MohanPublications Print Books Online store clik Here Devullu.com

MOHAN PUBLICATIONS Price List

ధృవ పాటలు_Druva songs

పల్లవి: అతడే తన సైన్యం 
అతడే తన ధైర్యం 
తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం 
తన మార్గం యుద్ధం..  
తన గమ్యం శాంతం 
పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం ధృవ.. ధృవ.. 
చరణం: చెడునంతం చేసే స్వార్థమే ధృవ 
విధినణచే విధ్వంసం ధృవ 
విద్రోహం పాలిట ద్రోహమే ధృవ 
వెలుగిచ్చే విస్ఫోటం ధృవ 
చరణం: ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై  
కలబోసుకున్న తేజం ధృవ 
చాణక్యుడితడు మరి చంద్రగుప్తుడితడై  
చెలరేగుతున్న నైజం ధృవ 
నిదురించని అంకితభావమే ధృవ 
నడిచొచ్చే నక్షత్రం ధృవ 
శిక్షించే ఓ క్రమశిక్షణే ధృవ 
రక్షించే రాజ్యాంగం ధృవ 
చిత్రం: ధృవ 
రచన: చంద్రబోస్‌ 
గానం: అమిత్‌ మిశ్రా 
సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ 


ఆ ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం 
కథానాయకుడి పరిచయ గీతాల్ని రాయడంలో చంద్రబోస్‌ కలం పరుగులు పెడుతుంది. ఆ తరహా పాటలకి చాలా లక్ష్యాలుంటాయి. సందర్భానికి తగినట్టు ఉండడంతో పాటు, కథానాయకుడి ఇమేజ్‌, హీరోయిజం కూడా పాటలో ప్రతిబింబించాల్సి ఉంటుంది. ‘ధృవ’ పాట విషయంలోనూ అదే ప్రయత్నం చేశారు. ఆ పాట ప్రయాణం గురించి చంద్రబోస్‌ ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘ఒక మంచి భావాన్ని మంచి భాషతో వ్యక్తపరిస్తే అది చిరస్థాయిగా నిలిచిపోతుందని నా నమ్మకం. నా పాట ప్రజల నోళ్లల్లో నానడంతో పాటు, దానికి సాహిత్యపరంగా కూడా స్థానం లభించాలన్న అభిలాష ఉంటుంది. ప్రస్తుతం మన వ్యవహారిక భాషలోకి పరభాష పదాలు చొచ్చుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ గంభీరమైన భాషనీ, ఒక స్థాయి కలిగిన భాషని ఉపయోగించడం ధైర్యమే. ఆ ప్రయత్నం చేస్తున్న నాకు సరైన గుర్తింపే లభించింది. డెబ్బైకి పైగా కథానాయకుడి పరిచయ గీతాల్ని రాశా. సందర్భాన్ని, కథానాయకుల తాలూకు ఇమేజ్‌నే కాకుండా, ఆ పాటలతో నాలోని రచయితని కూడా కొత్తగా ఆవిష్కరించుకోవల్సి ఉంటుంది. ‘ధృవ’ టైటిల్‌ గీతంతోనూ నాలోని రచయితని నేను కొత్తగా దర్శించుకొనే అవకాశం లభించింది. సినిమాలో ఈ పాట వచ్చే సందర్భం గురించి దర్శకుడు సురేందర్‌రెడ్డి ఫ్లైట్‌లో చెప్పాడు. ఆయన చెబుతున్నప్పుడే నేను ఆరు పేజీల నోట్స్‌ రాసుకొన్నా. అంత మంచి సందర్భమది. మదిలో ఎన్నో భావాలు మెదిలాయి. ఆ భావాలన్నీ నా పాటలో వినిపించాల్సిందే అని కలం చేతపట్టా. పల్లవిలోనే కథానాయకుడి పాత్ర తీరుతెన్నులు స్ఫురించేలా ‘అతడే తన సైన్యం... అతడే తన ధైర్యం... తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం’ అని రాశా. కథానాయకుడికి స్వార్థం ఉంది కానీ, అది చెడుని అంతం చేసే స్వార్థం అనీ... చెడు చేయాలని చూసే విధిని సైతం అణచివేసే విధ్వంసం ఆయనదనీ చరణంలో చెప్పే ప్రయత్నం చేశా. నిజాయతీకి మారుపేరైన ధర్మరాజు, సమయపాలనకు ప్రతీకైన యమధర్మరాజు ఒక్కడైన తేజమే అతననీ... బుద్ధి కుశలత ప్రతిరూపమైన చాణక్యుడు, భుజబలానికి పెట్టింది పేరైన చంద్రగుప్తుడులా మారితే ఇక తిరుగులేదనే విషయాన్ని రెండో చరణంలోని వాక్యాలు చెబుతాయి. ‘శిక్షించే ఓ క్రమశిక్షణే ధృవ, రక్షించే రాజ్యాంగం ధృవ’ అనే పంక్తులు రచయితగా నాకు ఎంతో సంతోషాన్నిచ్చాయి. ప్రజాసేవకి అంకితమైన ఓ పోలీసు అధికారి అంతరంగ భావాల్ని ఈ పాటలో చెప్పే ప్రయత్నం చేశా. విడుదలైన తర్వాత కూడా ఎంతోమంది ఈ పాట గురించి అంతర్జాలంలో మాట్లాడుకొన్నారు. హిప్‌ హాప్‌ తమిళ బాణీ, అమిత్‌ మిశ్రా గానం చాలా బాగా కుదిరాయి’’. No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

జాతకచక్రం