MohanPublications Print Books Online store clik Here Devullu.com

ద్వాదశ జ్యోతిర్లింగాలు _12 Jyotirlingas




శశిశేఖరుడు – జ్యోతిర్లింగములు
‘శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః’ – ఆయనను శశిశేఖరః’ అని పిలుస్తారు. శశము అనగా కుందేలు. దూకే స్వభావం ఉన్నది. దూకేస్వభావం ఉన్నది కాలము. సుఖము చేత కాలము దూకేస్తుంది. దుఃఖములో వుంటే కాలము గడుస్తున్నట్లు అనిపించదు. దాంట్లో అర్థం చేసుకోవలసిన రహస్యం ఒకటి ఉన్నది. మీరు దానిని పట్టుకుంటే ‘శశిశేఖరః’ అన్నమాటకున్న తాత్త్వికమయిన అర్థం అర్థం అవుతుంది. కాలంలో సుఖదుఃఖములు రెండూ ఉంటాయి. దూకేసినట్లు కనపడిన కాలమును, దూకనట్లు కనపడిన కాలమును వైదిక సమన్వయము చేస్తే మీరు రోజూ చెప్పేటప్పుడు కాలమును ఎలా చెప్పుతారు? శ్రీవిరోధి నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే పంచంయాం భూమవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథే శ్రీమాన్ శ్రీమతః’ అని చెప్తాము. ఎవడు ఆయన పాదములు పట్టుకున్నాడో అటువంటి వాడికి జ్ఞానమును ఇచ్చి కాలాతీతుడిని చేసి, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కలిగించగలడు. కాలము ఆభరణముగా కలిగిన వాడని చెప్పడానికే చంద్రరేఖను పొంది ఉంటాడు. మోక్షం ఇవ్వగలవాడని చెప్పడం కోసమే చంద్రరేఖను ధరించి ఉండడం. ఇదే శశిశేఖర అన్నమాటకు అసలు తాత్త్వికమయిన రహస్యం.

కానీ మనం సోమనాథ లింగము అన్నమాటను ప్రస్తావన చేస్తాము. శాస్త్ర సంబంధం అయిన మాటలలో కొన్ని ఆశ్చర్యకరమయిన మాటలు ఉంటాయి. మీరు కంచిలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి దానిని జ్యోతిర్లింగం అంటే శాస్త్రం అంగీకరించదు. దానిని అష్టమూర్తులయందు ఒక లింగము – పృథివీలింగము అని పిలుస్తారు. పంచ భూతలింగములలో ఒకటి.

కాళహస్తిలోని లింగము వాయులింగము. అది జ్యోతిర్లింగం కాదు. జంబుకేశ్వరంలోని శివలింగం జలలింగం. అది జ్యోతిర్లింగం కాదు. కానీ కొన్ని శివలింగములను జ్యోతిర్లింగములు అని పిలుస్తారు.

“సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం” అని మనం ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం చదువుతుంటాం. ఈ పన్నెండింటినీ మనం జ్యోతిర్లింగములని పిలుస్తున్నాము.
సోమనాథుడు – సోమనాథ్ – గుజరాత్;
మల్లికార్జున స్వామి – శ్రీశైలం - ఆంధ్రప్రదేశ్;
మహాకాలేశ్వరుడు - ఉజ్జయిని – మధ్యప్రదేశ్;
అమలేశ్వరుడు – ఓంకారేశ్వరం – మధ్యప్రదేశ్;
వైద్యనాథుడు – పర్లి – మహారాష్ట్
ర; భీమశంకరుడు – పూణే – మహారాష్ట్ర;
రామలింగేశ్వరుడు – రామేశ్వరం – తమిళనాడు;
నాగేశ్వరుడు – ఔండా – గుజరాత్;
విశ్వనాథుడు – వారణాసి – ఉత్తరప్రదేశ్;
త్ర్యంబకేశ్వరుడు – నాసిక్ – మహారాష్ట్ర;
కేదారేశ్వరుడు – కేదారనాథ్ – హిమాచల్ ప్రదేశ్;
ఘ్రుష్ణేశ్వరుడు – వెరుల్ – మహారాష్ట్ర.


జ్యోతిర్లింగములని మనం వాటిని పిలిచినప్పుడు ఈ పన్నెండు చోట్ల జ్యోతి ఉండాలి. కానీ మనం ఆయా క్షేత్రములకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ మనకు శివలింగమే కనపడుతుంది. కానీ జ్యోతి కనపడదు. అయితే ఈ పన్నెండింటిలోనే జ్యోతిర్లింగములని ఎందుకు అంటారు? దీనికి సమాధానం “ఆపాతాళనభఃస్థలా” అని రుద్రమునకు ఉన్న ప్రార్థనా గద్యయందు చెప్పారు. మీరు ఆ లింగం దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు ఇహమునందు కావలసిన సౌఖ్యమునుండి మోక్షము వరకు ఏదయినా ఇవ్వగలిగిన పరబ్రహ్మ స్వరూపంగా ఆ శివలింగం ఉన్నది.ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్నా కోరికలు తీరవలెనన్నా శివుడిని అర్చించాలి. కోర్కె తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చేయగలిగిన శివలింగములు ఏవి ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు. అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభు – ఒకరు ప్రతిష్ఠించినవి కావు. ఈశ్వరుడు చిత్రవిచిత్రమయిన పరిస్థితులలో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి మనం స్థల పురాణములను పరిశీలించాలి. ఆయా కథలను తెలుసుకుని స్మరించడం చేత స్వయంభువు అయిన ఈశ్వరుడు ప్రసన్నుడై ఎన్నో శుభఫలితములను ఇస్తాడు. ఆయా కథలను వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనస్సు ఆయా క్షేత్రముల వద్దకు వెళ్ళిపోతుంది.

‘శశిశేఖరః’ అన్న నామము వ్యాఖ్యానం చేస్తూ అంటారు – దక్ష ప్రజాపతికి 27మంది కుమార్తెలు. ఈ 27మంది కుమార్తెలే అశ్వని భరణి మున్నగు పేర్లు కలవాళ్ళు. వారిని చంద్రునికిచ్చి వివాహం చేశాడు. పూర్వం దక్షిణనాయకత్వం అని ఒకటి ఉండేది. విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన రామరాయల వారికి అనేక భార్యలు ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. పూర్వం అలా దక్షిణ నాయకత్వం ఉండేదో. తన భార్యలతో చంద్రుడు సంతోషంగా ఉండాలి. కానీ చంద్రుని చరిత్రయందు ఒకదోషం ఉంది. ఆయన కొంచెం తొందరపడిపోవడం యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీపట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో అలాంటి వాళ్ళతో రమించడం కూడా చంద్రుని చరిత్రలో ఒకచోట ఉన్నది. ఈ అలవాటు ఫలితం ఎక్కడో రావాలి. అందుకుగాను శివుడు తన ధనుస్సులోంచి చంద్రునకి పాపఫలితం ఒకదానిని ఇస్తున్నాడు. చంద్రుడు తన భార్యలలో రోహిణి మీద అధిక ప్రేమను కనపరచాడు. ఇది సహజంగా మిగిలిన 26మందికి బాధ కలిగించింది. వాళ్ళు తండ్రిగారి వద్దకు వెళ్లి ఈ విషయమును చాలా బాధపతుతూ చెప్పారు. విన్న తండ్రి మనస్సు ఎంతగానో క్రున్గింది. ఆయనకు చంద్రుడి మీద చాలా కోపం వచ్చింది. వెంటనే దక్ష ప్రజాపతి చంద్రలోకం వెళ్ళాడు. అల్లుడయిన చంద్రుడు ఆయనకు ఎదురు వచ్చి తీసుకు వచ్చి కూర్చోపెట్టాడు. అపుడు దక్షుడు చంద్రునితో ‘నీకు నేను నా 27మంది కుమార్తెలను యిచ్చి వివాహం చేసినప్పుడు అందరినీ జాగ్రత్తగా సమానంగా చూసుకుంటాను అని మాట ఇచ్చావు. కానీ నీవు ఒక్క రోహిణితో మాత్రమే ఉంటున్నావని తెలిసింది. అందరినీ సమానంగా చూసుకో” అని చెప్పాడు. తప్పకుండా ఆయన మాట ప్రకారం నడుచుకుంటాను అని బదులిచ్చాడు. కొంతకాలం గడిచింది. కానీ అల్లుడి ప్రవర్తనలో ఏమీ మార్పులేదని, రోహిణి తప్ప మిగిలిన కుమార్తెలందరూ పూర్వంలాగే బాధపడుతున్నారని దక్షప్రజాపతికి తెలిసింది. దక్షునికి కోపం వచ్చి నీ విశ్రుంఖలత్వమునకు అడ్డుకట్ట వేస్తాను. నీవు క్షయవ్యాధి పీడితుడవు అవుదువు గాక’ అని శపించాడు. దీనివలన పూర్వం సంతోషపడిన రోహిణి కూడా చంద్రుడిని దగ్గరకు రానీయదని ఆయన ఉద్దేశ్యం. ఫలితంగా చంద్రునికి క్షయవ్యాధి వచ్చింది. దాని ఫలితంగా దేవతలందరూ నీరసపడి పోయారు.

చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి. ఓషధులు బాగా ప్రకాశిస్తే ఓషధులతో కూడిన ద్రవ్యంతో యజ్ఞం చేయాలి. ఆ హవిస్సులను దేవతలు తీసుకుంటారు. అపుడు దేవతల ఆకలి తీరినట్లయితే వారు మనకు మంగళములను ఇస్తారు. చంద్రునికి క్షయ వ్యాధి సోకడం చేత దేవతలకు హవిస్సులు లేవు. ప్రజలకు మంగళములు లేవు. అటు దేవతలు, ప్రజలు మాడిపోయారు. ఇప్పుడు ఇది అన్ని లోకముల సమస్య అయి కూర్చుంది. ఇపుడు వీళ్ళందరూ తమలో తాము చర్చించుకుని అత్రి మహర్షిని పిలిచి అందరూ కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు –

“నేను లోక్ష సంక్షేమం గురించి చెప్తున్నాను. ఇపుడు చంద్రుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళాలి. ప్రభాస క్షేత్రం సముద్రపు ఒడ్డున ఉంది. ఆ క్షేత్రంలో ఒక గుంత త్రవ్వి అందులో ఒక పార్థివలింగమును పెట్టుకుని పంచాక్షరి మహా మంత్రం జపమును, మృత్యుంజయమంత్రంతో కలిపి అనుష్ఠానం చేయాలి. ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కునూ, అటు చంద్రుడినీ చచ్చిపోకుండా కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరోకనికి సాధ్యం కాదు. కాబట్టి శంకరుడు మాత్రమే ఈ పనిని చేయాలి. అందుకని అక్కడికి వెళ్లి పార్థివలింగమునకు అర్చన చేయమనండి” అని చెప్పాడు.

వెంటనే చంద్రుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్లి పంచాక్షరీ మంత్రమును, మృత్యుంజయ మహా మంత్రముతో అనుసంధానం చేశాడు. ఇపుడు ఎవడు వ్యాధిని ఇచ్చాడో వాడే – ‘శివా శరవ్యాయా తవ త యా నో రుద్రా మృడయ’ – రక్షించాలి. కొన్ని కోట్ల జపం అయిపోయిన తర్వాత భగవానుడు శంకరుడు, పార్వతీ సహితుడై ప్రత్యక్షమై ‘ఏమిటి నాయనా నీ అభీష్టము’ అని అడిగాడు. అపుడు చంద్రుడు తనకి క్షయవ్యాధి తగ్గిపోయేలా చేయమని పరమేశ్వరుని ప్రార్థించాడు. ఇపుడు నీ క్షయవ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు. కానీ అలా అనినట్లయితే దక్ష ప్రజాపతి మాటకు విలువ లేనట్లవుతుంది. ఆయన మాట నిలబడాలి, తప్పు చేసిన వాడయినా తన పాదములు పట్టుకున్నాడు కాబట్టి అతని బుద్ధిని కూడా సంస్కరించాలి. అందుకే తరువాత చంద్రుడు తన 27మంది భార్యలతో సమానంగా లేదు అని చెప్పడానికి ఉదాహరణమే చాద్రమానంలో దీనిని చెప్తున్న తిథులు. పరమేశ్వరుడు బుద్ధిని ధర్మం వైపు మారుస్తాడు కాబట్టే ఆయనకు మనం రుద్రశబ్దమును ఉపయోగించాము. చంద్రునితో ‘నీకు క్షయ ఉంటుంది. కానీ నీవు పదిహేను రోజులు క్షీణిస్తావు, పదిహేను రోజులు వృద్ధి పొందుతుంటావు. క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు. ఎప్పుడూ హాయిగా ఉంటావు. ఇపుడు నీ చరిత్ర మారిపోయింది. నీవు పూర్తిగా గొప్పవాడివయ్యావు. నీవు నా చేత అనుగ్రహింప బడినవాడివని తెలుసుకోవడానికి నాతొ కలిపి నీ దర్శనం చేయించడానికి నాపేరే నీతో కలుపుకుంటాను. చంద్రశేఖర అని పిలిపించుకుంటాను’ అని ఆ చంద్రుణ్ణి తీసి నెత్తిన పెట్టుకున్నాడు. ఇదీ ఆయన కారుణ్యం అంటే.

అందుకని తప్పులు జరిగిన వాటికి వేళ్ళు విరవకండి. ఇంత కారుణ్య మూర్తి అయిన శంకరుని పాదములు పట్టుకున్న వాడికి ఒక్కసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నెత్తిమీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకనే శంకరుని ‘శశిశేఖరః’ అని పిలువవలసి వచ్చింది. చంద్రుని క్షయ వ్యాధి పోయింది. చాంద్రమానం వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీ దేవికి గొప్ప భక్తుడు అయ్యాడు. అందుకే మనుః చంద్రః కుబేరశ్చ లోపాముద్రా చ మన్మథః

అగస్తి రగ్ని సూర్యశ్చ ఇంద్రః స్కందశ్శివస్తదా క్రోధభట్టారకో దేవ్యాః ద్వాదశామీ ఉపాసకా!! (సౌభాగ్య భాస్కర భాష్యం) సూర్యుడు, స్కందుడు – అని పన్నెండుమంది అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు.

సోమనాథుడు
శంకరుడు చంద్రుడిని నెత్తిమీద పెట్టుకోవడం మంచిదే.ఇక్కడే ఒక చిత్రం జరిగింది. అదే సోమనాథ లింగం. స+ఉమ+నాథుడు=సోమనాథుడు. అనగా పార్వతీదేవి పక్కన ఉన్న కారుణ్యమూర్తి. సశక్తిపరుడు. ఇది ఒక అర్థం. మరొక అర్థం ఉన్నది. సోముడు అనగా చంద్రుడు. సోముడు ప్రార్థన చేశాడు. ‘నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తరా ఎవరు వచ్చినా రక్షించడానికి ఇక్కడే వెలయవలసినది’ అన్నాడు. అపుడు శివుడు అక్కడ జ్యోతిర్లింగమై వెలశాడు. అందుకే అది స్వయంభూ జ్యోతిర్లింగములలో మొట్టమొదటి లింగము. మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా అక్కడికి వెళ్ళి సోమనాథ జ్యోతిర్లింగమును దర్శించుకుంటే దీర్ఘకాలంగా పీడిస్తున్న వ్యాధులు నయం అవుతాయని, భవిష్య జన్మలో చేసిన పాపముల వలన భయంకరమయిన కుష్ఠు మొదలయిన వ్యాధులు రావలసిన పాపములు ఖాతాలో ఉండిపోయినా అవి భగ్నం అయిపోతాయని సోమనాథలింగ దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది. సోమనాథ దేవాలయం శ్రీ సర్దార్ వల్లభాయ్ సారధ్యంలో పునర్నిర్మాణం అయింది. ఈ లింగం మీద కన్నుపడే ఈ సోమనాథ దేవాలయమును పూర్వం ఎందఱో ఎన్నో మార్లు ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కుమనిషి అనిపించుకున్న భారతదేశపు తోలి ఉప ప్రధానిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి, సోమనాథ దేవాలయమును పునర్నిర్మాణం చేసి, అత్యద్భుతంగా రూపుదిద్దారు.

శ్రీశైల క్షేత్రం
శ్రీశైలం సాక్షాత్తుగా మన ఆంద్రదేశంలోనే కర్నూలు జిల్లాలో వెలసిన స్వయం భూలింగ మూర్తి ఉన్న క్షేత్రము. విశేషించి అష్టాదశశక్తి పీఠములలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా అమ్మవారు ఒక శక్తిపీఠం. శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. ఆ పరమేశ్వరుడు వెలసిన కొండపేరు శ్రీగిరి. మనం ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయింది. దానిపేరు శ్రీగిరి. శ్రీశైలంలో స్వామి లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు. శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒకమాట చెప్పింది. ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని చెబుతారు. కానీ దాని తాత్త్వికమయిన రహస్యం వేరు. శ్రీ’లో ‘శ’కార, ‘ర’కార, ‘ఈ’కారములు ఉన్నాయి. ఈ మూడక్షరములు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి – ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలం. ఈ మూడు శక్తులు మమైకమయిన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలం ఒక శక్తి పీఠం. ఆ కొండమీద అడుగుపెట్టిన వాడు సరస్వతీ కటాక్షమును కానీ, లక్ష్మీ కటాక్షమును గానీ, జ్ఞానమును గానీ నోరువిప్పి అడగక్కరలేదు. అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తిమంతమయిన కొండ. శ్రీశైల పర్వతం ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు ఆలవాలము. అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయమును చెప్తారు.

గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలమునంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుహ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు. సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన ‘నాన్నగారూ, తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన ప్రదక్షిణతో సమానం. కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను’ అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈవిధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు. అపుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు.

సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు. వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు 24 క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు. అపుడు శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం క్రింద కూర్చున్నాడు. అపుడు పార్వతీదేవి కూడా వెళ్ళింది. పిల్లవాడు ఎలా ఉన్నాడో అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్లి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది. ఆయన మహా జ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటుంది. పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉంది సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లెచెట్టు క్రిందకి వచ్చాము కదా అని అక్కడ వెలశారు. మనం అలకచేతనో, అజ్ఞానం చేతనో మన శరీరములను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాము. ఇలాంటి వాళ్ళు ఎవరయినా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు. శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. మీరు మీ ప్రదేశం నుంచి శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది మీ శరీరం. ఆ బట్టలతో కొండమీదకి వెళతారు. మీరు శుభ్రపడి దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. మీరు ఆ క్షేత్రమునకు వెళ్ళగానే ఆశౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరకు వెళ్లి ధూళి దర్శనమునకు వచ్చాము అని చెప్పి లోపలి వెళ్లి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకుని, శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగి పోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడుట. దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చెయ్యాలి.

అసురసంధ్య వేళలో నందివాహనం భూమండలం మీదనుండి వెడుతుంది. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైలపర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమయిన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు. జన్మ చరితార్థం అయిపోతుంది. చెంచులు చెవిటి మల్లన్నా అని అరుస్తూ ఉండేవారు. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలం స్వామీ వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామమునలు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలి వెళ్లి మన గోత్రం, పేరు, చెప్పుకోవాలి. గణపతి మన గోత్ర నామమును చిట్టాలో రాసేసుకుంటారు.

శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం, విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో నని అనుకున్న వాళ్లకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి. అందుకే అనేక శివాలయములలో చరనంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద వున్నా త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి. అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా? అని. అపుడు శంకరుడు “శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగముల లోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి ‘మా అయన దిగబడిపోతున్నాడు. అందుకని ఎవరయినా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి’ అన్నది. అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అపుడు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. అపుడు ప్రతివాడూ తాను ఏదో పాపం చేసి ఉండక పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది. అపుడు పార్వతీ దేవి ఏమమ్మా, అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా. అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది. అపుడు ఆవిడ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే – అమ్మా నేను ఇప్పడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం లేదు, పుణ్యం లేదు. రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇపుడు నా ఖాతాలో పాపం లేదు. పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను. నేను అర్హురాలను’ అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను’ అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు. అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమె మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది.


హాటకేశ్వరం
శ్రీశైలంలో హాటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమయిన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండపెంకునందు ఆవిర్భవించిన హాటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని ‘హాటకేశ్వరము అని పిలుస్తారు. అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే ఫాల దారాలు, పంచ దారాలు అని అయిదు ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధారా ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయిన ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు. ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడయిన శంకరునికి తగిలి పడిన ధార ఫాలధార. పంచధారలు అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార. ఒకటి విష్ణు ధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులయిన సూర్యచంద్రులు ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమ పావనమయిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.

పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.

అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు. రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు. చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది. అపుడు లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్నా రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జునా అని మరొకమారు పిలిపించుకున్నాడు.

శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి “నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. అక్కడకు రా నిన్ను వివాహం ఆడతాను’ అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతోంది. అపుడు పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. అపుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అపుడు పార్వతీ దేవి అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగింది. అపుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు? అని అడిగాడు. ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అపుడు ఆయన నేనే శివుడిని, ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. చూశావా పార్వతీ, ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం. ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. అపుడు శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు. మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన. ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. ఈవిధంగా నరసింహ స్వామీ దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. అది మన తెలుగునాట ఉన్న కొండ.

అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు/ ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.

శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.


మహాకాళేశ్వరం – ఉజ్జయిని
అవంతికాయాం విహితావతారం, ముక్తి ప్రదానాయచ సజ్జనానాం!
అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం!! (ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం – 3)

ఈ శ్లోకం ద్వారా ఉజ్జయినిలో ఉన్న మహా కాళుడికి నమస్కారం చేస్తున్నాము. సజ్జనులకు ముక్తినిచ్చువాడు. అయితే సజ్జనుడు అనగా ఎవరు? పరమేశ్వరార్చన చేసేవాడికి సదాచారము తెలిసి ఉండాలి. శౌచము తెలిసి ఉండాలి. ఈ సదాచారం పథ్యం లాంటిది భగవద్భక్తి ఔషధం లాంటిది. ఈ ఔషధం వేసుకుని పథ్యం పాటిస్తే భవరోగమనే రోగం తగ్గుతుంది. కానీ లౌకికంగా బయటవచ్చే వ్యాధికి, భగవత్సంబంధంలో వచ్చే భవరోగమునకు ఒక తేడా ఉంది. ఒకనికి ఆచారం, శౌచం తెలియదు. తెలిసి మానిన వాడు కాదు. కానీ ఆయన గుండెల నిండా భక్తి ఉన్నది. కానీ శౌచం లేకపోయినా వాని భక్తి వృధా పోదు. సదాచారం తెలిసీ దానిని విడిచిపెట్టి భక్తిని పాటిస్తే అది మాత్రం అతని అక్కరకు రాదు. ఆచారం తెలిస్తే పాటించాలి. తెలిసి ఉన్నది అనుష్ఠాన పర్యంతం రావాలి. ఏమీ తెలియనప్పుడు ఆచారమయినా అది తెలియక పొరపాటు చేసినా ఈశ్వరుడు దానిని పక్కన పెట్టి ఏలుకుంటాడు. మాహాకాళ దర్శనమునందు ‘సజ్జనానాం’ అనేమాట ఎందుకు వాడారో గుర్తెరిగి ప్రవర్తించాలి. అందుకే మహాకాళుడన్నమాట. కామమును పోగొట్టు వాడు, కాలారి, కామారి అనే రెండు మాటలను పరమశివునికి వాడతారు. కాలారిగా అనుగ్రహం కావాలన్నా, కామారిగా అనుగ్రహం కావాలన్నా మీకున్న స్థాయిలో అనుష్ఠానమునకు తెచ్చుకుని మాత్రమే ఈశ్వరుని యందు ప్రవర్తించాలి. పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు. అవంతి అనగా స్త్రీ అని, అక్క అని రెండు అర్థములు. అవంతి సాక్షాత్తు జగదంబ అయిన అమ్మవారి స్వరూపము. మనకి మోక్షపురులు ఏడు ఉన్నాయి. వీటిలో జగద్విఖ్యాతి గాంచిన పట్టణం అవంతి – ఉజ్జయిని. ఈ ఉజ్జయిని ఒకపక్క మహా కాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత కూడా అంత ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాల స్వరూపములై ఉన్నవి. ఇవి లయకారకములై ఉంటాయి. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్న పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసు ఇద్దరూ నడయాడిన ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఈ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ శివార్చనా శీలుడై శాత్కాలముల యందు శివపూజ చేసి వేదము ఏమి చెప్పిందో దానియందు అపారమయిన ధృతి కలిగిన బ్రాహ్మణుడు. వేదప్రియుడికి నలుగురు కుమారులు. నలుగురు సుగుణోపేతులే. తండ్రిగారు ఎంత ధర్మానుష్టాన పరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్టాన పరులు. దొరికిన దానితో తృప్తిగా జీవించేవారు. ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు, రెండవ వానికి ప్రియ మేథుడు, మూడ వానికి సుకృతుడు, నాల్గవ వానికి సువ్రతుడు అని పేర్లు పెట్టుకున్నాడు. ఆ నలుగురు పిల్లలు వృద్ధిలోకి వచ్చారు.

ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరములలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. ఏదయినా కష్టం వచ్చినప్పుడే పరీక్షకు నిలబడినప్పుడే వాటి వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి. కాబట్టి ఈశ్వరుడు ఆ కుటుంబమును ప్రకాశింపచేయాలనుకున్నాడు. భగవంతుడు భక్తుల యెడ అంత ఉదారుడై ఉంటాడు. దూషణుడు అనే రాక్షసుడు లోకం అంతటా బాధలు పెడుతూ అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎక్కడా ఎవరూ ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించాడు. ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు నన్ను మాత్రమే అర్చించాలి, మీరు శివపూజను విదిచిపెడతారా లేక లింగమును ధ్వంసం చేయనా? అని అడిగాడు వాళ్ళు కనీసం బెదరకుండా శంకరుని రక్షణ యందు మనం ఉండగా మనకు భయం ఏమిటి అని వాళ్ళు అనుకున్నారు. దూషణుడు ఈ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తి కంఠం మీద వేయబోతున్నాడు. అయినా వాళ్ళు కదలకుండా హర ఓం హర అంటూ అలానే ఆరాధన చేస్తూ కూర్చున్నారు. ఏ రూపంలో వస్తున్న మృత్యువునైనా ఈశ్వరుడు తప్పించగలడు. ఇక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు చూడబడే రూపం సామాన్యమయిన రూపం కాదు. స్వామి మహాకాళ రూపంలో వచ్చి ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారమునకు దూషణుడి సైన్యములు బూడిద రాశులై పడిపోయాయి. ఆ రూపము అత్యంత వేడితో వచ్చింది కానీ ఆ వేడి అక్కడే కూర్చున్న బ్రాహ్మణ కుమారులను చెనకలేదు.బ్రాహ్మణ కుమారులు ఆ రూపమును చూసి ఆశ్చర్యం పొంది చచ్చిపోయే వారిని చంపకుండా మిగిల్చిన రూపంగా భావించి స్తోత్రం చేశారు. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు లేదు.

ప్రదోష వేళలో శివమహాపురాణాంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు చదవడం చేత మీరు శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాళ దర్శనం చేసినట్లే. ఆ ఫలితం ఉత్తరక్షణం మీ ఖాతాలో పడిపోతుంది. పిమ్మట ఆ స్వూపాన్ని చూసి దేవతలు పొంగిపోయారు. వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు. ‘ఈశ్వరా, మీరు ఇక్కడ లింగరూపంలో వెలవండి. కేవలం ఈ బ్రాహ్మణ కుమారులే కాక మిమ్మల్ని నమ్మిన వారెందరో ఉంటారు. సజ్జనులు, నీమీద పూనిక ఉన్నవాళ్ళు, నీవు ఉన్నావని నమ్మినవాళ్ళు ఎవరు ఇక్కడకు వస్తున్నారో వారు కాలమునందు పడిపోకుండా చూడవలసిన బాధ్యతా అటువంటి అనుగ్రహ ప్రసరణ కొడకు నీవు ఇక్కడ స్వయంభూ లింగముగా ఉండాలి అని అడిగారు. అప్పుడు స్వామీ తప్పకుండా ఉంటాను అని ప్రసన్న మూర్తియై వెంటనే మహా కాళ లింగముగా ఆవిర్భవించాడు.

ఉజ్జయినిలో శివలింగములు మూడు అంతస్తులుగా ఉంటాయి. క్రిందను ఉండేది మహాకాళ లింగము, మధ్యలో ఓంకార లింగము, ఆపైన నాగేంద్ర స్వరూపమయిన లింగము ఉంటాయి. క్రింద ఉండే మహాకాళ లింగమును భక్తులు వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉజ్జయినిలో ఈ శివలింగం దగ్గరే ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. చంద్రసేనుడు అనే ఒక మహారాజు ఉజ్జయినీ రాజ్యమును పరిపాలిస్తున్నాడు. గొప్ప శివభక్తుడు. ప్రతిరోజూ శివార్చన చేసేవాడు. ఈ శివార్చనకు మెచ్చి పరమశివునికి అత్యంత సన్నిహితుడయిన మణిభద్రుడు చంద్రసేనుడికి ఒక మణిని బహూకరించాడు. ఈ మణిని నీవు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి, ఇనుము, ఇత్తడి దేనిని తగిలినా అవి బంగారంగా మారిపోతాయి. దేశంలో క్షామం ఉండదు. అతివృష్టి ఉండదు. నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారు అని చెప్పాడు. చంద్రసేనుడు ఆ మణిని కట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. మిగిలిన రాజులందరూ ఆ రాజు ఎందుకు అలా సుఖపడుతున్నాడో తెలుసుకుని ఆయన వద్దవున్న మణిని ఎత్తుకు వచ్చెయ్యాలని భావించారు. అందరూ కలిసి చంద్రసేనుడి మీదికి యుద్ధానికి బయలుదేరారు. లోపల వున్న వేగుల వలన విషయంతెలుసుకున్న రాజు యుద్ధం చేస్తే గెలవడం చాలా కష్టం అని గ్రహించి యుద్ధానికి వెళ్ళడం అంటే నాకు సంతోషమే. కానీ లోకంలో ఉన్న రాజులందరూ కట్ట కట్టుకుని వస్తే నేను ఏకాకిని’ అన్నాడు. ఆయనయందు ధర్మలోపం లేదు. యుద్ధం చేయడానికి వచ్చిన రాజులలో ధర్మలోపం ఉంది. కాబట్టి తానిప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి ఎవరు నాకీ మణిని ఇవ్వడానికి కారకుడో వాడి పాదములే నేను గట్టిగా పట్టుకుంటాను అని భావించి వెంటనే దేవాలయమునకు వెళ్లి పూనికతో శివారాధన చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన భక్తి పరిఢవిల్లి ఉంది.

ఆ సమయంలో ఒక గోపాల బాలుడు దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఆ పిల్లవాడు తల్లితో కలిసి లోపలి వచ్చి నమస్కారం చేసి బయటకు వెళ్ళిపోయారు. ఇద్దరూ దర్శనం చేసినా గోపకాంత మనసు చిన్నపిల్లవాడి మనస్సంతగా భగవంతుని యందు కేంద్రీకరించబడలేదు. రాజు చేస్తున్న పూజను చూసిన పిల్లవాడు తానుకూడా అలాగే పూజచేయాలి అనుకున్నాడు. కానీ వాడికి పూజ చేయడం రాదు. వాడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ వాని దృష్టి అంతా రాజు చేస్తున్న లింగార్చన మీద ఉంది. ఇప్పుడతడు అర్చన చేయడానికి శివలింగం కోసం వెతకగా ఒక గుండ్రాయి కనిపించింది. వాడు దానిని రాయిగా కాక శివలింగంగా చూశాడు. పూజచేయడం రాదు కాబట్టి చుట్టుపక్కల చెట్ల నుంచి కొన్ని ఆకులు తెచ్చి పూజచేయడం ప్రారంభించాడు. రాజు చేస్తున్న పూజయందు సదాచారం ఉన్నది. కానీ ఈ పిల్లవాడు చేసున్న పూజయందు సదాచారం లేదు. కానీ భక్తి ఉన్నది. వాడికి అభిషేకం, పురుషసూక్తం తెలియదు. నైవేద్యం లేదు. కానీ వాడు ఒక్కొక్క ఆకు తీసి శివ అంటూ వేస్తున్నాడు. వాడు మనస్సులో అలాగే మహాకాళ లింగానికి పూజ చేస్తున్నాడు. పిల్లవానికి అన్నం పెడదామని గొల్లవనిత వచ్చి పిలిచినా వాడికి ఇవేమీ వినపడలేదు. నటిస్తున్నాడు అని ఆవిడకి కోపం వచ్చింది. గుండ్రాయిని తీసి విసిరి అవతల పారేసింది. ఆకులన్నిటిని కాలితో తోసేసింది. ఇంట్లోకి రా అన్నం పెడతాను అని లోపలికి వెళ్ళిపోయింది.

పిల్లవాడు కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా ఉన్న శివలింగం కనపడలేదు. వెంటనే ఆర్తితో ఏడ్చాడు. ఇప్పుడు వారు రమ్మని తన స్వామిని పిలుస్తున్నాడు. స్వామీ కనపడలేదన్న బెంగతో మూర్ఛపడిపోయాడు. తనకోసం ఇంత పరితపించిపోయిన పిల్లవానిని శంకరుడు చూశాడు. అక్కడ బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం, పెద్ద శివలింగం ఏర్పడ్డాయి. పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చేయబడిన పీటమీద పట్టు పంచెతో కూర్చుని పూజ చేస్తున్నాడు. వానికి సమస్తమయిన శివజ్ఞానము భాసించింది. తల్లికి ఆ ఘోష వినపడి బయటకు వచ్చి చూసి తెల్లబోయింది. నా వంశమే తరించిపోయిందిరా తండ్రీ ఈ పూజ చేశావని నాకు తెలియదు అని వెళ్లి బిడ్డడిని కౌగాలించుకుంది. ఆనందపడిపోయింది. ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించి ఒకమాట చెప్పారు “ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో, లలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో నాలుక చివర శివనామము పలుకుతున్నాడో వానికి మోక్షము కరతలామలకము. ఈ పిల్లవాడికి ఏమీ తెలియక పోవచ్చు. కానీ పరమేశ్వరుడిని నమ్మాడు. దీనివలన ఈతడు పొందబోయే భాగ్యం ఏమిటంటే గొప్పగొప్ప వాళ్ళందరూ ఈ గొల్లవంశంలో పుడతారు. యితడు గొప్ప ఐశ్వర్యమును అనుభవిస్తాడు. వీని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎనిమిది తరములు గడిచిన తర్వాత సాక్షాత్తు పరబ్రహ్మమే గోపాలబాలుడై ఈ భూమి మీద నడయాడతాడు. అపుడు ఈ బాలుడు నందునిగా శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి అనిపించుకుంటాడు. మీ వంశం అటువంటి వంశం కాబోతోంది’ అని హనుమ ఆనాడు శివభక్తి విశేషమును ఆవిష్కరించి వెళ్ళాడు.

ఈవార్త ఊరంతా పాకింది. ఈవార్త బయట విడిది చేసిన శత్రు సైన్యములకు తెలిసింది. ఇది నిజంగా అలా ఏర్పడినది అయితే మాలో కొంతమంది ప్రతినిధులం స్నేహంగా లోపలికి వస్తాం మాకు చూపించండి అని రాజుకు కబురు పంపారు. అపుడు రాజు వారిని లోపలికి తీసుకువెళ్ళి దేవాలయదర్శనం చేయించాడు. ఇంత భక్తి పరిపుష్టి కలిగిన గోపాల బాలుడు ఈ రాజ్యంలో ఉంటే మన బతుకులు ఏమవుతాయో, మన వంశములు ఏమవుతాయో అని చంద్రసేనుడికి నమస్కారం చేసి వెళ్ళిపోదాము అని యుద్ధం చెయ్యకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు. చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు. ఈవిధంగా ఆ ఉజ్జయిని యందు మహాద్భుతమయిన మహాకాళేశ్వరుని దేవాలయం ఆవిర్భవించింది.

ఉజ్జయిని యందు సంవత్సరమునకు ఒకసారి వర్షాకాలమునకు ముందర ‘పర్జన్యానుష్టానము’ అని చేస్తారు. వర్షములు బాగా పడాలని, పంటలు బాగా పండాలని మహాకాళేశ్వరాలయంలో కూర్చుని అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. అంత గొప్ప ఆలయం ఆ ఆలయం.

ఈ ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం క్రిందనే శంఖ యంత్రం అనే యంత్రం ఉన్నది అని పెద్దలు నమ్ముతారు. శంఖం విజయమునకు గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం ముందు ధృతరాష్ట్రుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. అపుడు సంజయుడు పాండవులు శంఖములు ఊదుతున్నారు అని చెప్పాడు. ఎవరు శంఖమును ఊదాడో వానికి విజయం కలుగుతుంది. మహాకాళేశ్వరుని క్రింద శంఖయంత్రం ఉంది. అందుకని ఆయన దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయమునయినా పొందుతాడు. అపమృత్యుదోషం పోతుంది. ఎటువంటి కోర్కెలు అయినా తీరతాయి. అక్కడి అమ్మవారికి అవంతిక అని పేరు. ఇక్కడ ఉండే కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది. ఆవిడ రాత్రివేళ పట్టణం అంతా సంచరించి తెల్లవారే సరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాస మహాకవి వెళ్లి తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాడు. తెల్లవారి పోతోంది. లోపల కూర్చున్న ఆయన తనకు జ్ఞానం ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించాడు. అపుడు అమ్మవారు కాళిదాసును తలుపు సందులోంచి నాలుకను బయట పెట్టమని చెప్పి ఆయన అలా పెట్టగానే నాలుక మీద బీజాక్షరములను రాసింది. అప్పుడు మహానుభావుడు తలుపులు తీసి అమ్మవారి మీద శ్యామలాదండకం చేశారు. ఈ విధంగా కాళిదాస మహాకవికి జ్ఞానమబ్బిన క్షేత్రము ఉజ్జయిని క్షేత్రం.

ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరముల నుంచో ఉజ్జయినిలో ఉన్న అంతరాలయమునందు రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఈ రెండు జ్యోతులను అఖండ దీపములు అని పిలుస్తారు. ఈశ్వరుడిని మీరు దానిలో చూడవచ్చు.

ఉజ్జయిని దేవాలయంలో భస్మమందిరం అని ఉన్నది. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మ మందిరంలోనికి ఆవులను తీసుకువచ్చి ఆవులు వేసిన పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ విభూతి అభిషేకం రెండు రకములుగా ఉంటుంది. తెల్లని పల్చటి బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టి ఆ మూటను పట్టుకుని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక్క శివలింగం ఉన్నచోటే కాదు అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖముకు, భేరీలు, పెద్ద పెద్ద మృదంగములు ఇవన్నీ మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినా అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో అభిషేకం చేసుకోవాలి అనుకున్న పురుషులను సాంప్రదాయక వస్త్రాలతో తెల్లవారు జామున దేవాలయంలోపలికి పంపిస్తారు. అప్పుడు శ్మశానంలో కాలిన శవభస్మమును అర్చకులు పట్టుకు వచ్చి చుట్టూ కూర్చును ఆ శవ భస్మంతో అభిషేకం చేస్తారు. అప్పుడు నిజంగా మనం కైలాసపర్వతం మీద కూర్చున్నట్లే ఉంటుంది.

అసురసంధ్య వేళలో మహాకాళేశ్వరుడికి చిత్రవిచిత్రమయిన నీరాజనములను ఎత్తుతారు. దానికోసం ప్రత్యేక మహంతులు వస్తారు. ఈ దీపారాధనతో కూడిన జ్వాలని నీరాజనంగా చూపించేముందు ఇక్కడ ఒక నియమం ఉంది. మహా కాళేశ్వరుడికి సమీపంలోనే మరొక శివలింగం ఉంది. ఆ శివలింగం పేరు కోటేశ్వర మహాకాళుడు. ఆయనకు ముందు పూజ చేస్తే తప్ప అసలు మహా కాళుడికి పూజచేయడం నిషిద్ధం. కాబట్టి ముందు కోటేశ్వర మహా కాళుడికి నీరాజనములను ఎత్తుతారు. తరువాత కాళేశ్వరుడికి ఇస్తారు. అందుకని ఉజ్జయినిలో కోటేశ్వర మహాకాళ దర్శనం కూడా చేయవలసి ఉంటుంది.

ఏడాదికొక్కసారి స్వామివారు సవారీ వెడతారు. ఆయన కారుణ్యమునకు పరాకాష్ఠ ఈ సవారీ ఉత్సవం. దీనిని ఊరేగింపు/ఊరెరిగింపు అంటాం. అపుడు ఉజ్జయిని జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్, ఎన్నికయిన మంత్రి ఎవరయినా లేదా పరిపాలన చేసే మంత్రి ఈ ముగ్గురు ప్రతి ఏటా స్వామివారి సవారీ ఉత్సవమునకు వచ్చి తప్పనిసరిగా సవారీని మోయాలి. కొన్ని వేల సంవత్సరములనుంచి ఇదే ఆనవాయితీ.

ఉజ్జయినిలో శివరాత్రినాడు స్వామి పెళ్ళికొడుకు అవుతాడు. అపుడు ఆయన పుష్ప కిరీటం పెట్టుకుని పెళ్లికొడుకు అవుతాడు మహాశివరాత్రి వెళ్ళిపోయిన మరునాడు ఈ అలంకారం అంతా తీసేసి మరల భస్మాభిషేకమును అందుకుంటారు. అటువంటి సవారీ జరుగుతుంది. అక్కడే బలరామ కృష్ణులు ఇద్దరూ సాందీపని మహాముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. ఈవిధంగా ఉజ్జయిని అన్నిరకములుగా ప్రకాశిస్తున్నది. అటువంటి దివ్యక్షేత్రమును జీవితంలో ఒక్కసారయినా దర్శనం చేసి, అక్కడ కొన్నిరోజులు గడిపి, జన్మసార్థకం చేసుకోవాలి.

కేదారేశ్వరుడు
కేదారేశ్వర లింగం గురించి ఒకమాట చెప్తారు. మహాద్రి పార్శ్వే చ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే!!
(ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం – ౧౧)

ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగము. నరనారాయణులిద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీక్షేత్రము నందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమయిన శివలింగము. కేదారమునందు ఉన్న శివలింగమును దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే! కేదారేశ్వర లింగమును దర్శనం చేసేటప్పుడు ఒక నియమం ఉంది. ఆ నియమంతోనే దర్శనం చేయాలి.

కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివ లింగమును ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవారు. పార్థివ లింగము అంటే మట్టితో చేసిన శివలింగం. మట్టితో చేసిన ఆ శివలింగమును వారు సాక్షాత్తు ఈశ్వరుడు అని నమ్మి శివలింగామునకు అర్చన చేస్తున్నారు. అపుడు ఆ శివలింగం లోంచి పరమశివుడు ఆవిర్భవించి ‘మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను. ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివ లింగమునకు ఇంత అర్చన చేశారు. మీకేమి కావాలో కోరుకొనండి’ అని అడిగారు. అపుడు వారు ‘స్వామీ, ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు ఆవలివైపు హిమాలయ పర్వతశృంగముల మీద నీవు స్వయంభువ లింగమూర్తివై వెలసి లోకమును కాపాడు’ అని అడిగారు. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు.

హిమాలయ పర్వతములు సముద్ర మట్టమునకు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. కేదారం వెళ్ళడానికి దారి కొన్ని నెలలలో మాత్రమే వీలు చేయబడుతుంది. రాత్రి తొమ్మిది దాటితే ఆ మార్గ ప్రాంతంలో కరెంటు తీసివేస్తారు. అక్కడి కాటేజీలలో చీకట్లోనే పాడుకోవాలి. అక్కడ ప్రయాణం చేయాలి అంటే పాదచారియై వెళ్ళాలి. మంచి హోరుమని వానలా పడిపోతుంది. పైనుంచి క్రిందకి చూశారంటే కళ్ళు తిరిగిపోతాయి.

ఇటునుంచి రుద్రప్రయాగ, అటునుంచి దేవప్రయాగ రెండూ వెళ్ళి కలుస్తాయి. ఇక్కడ గంగానది – బదరీలో అలకనందానది. పర్వతముల నుండి ఎన్నో జలపాతములు పడిపోతూ ఉంటాయి. సాధారణంగా ఆ మార్గంలో నడిచి వెళ్ళే వాళ్ళు తక్కువ. డోలీ, లేదా గుర్రముల మీద కూర్చుని వెళ్ళాలి. గుర్రం ఒక్కసారి జారిందంటే ఇక గుర్రం మీద కూర్చున్న వాడిని వెతకవలసిన అవసరం ఉండదు. అలా జారితే వాడు కొన్నివేల అడుగుల నుండి క్రింద పడిపోతాడు. శరీరం చిన్నాభిన్నం అయిపోతుంది. యాత్రములో ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ కేదారనాథ్ యాత్ర వెళ్ళితీరవలసిన యాత్ర. ఇన్నివేల అడుగులు పైకి ఎక్కిన తర్వాత స్వామి దేవళం కనపడుతుంది. లోపలి వెడితే లోపల పెద్ద అంతరాలయం ఉంటుంది. అక్కడ మహానుభావుడు కేదారేశ్వరుడుగా వెలిశాడు. కేదార శివలింగ దర్శనం చేసిన వాడికి మోక్షం కరతలామలకము అని శివమహాపురాణం, పెద్దలు నిర్ణయం చేశారు. కేదారం వెళ్ళినపుడు పడిపోయిన వారికి కూడా మోక్షం దొరికి తీరుతుంది. అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకసారి ఒక విచిత్రమయిన స్థితి ఏర్పడింది. అక్కడ శివలింగం వెలసి కొన్ని యుగములు అయిపొయింది. శివాలయములో శివునికి పునఃప్రతిష్ఠ ఉండదు.

ఒకసారి పాండవులు అయిదుగురు కలిసి కేదారేశ్వర దర్శనమునకు వెళ్ళారు.అప్పటికి ఆలయంలో చిన్న శివలింగం ఉంది. పాండవులు ఏమి చేస్తారో చూడాలని శివునికి ఒక ముచ్చట. ఒక చిన్న దున్నపోతు రూపంలో పరుగెత్తాడు. పాండవులు దానిని గమనించారు. వారు అది ఖచ్చితంగా అది శంకరుడే అయి ఉంటాడని భావించారు. మహిషరూపంలో వెడుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు. దాని కాళ్ళు పట్టుకోవాలని వారు ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు. వాళ్లకి దాని కాళ్ళు అందలేదు. తోక అందింది. ఈశ్వర స్వరూపంగా దాని తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై పరమేశ్వరుడు తన పృచ్ఛభాగమును అక్కడ విడిచిపెట్టి దానిని శివలింగంగా మార్చివేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న కేదారలింగం. కేదారం వెళ్లి వచ్చిన వాడికి అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి. అంత పరమ పవనమయిన క్షేత్రం కేదార క్షేత్రం.

అక్కడే మనం ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతుంటుంది. ‘అదిగో కైలాసం కనపడుతోంది చూడండి అంటారు. ఆ మంచుకొండ నిజంగా కైలాసంలాగే భాసిస్తూ ఉంటుంది. వర్షం ఆగి సూర్య కిరణములు పడుతుంటే ఆ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కైలాస సమీపమునకు వెళ్లి వచ్చినట్లు అనిపిస్తుంది. శంకర భగవత్పాదులు అక్కడే తమ సత్యదండమును విడిచిపెట్టేశారు అని భక్తులు నమ్ముతుంటారు. అక్కడ శంకరుల సత్యదండపు పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది. అక్కడే చిన్న ఆలయం కూడా ఉంటుంది. కాబట్టి కేదారము అంత గొప్ప క్షేత్రము.

కేదారక్షేత్రం వెళ్ళినవారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదు. వలయమును పట్టుకు వెళ్ళాలి. వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి. అంతరాలయంలో ప్రవేశించగానే కంటిముందు ఆ వలయమును పెట్టుకుని అందులోంచి చూడాలి. కేదారము దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రం గనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకరమును పెట్టుకుని అందులోంచి కేదార లింగమును చూడాలి. అలా చూసిన వలయ కంకణమును అక్కడ వదిలిపెట్టి వచ్చెయ్యాలి. మన చేతికి వున్నా ఏ బంగారు కంకణమునో ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టేయడానికి మనసొప్పదు. కాబట్టి ముందే ఒక రాగి కంకణమును పట్టుకుని వెడితే రాగి చాలా ప్రశస్తము కనుక, ఆ కంకణములోంచి కేదార లింగమును దర్శనం చేసి దానిని అక్కడ వదిలిపెట్టి రావచ్చు. ఇకముందు వెళ్ళేవారు ఒక వలయంలోంచి కేదారలింగమును దర్శనం చేసే ప్రయత్నం చేస్తే మంచిది.

ఓంకారేశ్వరుడు
కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే!!

మాంధాతృపురంలో వెలసిన వాడు ఓంకారేశ్వరుడు. ఓంకారేశ్వర క్షేత్రము చాలా చిత్రమయిన క్షేత్రము. అక్కడ రెండు స్వయంభూ శివలింగములు వెలశాయి. అందులో ఒకదానిని ‘ప్రణవాకార పరమేశ్వరుడు’ అంటారు. ఆయన ఓంకార స్వరూపియై ఉంటాడు. రెండవది మనము ‘ఓంకారమమలేశ్వరం’ అంటాము. అమలేశ్వరుడు అనే పేరుతో ఒక శివలింగం ఉంటుంది. ఇలా రెండు లింగములు వెలయడానికి కారణం తెలుసుకోవాలి.

నారదమహర్షి త్రిలోక సంచారి. మహానుభావుడు గురు స్వరూపుడు. అటువంటి నారద మహర్షి ఒకసారి వింధ్యపర్వతం దగ్గరకు వచ్చారు. వింధ్యపర్వతమునకు తాను చాలా గొప్పదానను అని, తనంత ఎత్తైన పర్వతం మరొకటి లేదని చాలా అహంకారం ఉంది. ఇది ఒక అర్థం లేని ఆభిజాత్యం. ఇక్కడ అదృష్టం ఏమిటంటే అటువంటి సద్గురువు అయిన నారదునితో వింధ్యపర్వతం మాట్లాడడం. ఎంత అహంకారి అయినా అతనికి ఒక సద్గురువు దొరికాడంటే అతనికి అంతకుమించిన అదృష్టం లేదు. వాని జీవితం మారిపోతుంది. నారదుడిని చూసి విధ్యపర్వతం అహంకారమును బయట పెట్టింది. అసలు వింధ్యుడు చూడగానే నారదునికి నమస్కారం చెయ్యాలి. కానీ అహంకారంతో మాట్లాడాడు. అపుడు నారదుడు ఒక చిరునవ్వు నవ్వి “నీవు చెప్పినది యథార్థము. నీతో సామానమయిన పర్వతము ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది. మేరుపర్వతం కూడా చాలా గొప్ప పర్వతం. నవగ్రహములు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు అవి మేరుపర్వతమునకు ప్రదక్షిణగా తిరుగుతూ ఉంటాయి” అన్నాడు. ఆమాట వినేసరికి వింధ్య పర్వతానికి చాలా బాధ వేసింది. ‘నాకూ ఉన్నాయి శిఖరములు, కానీ వాటి చుట్టూ ఎవరూ తిరగడం లేదు. మేరు పర్వతమునకు ఉన్న కీర్తి నాకు లేదు’ అని అనుకుని ‘నారదా, నేను కూడా అటువంటి కీర్తిని పొందాలి. మేరుపర్వతం కంటే గొప్ప ఉన్నతిని పొందాలి. అందుకని ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు?” అని అడిగాడు.

అపుడు నారదుడు మహాశివుణ్ణి గూర్చి తపస్సు చేయమని వింధ్యుడికి సలహా చెప్పాడు.వెంటనే వింధ్యుడు మహాశివుణ్ణి గూర్చి శివ పంచాక్షరీ మహామంత్రమును ఉచ్చరిస్తూ తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు. దేవతలు మహాదేవుని వద్దకు వెళ్లి ‘మహాదేవా, వాన్ తపస్సు సామాన్యంగా లేదు. మీరు వెళ్ళి ప్రత్యక్షం అవండి’ అన్నారు. అంతటా నిండి ఉన్న నిర్గుణ పరబ్రహ్మము సాకారమును పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు. చేతితో స్పృశించాడు. వింధ్యుడు బహిర్ముఖుడు అయ్యాడు. ‘నాయనా, నీవు చాలా గొప్ప తపస్సు చేశావు. నీవు ఏమి కోరి ఈ తపస్సు చేశావు? ఏమి కావాలో చెప్పు ఇచ్చేస్తాను’ అన్నాడు. ‘నన్ను లోకములో గొప్పవాడిగా చెయ్యి’ అని అడిగాడు. “నీవు ఇంక అహంకారముతో ప్రవర్తించకు. ఏ నవగ్రహములు అయితే మేరువు చుట్టూ తిరుగుతున్నాయో అటువంటి నవగ్రహములను కవచంగా కట్టుకున్న నేను స్వయంగా వచ్చి నీ శిఖరమును అధిరోహిస్తాను’ అని చెప్పి శంకరుడు వింధ్యుడిని అనుగ్రహించాడు. అపుడు వింధ్యుడు ‘ప్రభూ, దానిని నీ అనుగ్రహంగా భావిస్తాను, అహంకరించను’ అని చెప్పాడు. అపుడు ఆ వింధ్య పర్వత శ్రేణి మీద పరమాత్మ అన్ని చోట్లా ఒక్క స్వయంభూలింగంగా వస్తే వింధ్య పర్వత శిఖరముల మీద స్వామి రెండు స్వయంభూ లింగములుగా వచ్చాడు. ఒకటి ‘ఓంకార లింగము’, ఒకటి ‘అమలేశ లింగము’. అందుకే మనం చెప్తే ‘ఓంకారమమలేశ్వరం’ అంటాము. ఆ వెలయడం మాంధాతృ పురంలో వెలశాడు. ఓంకారం అంటే ప్రణవము. ప్రణవము మోక్ష దాయకము. ఇపుడు వింధ్య గిరి మీదికి వెళ్లి దర్శనం చేసిన వాడికి మోక్షం వస్తుంది. పక్కన అమలేశుడు ఉన్నాడు. మనందరి యందు ఆసవ మలము, కార్మిక మలము, మాయక మలము అని మూడు రకములయిన మలములు ఉంటాయి. మీరు స్నానం చేసినా ఈ మూడూ వదలవు. కానీ ఈశ్వరుడు ఈ మూడు మలములకు అతీతుడు. ఎవడు మీకు ఈ మూడు మలములకు అతీతమయిన స్థితిని ఇవ్వగలడో, తానే స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మిమ్మల్ని ఎత్తగలిగినవాడో వాడు ఓంకారేశ్వరుడు. మీరు కోరిన సమస్త కోరికలనూ తీర్చగలిగిన వాడు. ఆయన నిరంతర ఆనంద స్వరూపుడు. మీరు అడిగినది ఏదయినా ఇవ్వగలడు. ఇపుడు ఆయన అమరేశ్వరుడిగా, ఓంకారేశ్వరుడిగా ఉన్నాడు. ఇద్దరుగా అక్కడ వెలసి శంకరుడు నిరంతరమూ జనులకు శుభములను ఇస్తూ ఆ కొండమీద వెలసి ఉన్నాడు. అలా వెలసిన అమలేశ్వరుణ్ణి శంకర భగవత్పాదులు ఒక అద్భుతమయిన శ్లోకముతో ఆరాధన చేస్తారు. మనం అమరేశ్వర లింగమును చూసినప్పుడు ఆ భావనను మనస్సులో తెచ్చుకోవాలి. అమలేశ్వర లింగమును, ఓంకారేశ్వర లింగమును మీరు అక్కడ కళ్ళతో చూసి తత్త్వ విచారణ రీత్యా మీ మనస్సు లోపలి తెచ్చుకోవాలి. శంకరులు అంటారు

ఆకాశ శ్చికురాయతే దశదిశాభాగో దుకూలాయతే
శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే,
వేదాంతో నిలయాయ తేసువినయో యస్యస్వభావాయతే
తస్మి న్మే హృదయం సుఖేనరమతాంసాంబే పరబ్రహ్మణి!!

‘సాంబే’ అంటే ‘స అంబే’ – అమ్మతో కూడుకున్న అయ్యా, ఓ శంకరా నీవు పరబ్రహ్మవు. నీవు అమలేశ్వరుడవు. మూడు మలములకు అతీతమై ఉన్నవాడవు. ఇక్కడ నీవు లింగముగా కనపడుతున్నావు. నీవు నాతొ వచ్చినప్పుడు నీవు ఆకాశ స్వరూపుదవై ఉన్నావు. నీవు దిగంబరుడవు. పది దిక్కులు కలిసి నీకు వస్త్రము అయ్యాయి. దిక్కులను అంబరముగా కట్టుకున్నవాడవు. చంద్రరేఖను ఆభరణముగా కలిగిన వాడవు. ఎప్పుడూ ఆనందమయ స్వరూపుదవై ఉంటావు. వేదముల చివరి భాగాములయిన ఉపనిషత్తులయందు చెప్పబడుతుంటావు. వినయముతో నిన్ను తలుచుకుంటే చాలు, మమ్మల్ని ఉద్ధరించడానికి వస్తావు’.


భీమేశ్వర జ్యోతిర్లింగము
భీమేశ్వర జ్యోతిర్లింగం గూర్చి ప్రార్థనా శ్లోకంగా ఒకమాట చెప్తారు.
యం డాకినీశాకినికాసమాజై నిషేవ్యమాణం పిశితా శనైశ్చ!
సదైవ భీమాదిపదప్రసిద్ధం, తమ్ శంకరం భూతహితం నమామి!!

ఇక్కడ ఉండే శంకరుడిని భీమలింగము అని పిలుస్తారు. శివాష్టోత్తరంలో ‘భీమః’ అన్న నామమును మనం చదువుతుంటాము. ‘భీమః’ అనే నామం విష్ణుసహస్రనామ స్తోత్రంలో కూడా ఉంది. ఇది చాలా చిత్రాతిచిత్రమయిన స్వయంభూలింగము.

లింగపురాణం మనకొక మాట చెప్తోంది. వాయువు పేరును ‘ప్రభంజనః’ అని పేర్కొంది. ఆయన గట్టిగా వీస్తే పెద్దపెద్ద వృక్షములు కూడా కూకటి వేళ్ళతో క్రిందపడిపోతాయి. కాబట్టి ఆయన ప్రభంజనుడు. అటువంటి వాడికి శంకరుడు ‘నీవు జీవులలో ఉండి వాళ్ళ కార్యములన్నీ నిర్వర్తించాలి’ అని చెప్పాడు. వెంటనే వాయువు జీవులలోకి వెళ్ళాడు. ఇప్పుడు ప్రభంజనుడై వాయువు మీ శరీరము నిలబడడానికి పది రకములయిన కర్మలను లోపల వుండి నిర్వహిస్తున్నాడు. ఆయన ఇవి చెయ్యకపోతే మన బ్రతుకే లేదు.

పూర్వకాలమునందు సహ్య పర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసుని పేరు కర్కటుడు. ఆయన భార్య పేరు పుష్కసి. ఈ రాక్షస దంపతులకు ఒక రాక్షసి పిల్ల పుట్టింది. ఆమె పేరు కర్కసి. పెరిగి పెద్దదయి యౌవనంలోకి వచ్చింది. తగిన సంబంధం చూడాలి. విరాధుడు అనేవాడిని ఈమెకు తగిన వరునిగా నిర్ణయించి పెళ్ళి చేశారు. కొంతకాలమునకు రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు. ఈవిడకి వైధవ్యం వచ్చింది రాముడి పట్ల వైరం ఉన్న కుంభకర్ణుని పట్ల మక్కువ పెంచుకుంది. ఈ విషయం తెలుసుకుని కుంభకర్ణుడు ఈమె దగ్గరికి వచ్చాడు. కదళీ వనంలో వున్న ఆమెను స్వీకరిస్తానని చెప్పి ఆమెను బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆవిడకి కుంభకర్ణుడి వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఆ పుట్టినవాడు అపారమయిన బలవంతుడు అవాలని ఆమె కోరుకుంది. తన కొడుకు తన భర్త విరాధుడిని, కుంభకర్ణుని సంహరించిన రాముడిని సంహరించగల శక్తిమంతుడు కావాలని ఆమె కోరిక. అందుకని ఆ పిల్లాడిని ‘భీమః’ అని పిలవడం ప్రారంభించింది. భీమః అంటే గోప్పబలం ఉన్నవాడు అని అర్థం.

వాడు పెరిగి పెద్ద రాక్షసుడు అయ్యాడు. వాడు ఒకనాడు తల్లిని “నాన్నగారు ఎక్కడ” అని అడిగాడు. అపుడు ఆమె తన కథను కొడుక్కి చెప్పి ఈ రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి విష్ణువుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నీవు విష్ణువును సంహరించాలి’ అని చెప్పింది. విష్ణువు గురించి లోకములనన్నింటిని వెతికి వెతికి విసిగిపోయాడు. ఎవడయినా భగవంతుని పాదములు పట్టుకున్న వాడు ఉన్నట్లయితే వాని తలకాయ తీసివేయమని ఆజ్ఞాపించాడు. ఇలా భక్తులన్దరినీ చెనకుతూ వెళ్ళిపోతుండగా ఒకానొకప్పుడు కామరూప రాజ్యమును పరిపాలిస్తున్న సుదక్షిణుడు అనే రాజు జోలికి వెళ్ళి ఆయనను ఓడించి తీసుకు వచ్చి కారాగారంలో పెట్టాడు.

సుదక్షిణుడు పార్థివ లింగం పెట్టి రోజూ లింగార్చన చేస్తూండేవాడు. మనస్సుతోనే ఆయన అన్నీ సృష్టించి శివపూజ చేస్తుండేవాడు. అలా చేస్తుంటే అక్కడ ఉన్న కాపలాదారులు వెళ్ళి ఈవిషయం రాజుకు చెప్పారు. వీడికి ఎక్కడ లేని కోపం వచ్చి నాకన్నా గొప్పవాడు ఎవడు? ఇప్పుడే ఈ లింగమును కత్తితో నరికేస్తాను అని చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతుండగా సుదక్షిణుడు పరమేశ్వరా నీవు ఆవిర్భవించి వీనిని సంహరించు అని ప్రార్థన చేశాడు.

ఎప్పుడయితే తన చేతిలో ఉన్న చంద్రహాసమును విసిరాడో అంతటా నిండి నిబిడీ కృతమయిన పరమాత్మ ఈ కన్నులకు కనపడని పరమాత్మ సాకార రూపమును పొంది పార్థివ లింగంలోంచి బయటకు వచ్చి నేను నా భక్తుల జోలికి వెళ్ళే వాళ్ళని ఉపేక్షించను అని ఉత్తరక్షణం వాడిని కుత్తుక మీద పొడిచి సంహారం చేశాడు. ఆ సందర్భంలో పరమేశ్వరుడే తన పేరు ‘భీముడు’ అని చెప్పుకున్నాడు. భీముడు అనగా అద్వితీయ పరాక్రముడు.

ఇందులో తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉంది. ఆ రాక్షసుని కక్ష విష్ణువు మీద. అయితే ఇక్కడ పరమశివుడు వచ్చాడు. యథార్థమునకు విష్ణురూపం రావాలి కదా! అయితే శివరూపంతో వచ్చి ఎందుకు చంపాడు? అంటే భగవంతుని రెండు పేర్లు చెప్తారు – వామదేవ, వాసుదేవ. వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు. వామదేవ అంటే పరమశివుడు. ఈ రెండు పేర్లలో మారిన అక్షరములు ‘మ’ ‘సు’. ఇప్పుడు ‘సు’ పక్కన ‘మ’ పెట్టండి. ‘సుమ’ అవుతుంది. ‘సుమం’ అంటే పువ్వు. పువ్వు అనగా జ్ఞానం. జ్ఞానం మీకు కలిగితే ఆ వామదేవుడు వాసుదేవుడు, వాసుదేవుడు వామదేవుడు అవుతారు. నామములు, రూపములు మారాయి. తత్త్వరీత్యా ఉన్నది ఒక్కటే పదార్ధం. అందుకే శివలింగమును పూజించి రాముని జోలికి వెళ్ళినా, రావణాసురుని పది తలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదు. శివ స్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదములు పట్టుకున్నా, శ్రీమహావిష్ణువు వచ్చి శంకరుడు చేసే ప్రళయమును ఆపడు. ఎందుచేత అంటే ఉన్నది ఒక్కటే పదార్థము. ‘ఏకోదేవః సర్వభూతాంతరాత్మా స్రవభూతాభివాసః సాక్షీచేతోకేవలోనిర్గుణస్యా’ అంది వేదం. ఆ ఉన్న ఒక్క పదార్థము అవసరమును బట్టి రూపమును మారుస్తుంది. ఇక్కడ భీమః – మీరు ఏమి కోరుకుంటున్నారో అటువంటి శక్తి ఏదయినా మీకు ఇవ్వగలిగిన వాడు. ఇప్పుడు ఆ స్థితిలో వచ్చి రాక్షససంహారం చేసి తన భక్తుడయినవాడికి రాజ్యాధికారం ఇచ్చి, తదనంతరం మోక్షమునిచ్చినవాడు.

ఒక్కసారి వెళ్ళి ఆ భీమశంకర జ్యోతిర్లింగం దగ్గర నిలబడి ‘డాకిన్యాం భీమశంకరం’ అని ఒక్క నమస్కారం చేస్తే భీముడు శంకరుడు మీకు శుభం చేస్తాడు. ఒక్క నమస్కారం చేస్తే ఆ పరమాత్మ మిమ్మల్ని కాపాడి ఎటువంటి దుఃఖములు రాకుండా రక్షిస్తాడు.


త్ర్యంబకేశ్వరుడు
‘త్ర్యంబకం గౌతమీ తటే’ అని మనం అంటాము.
సహ్యాద్రి శీర్శే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్రదేశే,
యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తమ్ త్ర్యంబకమీశమీడే!! (ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం – ౧౦)

త్ర్యంబకుడు తనను దర్శనం చేసిన వారిని రక్షించే స్వభావం కలవాడు. ఆయనను స్మరించిన వారిని, ఆయనను నమ్మిన వారిని సర్వకాలముల యందు రక్షించే స్వరూపం ఉన్నవాడు. ఇప్పటివరకు చదివిన స్వయంభూలింగముల విశేషం ఒకలా ఉంటుంది. త్ర్యంబకేశ్వరుని వద్దకు వచ్చేటప్పటికి ఒకలా ఉంటుంది. ఇది కేవలము ఒక లింగము ఆవిర్భవించిన కథ కాదు. గౌతమ మహర్షి జీవితమును, ఆయన శీలమును, ఆయన గొప్పతనమును ఇందులో చూస్తారు. అక్కడి శివలింగం గొప్పదా, గౌతముడు గొప్పవాడా అని ఒకసారి ఆలోచిస్తే గౌతముడే గొప్పవాడని అనిపిస్తుంది. ఇక్కడ ఒక నది, ఒక శివలింగం ఆవిర్భవించాయి. మనం తెల్లవారి లేస్తే ఏ నదీజలములు త్రాగి బతుకుతున్నామో ఆ నదిని తీసుకువచ్చిన మహాపురుషుని చరిత్ర ఇప్పుడు చదవబోతున్నాము.

గౌతముడు చాలా గొప్ప మహర్షి. ఆయన తన శిష్యులతో కలిసి ప్రతిరోజూ శంభు లింగారాధనము చేస్తుండేవాడు. ఆ లింగానికి శంభులింగము అని పేరు పెట్టాడు. ‘శం భావయతి ఇతి శంభుః’ – మంచి భావములను కల్పించ గలిగిన లింగమును ఆరాధనా చేశాడు. అటువంటి మహర్షి కోరుకునేది ఒక్కటే. లోకమంతటినీ లోకేశ్వరునిగా చూడడం. చాలామంది శిష్యులు ఆయనను అనుగమించి ఉండేవారు. వాళ్ళందరికీ అనేక శాస్త్రములను బోధిస్తూ బ్రహ్మగిరి అనే పర్వతశిఖర పాదమూలమునందు ఆశ్రమమును నిర్మాణము చేసుకుని లింగారాధన చేస్తూ పవిత్రమయిన జీవితమును గడుపుతున్నాడు.

ఇలా నడుస్తుండగా కొంతకాలమునకు అనావృష్టి వలన భయంకరమయిన క్షామం వచ్చింది. వర్షములు పడలేదు. ఎక్కడా నీరు లేదు. ఇప్పటికీ లోకమునందు నీరు లేకపోతే శివలింగామునకు సహస్ర ఘటాభిషేకం చేస్తారు. చేస్తే వర్షములు పడతాయి. ఇటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరు నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనిని గౌతముడు చూసి నేను ఎలాగయినా ఈ లోక బాధను తీర్చే ప్రయత్నం చేస్తాను’ అని జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు. ‘నీవు తపస్సు చేశావు. సంతోషించాను. కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు. కానీ నీకు ఒక ఉపకారం చేస్తాను. లోకమునకంతటికీ నేను నీరు ఇవ్వలేను. నీవు ఒక చిన్న గుండం తవ్వు. నేను అందులో నీళ్ళు పోస్తాను. ఒక వరం ఇస్తాను. ఆ కుండం ఆరదు. ఎప్పుడూ నీళ్లు ఉంటాయి’ అని చెప్పాడు వరుణుడు. అపుడు గౌతముడు ఇంతకన్నా నాకు అదృష్టం ఎక్కడ ఉంటుంది. తప్పకుండా అలా చేస్తాను’ అని తన భార్య అయిన అహల్యతో కలిసి ఒక గుండం తవ్వాడు. అహల్య గొప్ప పతివ్రత. వారు తవ్విన గుండంలో నీరు నింపాడు వరుణుడు. అపుడు గౌతముడు అహల్య కలిసి ఈ నీటిని పట్టుకు వెళ్ళి సేద్యం చేసి అనేకమయిన పంటలు పండించాడు. అందరికీ ఉచితంగా భోజనం లభించింది. అక్కడి ప్రజలు గౌతమ మహర్షి ఆశ్రమమునకు వెళ్లి చక్కగా ఆ పెట్టిన పదార్థముల నన్నిటిని తినడమే కాక ఈ కీర్తిలో వాటా కోసం కొందరు గౌతమునితో బంధుత్వం కలదని చెప్పుకోవడం ప్రారంభించి ఆయన దగ్గరకు చేరారు.

ఇలా జరుగుతుండగా గౌతమాశ్రమంలో ఒక విచిత్రం జరిగింది. ఒకరోజు తెల్లవారు జామున మహర్షి శివలింగమునకు అభిషేకం చేయాలి. వరుణ గుండంలోకి వెళ్ళి నీళ్ళు పట్టుకురండి అన్నారు శిష్యులను మహర్షి. వాళ్ళు నీళ్ళు తేవడానికి వెళ్ళారు. అదే సమయమునకు మునుల భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాములే అని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది కాబట్టి అమ్మలారా, మీరు ఒక్కదారి అలా ప్రక్కకి తొలగితే మీము నీళ్ళు పట్టుకుని వెళ్లిపోతాము అని చెప్పారు. స్త్రీలు అన్నారు ‘ మీకు ఎంత మిడిసిపాటు వచ్చింది. మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనం, అభిషేకం ఎక్కువయ్యాయా?అవతలికి పొండి ’ అన్నారు. ఆ మాటలకు శిష్యులు చిన్నబుచ్చుకుని ఖాళీ కుండతో తిరిగివచ్చారు. అప్పుడు వాళ్లకి ఏమి చేయాలో అర్థం కాక అహల్య దగ్గరికి వెళ్ళి ‘అమ్మా, ముని పత్నులు మమ్మల్ని అనరాని మాటలు అని పంపించి వేశారు. ఇప్పుడు గురువుగారి వద్దకు ఎలా వెళ్ళడం’ అని అడిగారు. ఆమాటలను విన్న అహల్య వెంటనే తాను వెళ్ళి నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది.

వెంటనే వాళ్ళు అహల్య మనల్ని చూసి ఏమీ మాట్లాడకుండా చులకన చేసి వెళ్ళిపోయింది అని దెప్పిపొడిచారు. వాళ్ళలో అక్కసు బయలుదేరింది. వెళ్ళి భర్తలను “మా భర్తలు ఒకళ్ళు పెడితే అంగలారుస్తూ తినేవాళ్ళు అనుకుంటున్నారా?” అని అడిగారు. అలా భార్యలు అడిగేసరికి వాళ్లకి కష్టం వచ్చింది. వెంటనే వీళ్ళు గణపతి హోమం మొదలు పెట్టారు. వీళ్ళు విఘ్నేశ్వరుని ఉద్దేశించి దంతిమఖము అనే మఖము ఒకటి చేశారు. వీళ్ళు చేసినటువంటి మఖమునకు తృప్తిపొందిన గణపతి యజ్ఞ గుండంలోంచి ఆవిర్భవించాడు. ‘నేను మీకు ఏమి చేసిపెట్టాలి?” అని అడిగాడు. అపుడు వాళ్ళు ‘గౌతముడు పొగరెక్కి ఉన్నాడు. కాబట్టి ఈ ఆశ్రమంలోంచి గౌతముడు తరమబడేటట్లు నీవు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి’ అన్నారు. అపుడు విఘ్నేశ్వరుడు ‘ఇది మీరు అడగవలసిన మాట కాదు. ఒకనాడు మీకు తాగడానికి నీళ్ళు లేక, తినడానికి అన్నం లేకపోతె ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మీకు వడ్డించి అన్నం పెడుతుంటే ఆయనను ఈ ఆశ్రమం నుండి తరిమి క్షామంలోకి తొరి మీరు సుఖములను అనుభవిద్దామని అనుకుంటున్నారా? ఇది ఎంత కృతఘ్నత! ఇలా చేయకూడదు. అలా చేస్తే మీరు లోకంలో నశించిపోతారు” అన్నాడు.

అపుడు వాళ్ళు “నీ దగ్గర నీతులు వినదానిమి మేము ఈ మఖము చేయలేదు. మాకోరిక ఒక్కటే. గౌతముడు ఈ ఆశ్రమం నుండి తరమబడాలి. అలా నువ్వు చేస్తే మేము చేసిన మఖమునకు ఫలితం ఇచ్చినట్లు అవుతంది. కానినాడు నీవు కృతఘ్నుడవు అయిపోయినట్లు మేము భావిస్తాము” అన్నారు. అపుడు విఘ్నేశ్వరుడు ‘మీరు చేసిన మఖమునకు నేను ప్రీతి చెందాను. తప్పకుండా మీకోరిక తీరుస్తాను. కానీ మీరు పాడయిపోతారు. తన ఉపాసన యందు భంగము లేకుండా నడిచి వెళ్ళిపోయినటువంటి గౌతముడు సర్వోత్క్రుష్టమయిన కీర్తిని పొందుతాడు. దీనిని మీ మనస్సులో పెట్టుకోండి. మీ కోరిక తీర్చడంలో నాకు అభ్యంతరం లేదు’ అన్నాడు. ఒక వృద్ధ గోవు ఆయన కష్టపడి వేసిన పళ్ళు, ఆకుకూరలు వచ్చి తినేస్తోంది. గణపతి ఆ వృద్ధ గోవు రూపంలో వచ్చాడు మునుల కోర్కెను తీర్చడానికి గాను. బక్క ఆవు మేస్తుంటే ఆవును కర్రతో కొట్టినా, చేతితో కొట్టినా గోమోదక దోషం వస్తుందని మహానుభావుడు గౌతముడు ఒక ఎండిపోయిన గడ్డిపరక తీసి ఆవుమీద పడేసి ‘హ హ’ అన్నాడు. ఆ గడ్డిపరక పడగానే ఆవు చచ్చిపోయింది. నాకు గోహత్యాదోషం వచ్చింది’ అని ఏడ్చాడు. ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడలేదు. అక్కడికి అహల్య, ఆయన శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు. మునులు, మునిపత్నులు వచ్చారు. ఏమయిందని గౌతముని అడిగారు. జరిగింది చెప్పాడు గౌతముడు. అపుడు వారు’ఆవును చంపిన నీ ముఖం చూస్తే మహా పాతకములు వస్తాయి. నీవు నీ భార్యను, శిష్యులను తీసుకుని ఆశ్రమం వదలి ఎక్కడికయినా పో’ అన్నారు. అక్కడితో ఊరుకోక నువ్వు గోహత్య చేసిన వాడివి, ఇక్కడ నీవు ఉంటె మేము ఉండము అంతేకాక ఈవేళ నుండి నీవు దేవతలను ఆరాధించకూడదు. గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజచేస్తే భగవంతుడు నొచ్చుకుంటాడు. అదేమీ కుదరు పో’ అన్నారు. గౌతముని ప్రాణం ఈశ్వరార్చన. అప్పుడు ఆయన ‘అయ్యో, నేను తప్పకుండా వెళ్ళిపోతాను. అని వెళ్ళిపోయాడు. అక్కడ నుండి బయలుదేరి అక్కడ అక్కడ తిరిగి ఎంతో దుఃఖమును అనుభవించి ఆ మునులను ఏదైనా ప్రాయశ్చిత్తం వుంటే చెప్పండి. నేనది చేసుకుని మరల నా జీవితమును ఈశ్వరాభిముఖం చేసుకుంటాను’ అన్నాడు. నిజానికి ఆయనకు తెలియని విషయమా? ఆయన ఇంకా మెట్లు దిగి వినయమునకు వెళుతున్నాడు. వీళ్ళు మెట్లెక్కి అహంకారమునకు వెడుతున్నారు. అపుడు వీళ్ళు ‘అయితే ఈ భూమండలమునంతటినీ మూడు మార్లు ప్రదక్షిణ చెయ్యి. అలా చేస్తున్నప్పుడు అడుగుతీసి అడుగు వేసినప్పుడల్లా గోవును చంపిన మహా పాతకుణ్ణి నేను అని అంటూ చెయ్యి. వచ్చిన తరువాత చాంద్రాయణ వ్రతం చెయ్యి. అప్పుడు నీకు ఆవును చంపిన పాపం పోతుంది’ అని చెప్పారు. ఒకవేళ అలా చేయలేక పోయినట్లయితే వెళ్లి శంకరుని గూర్చి తపస్సు చెయ్యి. శంకరుడు ప్రత్యక్షమయిన తర్వాత గంగను ఇమ్మని అడుగు. ఎక్కడ ఆవును చంపావో అటువైపు నుంచి గంగను ప్రవహింపజెయ్యి. తర్వాత అఘమర్షణవ్రతం చెయ్యి. కోటి లింగములు పెట్టు. వాటికి అర్చన చెయ్యి. అలా చెయ్యి అన్నారు. మరల గౌతముడు ఆశ్రమమునకు తిరిగి రాకుడా ఉండేవిధంగా ఉపదేశం చేశారు.

గౌతమ మహర్షి వెళ్లి అద్భుతమయిన తపస్సు ప్రారంభం చేశారు. ఒక పార్థివ లింగమును తీసుకుని పంచాక్షరీ మహామంత్రముతో తదేక నిష్ఠతో శివుణ్ణి ఆరాధన చేశారు. అలా తపస్సు చెయ్యగా శంకరుడు ప్రత్యక్షం అయి ‘నాయనా, ఎందుకింత గొప్ప తపస్సు చేశావు?” అన్నాడు. కన్నుల నీరు కారుస్తూ గౌతముడు ‘ఈశ్వరా నీకు తెలియనిది ఏముంటుంది? నేను ఆవుని చంపి మహాపాపం చేశాను. నేను చేసిన గోహత్యా పాపమును నా నుంచి తీసివేసి నేను పాపాత్ముడను కానన్న స్థితిని నాక్కు కల్పించవలసినది’ అని ప్రార్థించాడు. శంకరుడు ‘అయ్యో పిచ్చివాడా. ఇంత తపస్సు చేసి పాపమును తియ్యమని అడుగుతున్నావా? నీకు పాపం ఉన్నాడని అనుకుంటున్నావా? అసలు నీకు పాపం లేదు. నీవు గోహత్య చేశావని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు. జగత్తులో ఎవడయినా గౌతమమహర్షి అన్న పేరు పలికినా, గౌతమ మహర్షిని చూసినా వాడి పాపములు నశించిపోతాయి. నీవు అంతటి పుణ్యాత్ముడవు. నిన్ను చూడడానికి నేను వచ్చాను’ అన్నాడు. గౌతముడు ఒక్కసారి అంతర్ముఖుడై చూశాడు. సత్యం తెలిసిపోయింది. వెంటనే ఆయన కళ్ళు తెరచి శంకరుని చూసి ఆహా పరమేశ్వరా, వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు. వాళ్ళు నన్ను అలా తిట్టక పొతే నిన్ను ఇలా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఉండేవాడిని కాదు. వాళ్ళ వల్లనే కదా నాకు నీ దర్శనం అయింది. వాళ్లకు నేను ఋణపడిపోయాను అన్నాడు.

తరువాత శివుడు ‘గౌతమా! ఏదైనా వరం కోరుకో ఇస్తాను’ అన్నాడు. అపుడు గౌతముడు స్వామీ మీరు నిజంగా నన్నుకానీ అనుగ్రహించాలి అనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగను విడిచి పెట్టండి. నేను ఆంద్రదేశమునకు తీసుకువెడతాను’ అనగానే గభాలున గంగ స్త్రీరూపంలో పైనుండి క్రిందికి దూకి తెల్లటి వస్త్రములతో నిలబడింది. గౌతమునికి గంగాదర్శనం అయింది. వెంటనే ఆయన తన రెండు చేతులు ముకుళించి నన్ను నిర్మలుడిని చెయ్యి తల్లీ అన్నాడు. అపుడు ఆ తల్లి నీవు కోరుకున్నట్లుగా ఇక్కడ ఒక్కసారి నేను ఆగుతాను. నీటి రూపంలో నీ తలమీద పడతాను. అపుడు నీవు గంగా స్నానం చేసిన వాడవు అవుతావు. నీవు నిర్మలుడవు అయినట్లే. వెంటనే శివుని తలమీద వెళ్ళిపోతాను. ఇంకొకసారి భూమిమీద ప్రవహించను అన్నది. అపుడు గౌతముడు ‘అమ్మా, లోకం అంతా సుభిక్షం కావాలి. నీవు ప్రవహించాలని కదా తల్లీ నేను కోరింది అన్నాడు. అపుడు గంగ శంకరుని వంక చూసి స్వామీ, గౌతముని కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను. మీరు లింగరూపంలో ఇక్కడ వెలయండి. 33 కోట్ల దేవతలు నా ప్రవాహం ఎటువెడుతుందో అటు ఉండాలి. అంది. శివుడు తప్పకుండా అలాగే ఇక్కడ వెలుస్తాను అన్నాడు. అప్పుడు దేవతలు అమ్మా మేము మాత్రం ఏడాదికి ఒకమారు వచ్చి ఇక్కడ కూర్చుంటాము. పుష్కరములు వచ్చినప్పుడు మాత్రం ఏడాది అంతా ఉంటాము. అని గంగామాతను ప్రార్థించారు. గంగ సరే సంవత్సరమునకు ఒకరోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి అంది.

గౌతముని మీద వెడుతున్న గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారు. స్వామి ఇక్కడ త్ర్యంబకుడు అనే పేరుతో వెలశాడు. ఇది పరమశివుని అపారమయిన కారుణ్యమును, సౌలభ్యమును తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఏ మునులయితే గౌతమ మహర్షిని పో పో అని తరిమేశారో వాళ్ళందరూ గంగ క్రింద పడిందిట మనం స్నానం చేద్దాం రండి అని భార్యలతోటి, శిష్యుల తోటి, దిగుతున్నారు. గంగ వారిని చూసి ‘ఆయన పేరు మీద పుడితే మళ్ళీ అందులో స్నానం చేసి పాపములు పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా దూర్తులారా? అని అంతర్ధానం అయిపోయింది. గౌతముడు ఏడ్చాడు. ఈయన ఏడుపు చూడలేక గంగాదేవి తిరిగి వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ చక్కగా లోపలికి దిగి స్నానం చేశారు.

కొన్నిచోట్ల గౌతముడు మునులను శపించాడు అని వ్రాయబడింది. అలా చెప్తే ఈ ఆఖ్యానమునకు అర్థం ఉండదు. గౌతముడు శపించలేదు. తమ గురువుగారు ఇంత చేసినా సరే, గంగాస్నానమునకు మళ్ళీ ఏర్పాటు చేసిన అసారే స్నానం చేసి వచ్చి క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు మీకు శివభక్తి లేకుండుగాక అని శపించారు. ఆనాటి నుండి వాళ్ళు జడులై, తమ జీవితములను పాడుచేసుకుని తిరగసాగారు. ఆనాడు వెలసిన త్రయంబక లింగమే మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వరుడు అని పిలవబడుతూ గౌతమీ తటి ఒడ్డునే మనం చూస్తున్నది. ఆయన త్ర్యంబకుడు. అనగా మూడు కన్నులు కలవాడు. ఆ త్ర్యంబకుడిని చూసి ఒక్కసారి మూడు కన్నుల వాడా మహాదేవా అని ఒక్కసారి నమస్కరిస్తే చాలు మీకింత ఫలితమును ఇచ్చేస్తాడు. ఒకనది ప్రవహించేటట్లు చేసి ఆనాటి నుండి ఈనాటి మనవరకు బ్రతుకుతున్నాం అంటే ఇన్ని క్షేత్రములు వచ్చాయి అంటే మహాపురుషుడయిన గౌతముడిని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి.


విశ్వేశ్వర లింగము
వారణాసి క్షేత్రంలో వెలసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనాశ్లోకం చెప్తూ ఉంటారు.


సానందమానందవనే వసంతం, ఆనందకరం హతపాప బృందం
వారాణసీ నాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే!!

ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేని నా బలహీనతను గుర్తెరిగి, ఈశ్వరా, నీవే నన్ను నీవాడుగా స్వీకరించు’ అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే’ – ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేస్తున్నాను’ అని ప్రార్థనా శ్లోకమును ప్రారంభం చేస్తారు. సనాతన ధర్మమున జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు. అసలు కాశి నేను రాను అన్నవాడు కాని, వెళ్ళనన్నవాడు కానీ ఉండడు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనినాడు ఈ పట్టణంలోకి ప్రవేశం చేయలేడు. మొట్టమొదట ఈలోకమునకు ఉపాసనా క్రమమును నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్ట మొదట కనపడింది. వీరు సృష్టి చేయడానికి వచ్చారు. దీనినే శాస్త్రం ‘నారాయణ, నారాయణి’ అని మాట్లాడింది. ఇపుడు వాళ్ళిద్దరూ చూసి ‘నీ సంకల్పం మాకు తెలిసింది. మేము ఏమి చెయ్యాలి? అని అడిగారు.అపుడు ఆయన తపించండి’ అని చెప్పాడు. నిర్గుణం నుండి సగుణం అయిన తర్వాత ఆయన నోటి వెంట పలికిన మొట్టమొదటి మాట తపింపుడు అనేది. అప్పుడు ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగారు. అప్పుడు ప్రపంచం అంతా నీటితో నిండిపోయి ఉంది.. వెంటనే ఈశ్వరుడు పరిశీలించి ఒక పట్టణమును సృష్టించాడు. అదే వారణాసి. అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి. చావడం పుట్టడం ఇంకొకటి తెలియక చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేశాడు. ఇలా బతికేటట్లు చేయడానికి కాశి ఇప్పుడు మోక్షపురి అయింది. కాశి భోగపురి కాదు. మీరు చేసిన పాపరాశి దగ్ధం అయిపోవాలి అంటే వాడు శరీరంతో కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే వానికి ఈశ్వరుడు మోక్షం ఇస్తాడు.

ఈశ్వరుడు వ్యక్తి ఖాతాలో పడిపోయి ఉన్న కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములనే పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాడు. ఆ పట్టణంలో అడుగు పెట్టినంత మాత్రం చేత పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీ పట్టణము నందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అందుకే చచ్చిపోతే కాశీ వెళ్లి చచ్చిపోవాలన్నారు. కాశీ పట్టణానిది విచిత్రమైన స్థితి. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది. విశ్వేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికి వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. అప్పుడు ఆ వ్యక్తీ మోక్షమును పొందాలి. ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అది జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అందుకనే అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణం అయింది. ఇప్పుడు అయిదు క్రోసుల కాశీపట్టణం సిద్ధం చేసి ఇక్కడ తపించండి అన్నాడు. శ్రీహరి కూర్చుని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టిన చెమట ఆకాశంలో తెల్లటి రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడై ప్రవహించి వెడుతున్న నీళ్ళ వంక చూసి ఆశ్చర్య పోతున్నాడు. శ్రీమహావిష్ణువు శరీరమునుండి పుట్టిన తపో వ్యగ్రత చేత కలిగిన జలధార ఆయన కూర్చున్న కాశీపట్టణమును ముంచెత్తేస్తోంది. ఇప్పుడు శంకరుడు చూసి తన త్రిశూలం చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు ఆ పట్టణమునాకు త్రిశూల స్పర్శ కలిగింది. నీళ్ళలోంచి భూమి పైకి వస్తూ కనపడింది. ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలం ఒకటి జారి ఆ నీళ్ళలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే ‘మణికర్ణికా తీర్థం’ అయింది.

అప్పుడు శివుడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ‘ ఇప్పటి వరకు ఈ పట్టణమును మాత్రమే సృష్టించాను. లయం జరిగినప్పుడు ప్రళయజలములందు ఈలోకం అంతా మునిగిపోతుంది. కానీ ఈ కాశి నా త్రిశూలమునకు పైన నిలబడింది కాబట్టి ఈ పట్టణం మునగదు. ఈ కాశీపట్టణం అలాగే ఉండిపోతుంది’ అన్నాడు. కాబట్టి కాశీకి లయంలేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళాడు. ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి బ్రహ్మ వచ్చారు. వేదమును ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభం అయిన భూమి వారణాసి. ‘వారణ’ ‘అసి’ అని రెండు నదుల సంగమ క్షేత్రం వారణాసి. శంకరుని జటాజూటం మీద పడి అక్కడినుంచి క్రిందకి ప్రవహించి వచ్చిన గంగానది ఒరిపిడితో ప్రవహించిన భూమి వారణాసి.

అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థన చేశారు ‘ఈశ్వరా, ఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో మొదలయింది ఆ స్వరూపమును శ్రీ మహావిష్ణువే చూశారు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు కనుక నీవు విశ్వేశ్వర నామంతోను, విశ్వమునకు నాథుడవు గనుక విశ్వనాథుడను నామంతోను పిలవబడతావు’ అని చెప్పింది. సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసినది ఉపాసన. అందుచేత అది స్వయంభూలింగం అయింది. ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఇపుడు ఈ సృష్టి నిలబడదానికి ఆహారం అవసరము. ఇప్పుడు ఆ పని చేయడానికి అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది. తన భర్త విశ్వభర్తయై అక్కడ కూర్చుంటే అన్నపూర్ణయై తాను అంతరికీ అన్నం పెడతానని మునికాన్తలు అందరూ సంతోషపడేటట్లుగా ఆ శివశక్తి ఏ సృష్టికి హేతువయినదో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది.

భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః’ అన్నారు వాల్మీకి రామాయణంలో. శంకరుని శరీరమును తాకి క్రింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది. గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలు పెట్టి వారణాసీ క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖం అయింది. మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడివడి జీవ స్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాము. ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం, దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానమునకు వెళ్ళడం. మనం అందరూ అలానే తిరుగుతున్నాము. మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రం తిరగడం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది. గంగ కాశీలో ఉత్తరమునకు తిరిగింది. కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాం. పరమశివుడు మహాజ్ఞాని. ఆయన అనురాగమును నలుగురు చూరగొన్నారు – గౌరీదేవి, గంగాదేవి, కాశీపట్టణం, దాక్షారామం. కాశీ మోక్షపురి పెద్దలయిన వారు ముందు నడవడిని చూపిస్తే వెనకనున్న వాళ్లకి అలవాటు అవుతుంది. అందుకని వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగిన వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక ఏడురోజుల పాటు ఆయనకీ అన్నం దొరకకుండా చేశాడు. వ్యాసుడికి అక్కసు పుట్టింది. తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు. కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా! వ్యాసుడు శాపజలమును పటుకోగానే గభాలున అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి 50 సం!!ల స్త్రీ బయటకు వచ్చి “నీ మనశ్శుద్ధిని లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు. కాశీని శపిద్డామనుకున్నావా? అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు. ఒకసారి గంగానదికి వెళ్లి స్నానం చేసి మధ్యాహ్నకాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగమునకు అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా. అన్నం పెడతాను’ అన్నది. వ్యాసుడు వెళ్లి గంగాస్నానం చేసి సంధ్యావందనం, అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూర్చున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనపడలేదు. ఈవేళ కూడా మనకు భోజనం లేదు. అని అనుకుని ఆపోశన నీళ్ళు చేత్తో పట్టుకునే సరికి పొగలు కక్కుతున్న అన్నం, కూరలు భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు అన్నిటితో నెయ్యి అభిఘారం చెయ్యబడిన విస్తరి కనపడింది. వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోశనం పట్టేశారు. అమ్మవారు వచ్చి ‘మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చోనమని చెప్పింది. వారు అలాగే కూర్చున్నారు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడావిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలి పొమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్లిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అపుడు శంకరుని తీసుకు వచ్చింది. అపుడు వ్యాసుడు అమ్మవారి వంక, అయ్యవారి వంక చూశాడు. అపుడు శంకరుడు ‘వ్యాసా, నీవు ప్రాజ్ఞుడవని, ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నాచేత నిర్మింపబడి కొన్ని కోట్లమందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసీ పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు. కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో’ అన్నాడు. వ్యాసుడు అగస్త్య మహర్షితో చెప్పుకున్నాడు.

వెనక్కి తిరిగి బాధలో అయ్యో కాశీ విడిచి పెట్టి వెళ్లిపోవడమా? అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అపుడు వెనక నుంచి అమ్మవారు ‘వ్యాసా, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి. నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి. భోగము, మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి నీవు ఇక్కడనుండి దక్షారామం వెళ్ళిపో’ అంది. ఇదీ అన్నపూర్ణాతత్త్వం అంటే. అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం.


విశ్వేశ్వర లింగము


మనం కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కాలభైరవుని దర్శిస్తాము. కాలభైరవుని అనుగ్రహం ఉంటే తప్ప కాశీ పట్టణంలోకి ప్రవేశించలేము. ఈ కాలభైరవుడు ఎవరు? ఒకానొకప్పుడు బ్రహ్మగారికి అయిదు తలలు ఉండేవి. శంకరుడికి కూడా అయిదు తలలు ఉండేవి. బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. తాను ఈశ్వరుడితో సమానం అని అనుకున్నాడు. శంకరుని ధిక్కరించి మాట్లాడాడు. వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుడిని సృష్టించాడు. ఆ కాలభైరవుడు తన బొటనవ్రేలి గోటితో బ్రహ్మగారి అయిదు తలలలో ఒక తలను పువ్వును గిల్లినట్లు గిల్లేశాడు. ఆయన వారణాసి పట్టణమునకంతటికీ కాపలాదారై ఉంటాడు. కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం చాలా ఉత్తమం. కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం పూర్ణత్వమును ఇస్తుంది.

కాశీ పట్టణంలో సూర్యశక్తి ఒకచోట కేంద్రీకృతమై ఉన్నది. దీనిని లోలార్కుడు అని పిలుస్తారు. కాశీలో మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశములలో ఇది ఒకటి.

తులసీఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసీఘాట్ ఎదురుగుండా ఉన్నగోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది. ద్వాదశాదిత్యుల శక్తి ఆ చక్రం మీద ఉంది. ఎప్పుడెప్పుడు కాశీ వెడదామా అని తాపత్రయపడి కాశీ వచ్చి వెలసిన సూర్యశక్తి అక్కడ ఉన్న చక్రం మీద ఉన్నది. కనుక దానిని లోలార్కుడు అని పిలుస్తారు. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ – తులసీ ఘాట్ గోడమీద ఉన్న లోలార్కబింబమునకు, ఆ చక్రమునకు గంగాస్నానం చేసి నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది.

కాశీ పట్టణములు వారాహి కూడా రక్షిస్తుంది. రాజేంద్రప్రసాద్ ఘాట్లో స్నానం చేసి ప్రక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే అక్కడ మీకు వారాహి దేవాలయం కనపడుతుంది. వారాహి సరస్వతీ స్వరూపం. అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వ సైన్యాధిపతి. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీ పట్టణంలో తిరుగుతుంది. ఇక తెల్లవారుతుందనగా ఇంకా చీకటి ఉండగానే మరల దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీ పట్టణంలో వారాహి మూర్తి చాలా ఎత్తు ఉంటుంది. అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారు జామున బిక్కుబిక్కుమంటూ వెళతారు. అసలు అమ్మవారిని పైనుంచి క్రిందకు పూర్ణంగా చూడలేరు. అర్చకులు లోపలి వెళ్ళి తెల్లవారే లోపలే పూజ పూర్తిచేసి నైవేద్యం పెట్టేస్తారు. ఆవిడ పగటిపూట పడుకుంటుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నములుంటాయి. కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంది. మీరు పూర్ణంగా చూడలేరని, అలా చూడడానికి శక్తి సరిపోదని మిమ్మల్ని దేవాలయంలోకి పంపరు. అందుకని మీరు వారాహిని పైన కన్నంలోంచి చూడవలసి ఉంటుంది. వారాహి కదిలే తల్లి. ఆ వారాహీ దర్శనమును మీరు వారణాసీ పట్టణంలో చెస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది. వారాహి వీర్యసమృద్ధిని ఈయగాలిగిన తల్లి. కేవలం కామ్యముచేత నష్టం అయిపోకుండా ఈశ్వరానుగ్రహం వైపు బుద్ధి శక్తిని ప్రవేశపెట్టగలిగిన తల్లి.

కాశీలోని దర్శనీయ స్థలములలో ఆదికేశవుని ఆలయం. ఎన్నో విష్ణ్వాలయములు ఉన్నాయి. కానీ మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరుచుకున్న విష్ణ్వాలయమునకు ఆదికేశవాలయం అని పేరు. దానిని ప్రతివారు దర్శనం చేయాలి.

తరువాత డుంఠి గణపతిని దర్శించాలి. సాధారణంగా గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. కానీ ఒక్క కాశీ పట్టణంలో ఉన్న డుంఠి గణపతి తొండం ఎడమవైపు తిరిగి ఉంటుంది. ఎడమ వైపు తొండం తిరిగి ఉన్నవాడు కాబట్టి డుంఠి గణపతి అని పేరు. డుంఠి గణపతి దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి.

అక్కడ హరికేశుడు అనే ఒక యక్షుడు ఈశ్వరానుగ్రహం చేత ప్రమథగణములలో చేరి, ప్రమథగణములకు నాయకుడై రెండవ క్షేత్రపాలకుడిగా ఆ స్థితిని పొందాడు. ఆయన చేతిలో వెండి కట్టుతో ఉన్న బెత్తం పట్టుకుని ఉంటాడు. విభూతి పిండికట్టు పెట్టుకుని రుద్రాక్షలను సవరించుకుంటూ ఉంటాడు. పాపాత్ములకు భయంకరంగా కనపడతాడు. ఈశ్వర భక్తులకు ప్రసన్నమూర్తిగా కనపడతాడు.

కాశీవిశ్వేశ్వర క్షేత్రంలో ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మంటపం అని ఒక మంటపం ఉంది. కాశీకి సంబంధించిన చిత్రం ఏమిటంటే విశ్వేశ్వరుడి దర్శనం చేసి అక్కడే ఉన్న గంగలో ఉన్న నీళ్ళు తీసుకు వెళ్లి, ఆయన తలమీద పోసేస్తే చాలు. ఆయనకు ప్రత్యేకంగా తీసుకువెళ్ళనవసరం లేదు. మనం అక్కడి ముక్తి మంటపంలో కూర్చుని ఏదో ఒక శివకథ చెప్పుకుని వారణాసి విడిచిపెట్టాలి అని నియమం. వారణాసి ఊరికే వెళ్లి వచ్చేయడం కాదు. వీలయితే మణికర్ణికా ఘట్టంలో స్నానం చెయ్యాలి.

వారణాసి గురించి చెప్పుకున్నప్పుడు తప్పకుండా రెండింటిని గురించి ప్రస్తావన చేయవలసి ఉంటుంది. కాశీలో మనం విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేస్తాము. ఆ విశాలాక్షి దర్శనం చెయ్యకపోతే కృతఘ్నులం అయిపోతాము.

అక్కడే మహానుభావుడు శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు. కాశీవిశ్వేశ్వరుడి దేవాలయంలోంచి బయటకు వస్తే ఎడమ ప్రక్కన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలోకి లోపలికి వెళితే కుడిచేతి పక్క ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. ఆ శ్రీచక్రంతో కూడిన శివలింగమును తన చేత లలితా సహస్ర స్తోత్రమునకు భాష్యం అమ్మవారు వ్రాయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యులవారు ప్రతిష్ఠ చేశారు. దానియందు అయ్య, అమ్మ కలిసి ఉన్నారు. ఆ శివలింగం దగ్గరకు వెళ్లి నమస్కరిస్తే ఆ తల్లి ఎంతగానో పొంగిపోతుంది.

కాశ్యాంతు మరణాన్ ముక్తిః’ – కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది. ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్న స్థితిలో వెళ్ళిపోతున్న వాడు బెంగ పెట్టుకోకుండా ఉండడానికి ఒక చిత్రం జరుగుతుంది. పార్వతీదేవి అటువంటి వాని దగ్గరికి వచ్చి కూర్చుని తన పమిటతో ఆ వెళ్ళిపోతున్న వాడికి వీస్తుంది. వాడు సేదతీరి ఏ బాధలేని స్థితిని పొందుతాడు. అప్పుడు డుంఠి గణపతి వచ్చి పక్కన కూర్చుని ఊపిరి అందక కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర తడిపెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాడు. అపుడు ఆ ప్రాణి ఎంతగానో సేదతీరుతాడు. భ్రుంగి వచ్చి లలాటమునందు పెడతాడు. మంచి సువాసనలతో మారేడు వాసనలతో స్వామివారు వచ్చి నవ్వుతూ చూస్తారు. అలా వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతమునకు స్వామి కుడిచెవిలో ప్రణవమును ఉపదేశం చేస్తాడు. ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయన యందే చేరిపోతున్నాయి. మన పాపధ్వంసము చేయకలిగిన కాశీ కొన్ని కోట్ల జన్మల పాపములను నశింపజేయగలిగిన కాశీ మన భరతఖండంలో ఉంది. అది ఎన్నో ప్రాణులు ఈశ్వరునిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం. సర్వ జగత్తు లయం అయిపోతున్నా తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమపావనమయిన భూమి.

సానందమానందవనే వసంత మానందకందం హృతపాపబృందం
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే.


వైద్యనాథ లింగము
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదావసంతం గిరిజా సమేతం!
సురాసురాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి!!

‘ఓ వైద్యనాథుడా, నీకు మేము నమస్కరించుచున్నాము’ అంటారు. మనవాళ్ళు ఏది చేసినా దాని చిట్టచివరి ప్రయోజనం పరబ్రహ్మమును చేరటమే. అభిషేకంలో శివునికి ఒక నామం ఉంది. ‘ప్రథమో దైవ్యో భిషక్’. ఈశ్వరుడు ఈ లోకమునకు మొట్టమొదటి వైద్యుడు. వైద్యుడు సాధారణంగా నాది నాది అని చెప్పిన ఈ శరీరంలో మీకే తెలియకుండా ప్రవేశించిన రుగ్మతను తొలగిస్తాడు. మనకి భవరోగము అని ఒక రోగం ఉంటుంది. అంటే ఎప్పుడూ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడం. ఈ భవ రోగమునకు ప్రధాన కారణం అహంకారం. ఇటువంటి భవరోగములో పది కొట్టుకునే వాడిని పైకెత్తి తన పాదముల దగ్గరకి చేర్చుకుంటాడు. కాబట్టి కూడా ఆయన వైద్యనాథుడు. వైద్యులకు నాథుడయినవాడు లేదా వైద్యులయందు పెద్ద వైద్యుడు – రెండు కారణముల చేత ఆయనను వైద్యనాథ లింగము అని పిలుస్తారు.

ఒకానొక సమయంలో లంకా పట్టణమును రావణాసురుడు పరిపాలిస్తూ ఉండేవాడు. లంకా పట్టణం ఎప్పుడూ దక్షిణ దిక్కునే ఉంటుంది. ఊరికి దక్షిణ దిక్కున శ్మశానం ఉంటుంది. జీవన యాత్రలో చిట్టచివరి ప్రయాణం అక్కడకు వెళ్ళడంతో పూర్తయిపోతుంది. రావణాసురుడు అజ్ఞాని కాదు. వేదమును చదువుకున్న వాడు, త్రికాలముల యందు సంధ్యావందనం చేసేవాడు, లింగార్చన చేసేవాడు, ఘన జట చెప్పేవాడు. కానీ ఈ చదువు ఒక స్థాయి యందు నిజమయిన చదువు కాదు. అంత గొప్పవాడయిన రావణుడు ఒకసారి కైలాసమునకు వెళ్ళాడు. శరీరము నేను అనే అహంకారంతో ఉన్నవాడికి కైలాసాచలాధీశుని దర్శనం దొరకడం కష్టం. కానీ రావణుడు ఈశ్వరుని పట్టుకోవడానికి చాలా బింకంతో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. అనగా రజోగుణ ప్రకృతితో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. ఇటువంటి పట్టుదలతో కూడిన తపస్సు చాలా అనర్థహేతువుగా, మనిషిని పాడు చేసేదిగా ఉంటుంది. ఈ తపస్సు సాత్త్వికంగా ఉండదు. అది ఈశ్వరుడిని కదపలేక పోయింది. పరమేశ్వరుడు రాలేదు. రావణుడు చేసే తపస్సులో దోషం ఉంది. ఈశ్వరుడి మీద అలక వహించాడు రావణుడు. అందుకని తొమ్మిది తలలు కోసేసుకున్నాడు. వాటిని అగ్నిహోత్రమునందు వ్రేల్చాడు. రావణుడు చేసే తపస్సు యందు వినయము లేదు. రావణుడు తన పదవ తలను కూడా నరుక్కుందుకు సిద్ధపడ్డాడు. సరిగ్గా ఆసమయంలో శంకరుడు వచ్చాడు. ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడే సరికి రావణుని పది తలలు మరల మొలిచాయి. అపుడు శంకరుడు రావణునితో “రావణా, నీకు ఏమి కావాలి?” అని అడిగాడు. రావణుడు అపుడు తనకు విపరీతమయిన బలం కావాలి అన్నాడు. రెండవ కోరికగా శంకరుడిని వచ్చి లంకలో కూర్చోమన్నాడు. అపుడు శివుడు ‘నేను లింగమునందు ఉంటాను. నీవు దీనిని తెలివితో నీ పట్టణమునకు తీసుకువెళ్ళు’ అన్నాడు. రావణుడి ఒంటికి బలం ఉందికాని మనస్సుకి తెలివిలేదు. ఉత్తర క్షణం రావణుడి ఒంటికి బలం వచ్చింది. కానీ అతని ప్రవృత్తిలో మార్పు రాలేదు.

రావణుడు ఆ శివలింగమును పట్టుకుని లంకకు బయలుదేరాడు. పరమాత్మ వానికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. పిండాండ బ్రహ్మాండ అనుసంధానం అని ఒకటి ఉంది. ఈ శరీరమునకు ఆకలి వేస్తుంది. బ్రహ్మాండంలో లభించే ఏదో ఒక ఆహారపదార్ధం తీసుకు వెళ్లి ఈ పిండాండంలో పడెయ్యాలి. మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషమును బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండమునకు దాహం వేస్తే బ్రహ్మాండమే ఇవ్వాలి. దాహార్తిని తీర్చడమే కాకుండా ఇందులో ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉంది. ఇందులోని మలినములను పట్టుకుని ఆ నీళ్ళు బయటికి రావాలి. నీళ్ళను మరల బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి. ఇది ఈశ్వరుడు. దాహం వేయించిన వాడు ఈశ్వరుడు, నీటిని ఇచ్చిన వాడు ఈశ్వరుడు, ఈ నీటిని మరల మూత్రముగా మార్చిన వాడు ఈశ్వరుడు, బయటకు పంపిన వాడు ఈశ్వరుడు. అందువల్ల ఈశ్వరానుగ్రహం లుప్తం అయితే అవతలి వాడు పాడైపోవడానికి ఒక్క కారణం చాలు. మూత్ర విసర్జన చేయవలసిన అవసరం రావణాసురుణ్ణి పాడు చేసేసింది. శివలింగాన్ని చేతితో పట్టుకుని మూత్ర విసర్జన చేయలేడు కదా! ఎవడో ఒకటు శివలింగమును పట్టుకుంటే బాగుండుని అని అనుకుని అటూ ఇటూ చూశాడు. ఆ శివలింగం శివుడన్న భావన రావణునికి లేదు. తేలికగా చూశాడు. అక్కడి సమీపంలో గల పశువులు కాసుకునే ఒక గొల్ల పిల్లవాడిని పిలిచి నేను మూత్ర విసర్జనకు వెళ్ళి వస్తాను ఈ శివలింగమును ఒకసారి పట్టుకుని ఉండవలసినది అని అడిగాడు. పిల్లాడి చేతిలో శివలింగమును పెట్టి మూత్ర విసర్జనకు వెళ్ళాడు. అది శివుడు. రావణాసురుడికి ఎలా బుద్ధి చెప్పాలా అని చూస్తోంది. ఆ శివలింగం చాలా బరువయిపోయింది. వాడు మోయలేక కింద పెట్టేశాడు. శివుడు రావణునితో ఇది నీ పురి చేర్చు. మధ్యలో దీనిని ఎక్కడయినా క్రింద పెట్టావో అక్కడ ఉండిపోతాను’ అని ముందరే చెప్పాడు. ఇప్పుడు ఆ గొల్ల పిల్లవాడు శివలింగమును చితాభూమి మీద పెట్టేశాడు. దీనిని చూసి రావణుడు పరుగుపరుగున వచ్చాడు. అతను వెంటనే ‘ఈశ్వరా, తీసుకు వెళ్ళమన్నావు, కానీ ఆ తెలివి నాయందు నిలబడక పోవడానికి కారణం కూడా నీవే. కాబట్టి ఇప్పుడ నా బుద్ధి మార్చవలసింది అని ప్రార్థన చేయలేదు. ఇదెంత దీనిని నేను ఎత్తుకు పోతాను అని కదపడానికి ప్రయత్నించాడు. అది కదలలేదు. ఆ శివలింగమును అక్కడే వదిలేసి లంకకు వెళ్ళిపోయాడు. వానికి ఒంట్లో బలం బాగా ఉంది.

దేవతలందరూ వచ్చి రావణుడు అక్కడ వదిలి వెళ్ళిన ఆ శివలింగమునకు పూజలు చేయడం ప్రారంభించారు. రావణుడి బలం వలన చాలా ప్రమాదం రాగలదని దేవతలు భావించి దేవతలు నారదుని వద్దకు వెళ్లి రావణుడు సంపాదించిన బలం వానినే పాడుచేసేటట్లుగా చేయవలసినది అని కోరారు. నారదుడు వెళ్ళి ‘రావణా, నీవు కైలాసమునకు వెళ్ళి గొప్ప తపస్సు చేసి శంకరుడిని ప్రత్యక్షం చేసుకున్నావని ఎవరో చెప్పగా తెలిసింది. ఏమి చేశావో చెప్పవలసినది’ అని అడిగాడు. రావణుడు జరిగిన విషయం చెప్పాడు. అపుడు నారదుడు నీకు శివలింగమును ఇచ్చినట్లే ఇచ్చి దానిని నీకు కాకుండా చేసినవాడు కూడా శివుడే అయి ఉండవచ్చు కదా. దీనిని నిర్ధారించుకుందుకు నీవు ఒకసారి కైలాసమునకు వెళ్ళి నీ బలంతో కైలాసాన్ని కదిపి చూడు అప్పుడు నీకు యథార్థం తెలుస్తుంది. శంకరుడే కదిలిపోతే నీకు బలం బాగా ఉన్నట్లు. అప్పుడు ఇతరులమీదికి వెళ్ళు’ అన్నాడు. వెంటనే రావణుడికి అనుమానం వచ్చింది. ఇదేదో బాగుంది అని వెంటనే పుష్పకవిమానం ఎక్కి కైలాసపర్వతం దగ్గరకు వెళ్ళి కైలాస పర్వతమును కదపడం మొదలుపెట్టాడు. అలా కదిపేసరికి పార్వతీ పరమేశ్వరుల సింహాసనం కదులుతోంది. శంకరునికి కొంచెం కోపం వస్తే తప్ప దేవతల కార్యం నెరవేరదు. ఆయన మౌనంగా ఉంటాడేమోనని ఆ తల్లి కొంచెం చమత్కారంగా ‘మాట్లాడింది. అమ్మవారు శక్తి స్వరూపిణి. లోకమునకు అనారోగ్యం వస్తే బతికిస్తుంది. ఇప్పుడు లోకమును బతికించాలి. లోక కంటకుడిని చంపాలి. వాడు చావడానికి కారణం శివ ముఖతః రావాలి. అలా వచ్చేటట్లు ఆవిడ శివుణ్ణి మాట్లాడింది. ఆవిడ శివుణ్ణి రుద్రుడిని చేస్తుంది. రుద్రుడిని శివుడు చేస్తుంది. ఇప్పుడు లోకక్షేమం కోసం శివున్ని రుద్రుని చేస్తోంది.

అబ్బా మీరు ఎంత గొప్ప శిష్యుడిని సంపాదించుకున్నా రండీ! మీరు వరాలు ఇచ్చిన రావణుడే వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడు. ఎవరికైతే మీరు వరాలు ఇచ్చారో వాడికి ఇప్పుడు మీమీదకోపం వచ్చింది. వాడి బలానికి ఇప్పుడు మీరు నేనూ ఊగిపోతున్నాము. పాపం మీరుమాత్రం ఏం చేస్తారు లెండి?” అంది. ఆమె మాటలు వినేసరికి శివుడు రుద్రుడయ్యాడు. ఎవరు రావణుడికి బలం ఇచ్చారో ఆయనే శాపమును ఇచ్చాడు. ‘రావణా, ఇక కొద్దికాలంలో నీ మదం అణగిపోతుంది, ఇక్కడనుండి పో’ అన్నాడు. కైలాస పర్వతమును ఊపుతున్న రావణునికి ఈమాట వినపడింది. ఈశ్వరుని మాట నిజం అయింది. రావణుని పట్టుకున్న వాళ్ళందరూ నశించిపోయారు. రాముని ఆశ్రయించిన వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఈ శివ వాక్యమును ఆధారం చేసుకునే తరువాత రావణునికి శాపములన్నీ వచ్చేశాయి. చివరకు రావణుని బలం తన వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికొచ్చింది. రాముడు ఒక్కొక్క తల చొప్పున పది తలలు పడగొట్టేస్తుంటే ఆఖరున మండోదరి వచ్చి శివుడు ఏది చెప్పాడో అదే చెప్పింది. నీ ఒంటి పొగరు నిన్ను చంపింది. రాముడు నిన్ను చంపలేదు. ఏ మదం నీలో ప్రవేశించిందో అది నిన్ను చంపేసింది అని ఆవిడ చెప్పింది.

ఇది ఆనాడు చితాభూమియందు వెలసిన వైద్యనాథుడన్న జ్యోతిర్లింగం ఏది ఉన్నదో ఆ జ్యోతిర్లింగం. ఆనాటి నుండి ఈనాటి వరకు వెళ్ళి దర్శించి నమస్కరించిన వాళ్ళందరికీ ఒక అనుగ్రహమును ఇస్తోంది. ఇదే వైద్యనాథుడంటే! భవము – అంటే సంసారమునండు కొట్టుమిట్టాడుతూ, కామక్రోధముల యందు తెరిపి లేకుండా తిరుగుతూ అహంకార మమకారములలో పడి సొక్కిపోకుండా సాత్త్వికోపాసనతో కూడిన ఈశ్వర భక్తిని క్రుపచేసి భవసాగరమునుండి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఇలా ఉద్ధరిస్తే ఒకడికి ఈశ్వరుడిని చేరడానికి కోటి జన్మలు పట్టవచ్చు. ఒక్క జన్మలో, ఒక్క గంటలో ఈశ్వరుని చేరిపోయిన మహాభక్తులు ఉన్నారు. కాబట్టి ఆ వైద్యనాథుని అలా దర్శించిన వారికి అటువంటి మహానుభావుడికి నమస్కరించిన వాడికి ఆయన అనుగ్రహం కలిగితే అతి తక్కువ కాలంలో ఉపాసన దిద్దబడుతుంది. అతి తక్కువ కాలంలో సత్త్వగుణం ఆవిర్భవిస్తుంది. ఆయన అనుగ్రహం లేకుండా ఆయనను రాజస తామసిక పూజలతో లొంగదీసుకోవాలన్న భావన మంచిది కాదు.


రామేశ్వర లింగము
రామేశ్వర లింగము చాలా గొప్ప లింగము. మహాబలసంపన్నుడయిన రావణాసురుని సంహారం అంత తేలికయినది కాదు. దీనికి పరమ మంగళప్రదుడయిన శంకరుని అనుగ్రహం కావాలి. ‘ఈశ్వరా’ లంకా పట్టణమునందు ప్రవేశించి రావణుడే పది తలలతో నాకంటపడినా ధర్మము తప్పనంత సంయమనంతో కూడిన బుద్ధి నాయందు ప్రచోదనమయి యుద్ధం జరుగుగాక’ అని శ్రీరాముడు శంకరుని ప్రార్థించాడు. రాముడు ఎన్నడూ ధర్మము తప్పలేదు. శ్రీరాముడు శంభు లింగమును ఆరాధన చేశాడు. ఒక శివలింగమును పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట. అనగా రామచంద్ర మూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లుగా ప్రవర్తించాడు. తనకు ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు.

స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సలా
పాహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం!!

ఈశ్వరా, నేను నీ భక్తుడిని, దీనుడిని. ఎప్పుడయినా నానుండి కోపం బయటకు రావచ్చు. బాహ్యమునందు గొప్ప బలపరాక్రమములు గల రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. మీరు శివుడు, మంగళప్రదులు. నన్ను ఆశీర్వదించాలి. జయమును ఇవ్వాలి. కాబట్టి శంకరా నన్ను అనుగ్రహించండి అన్నాడు. అనేసరికి శంకరుడు ప్రత్యక్షం అయి శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు. శ్రీరాముడు నీవు ఇక్కడనే వసించు. ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన లింగము అనే పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది. అన్నాడు. శివుడే ఇప్పుడు శ్రీరాముడిగా వెళుతున్నాడు. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’ – లంకకు వెడుతున్న శ్రీరామునికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. ‘నీవు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు. ఇప్పుడాయన రామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. రావణుని సంహరించి తిరిగి పుష్పకవిమానంలో రామచంద్ర మూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెడుతూ కిందికి చూపించారు. ‘సీతా, ఇదిగో సేతువు. అదిగో అక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించాడు’ అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండలోని శ్లోకములలో ఈపాదం ఉంది. ఆయన శివపూజ చేశాడు అనడంలో ఏమీ సందేహం లేదు.

ఇక్కడ మనకి ఒక సందేహం కలగవచ్చు. సముద్రం దాటేముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగం ఆవిర్భవించింది అని చెప్పుకున్నాము. కానీ ఈవేళ రామేశ్వరం దీవియందున్న శివలింగమును రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాం. రెండూ ఒకటేనా? అలా అయితే స్థలపురాణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్ర మూర్తి ప్రతిష్ఠ చేయడం కోసం హనుమను కాశీ పట్టణం పంపించి విశ్వనాథ లింగము నొకదానిని తీసుకురమ్మంటే హనుమ కించిత్ ఆలస్యంగా వస్తే సీతాదేవి సైకత లింగముతయారుచేసిందని, దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారని రామేశ్వరంలో చెప్తుంటారు. పైగా అక్కడ సరస్వతీ బావి, సావిత్రీ బావి, గాయత్రీ బావి మున్నగు బావులు ఉన్నాయి. ఈ రెండు శివలింగములు ఒకటేనా? ఈవిషయమును మహానుభావుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు ‘రామాయణమునందు ధర్మ సూక్ష్మములు’ అనే గ్రంథంలో పరిష్కారం చేశారు. ఆయన ఒకమాట చెప్పారు. కూర్మపురాణంలోంచి ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ ‘యావస్సేతుశ్చతావశ్చ కాస్యాంయత్రతిరోహితః’ ‘నేను తిరోహితుడనై ఉంటాను. అందరికీ నేను కనపడను, కనపడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు. కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించాడు అని మీరు ఒక నమస్కారం చేసి ద్వీపంలోకి వెడితే అక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సీతమ్మ తల్లి చేతులతో పోగుచేయబడిన మట్టితో ఏర్పడిన శివలింగ దర్శనం అవుతుంది. వ్యాసుడు స్కాందపురాణంలో నాగర ఖండమునందు ఈ శివలింగం ప్రతిష్ఠితం చేయబడడం యథార్థమే అని చెప్పి ఉన్నాడు. కాబట్టి అది రామేశ్వర లింగమే. హనుమ కూడా శివుని అవతారమే అని శివపురాణం చెప్తుంది. హనుమ కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు. హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ అవాలి అని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యం అయితే ముహూర్తం అయిపోతుందని సీతమ్మ ప్రతిష్ఠించాలి. తన సంకల్ప ముహుర్తమై హనుమ ప్రతిష్ఠించాలీ. అందుకని ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి అక్కడ ఇసుకను ప్రోగుచేస్తే అది శివలింగం అయింది. ఇపుడు దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశాడు. దానిని రామనాథ లింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకు వచ్చిన లింగము. అది కాశీనుండి తేబడింది కాబాట్టి దానిని విశ్వనాథ లింగము అని పిలుస్తారు. ఆ బావులలో ఉండే నీటియందు ఓషధీశక్తులు ఉంటాయి. ఆ బావుల నీటితో స్నానం చేయాలి.

రామేశ్వరంలో మనం సముద్రస్నానం చేస్తాము. రామేశ్వర దర్శనం అద్భుతమయిన దర్శనం. అక్కడ రైల్వేస్టేషన్లో ఒక గొప్పతనం ఉంది. కొత్త ప్లాట్ ఫారం కట్టడం కోసమని తవ్వితే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఆ దక్షిణామూర్తిని భారతీయ రైల్వే వారు మరోచోట పెట్టకుండా రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న పెద్ద రావిచెట్టు క్రింద పెట్టారు. మీరు రైల్వేస్టేషనులోనే దక్షినామూర్తిని దర్శనం చేసుకోవచ్చు.

అక్కడే శంకరాచార్యుల వారు తీసుకు వచ్చిన శివలింగములలో ఒక శివలింగం ఉంది. అది స్ఫటికలింగం. దానిని సూర్యోదయం కాకుండా దర్శనం చెయ్యాలి. ఆ లింగం చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి స్ఫటికలింగం మరొకటి శ్రీకాళహస్తిలో ఉంది. కానీ అక్కడ విన్యాసములేవీ కనపడవు. దాని వెనకాల ఒక లైటు వెలుగుతూ ఉంటుంది. కానీ రామేశ్వరంలోని స్ఫటికలింగం అలా కాదు. తెల్లవారుజామున ఆ శివలింగమునకు అర్చకులు పూజచేస్తారు. అలా మంత్రములు చదువుతూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఎర్రని పువ్వు తెచ్చి ఆ స్ఫటిక లింగం ముందర పెడితే మొత్తం ఆ శివలింగం అంతా ఎర్రగా మారిపోతుంది. ఆ పువ్వును తీసేస్తే మరల మీకు తెల్లటి లింగం కనపడుతుంది. అదీ స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం. అనగా నిర్గుణమయిన పరబ్రహ్మము శుద్ధసత్వంతో ఉంటాడు. ఆయనయందు లోకము ప్రకాశిస్తూ ఉంటుంది.

ఎవరయినా ఈ రామేశ్వర లింగం దగ్గరకు వెళ్లి కాశీ పట్టణంలో ఉన్న గంగను తీసుకు వెళ్ళి ఆ రామేశ్వర లింగమును గంగధారలతో అభిషేకిస్తే అలా అభిషేకం చేసినవాడు కైలాసమును చేరుకుంటున్నాడు. గంగ అనగా జ్ఞానము. కాశీ గంగతో అభిషేకం చేయడం వలన ఉన్నది ఒక్కటే పదార్ధం అన్న ఎరుక లోపల బాగా నిలబడాలి. ఇది నిలబడడం రామేశ్వర దర్శనం. అది చేసిన వాడు సంసార సముద్రమును దాటి ఈశ్వరుని పొందుతున్నాడు. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమయిన క్షేత్రము రామేశ్వర క్షేత్రము.

ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్లకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది. కానీ రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపమును ఖాతాలో వేస్తారు. కాబట్టి రామేశ్వరం వెడదాం అనుకున్నాను అని అనకూడదు. ‘ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకు వెళ్లాలని ప్రార్థిస్తున్నాను’ అని అనాలి. ఆ బాధ్యతను ఆయన మీద పెట్టెయ్యాలి. అపుడు ఆయనే మిమ్మల్ని రామేశ్వరం తీసుకువెడతాడు.


నాగేశ్వర జ్యోతిర్లింగము
యామ్యే సదంగే నగరేతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై
సద్భక్తి ముక్తిప్రదమీశమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే!!

సద్భక్తిని, ముక్తిని రెండింటిని ఈయగాలిగిన నాగనాథునికి నమస్కరించుచున్నాను. ఇక్కడ నాగ నాథుడు అంటే విశేషమయిన పూజనీయుడు అని అర్థం. అటువంటి నాగనాథునికి నేను శరణాగతి చేయుచున్నాను. ఈ నాగనాథ లింగము ఎందులకు వచ్చింది? దీని ఆవిర్భావమునకు వెనకాతల ఉండే కారణం ఏమిటి? ఇక్కడ మనం ఒక విషయమును పరిశీలనం చేయాలి. శివారాధన రాక్షసులు చేస్తారు, ప్రమథగణములు చేస్తారు, మహాభక్తులు చేస్తారు, భూతప్రేతాది గణములు చేస్తాయి. శివారాధనమును జ్ఞానమును ఐశ్వర్యమును అపేక్షించేటటువంటి వారు చేస్తారు. ఆపద పోవాలనుకుంటున్న వాళ్ళు శివాభిషేకం చేస్తారు.

దారుకుడు, దారుకి వీరిద్దరూ రాక్షస దంపతులు. వారికి బోలెడంత సంతానం ఉంది. వాళ్ళు ఒకనాడు ఒక సముద్రతీరమునకు చేరారు. వీరు చాలామందిని హింసించారు. ఒకానొకప్పుడు అందరి ప్రజలని బాధపెడుతూ భగవద్భక్తుల జోలికి కూడా వెళ్ళారు. అపుడు ఆ భక్తులు ఔర్వుడు అనే మహర్షి పాదములు పట్టుకుని ఆయనను శరణాగతి చేశారు. ఔర్వుడు గొప్ప తపశ్శక్తి కలవాడు. ‘వాళ్ళు వాళ్ళ ఉద్ధతిని మార్చుకుని మంచిగా జీవితం గడిపినట్లయితే ఫరవాలేదు. వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని మార్చుకోలేము అనుకున్నప్పుడు వాళ్ళు భూమండలం మీద ఎక్కడా ఉండకూడదు. భూమండలం మీద ఎక్కడయినా రాక్షస ప్రవృత్తి కలిగినవాడు ఉన్నట్లయితే వారు ఉత్తరక్షణం మరణిస్తాడు. ఇదే నా శాపం’ అని ఔర్వుడు అభయం ఇచ్చాడు. తపశ్శక్తి కలిగిన వాడి వాక్కు బ్రహ్మాస్త్రం అయి కూర్చుంటుంది. ఈవార్త రాక్షసులకు తెలిసింది వాళ్లకి తాము బ్రతకడం ఎలా అనే బెంగపట్టుకుంది. అపుడు దారుకి ‘నేను పార్వతీదేవి గురించి ఎప్పుడో ఒకసారి తపస్సు చేశాడు. అపుడు శాంభవి నాకు ప్రక్షమయి ఒక గొప్ప వరం ఇచ్చింది. దాని వలన నేను నా వారిని ఎక్కడయినా పెట్టి బ్రతికించగలను. ఔర్వుడు మనలను భూమి మీద కదా ఉండవద్దని శాపం ఇచ్చాడు. అందుకని మనందరం సముద్రం మీద ఉందాము. ఆవిడ ఇచ్చిన తపశ్శక్తితో మిమ్మల్నందరిని నేను రక్షిస్తాను. పదండి’ అంది. దారుకి సూచనను అనుసరించి రాక్షసులందరూ సముద్రం మీద పడ్డారు. ఆ సముద్రంలో వాళ్ళు సముద్రం మీద ఓడలలో ప్రయాణించే వారిని పట్టుకుని వారిని చెరపట్టి హింసించి బాధిస్తూ ఆనందిస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు.

అక్కడ సముద్రం మీద ఓడలో వెళుతున్న వారిలో సుప్రియుడు అనబడే ఒక వైశ్యుడు ఉన్నాడు. భక్తికి కులంతో సంబంధం లేదు. రాక్షస దంపతులు సుప్రియుడిని పట్టుకున్నారు. సుప్రియుడికి దాసదాసీజనం ఉన్నారు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన ఒక్కడినీ తీసుకు వెళ్లి కారాగారంలో పెట్టారు. అపుడు ఆయన ఇవన్నీ ఉండడం, పోవడం ఈశ్వరేచ్ఛ. నాకు ఈశ్వరుడు చాలు అన్నాడు. ఆయన కారాగారంలో ఉన్న ధూళినంతా పోగేస్తే ఒక చిన్న శివలింగం అయింది. దానిమీద చుక్క నీరు పోసి పార్థివలింగం చేశాడు. ఆరాధన చేయడం ప్రారంభించాడు. అపురూ రాక్షసులు ఆరాధనకు అడ్డుపడ్డారు. నువ్వు శివారాధన చేయకూడదు, శివ అనే నామం చెప్పినా, శివున్ని ఆరాధన చేసినా, ధ్యానంలో కూర్చున్నా, భగవంతుని స్మరిస్తున్నావన్న అనుమానం ఏమాత్రం నాకు కలిగినా నీ శిరస్సు త్రుంచేస్తాను అన్నారు. అంటే ఆయన అన్నాడు – ‘నేను ఒక్కనాటికి శివారాధన మానను. నన్ను రక్షించేవాడు శంకరుడు. నా తల త్రుంచడానికి ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాని చేతిలో నీ తల త్రుంచబడుతుంది. త్రుంచకలిగిన వాడు నా తండ్రి అని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఆయన పాదములు పట్టుకున్నాను అన్నాడు. అపుడు వెంటనే రాక్షసుడు కత్తినొకదానిని తీసుకుని అపారమయిన ఉగ్రరూపంతో సుప్రియుడి కంఠమును నరికేయ్యబోయాడు. ఆ సమయమునకు సుప్రియుడు ఈశ్వరుని పరమ భక్తితో శరణాగతి చేస్తున్నాడు. రెండు చేతులతో పరమేశ్వరునికి నమస్కారం చేశాడు. అలా చేసేసరికి ఈయన ఆరాధన చేస్తున్న పార్థివలింగంలోంచి ఒక్కసారి పరమశివుడు ఆవిర్భవించాడు. రుద్రరూపంతో ఆవిర్భవించడం త్రిశూలం పెట్టి దారుకుడిని దెబ్బకొట్టడం వాడు పారిపోవడం ఆయన ఉగ్రమయిన దృష్టికి కొన్ని వందలమంది రాక్షసులు బూడిద కుప్పలై పడిపోవడం ఏకకాలమునందు జరిగిపోయాయి. చిత్రమేమిటంటే ఆ వచ్చిన పరమశివుని అర్థభాగమందు పార్వతీదేవి ఉంది. ఆవిడ గబుక్కున శివుని చేయి పట్టుకుని తనవారిని తాను రక్షించుకునే శక్తి ఇమ్మని దారుకి అడిగింది. ఆమెకు అటువంటి శక్తి కలిగేలా నేను ఆమెకు వరం ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇలా కాల్చేస్తే నా వరం ఎమవ్వాలి? ఆవిడ నాకు భక్తురాలు. మీరు నామీద ప్రేమతో ఆమెయందు అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి’ అంది.

వెంటనే శివుడు శంకరుడు అయిపోయాడు. ఒక నవ్వు నవ్వి ‘పార్వతీ నిజమే. ఆవిడకి నీవు వరం ఇచ్చావు. కానీ వాళ్ళు రాక్షసులు. నేను ఇప్పుడు వీళ్ళని విడిచిపెడితే వీళ్ళు మరల దుర్మార్గపు పనులు చేయడం మొదలుపెడతారు. కాబట్టి వీళ్ళు మరల ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసే నిమిత్తం నేను ఇక్కడే జ్యోతిర్లింగరూపంలో కూర్చుంటాను. నీవు కూడా నీవలన బతుకున్నామని వాళ్లకి గుర్తు ఉండడానికి అమ్మవారి రూపంలో ఇక్కడే కూర్చో. నేను నాగనాథుడు అనే పేరుతో వేలుస్తున్నాను. ఈశ్వరీ, నువ్వు నాగేశ్వరీ అనే పేరుతో వెలవవలసింది’ అన్నాడు. ఆవిధంగా ఇద్దరూ ఆ తటమునందు జ్యోతిర్లిన్గమై వెలిశారు. ఎవరయినా వారి దర్శనం చేస్తే వారికి జన్మ జన్మలయందు పార్వతీ పరమేశ్వరుల పాదపద్మముల యందు చెక్కుచెదరని భక్తి ప్రపత్తులు కలిగేలా అనుగ్రహిస్తాను అని స్వామి శపథం చేసి చెప్పి నాగనాథుడిగా ఆ తీరమునందు వెలసి ఉన్నాడు. కాబట్టి మనం నాగ నాథ క్షేత్రమునకు తప్పకుండా వెళ్ళాలి. మనస్సును నిగ్రహించి ఈశ్వరుని వైపు పెట్టడం అలవాటు అవడం అనే భక్తి ముహూర్తములవలన రాదు. భక్తిగా ఉండడం ఈశ్వరానుగ్రహం. భక్తి అంటే ఏమిటో సరిగ్గా తెలియడం ఈశ్వరానుగ్రహం. సరిగ్గా తెలిసన భక్తియందు మనస్సు నిలబడడం ఈశ్వరానుగ్రహం. అటువంటి అనుగ్రహమును తన దర్శనమాత్రం చేత ఇచ్చేస్తానన్నాడు నాగనాథుడు.

పూర్వం పెద్దలు మనలను తీర్థయాత్రలు చేయమని ప్రోత్సహించేవారు. తీర్థయాత్ర చేసేముందు వెడుతున్న ఆ క్షేత్రం వైశిష్ట్యం తెలియాలి. తీర్థయాత్రలు చేసినప్పుడు ఆయా క్షేత్రములకు వెళ్లినపుడు వాటిని గురించి తెలుసుకుని ఆయా క్షేత్రములలో ఏ శ్లోకమును చెప్పాలో ఆ శ్లోకమును చెప్పి ఏది మీరు భగవంతుని అడగాలో దానిని అక్కడ అడగాలి. అంతేగానీ వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చాము అనుకోవడం వలన ఉపయోగం లేదు. క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు దానికి తగిన పనిని మీరు చేసి వస్తుండాలి. ఒకవేళ అలా చేయడం తెలియకపోయినా మన అమాయకత్వం చేత ఈశ్వరుడు దానిని పరిపూర్ణం చేస్తూ ఉంటాడు. ఈశ్వరశక్తియందు అదికూడా ఉంటుంది


ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగము
ఇళాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్!
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే!!

ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషణం చెప్పబడింది. ఇంక ఆయన ఔదర్యమును ఇంత అంత అని మీరు లెక్కకట్టి చెప్పడం కుదరదు. స్వామి అంతటి ఔదార్యం ఉన్నవాడు. ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనబడే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు త్రికాల సంధ్యావందనం అలవాటయిన వాడు. నిరంతరం శివ పార్థివేశార్చనకు అలవాటు పడిన మనస్సు ఉన్నవాడు. భగవంతునియందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కాని, తనకిదిలేదని కాని, ఎన్నడు భావన చేయనివాడు. తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఆయన భార్యపేరు సుదేహ. ఆమె మహా సౌశీల్యవతి. భర్తను ధర్మమునందు నిరంతరమూ అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలాకాలం ఇలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. ఆమె బాధపడింది. అపుడు ఆయన భార్యతో “ఏమిటే నీ వెర్రి! ఎవరు ఎవరికి తల్లిదండ్రులు? ఎవరు ఎవరికి బిడ్డలు? ఎవరి స్వార్థం వారిది. అటువంటి బిడ్డలకోసం ఎందుకు నీకీ అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుని యందు పెట్టు తరిస్తావు. నీతోపాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు, సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనస్సు పెట్టు’ అని చెప్పాడు. ఈ మాటలు విన్న తరువాత ఆవిడ తన మనస్సును సర్దుకుంది. ఈవిడ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఎదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచిమాట చెప్పింది. ఆ పక్కావిడ చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అనేసింది. ఈమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. భర్త దగ్గరకు వెళ్లి చెప్పింది. అపుడు ఆయన ‘నేను ఎంత చెప్పినా నీవు బిడ్డలను గురించే ఆలోచిస్తున్నావు. మనస్సును ఈశ్వరుని వైపు మరల్చుకోలేక పోతున్నావు. బిడ్డలు కలుగక పోవడానికి దోషము నీదో, నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయమును ఈశ్వరుదినే అడుగుతాను’ అని చెప్పాడు. తరువాత ఆవిడకి చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు.

రెండు పూలదండలు తెచ్చి భగవంతుని పాదముల దగ్గర పెట్టాడు. రెండు పువ్వులు పెట్టి ఆయన శివునికి ఒక విజ్ఞాపన చేశాడు. ‘ఒకవేళ నాయందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. మాకు అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది’ అని ఈశ్వరా నీ సంకల్పమును మాకు చెప్పెయ్యాలి’ అని దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండలలో ఒకదానిని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి రెండవదండను తీసింది. అపుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలుగదు అని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని ఈశ్వరుని యందు మనస్సు పెట్టుకొనవలసిందని చెప్పాడు. అపుడు ఆవిడ అలా వీల్లేదని ‘నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు. కానే అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమెవలన మీకు సంతానం కలుగుతారు కదా! వాళ్ళు నన్ను అమా అని పిలిస్తే చాలు. అని చెప్పింది. అపుడు ఆయన ‘ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీయందు పెనుభూతమై కూర్చుంటుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోను’ అన్నాడు. అపుడు ఆవిడ చచ్చిపోతానుఅన్నంత హఠం చేసింది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు ఘృష్ణ. సంతోషంగా కాలం గడుస్తోంది. ఘృష్ణకి ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకి చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజూ నూట ఒక్క పార్థివ లింగాములకు అర్చన చేసేది. పూజ అయిన తర్వాత నూటొక్క లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది. ఇలా మూడు సంవత్సరములు ఆరాధన చేసింది. ఆవిడ చేసిన శివపూజ వలన ఆయనకు నానా అనిపించుకోగల అదృష్టం కలిగింది. మూడు సంవత్సరములలో ఆవిడ దాదాపు లక్ష శివలింగములకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భమును ధరించింది. అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ మూడు సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లవాడిని కనింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు.

ఆ పిల్లవాడికి యుక్తవయస్సు వచ్చింది. వానికి వివాహం చేశారు. వీళ్ళయితే సుదేహను గౌరవంగా చూశారు కానీ వియ్యాలవారు మాత్రం పిల్లవాని సొంతతల్లి ఎవరయితే ఉన్నదో ఆవిడకు పెద్దపీట వేశారు. దానితో కక్ష సుదేహలో కలిగింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువు అయింది. ఒక కొడుకు ఉండడమే తన చెల్లు అంత ఆదరణ పొందడానికి కారణమని తలచి ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్న తన చెల్లెలు కళ్ళవెంట నీటిధారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని భావించింది.

ఒకరోజు కొడుకు కోడలు శయనించి ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాని గదిలోకి వెళ్లి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరమును ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకు వెళ్లి తన చెల్లెలు రోజూ శివలింగములను కలిపే చోటులో నీటిలో పారవేసింది. తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుళ్ళో ధ్యానం చేసుకుందుకు నదీ తీరమునకు వెళ్ళిపోయాడు. ఈవిడ నూటొక్క లింగములకు అర్చన చేస్తోంది. పిల్ల నిద్రలేచి చూసింది. తన వంటి మీద పక్కబట్టల మీద నెత్తురు ఉంది. ఈ దృశ్యమును చూసి ఆమె గొల్లుమని ఏడుస్తోంది. సుదేహ గబగబా లోపలి వెళ్లి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఘృష్ణ ఏడవదే అని చూస్తోంది. ఘ్రుష్ణ మామూలుగా శివార్చన చేస్తోంది. ఆవిడ ఎవడు బిడ్డను ఇచ్చాడో వాడు ఆ బిడ్డకు రక్షకుడు. వాడిని ఆయన రక్షిస్తాడు. అని శివలింగాలకు పూజ చేసి తదుపరి ఆ పూజచేసిన శివలింగములను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగములు ఆ నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటంటే ఆమె ఏమీ అనలేదు. ఈ దృశ్యమును చూసి శివుడు తట్టుకోలేక పోయాడు. అదీ విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. వెంటనే అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసి పెద్దమ్మ చంపగా నీ పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఆవిడ నాయనా, నిన్ను కాపాడిన వాడు మహాకాలుడు. ఆయనే తీసుకెళ్ళ గలడు. ఆయనే బ్రతికించగలడు. ఆయన నిన్ను రక్షించాడు అంది. కానీ తల్లియైన ఘృష్ణ ‘నాయనా నీవు మాట్లాడేది తప్పు. పెద్దమ్మను అలా అనకూడదు. ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు. ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపము మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతోంది. ఇది కూడా శివుడు తట్టుకోలేక మూడు కన్నులతో త్రిశూలం పట్టుకుని ఘృష్ణా, ఈ త్రిశూలంతో నీ అక్కను పొడిచేస్తాను’ అని అన్నాడు. ఆవిడ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఎందుకేమిటి ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. కాబట్టే నీవు ఎంత ఉదారుడవో లోకానికి తెలిసింది అంది ఆవిడ. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత! నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకమునకు తెలుసు. ఈశ్వరా నీ పాదముల యందు భక్తిని నాకు కృప చెయ్యి. మా అక్కవలన కదా నాకు కొడుకు కలిగాడు. మా అక్క వలన కదా నాకు నీయందు పూనిక కలిగింది. ఈ ఔదార్యమును ఇలా అనుగ్రహించు’ అంది. ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్న అంతటి శివుడు చేష్టలుడిగి నిలబడి సరే నేను నీకు కనపడ్డాను కనుక ఏదేని ఒక కోరిక కోరుకోవలసింది అన్నాడు. ఆమె ‘అయితే ఒకటి అడుగుతాను. ఏ నీటిలో పడిపోయిన పిల్లాడిని రక్షించావో, ఏ నీటిలో రోజూ నూటొక్క లింగములు తీసుకువచ్చి కలిపానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగంగా వెలవవలసినది. నీ దగ్గరకి వచ్చి నమస్కరించిన వాళ్ళందరిని ఇలాగే కాపాడు’ అన్నది. అపుడు శివుడు ‘తప్పకుండా అలాగే చేస్తాను. నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగంగా ఉంటాను. నీపేరు మీద ఘృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను. నీవు గొప్ప భక్తురాలవు. ఇక్కడకు వచ్చినపుడు అందరూ నిన్ను తలచుకోవాలి. ఒక్కసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈశ్వరుడి ఔదార్యం ఘృష్ణవలన గుర్తురావాలి. నా ఔదార్యం ప్రకటితం అవడానికి కారణం నువ్వు. కాబట్టి నిన్ను తలచుకుని నన్ను తలచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు ఘృష్ణేశ్వరుడు’ అని ఘృష్ణేశ్వరుడై అక్కడ వెలిశాడు.

పిమ్మట శివుడు ‘ఘృష్ణా, నూటొక్క తరాలు నీవంశంలో చెప్పుకోదగిన మహా భక్తులయిన వారు కుమారులుగా జన్మించి వెడుతుంటారు. అలా నీకు వరం ఇస్తున్నాను. మీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను. ఆమె ఈవేళ నుంచి నాకు మహా భక్తురాలయిపోతుంది’ అన్నాడు. వీటన్నింటిని ఘృష్ణ అడగలేదు. కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరములను ఇచ్చేశాడు. కాబాట్టే ఈశ్వరుడిని నమ్మిన వారికి ఎన్నడూ లోటు ఉండదు.





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list