కేదారేశ్వర వ్రతం PDF
కార్తీక పౌర్ణమి విశిష్టత
కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అంటే కార్తీక మాసంలో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి. ఇందులో భాగంగా మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం.
శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలే......స్మిన్ సన్నిధింకురు||
ప్రధానంగా కార్తీక పౌర్ణమినాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.
కేదారేశ్వర వ్రతం
చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుందని పురోహితులు చెబుతున్నారు. ఆది దంపతులకు ఇష్టమైన ఈ వ్రతాన్ని ఎలా పాటించాలంటే కేదారేశ్వర వ్రతంలో 21వ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత వుంది.
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథ నాథం సదానంద భాజాం
భవద్దివ్య భూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభుమీశానమీడే
ఓం నమః శివాయ
భక్త జన రక్షక
పాహిమాం పాహిమాం- అంటూ ముక్కంటి స్తుతించుకుని కేదారవత్రాన్ని ప్రారంభించాలి.
21 పేటల పట్టు లేక నూలుదారాన్ని తోరంగా ధరించాలి. 21 మంది ద్విజులను పూజించిన తర్వాత కలశం/ప్రతిమలోకి కేదారేశుని ఆవాహనం చేయాలి. పూజలో గోధుమపిండితో చేసిన 21 అరిసెలు పాలు, పెరుగు, నెయ్యి, పాయసాలతో పాటు 21 రకాల ఫలాలను, కూరలను నైవేద్యంగా సమర్పించాలి. తప్పనిసరిగా తేనె ఉండాలి. ఈ వ్రతంలో 21వ సంఖ్యకు ప్రాముఖ్యత ఎందుకంటే శిశువు పుట్టినప్పుడు ఏక విశంతి (21) దోషాలుంటాయి. కేదారుని పూజించడం వల్ల ఈ దోషాలు నశిస్తాయి. మనం సమర్పించే నైవేద్య వస్తువులలో 21 దోషాలకు ఒక్కొక్కటి చొప్పున సమర్పణ చేస్తున్నాం. అరిసెలను గోధుమలతో చేయడంలో కూడ ఒక ఆరోగ్య-జ్యోతిష్య రహస్యం ఉంది. గోధుమలు సూర్యునికి ప్రీతికరమైన ధాన్యం. సూర్యుడు మనకు ఆయువునిచ్చేవానిగా జ్యోతిష్యం పేర్కొంది. సూర్యుడు అగ్ని స్వరూపంలో శివుని మూడోకన్నులో కాలాగ్ని రూపంలో దాగివున్నాడు. అనగా, కేదారేశుని పూజించడం వల్ల పరోక్షంగా సూర్యునిని కూడా ఆరాధించిన వాళ్ళవుతున్నాం.
పాలు-పెరుగుతో శుక్రుని, తేనెతో గురువును, నెయ్యితో శనీశ్వరుని, కూరలతో చంద్రుని. ఫలాలతో బుధుని, బ్రాహ్మణుల ఉపచారంతో కుజుని సేవించిన ఫలం ఈ వ్రతాన్ని చేయడం వల్ల లభిస్తుంది. కేదారేశ్వరుని పూజించడం వల్ల మొత్తం నవగ్రహాలను పూజించిన ఫలం దక్కుతుంది. సంఖ్యాపరంగా 21కి ఏక సంఖ్య చేసినట్లైతే (2+1=3) మూడు వస్తుంది. ఈ మూడు అనేది త్రిమూర్తి మత్వానికి సంకేతం. అందుకే ఈ వ్రతంలో 21వ సంఖ్యకు అంతటి ప్రాముఖ్యతని పురోహితులు చెబుతున్నారు. ఈ వ్రతాన్ని ఏకధాటిగా 21 సంవత్సరాల పాటు నిర్వహించి 21వ సంవత్సరపు పూజాంతంలో ఉద్యాపనం (ముగింపు) చెప్పుకోవాలి. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.
శ్రీ కేదారేశ్వర వ్రత కథ
పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతాన్ని గురించి చెబుతాను శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పారు. శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చునియున్నాడు. సిద్ధ-సాధ్య- కింపురుష-యక్ష-గంధర్వులు శివుణ్ణి సేవిస్తున్నారుదేవముని గణములు శివుని స్తుతిస్తున్నారు. ఋషులు-మునులు-అగ్ని--వాయువు-వరుణుడు-సూర్యచంద్రులు-తారలు-గ్రహాలు-ప్రమదగణాలు-కుమారస్వామి-వినాయకుడు-వీరభద్రుడు-నందీశ్వరుడు సభలో ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల-సాల-తమలా-వకుళ-నరికేళ-చందన-పనస-జంభూ వృక్షములతోను చంపక-పున్నాగ-పారిజాతాది పుష్పాలతోను మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నదపరతములతోను చతుర్ధశభువనాలు పులకిస్తున్నాయి.అలాంటి ఆనందకోలాహలములలో ''భృంగురిటి'' అనబడే శివభక్త శ్రేష్టుడు ఆనందపులకితుడై నాట్యం చేయసాగాడు. అతడు వినోద సంభరితములైన నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పిస్తూ ఉన్నాడు. శివుడు అతనిని అభినందించి సింహాసనంపైన వున్న పార్వతిని వీడి సింహాసనమునుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనులో భృంగి మొదలైన వందిమాగాదులు శివునికి ప్రదక్షిణంచేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీ భర్తను చేరి "నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇలా ఎలా చేశార''ని ప్రశ్నించింది. అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని "దేవీ! పరమార్ధ విదులైన యోగులు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించార''ని జవాబిచ్చాడు.
సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినైయుండి ఆ దండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమైన యోగ్యతను ఆర్జించటం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది. కైలాసాన్ని వదలి... శరభ శార్దూల గజములుగల నాగ గరుడ చకవాక పక్షసముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొనిన్న సస్యశ్యామలమైనటువంటి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిధి మర్యాదలు చేసి "తల్లీ నీవెవరివి ఎవరిదానవు ఎక్కడనుండి వచ్చివు నీరాకకు గల అగత్యమేమిటి?" అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వాతి మిక్కిలి ఆనందించినదై "యఙ్ఞయాగాది క్రతువులచే పునీతమైన గౌతమముని ఆశ్రమంలో నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమైన యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను'' అని చెప్పింది పార్వతి." మహర్షులారా! జగత్కళ్యాణాభిలాషులారా! నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అర్ధాంగినై తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతి వారిని కోరుకుంది. అందుకు గౌతముడు "పార్వతీ! ఈప్సితార్ధదాయకమైన ఉత్తమ వ్రతం ఒకటి ఉంది. అది కేదారేశ్వర వ్రతం. నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసింది'' అన్నాడు గౌతముడు.
వ్రతవిధానాన్ని వివరించమని పార్వతి గౌతముడ్ని కోరింది. "జగజ్జననీ ఈ వ్రతాన్ని భాద్రపదమాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి. ఆరోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములైన ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవాళి. ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజునుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించాలి. యింకా ధాన్యరాశినిపోసి అందులో పూర్ణకుంభాన్ని వుంచి ఇరవై ఒక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమునుగాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య-భోజ్య, నైవేద్యాదులు కదళీఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూలదక్షిణలిచ్చి వారిని తృప్తి పరచాలి. ఈ విధంగా వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేచేస్తాడ''ని గౌతముడు పార్వతికి వివరించాడు.
గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తనమేనులో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు. అప్పుడు జగదాంబ సంతుష్టాంతరంగయై భర్తతో నిజనివాసమైన కైలాసానికి చేరుకుంది.
కొంతకాలానికి శివభక్తపరాయుణడైన చిత్రాంగదుడ అనే గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వరవ్రతాన్ని దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకానికి దానిని వెల్లడిచేయగోరి దివినుండి భువికి చేరుకొని ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తరువాత ఉజ్జయినీ నగరంలో గల వైశ్యుడికి పుణ్యవతి, భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ఒకరోజు తండ్రిని చేరి "జనకా మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతి యివ్వండి'' అని అడిగారు. అందుకు అతను "బిడ్డలారా! నేను దరిద్రుడను. సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరా ఆలోచనను మానుకోండ''ని పలికాడు. అందుకా వైశ్యపుత్రికలు "నీ ఆఙ్ఞయే మాకు ధనము అనుమతిని యివ్వవలసింద''ని కోరుకున్నారు.
వారిద్దరూ ఒక వటవృక్షంక్రింద కూర్చుని తోరముకట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు, సుందర రూపాలను ప్రసాదించి అంతర్థానమయ్యాడు. ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్యసోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియైన వైశ్యుడు ధనదాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త ఆమెను, కుమారుడ్ని రాజ్యము నుండి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది.
ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చెంతకు పిలిచి "నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్జించి తీసుకొని" రావలసిందని చెప్పిపంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది. అతడు తిరిగివస్తుండగా మార్గమధ్యలో మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత దనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యలో చోరురూపుడైన శివుడాసొమ్మును తీసుకొనిపోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు .. "ఓయి! నీవు ఎన్నిసార్లు నీపెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారవ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కద''ని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీమార్భలంతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్యసంపదలతో జీవిస్తున్నది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565