చాణక్యుడు
మన చుట్టూ ఉన్న మంచిని గమనించుకొని మన జీవితాల్లోకి మంచి మనసుతో
ఆహ్వానించుకోవాలని కుతంత్రాన్నీ కుటిలనీతితోనే నిర్మూలించాలనీ, కేవలం
నిర్మూనిస్తే చాలదు, కూకటి వేళ్ళతో సహా పెకిళించివేయాలనే విషయాన్నీ
ఎంతోమంది చారిత్రకులు తెలియపరిచారు. చెడుకు దూరంగా ఉంటే అది మనల్ని
అంటుకోదనుకోవడం అమాయకత్వం. అది పూర్తిగా నశిస్తేనే మంచికి అస్తిత్వం అని
తెలియజెప్పిన వారూ ఉన్నారు. తెగింపు, బుద్ధిబలం, ఆత్మవిశ్వాసం, అపారమైన
విజ్ఞానం కలగలిస్తే, అదీ కుటిలనీతిగా పరిణమిస్తే చాణక్యుని
రూపుదాలుస్తుంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతాన్ని ఆచరించి
చూపించిన ఘనుడు చాణక్యుడు. అపజయమన్నదే ఎరుగని ధీరశాంతుడూ, విజ్ఞానంలో
విలువలెరిగిన వాడు. కోపంలో అగ్రేసరుడు చాణక్యుడు. ఈతని జీవితంలో స్వంతలాభం
ఉండదు. కానీ, మంచిని నిలబెట్టే ప్రయత్నంలో కుటిలత్వాన్ని అస్త్రంగా
చేసుకున్నాడు.
ఒకే కుటుంబానికి చెందిన నందవంశీయులూ చంద్రగుప్తమౌర్యుని మధ్యలోని
విభేదాన్ని ఛేదించడానికీ అన్యాయంగా చంద్రగుప్తుని నిరాదరణ పాలు చేసిన నంద
వంశీయులను సమూలంగా నాశనం చేయడానికీ కుటిల రాజనీతిని ప్రయోగించిన
సద్బ్రాహ్మణుడు చాణక్యుడు. ఋషి వంటివాడైన చాణక్యుడు ఏనాడూ భోగాలకు అలవాటు
పడలేదు. పూరిగుడిసెలో బతికేవాడు. తన బుద్ధి కుశలతతో రాజులను గద్దె దింపి
మరో రాజ్యానికి నాంది పలికే సత్తా చాణక్యుడిదే అయినా తన సామాన్య కుటీరాన్నే
అపార అసాధారణ సంపదలా భావించాడు. విచిత్రమైన వ్యక్తిత్వం చాణక్యునిది.
ఒకనాడు చాణక్యుని కాలుకు ముల్లు గుచ్చుకుంటుంది. ఆ ముల్లును కాలి నుంచి
తీసి, దానిని కాల్చి బుదిద చేసి, ఆ బూడిదను నీళ్ళలో కలుపుకొని తాగి మరీ
ముల్లుపై ప్రతీకారం తీర్చుకుంటాడు.
చాణక్యుని ఆలోచన ప్రకారం మూర్ఖులు మాత్రమే అదృష్టాన్ని నమ్ముతారు.
బుద్ధిబలం గలవారు తమ సామర్థ్యమే సాధనంగా చేసుకొని ముందుకు సాగుతారనీ
విశ్వసించేవాడు. చాణక్యునికి తన ఆత్మగౌరవమంటే అమితమైన ప్రేమ. ఎవరైనా దానికి
భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ప్రళయకాల రుద్రుడిలా మారి మరీ పగ
తీర్చుకునేవాడు. చాణక్యుని పరిచయ చిహ్నమంటేనే కోపమని చెప్పవచ్చు.
నందరాజులు ప్రజలను హింసా ప్రక్రియలో పరిపాలన చేసేవారు. ప్రజల తిరుగుబాటుతో రక్తపాతం జరుగుతుందనీ, అలా జరుగకుండానే తన కుటిల రాజనీతితో చంద్రగుప్తుని ఆసరాగా చేసుకొని నందవంశాన్ని నిర్మూలించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నందులు నమ్మిన విశ్వసనీయ మంత్రి బుద్ధిమంతుడూ, యోగ్యవ్యక్తి అయిన రాక్షసుని ఎత్తులను చిత్తు చేసి, చివరకు చంద్రగుప్తుని మంత్రిని రాక్షసున్నే నియమంచి తను నిర్లిప్తుడుగా అడవులకు వెళ్ళిపోయిన మహావ్యక్తిత్వం గలవాడు చాణక్యుడు.
కోపానికి నిదర్శనంగా, ఆలస్యాన్ని సహించని వ్యక్తిగా, ఆత్మ విశ్వాసిగా, కుటిల రాజనీతిజ్ఞుడిగా, అర్థశాస్త్ర రచయితగా ప్రపంచానికి తెలిసిన చాణక్యుని జీవితంలోని మరోకోణం అతని విశాల హృదయం, ఉదారత, సడలని సంకల్పం. కానీ ప్రపంచం ముందు మాత్రం భావుకత, దయ అనేవే ఎరుగని కఠిన హృదయుడుగా చాణక్యుడు చిత్రీకృతమైనాడు.
ప్రజల శ్రేయస్సు కోసం ప్రపంచం తనని ఎలా భావించినా సరే, తాననుకున్నది చేసి తీరాలన్న దృఢ నిశ్చయంతో జీవించాడు చాణక్యుడు. తన పన్నాగాల విషయంలోనూ ఎవ్వరినీ నమ్మేవాడు కాదు. స్వార్థంలేని తన మహత్వాకాంక్షలో తానే సర్వం అయి విజయం సాధించాడు. ఆ విజయం తన బుద్ధి కుశలతతోనే తన నిర్ణయాత్మక వివేచనతోనే సాధ్యపడిందనీ, దైవానికి అందులో భాగస్వామ్యం లేదని తేల్చిచెప్పిన చాణక్యుడు తన విజయాన్ని ప్రజాశ్రేయస్సుకై ధారపోశాడు.
చాణక్యుడు విచారశీలుడు. ఇతరులను తాను విశ్వసించడు కానీ అందరితో విశ్వసింపబడతాడు. తొందరపాటు, తొట్రుపాటు అతనికి తెలియదు. ఆలోచన చేసాడంటే అది సత్ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. అద్భుతమైన పరాక్రమం తనదైనా ఎల్లప్పుడూ తన బుద్ధినే నమ్ముకున్నాడు. ఉత్సాహశీలి అయిన చాణక్యుడు ఎదురుదెబ్బలెన్ని తగిలినా లెక్క చేయనివాడు. ఎంత చెబుతాడో అంత చేసి చూపిస్తాడు చాణక్యుడు. సకల శాస్ర్తాలకూ నిధిలాంటి వాడు. అన్ని గుణాలూ ఇతనిలో ఉన్నాయి. దురాత్ముడిలా కనిపించే మహాత్ముడు చాణక్యుడు. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ రాజునీతికృతమై మహారథి చాణక్యుడు.
ప్రజల శ్రేయస్సు గురించిన ఆలోచన ఒకవైపు, అన్యాయం అయిపోయిన చంద్రగుప్తునికి అభయమిచ్చిన మాట మరోవైపు. అతిథి మర్యాదలు పాటించక తనను అవమానించిన నందులను నాశనం చేస్తానని శిఖముడి విప్పి చేసిన ప్రతిజ్ఞ మరొకవైపు చాణక్యుని జీవితాన్ని లోకవిదితం గావించాయి. చాణక్యుని వంటివారు ఎన్ని తరాలు మారినా, తరం ఉద్ధరించబడాలంటే మళ్ళీమళ్ళీ పుట్టాలేమో!
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565