MohanPublications Print Books Online store clik Here Devullu.com

Group-2 Notifactions-Government Job Notifications

గ్రూప్‌-2 సాధనకు శ్రీకారం!

ఎంతోకాలంగా ఎదురుచూసిన ఏపీపీఎస్‌సీ గ్రూపు-2 నోటిఫికేషన్‌ 982 పోస్టులతో విడుదలయింది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులూ పెద్దసంఖ్యలో దీనికి దరఖాస్తు చేస్తారని అంచనా. కొత్త ఏడాదిలో ఫిబ్రవరి 26న స్క్రీనింగ్‌ పరీక్షా, మే 20న మెయిన్‌ పరీక్షా నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఈ ఏడాది డిసెంబరు 10లోపు దరఖాస్తు చేసుకోవాల్సివుంది!
ప్రకటించినవాటిలో 442 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, 540 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. కీలకమైన డెప్యూటీ తహసీల్దార్‌ పోస్టులు 253, అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌ పోస్టులు 96 ఉండటం విశేషం. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులలో ట్రెజరీ శాఖకు చెందిన సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు 158 ఉండటం గమనించాల్సిన విషయం. 
ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌కి మాత్రం 1-7-16 నాటికి 18-28 సం॥ మధ్య వయసు ఉండాలి. మిగతా పోస్టులు అన్నిటికీ వయః పరిమితిని 18-42 సం॥గా పేర్కొన్నారు. ఏపీ రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన సబ్‌ రిజిస్ట్రార్‌కు మాత్రం 20-42 సంవత్సరాలుగా పేర్కొన్నారు. 
అన్ని పోస్టులకూ కనీస అర్హతగా డిగ్రీని నిర్ణయించారు. 1-7-16 నాటికి సంబంధిత విద్యార్హతలలో ఉత్తీర్ణులై ఉండాలి. అయితే సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టుకు న్యాయ పట్టభద్రులు అయినవారికి ప్రాధాన్యం ఉంటుంది. హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ శాఖకు చెందిన అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌కి టెక్స్‌టైల్‌ టెక్నాలజీ/హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీలో డిప్లొమా ఉన్నవారికి కూడా సాధారణ డిగ్రీ లేకపోయినా అవకాశం కల్పించారు. 
ట్రెజరీ శాఖకు చెందిన సీనియర్‌ అకౌంటెంట్‌ కొలువులకు మాత్రం (a)ఆఫీస్‌ అటోమేషన్‌ (b)పీసీ మెయింటనెన్స్‌- ట్రబుల్‌ షూటింగ్‌ (c)వెబ్‌ డిజైనింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సు అవసరం. ఇది సాధారణ డిగ్రీకి అదనం. లేదా బీసీఏ, బీఎస్‌సీ (కంప్యూటర్స్‌), బీఏ (కంప్యూటర్స్‌), బీ టెక్‌, బీఈలలో కంప్యూటర్‌ సైన్స్‌ ఉత్తీర్ణత కలిగినవారు అర్హులుగా పేర్కొన్నారు.
ట్రెజరీ శాఖకు చెందిన జూనియర్‌ అకౌంటెంట్‌కు ఎకనామిక్స్‌/కామర్స్‌/గణితం సబ్జెక్టులుగా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. పైన చెప్పినవిధంగా సర్టిఫికెట్‌ కోర్సులో ఉత్తీర్ణత అదనంగా ఉండాలి లేదా బీసీఏ, బీఎస్‌సీ, బీఏ, బీ టెక్‌, బీఈలలో కంప్యూటర్‌ సైన్స్‌ ఉత్తీర్ణులై వుండాలి. 
ప్రొహిబిషన్‌- ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుకి మాత్రం విద్యార్హతతో పాటు శారీరక అర్హతలు కూడా అదనం. 
గమనిక: దివ్యాంగులకు 10 సం॥, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు 5 సం॥, ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ఠంగా 5 సం॥, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు గరిష్ఠంగా 3 సం॥ వయః పరిమితి సడలింపు ఇస్తారు.
పోస్టుల ప్రాధాన్యక్రమం

గ్రూప్‌-2 పోస్టుల్ని ఎంపిక చేసుకునేందుకు జీతభత్యాలు, సామాజిక గుర్తింపు, పదోన్నతులు మొదలైన ప్రమాణాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. క్షేత్రస్థాయి ఒత్తిళ్ళకు దూరంగా ప్రశాంత జీవనం గడపాలనుకునేవారు సచివాలయం, కమిషనరేట్లు, డైరెక్టరేట్ల పోస్టులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. 
* మునిసిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌-3) ఉద్యోగానికి మిగతా పోస్టులకంటే జీతభత్యాలు ఎక్కువ. క్షేత్రస్థాయి ఒత్తిళ్ళు కూడా చాలా ఎక్కువ. బదిలీలు బాగా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉద్యోగానికి ఎంపికైతే పదవీవిరమణ నాటికి మునిసిపల్‌ కమిషనర్‌ (సెలక్షన్‌ గ్రేడ్‌) వరకూ పదోన్నతులు పొందవచ్చు. మిగతా సామాజిక వర్గాలకు గ్రేడ్‌-1 వరకూ పదోన్నతి అవకాశాలున్నాయి. 
* సంఖ్యరీత్యా కూడా ఈ నోటిఫికేషన్లో డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులు ఎక్కువ. వీటికి పని ఒత్తిడి ఎక్కువ. వికేంద్రీకరణ పెరుగుతున్న నేపథ్యంలో సత్వర పదోన్నతులు పొందే అవకాశం ఉంది. పదవీ విరమణ నాటికి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు డెప్యూటీ కలెక్టర్‌ పై స్థాయి పదోన్నతి పొందవచ్చు. మిగతా అభ్యర్థులు కష్టమ్మీద డెప్యూటీ కలెక్టర్‌ వరకూ పదోన్నతి పొందవచ్చు. 
గమనిక: అభిరుచిని బట్టి ఈ రెండు పోస్టుల్లో దేన్నయినా ప్రథమ ప్రాధాన్యంలో ఎంపిక చేసుకోవచ్చు.
* ఏసీటీవోగా క్షేత్రస్థాయి ఒత్తిడి తక్కువే. అదేవిధంగా సబ్‌ రిజిస్ట్రార్‌కి కూడా క్షేత్ర విధుల కంటే కార్యాలయ పనే ఎక్కువ. కాస్త ఒత్తిడికి తట్టుకోలేనివారు, ఇతర సమస్యలు ఉన్నవారు ఈ రెంటిలో దేన్నయినా తదుపరి ప్రాధాన్యాల్లో ఎంపిక చేసుకోవచ్చు. 
ఏసీటీఓ స్థాయి నుంచి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయికి పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఇతరులు సీటీఓగా పదవీ విరమణ చేయవచ్చు. సబ్‌ రిజిస్ట్రార్‌గా ఎంపికైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు డీఐజీ స్థాయి వరకూ పదోన్నతి పొందవచ్చు. ఇతరులు డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌గా పదవీ విరమణ చేసే అవకాశం ఉంటుంది. 
* తదుపరి స్థానంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌కి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. క్షేత్ర ఒత్తిడి పెద్దగా లేకపోయినా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా వ్యవహరించాల్సిన కొన్ని వర్గాల వల్ల ఇతర ఒత్తిడి అధికమే. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి వరకూ ఎదిగే వీలుంటుంది. ఇతరులు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ వరకూ పదోన్నతులు పొందవచ్చు.
* అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌... తర్వాత ప్రాధాన్యం ఇవ్వగలిగినది. పదోన్నతులు ఆశాజనకంగా ఉండవు. 
* తర్వాతి స్థానంలో ఈవో (పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ) ఇవ్వొచ్చు. పని ఒత్తిడి ఎక్కువ. పదోన్నతులు అంతంత మాత్రమే. ఎంపీడీఓగా పదవీ విరమణ చేయవచ్చు. 
* హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ ఏడీఓ ఉద్యోగంలో ఒత్తిడి తక్కువే. 
* నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల్లో స్థిర జీవనం కోసం అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈఓ (పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ), ఏడీఓ ఉద్యోగాలకంటే ఇవి ఆకర్షణీయమైన ఉద్యోగాలు. 
* సీనియర్‌ (అకౌంటెంట్‌), ట్రెజరీ శాఖ పదోన్నతుల దృష్ట్యా తదుపరి స్థానాల్లో ప్రాధాన్యం ఇవ్వదగినదే. 
* జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, రెవిన్యూ సంబంధిత శాఖల్లో ఉన్నవాటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. తదుపరి వాటికి అనంతర ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

వన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌)
ఏపీపీఎస్‌సీ పరీక్షలు రాసేందుకు తప్పనిసరిగా అభ్యర్థులు తమ ప్రొఫైల్‌ను www.pscap.gov.inసైట్‌లో నింపవలసి ఉంటుంది. ఓటీపీఆర్‌ దరఖాస్తును పూర్తిగా నింపి, ‘సేవ్‌’ చేసిన తరువాత సైట్‌ నుంచి లభించే రిఫరెన్స్‌ ఐడీ భవిష్యత్‌లో ఏపీపీఎస్‌సీ పరీక్ష రాసేందుకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఓటీపీఆర్‌ ఐడీని పొందేందుకు మూడు రకాలైన అవకాశాలు ఈ సైట్‌లో లభిస్తున్నాయి. 
* మొదటిసారి రిజిస్ట్రేషన్‌ * చేసిన రిజిస్ట్రేషన్‌ సవరించుకోవటం * రిజిస్ట్రేషన్‌ని నిర్ధారించటం 
మొదటిసారి రిజిస్ట్రేషన్‌ చేసుకొనే అభ్యర్ధులు కింది అంశాల్ని పరిగణించి సిద్ధపడాలి. 
1 ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి. 
2 10వ తరగతి సర్టిఫికెట్‌లోని పేరు, జన్మతేదీలనే ఉపయోగించాలి. 
3 గుర్తింపు చిహ్నాలుగా 10వ తరగతి సర్టిఫికెట్‌లో పేర్కొన్న చిహ్నాల్నే పేర్కొనటం సబబు 
4 వయసు సడలింపు, ఫీజు మినహాయింపు, కులం, స్థానికత లాంటి అంశాలు ఓటీపీఆర్‌లో నింపితేనే తర్వాత పరీక్షల దరఖాస్తు పూర్తిచేసే అవకాశం; లబ్ధిపొందే వీలూ ఉంటాయి. అందువల్ల తగిన జాగ్రత్తలతో వాటిని నింపాల్సిన బాధ్యత అభ్యర్ధులదే. 
5 ఈ-మెయిల్‌, మొబైల్‌ నంబర్లు నింపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికే పరీక్షల సమాచారం అంతా పంపిస్తారు. 
6 తెలంగాణ స్థానికత కలిగి ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడుతున్నవారు 13 జిల్లాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. అప్పుడే వారికి జోనల్‌, జిల్లా స్థానికత వచ్చే అవకాశం ఉంటుంది. 
7 సైట్‌లో అభ్యర్థి విద్యార్హతల్ని నింపేటప్పుడు, సైట్‌లో పేర్కొని అర్హతలు ఉన్నట్లయితే వాటిని నమోదు చేసేందుకు కూడా అవకాశం ఉంది. 
8 గ్రూపు-2 పరీక్షలను హైదరాబాద్‌లో కూడా నిర్వహించే అవకాశం వుంది కాబట్టి ఆ కేంద్రాన్ని కూడా పెట్టుకోవచ్చు. 
9అంశాలు అన్నింటినీ నింపిన తరువాత ‘ప్రివ్యూ’ (Previw) అవకాశం వుంది. దాని ద్వారా నింపినవన్నీ ఒకసారి పరిశీలించి సేవ్‌ చేసుకోవటం అవసరం. 
10 వివిధ పరీక్షలు ఉత్తీర్ణత అయిన తేదీ దగ్గర సంవత్సరం, నెల ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. తేదీ అక్కర్లేదు 
11 ఓటీపీఆర్‌కి సిద్ధపడేముందే ఫోటోని అప్‌లోడ్‌ చేసేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాప్‌, కళ్ళజోడు వంటివి పెట్టకుండా ఫోటో దిగాలి. కలర్‌/నలుపు, తెలుపు ఫోటో అయినా ఫర్వాలేదు. ఫోటోపైన అభ్యర్థి పేరు, ఫోటో దిగిన తేదీ ముద్రితమై వుండాలి. పోలరాయిడ్‌ ఫోటోలు పనికిరావు. ఫోటోని స్కాన్‌ చేసేటప్పుడు తప్పనిసరిగా JPEG, JPG ఫార్మాట్‌లో వుండేలా జాగ్రత్త తీసుకొవాలి. 50kbకి మించకుండా 3.5×4.5cmలోపు స్కాన్‌ చేసిన ఫోటో ఉండేలా చర్యలు తీసుకోవాలి. 
12 అభ్యర్థి తన సంతకాన్ని ఒక తెల్లకాగితంపై పెట్టి స్కాన్‌ చెయ్యాలి. JPEG/JPG ఫార్మాట్‌, 30kbకి మించకుండా, 3.5×1.5cm నిడివి కలిగివుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
13రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అంశాల్ని సవరించే అవకాశం ఉంది. అందుకోసం మోడిఫై (modify)రిజిస్ట్రేషన్‌ లింక్‌ని ఉపయోగించుకోవచ్చు. 
14 రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరించే (Confirm Registration)లింక్‌ ద్వారా అభ్యర్థి ధ్రువీకరిస్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగిసినట్లు. పై ఏ రెండు దశల్లో అభ్యర్థి ఆగిపోయినా రిజిస్ట్రేషన్‌ పూర్తి కానట్లే, అందుకే అప్రమత్తంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list