుకుతుందని భూగర్బ పరిశోధకులు తేల్చిచెప్పారు. బదరీనాథ్‌లో నారద్‌కుండ్, తప్త్‌కుండ్ అనే వేడినీటి కుండాలు ఉంటాయి. వీటిలోనే భక్తులు స్నానాలు చేసి బదరీ నాథుడిని దర్శించుకుంటారు. యమునోత్రిలోని వేడి నీటి కుండాన్ని సూర్య కుండమని పిలుస్తారు. బంగాళాదుంపలు, బియ్యం తదితరాలను భక్తులు ఓ వస్త్రంలో మూటగా కట్టి కర్రల సాయంతో ఆ వేడినీటిలో ఉంచి ఉడికించి యుమునకు నివేదిస్తారు. కేదార్‌నాథ్ దిగువన ఉన్న గౌరీకుండ్‌లో వేడినీటి కుండం ఉంది.
జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్
గంగోత్రి దర్శనం యాత్రికులు కేదార్‌నాథ్ యాత్రకు పయనమవుతారు. గంగోత్రి నుంచి ఉత్తరకాశి మీదుగా వాహనాల్లో రుద్ర ప్రయాగ చేరుకుంటారు. అక్కడి నుంచి కేదార్‌నాథ్‌కు బయలుదేరుతారు. దేశంలో జ్యోతిర్లింగాలుగా పేరొందిన 12 శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్‌నాథ్. ఈ దారిలో వచ్చే గుప్తకాశి పురాణాల పరంగా విశిష్ఠమైన క్షేత్రం. అక్కడి నుంచి ఆసియాలోనే పెద్దదైన తెహ్రీ డ్యాం మీదుగా గౌరీకుండ్ చేరుకుంటారు. ఇక్కడి నుంచి కేదార్‌నాథ్‌కు 14 కిలోమీటర్లు. కాలి నడకన, డోలీల్లో, గుర్రాలపై వెళ్తుంటారు. దారిలో రాంబడా అనే చిన్న ఊరు వస్తుంది. అక్కడ కొద్దిమేర భోజన, వసతి సదుపాయాలు దొరుకుతాయి. కేదార్ వెళ్లే దారి పొడుగునా లోయల్లో మందాకిని నది ఉరుకుల పరుగులతో సాగిపోతూ ఉంటుంది.
కేదార్‌నాథ్ ఆలయం మూడు పర్వతాల మధ్య ఉంటుంది. వాటిపైన గాంధీసరోవర్ అనే పెద్ద సరస్సు ఉంటుంది. అక్కడి నుంచి కరిగే మంచు మూడు పాయలుగా చీలి కేదార్‌నాథ్ ఆలయం చుట్టువైపుల నుంచి కిందకు సాగి మందాకినిగా రూపుదాల్చుతాయి. (ఈ సరస్సు నిండిపోయి పొంగిపొర్లడం వల్లనే 2013లో హిమాలయ సునామీ సంభవించింది.) ఎద్దు పృష్ఠభాగం రూపంలో ఉండే శివలింగం అత్యంత పవిత్రమైనది. ఈ ఆలయం వెనుకనే ఆదిశంకరాచార్యుల సమాధి మందిరం ఉంటుంది.
నరనారాయణ పర్వతాల నడుమ బదరీనాథ్
బదరీనాథ్‌కు వాహనాల్లో నేరుగా వెళ్లొచ్చు. కేదార్‌నాథ్ నుంచి తొలుత జోషిమఠ్ వెళ్లాలి. ఘాట్ రోడ్డులో ప్రయాణం భలేగా సాగిపోతుంది. పక్కన లోయలో అలకనందా నదీ ప్రవాహం అలరిస్తుంది. జోషీమఠ్ నుంచి బదరీనాథ్ సుమారు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నరనారాయణ పర్వతాల నడుమ నెలకొన్న బద్రీనాథ్ ధామం ఇలవైకుంఠాన్ని తలపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం ఏనాటిదో పురావస్తు శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోయారట. హిమాలయాల్లో ఏర్పడే మంచుతుపాన్లకు, హిమనీనదాలకు దెబ్బతిన్న ఆలయ గోపురాన్ని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నపుడు మన తెలుగువాడైన గణపతి స్థపతితో పునర్నిర్మింపజేయడం విశేషం. ఎత్తయిన నారాయణ పర్వతం పాదాల చెంత అంతెత్తున ఠీవీగా నిలుచుని ఉండే రంగురంగుల గోపురం భక్తులను ఆకట్టుకుంటుంది. పలు ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు భోజన, వసతి సదుపాయాలు లభిస్తాయి. బస్సులు, వాహనాలు నేరుగా బదరీనాథ్‌కు చేరుకుంటాయి. బదరీ నారాయణుడిని దర్శించుకోవడంతో చార్‌ధామ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికులు హరిద్వార్ లేదా రుషీకేశ్ చేరుకొని తిరుగు ప్రయాణం అవుతారు.
గంగమ్మ ఒడిలో..
గంగ.. ఈ పేరు వినగానే భారతీయుల హృదయం పులకిస్తుంది. గంగ అని ముద్దుగా, గంగమ్మ అని భక్తితో.. గంగమ్మతల్లీ అని పరవశంతో పిలుచుకునే గంగానది జన్మస్థలమే గంగోత్రి. యమునోత్రి నుంచి జానకిఛట్టి వరకు దిగి వచ్చాక అక్కడి నుంచి వాహనంలో గంగోత్రి వరకు వెళ్లొచ్చు. ముందుగా బార్కోట్ చేరుకోవాలి. అక్కడ బస చేసి తిరిగి మర్నాడు ఉదయం గంగోత్రికి బయలుదేరుతారు చాలామంది. బార్కోట్ నుంచి ఘాట్ రోడ్డు మీదుగా 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఉత్తర కాశి వస్తుంది. ఇక్కడ కూడా భోజన, బస ఏర్పాట్లు ఉంటాయి. ఉత్తరకాశి జిల్లా కేంద్రం. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే గంగోత్రి చేరుకోవచ్చు. అక్కడ ధవళవర్ణంలో మెరిసిపోతున్న గంగాదేవి ఆలయం దర్శనమిస్తుంది. భగీరథుడు తపస్సు చేసి శివుణ్ని మెప్పించి దివి నుంచి గంగను భువికి దింపింది ఇక్కడేనని భక్తులు విశ్వసిస్తారు. నిజానికి గంగ జన్మస్థలం ఇది కాదు.. ఇక్కడి నుంచి మరో 17 కిలోమీటర్ల దూరం కాలినడకన మంచుపర్వతాలను ఎక్కితే గోముఖ్ వస్తుంది. అక్కడ గోవు ముఖం రూపంలోని ఓ పర్వత పాదాల నుంచి గంగ ఉబికి వస్తూ కనిపిస్తుంది. అక్కడికి వెళ్లాలంటే ముందుగా సైన్యం అనుమతి తీసుకోవాలి. అదీకాకుండా ఒక్కరోజులోనే వెళ్లి వెనక్కు వచ్చేయాల్సి ఉంటుంది. అందుకే ఎవరో సాహసికులు, పర్వతారోహకులు తప్ప మామూలు భక్తులు ఎవరూ గోముఖ్ వరకు వెళ్లరు.
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ఇలా..
* హరిద్వార్‌లోని రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్, గురుద్వారా తదితర ప్రాంతాలతోపాటు రుషికేశ్, జానకిచŸట్టి, గంగోత్రి, యమునోత్రి.. ఇలా అన్ని ముఖ్య ప్రాంతాల్లోనూ యాత్రికులు తమ పేర్లను నమోదు చేయించుకోవచ్చు. ఇందుకోసం ఆధార్‌కార్డు లేదా ఓటర్ కార్డు, పాన్‌కార్డుల వంటి ఐడెంటిఫికేషన్ రుజువులు, ఫొటోలు అవసరం. రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలంటే www.onlinechardhamyatra.com వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక మనకొక రసీదు వస్తుంది. దాని ప్రింట్ తీసుకుని యాత్ర నమోదు కేంద్రాల్లో ఎక్కడ చూపించినా కార్డు ప్రింట్‌చేసి ఇస్తారు.
* ఫొటో ఐడెంటిటీ కార్డును యాత్ర పొడవునా భద్రంగా దాచి ఉంచుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందిస్తున్నారు. జీపీఆర్‌ఎస్ సాయంతో మార్గమధ్యలో ఆ యాత్రికుడు ఏ ప్రాంతంలో ఉన్నదీ ఉపగ్రహం ద్వారా జాడ కనిపెట్టే వీలు ఉండడం దీని ప్రత్యేకత.
ఎలా వెళ్లాలి?
* దేశం నలుమూలల నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు రైళ్లు ఉంటాయి. విమానంలో వెళ్లాలనుకుంటే ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చేరుకుని అక్కడి నుంచి హరిద్వార్‌కు వెళ్లవచ్చు. సాధారణంగా దక్షిణ భారతం నుంచి వెళ్లే యాత్రికులు రైలు/ విమానంలో దిల్లీకి చేరుకొని.. అక్కడి నుంచి రైలు/ బస్సు ద్వారా హరిద్వార్‌కు బయల్దేరుతారు.
* హరిద్వార్ నుంచి చార్‌ధామ్ యాత్ర కోసం ఉత్తరాఖండ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు పరిమితంగా ఉంటాయి. సొంత వాహనాల్లోనూ వెళ్లే వాళ్లుంటారు. కాకపోతే, ప్రమాదకర మలుపులతో ఉన్న ఘాట్ రోడ్డులో సొంతంగా వాహనం నడపడం అంత శ్రేయస్కరం కాదు. ప్రైవేటు వాహనాలు (మినీ బస్సులు) ఉంటాయి.
* తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు ట్రావెల్ సంస్థలు చార్‌ధామ్ యాత్రకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. వీటి ధర రూ.20,000 నుంచి రూ.35,000 (ఒక్కొక్కరికి) వరకు పేర్కొంటున్నాయి. బృందంగా కలిసి వెళ్తే రూ.12,000 నుంచి రూ.18,000 (ఒక్కొక్కరికి) వరకు ఖర్చు వస్తుంది.
అనుకూలం: ఏప్రిల్, మే, జూన్ నెలలు ఈ యాత్రకు అనుకూలమైనవి. జులై నుంచి వర్షాలు మొదలవుతాయి కనుక ప్రయాణం ఇబ్బందికరం. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా అనుకూలత తక్కువ.
వాతావరణం : హిమాలయాల్లో వాతావరణాన్ని ముందుగా ఊహించలేం. నిమిషాల్లో మేఘాలు ఆవరించి కుంభవృష్టి కురుస్తుంది. హఠాత్తుగా మంచుతెరలు చుట్టుముట్టి ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోతుంది. ఎండ మండిపోవచ్చు కూడా. ఆక్సిజన్ లభ్యత కూడా తక్కువ.
హెలికాప్టర్‌లోనూ వెళ్లొచ్చు: డెహ్రాడూన్ నుంచి యమునోత్రికి మర్నాడు యమునోత్రి నుంచి గంగోత్రికి, ఆ మరుసటిరోజున కేదార్‌నాథ్‌కు, అక్కడి నుంచి బదరీనాథ్‌కు చేరవేయడానికి హెలికాప్టర్ సర్వీసును బుక్‌చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్ టూరిజం శాఖ వెబ్‌సైట్ www.uttarakhandtourism.gov.in లో వివరాలు లభిస్తాయి.
ఎప్పటి నుంచి?
ఏప్రిల్ 18 యమునోత్రి, గంగోత్రి
ఏప్రిల్ 29 కేదార్‌నాథ్
ఏప్రిల్ 30 బదరీనాథ్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565