MohanPublications Print Books Online store clik Here Devullu.com

కళ్యాణవైభోగమే..! _marriage

                       కళ్యాణవైభోగమే..! 

ళ్యాణఘడియ వస్తే క్షణం కూడా ఆగదట. రానే వచ్చింది ఆ ఘడియ. పెళ్లిచూపుల అంకం ముగిసింది. ఒకరికొకరు నచ్చారు. నిశ్చయతాంబూలాల వేడుక ప్రారంభం... వెనకట్లా ఏదో ఒక చీరో నగో మాత్రమే తీసుకుని రాలేదు వియ్యాలవారు. పూలూపండ్లూ మిఠాయిలూ పసుపూకుంకుమా నగలూ చీరలూ అన్నీ ఉంచిన పళ్లేలూ/ట్రేలూ రంగుల చమ్కీలూ నెట్టెడ్‌ వస్త్రాలతో అందంగా ముస్తాబయ్యాయి. వేదిక అలంకారం సరేసరి. లగ్నాలు పెట్టుకున్నారు. శ్రీరస్తు-శుభమస్తు అంటూపెళ్లిపుస్తకానికి శ్రీకారం చుట్టారు. మూడు డిజిటల్‌ కెమెరాలూ ఆరు డ్రోన్‌ కెమెరాలతో ఆ ప్రధాన వేడుక ఆడంబరంగా జరిగింది.

శుభలేఖలు అచ్చయ్యాయి. మెహందీ వేడుకలూ మంగళస్నానాలూ ముగిశాయి. పెళ్లికూతుర్నీ పెళ్లికొడుకునీ చేసే తంతు మొదలయింది. ఇద్దరి చేతుల్లోనూ రంగురాళ్లతోనూ బొమ్మలతోనూ అలంకరించిన కొబ్బరిబోండం అందంగా మెరుస్తోంది. చుట్టపక్కాలు వచ్చి బొట్టు పెట్టి ఎనామిల్‌వర్కుతోనూ కుందన్లతోనూ మెరుస్తున్న ఓ అందమైన ప్లేటులోంచి అక్షతలు తీసుకుని వేశారు.

ముహూర్త సమయం ఆసన్నమయింది. గౌరీపూజ పూర్తయింది. మల్లెలూ గులాబీలూ లిల్లీలూ ఆర్కిడ్లూ...వంటి పువ్వులూ జాలువారే పరదాలతో అలంకరించిన పెళ్లిమండపం సినిమా సెట్టింగుని తలపిస్తూ సింగారించుకుంది. బంగారురంగు జరీతో నేసిన కంచిపట్టుచీర కట్టుకుని ఒంటినిండా రాళ్లనగల్ని పెట్టుకుని చేతిలో ఓ డిజైనర్‌ కొబ్బరిబోండంతో పుత్తడి బొమ్మలా మెరుస్తోన్న నవతరం పెళ్లికూతురు రానే వచ్చింది. అప్పటికే మండపంలో కూర్చున్న పెళ్లికొడుకుకి ఎదురుగా సీతారాముల కళ్యాణవైభోగాన్ని తలపించే చిత్రాన్ని పెయింట్‌ చేసిన అడ్డుతెర పైకి లేచింది. లేసుదారాలతో సోకులు చేసిన వెండిచెంబుతో సహధర్మచారిణి నీళ్లు పోస్తుంటే ఘనంగా అలంకరించిన వెండిపళ్లెంలో అల్లుడి కాళ్లను కడిగి కన్యాదానం చేశారు మామగారు. ముహూర్త వేళయింది... ‘ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి’ అంటూ పురోహితుడు చెప్పేదాన్ని పలుకుతూ మేళతాళాల మధ్య ఒకరి తలమీద మరొకరు చెయ్యి వేసి ఒట్టు పెట్టే జీలకర్రా బెల్లం సైతం చమ్కీలతో చమక్‌మని మెరిసింది.

తెర తొలిగింది... తాళిబొట్టు మెడలో కట్టి బొట్టు పెట్టే మంగళసూత్రధారణా ముగిసింది. సుగంధాల పూలదండలూ మార్చుకున్నారు. వధూవరులు మధుఫర్కాలు ధరించి వచ్చారు. ఒకరి దోసిలిమీద మరొకరి దోసిలిపెట్టి అందులో ఉంచిన రంగురాళ్ల కొబ్బరిచిప్పలు అతిథుల్ని చిత్తరువుల్ని చేశాయి. వధూవరులకూ అతిథులకీ అందరికీ వినోదాన్ని పంచే తలంబ్రాల తంతు యథాప్రకారం సందడి సందడిగా ముగిసింది.
ఇద్దరూ చేతులు కలుపుకుంటూ గిచ్చుకుంటూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ మెట్టెల్నీ ఉంగరాల్నీ తీసే నీళ్లబిందె సైతం అదసలు బిందేనా అన్నది ఏమాత్రం బయటకు పొక్కనీయనంతటి సింగారంతో వూగింది.ఒకరితో ఒకరి జీవితాన్ని శాశ్వతం చేస్తూ వరుడి ఉత్తరీయానికీ వధువు పమిటచెంగుకీ వేసిన బ్రహ్మముడితో వధూవరులు సప్తపదులు పూర్తిచేశాక తొక్కించే సన్నికల్లూ సోకుల వేదికయింది.

పాతివ్రత్యసిద్ధికోసం ఆకాశంలో అరుంధతీ నక్షత్రాన్నీ ఆయుష్షువృద్ధి కోసం ధృవనక్షత్రాన్నీ దర్శించుకుని, వధూవరులు పేర్లు చెప్పి ఇంట్లోకి వచ్చే వేళ ఆడబడుచులూ మరదళ్లూ ఆటపట్టిస్తూ ఇచ్చే హారతి పళ్లేలూ, వధూవరులతో పూజ చేయించే అలివేణి కుండలూ, అమ్మాయి వెంట పంపించే గరిక ముంతలూ; ఆ తరవాతి తంతుల్లోని అట్లవాయనాలూ తద్దిపేరంటాల్లో అందించే చేటలూ; కొన్ని వర్ణాల్లో కనిపించే పెళ్లికూతురి పాలగంపలూ, కాశీయాత్రలోని కావిళ్లూ చెంబులూ గొడుగులూ... సర్వం రంగురాళ్ల శోభితాలే... అందాల అలంకారాలే..!

అవునండీ... ఇప్పుడు పెళ్లికి తప్పెట్లూ తాళాలూ తలంబ్రాలూ ఉంటేనే సరిపోదు, నిశ్చితార్థం నుంచి రిసెప్షన్‌ వరకూ వాడే వస్తువులతోపాటు, పెళ్లికొడుకు తెచ్చే కంతలూ పెళ్లికూతురు తెచ్చే సారెల్లోని పళ్లేలూ/ట్రేలనీ వాటిల్లోని పండ్లూ తమలపాకులనూ కూడా డిజైన్‌ చేయించాల్సిందే. ప్రత్యేకించి ఈ వస్తువుల అలంకరణకోసమే పెళ్లిపూలజడ, పెళ్లిసంప్రదాయాలు, శ్రీరస్తుమ్యారేజ్‌ఐటమ్స్‌ వంటి వెబ్‌సైట్లూ బ్లాగులూ వచ్చాయి.

నిజానికి ఈ అలంకరణ అనేది మెహందీ, సంగీత్‌ వేడుకల మాదిరిగానే ఉత్తరాది నుంచే మన దగ్గరకొచ్చింది. అక్కడ వివాహాది శుభకార్యాల్లోనూ పండగల్లోనూ వాడే హారతిపళ్లేలూ కలశాలూ పీటలూ దీపాలూ అన్నింటినీ కూడా రంగురాళ్లతో అలంకరిస్తుంటారు. ఆ రంగులహంగులు మనకూ తెగ నచ్చేయడంతో ఇప్పుడు మన పెళ్లితంతులో కనిపించే వస్తువులన్నీ కూడా అందంగా ముస్తాబవుతున్నాయి. ఇక, పెళ్లికార్లూ పల్లకీల పూల అలంకరణ ముందునుంచీ ఉన్నదే. ముఖ్యంగా వీడియోలూ ఫొటోషూట్లూ సోషల్‌ నెట్‌వర్కుల్లో అప్‌లోడింగులూ పెరిగిపోవడంతో పెళ్లి తంతులోని ప్రధాన పాత్రధారులైన వధూవరులతోపాటు అందులో కనిపించే ప్రతీ వస్తువూ ప్రత్యేకంగానూ ఆడంబరంగానూ కనిపించాలనుకుంటున్నారు. అందుకే ఈనాటి కల్యాణం...ఓ అలంకరణ వైభోగం..!

No comments:

Post a comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list