MohanPublications Print Books Online store clik Here Devullu.com

మార్గశిర లక్ష్మీవారాల వ్రతం_Margasira Laksmivarala vratam

ఐశ్వర్యాన్నిచ్చే 

ఐదువారాల అద్భుత వ్రతం

మార్గశిర లక్ష్మీవారాలు వ్రతం



    హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీకళతో లోగిళ్లన్నీ కళకళలాడినట్టే. ఎటు విన్నా ‘లక్ష్మీ నమస్తుభ్యం...’ ఎటు చూసినా ‘నమస్తేస్తు మహామాయే...’ అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వీనుల విందుగా వినిపిస్తూ, నయనారవిందంచేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికీ మక్కువైనదే! నిన్న అంటే డిసెంబర్ 3, మంగళవారంతో మొదలైన మార్గశిరమాసం జనవరి 1, బుధవారంతో ముగియనుంది. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు తనను నియమనిష్ఠలతో కొలిచినవారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనకమహాలక్ష్మి. మార్గశిరమాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీవైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపథమై విరాజిల్లుతుంది. ఆ వ్రతవిధానం అందరి కోసం...

 లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు, లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం.
 ఐదువారాల అద్భుత వ్రతం...
 మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి.

 వ్రతవిధానం: ముందుగా ప్రాతఃకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం’ అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూరనీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి. ‘ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’ అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి.

  అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి.  చివరగా క్షమాప్రార్థన చేయాలి.
 అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాతమైంది. కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. రెండవవారం  క్షీరాన్నం (పరమాన్నం), మూడోవారం అట్లు, తిమ్మనం, నాలుగోవారం గారెలు, అప్పాలు నైవేద్యం పెట్టాలి. ఐదోవారం నాడు అమ్మవారికి  పూర్ణం బూరెలను నివేదించాలి. ఆ రోజు ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. మంగళగౌరీవ్రతంలాగ పూజపూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లోసౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ.

 నియమనిష్ఠలు కీలకం
 గురువార వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచేస్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య నిదురపోకూడదు. కల్లలాడకూడదు. నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్యదేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది.

 ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజూ లక్ష్మిని పూజిస్తే విష్ణుసతి దీవెనలతో పదికాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీప్రసన్నంగా మార్చుకోవచ్చు.
 - డి.వి.ఆర్.భాస్కర్

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list