MohanPublications Print Books Online store clik Here Devullu.com

Winter Season


‘అసలే ఆస్తమా! ఇక చలికాలం వచ్చిందంటే అది కాస్తా ఎక్కువై ఊపిరాడనివ్వకుండా చంపేస్తుంది’ .. ఓ వృద్ధుడి బాధ. ‘మా చంటోడికి పడిశం, పిల్లికూతలు... ఈ చలికాలం పోయేదాకా పిల్లాడు అల్లాడిపోతాడు’.. ఓ తల్లి ఘోష. ‘చలికి ఒంట్లోని కీళ్లన్నీ పట్టేస్తున్నాయి. అడుగు తీసి అడుగేయాలంటే దేవుడు కనిపిస్తున్నాడు’... ఓ పెద్దాయన వేదన . చలికాలం నలుగురూ ఒకచోట కలిస్తే సాగే సంభాషణ ఇలాగే ఉంటుంది. కానీ ముందుచూపుతో తగిన జాగ్రత్తలు పాటిస్తే చలికాలాన్ని కూడా మిగతా కాలాల్లాగే సులభంగా దాటేయొచ్చంటున్నారు వైద్యులు.
మంచు కురవడం మొదలలైందంటే ఇంటి తలుపులూ, కిటికీలు మూతలుపడతాయి. హీటర్లు బుసలు కక్కడం మొదలవుతుంది. ఇంత జరిగినా ఊపిరితిత్తులు కొంత ఆయాసానికి గురవుతాయి. చర్మం పగుళ్లు బారడం ఆరంభమవుతుంది. మిగతావారితో పోలిస్తే చలికాలం పసికందులు, వృద్ధులకే సమస్యలెక్కువ. ఈ కాలం వీళ్లల్లో రెసిస్టెన్స్‌ లోపించి ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. దగ్గుతో కఫాన్ని బయటికి తెప్పించే శక్తి లేకపోవటం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువవుతుంది. ఇక ఆస్తమా ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. చర్మం పొడిబారి పగిలి దురద పెడుతుంది. ఆ దురద తట్టుకోలేక గట్టిగా గీకడం వల్ల చర్మం పుండ్లు పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా జరగకుండా ఒంటికి కొబ్బరినూనె రాయొచ్చు.

వృద్ధులకు, పసికందులకు అవస్థలే 
వృద్ధుల్లో ప్రత్యేకించి ఆర్థరైటిస్‌ ఉంటే ఎముకలు మరింత బిగుసుకుపోయే ప్రమాదం ఉంది. కదలికలు తగ్గి కొన్నిసార్లు పట్టుతప్పి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. చలికి భయపడి ఇంటికే పరిమితమవటం వల్ల ఒంటరితనంతో కుంగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వృద్ధులను గదికే పరిమితం చేయకుండా ఏదో ఒక వ్యాపకం కల్పించాలి. తేలికగా చేతికందే దూరంలో బెడ్‌ పక్కన లేదా కుర్చీ పక్కన ఫోన్‌ అందుబాటులో ఉంచాలి. స్విచ్‌లు, తలుపు గడియల మీద ఫ్లోరొసెంట్‌ టేప్స్‌ అంటిస్తే చీకట్లో తేలికగా గుర్తించగలుగుతారు. ఇక పసికందులను చలిగాలి సోకకుండా వెచ్చగా ఉంచాలి. స్వెటర్లు, మెత్తని రగ్గులు వాడాలి. స్నానానికి ముందు గోరు వెచ్చని నూనెతో మర్ధనా చేస్తే రక్తప్రసరణ పెరిగి ఒంట్లో వేడి పెరుగుతుంది. పసికందులు, వృద్ధులు ఉండే గదుల్లో హీటర్లు వాడటం మంచిది. ఈ కాలంలో డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువే. ఇదే సమయంలో జలుబు, దగ్గు, జ్వరాలతోపాటు ఊపిరాడకుండా చేసే వ్యాధులు కూడా చుట్టుముడతాయి.

ఆస్తమా 
చల్లటి కాలం అయినంత మాత్రాన అందరూ ఈ కాలంలో వచ్చే అన్ని వ్యాధులకూ గురవుతారని కాదు. ఆస్తమా లాంటి వ్యాధులు ఊపందుకోవడానికి వ్యాధినిరోధక శక్తి తగ్గడం ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. అప్పటికే ఆస్తమా వ్యాధిగ్రస్తులై ఉంటే వారిలో చల్లగాలి వల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా శ్వాస ఆడటమే కష్టమవుతుంది. ఈ స్థితిలో కేవలం ఆస్తమా మందులకే పరిమితం కాకుండా, వ్యాఽధినిరోధక శక్తిని పెంచుకునే విషయంలోనూ శ్రద్ధ వహించాలి.

గుండెపోటు 
చలికాలంలోనే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువనే సంగతి చాలామందికి ఇప్పటికీ తెలియదు. ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు రక్తనాళాలు మూసుకుపోయి, రక్తాన్ని శరీర భాగాలకు పంపిణీ చేయడం గుండెకు కష్టమవుతుంది. ఈ స్థితిలో గుండె ర క్తాన్ని పంపిణీ చేయడానికి ఎక్కువగా శ్రమిస్తుంది దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. ప్రత్యేకించి వృద్ధుల్లో సిస్టాలిక్‌, డయాస్టాలిక్‌ రక్తపోట్లు రెండూ పెరుగుతాయి. అందుకే హృద్రోగులు వ్యాయామం కోసం చలిలో బయటికి వెళ్లకూడదని వైద్య నిపుణులు చెబుతారు. చలికాలంలో అతిగా భోజనం చేయడం కూడా ప్రమాదమే. దీనివల్ల జీర్ణాశయం మీది ఒత్తిడి గుండె మీద కూడా పడే ప్రమాదం ఉంది.

కీళ్లనొప్పులు 
చలికాలంలో కీళ్లనొప్పులు(ఆర్థరైటిస్‌) కూడా ఎక్కువే. కీళ్లు బిగుసుకుపోయి, కీళ్లల్లో నొప్పులు వాపు ఏర్పడి ఎక్కువ మందిని బాధిస్తాయి. దీనికి క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్య నుంచి చాలా వరకు ఉపవమనం పొందవచ్చు. అవకాశం ఉంటే ఇండోర్‌ స్విమ్మింగ్‌ కూడా ఈ సమస్యకు చక్కని ఉపశమనంగా పనిచేస్తుంది.

శ్వాసకోశ సమస్యలు 
వృద్ధుల్లో శ్వాసకోశాలు సంకోచించి ఒక్కోసారి ఊపిరి ఆడటమే కష్టమవుతుంది. ఆస్తమాతో సమానంగా బ్రాంకైటిస్‌ కూడా వారిని ఊపిరి తీసుకోకుండా చేస్తుంది. ఇన్‌ఫ్లూయెంజాతోపాటు ఈ రుతువులో న్యూమోనియా వచ్చే అవకాశం కూడా ఎక్కువే. ఫ్లూ- వ్యాక్సిన్ల వల్ల వ్యాధి తీవ్రత కొంత తగ్గుతుంది. దుష్ప్రభావాలు కూడా తగ్గుముఖం పడతాయి. కాకపోతే అన్నిసార్లూ అంత ఫలవంతంగా ఉంటాయని చెప్పలేం. అయినా 65 ఏళ్లు పైబడిన వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ టీకాలు తప్ప మరో మార్గం లేదు.

సైనసైటిస్‌ 
ముక్కు దిబ్బడ, తలనొప్పి, దగ్గు, ముక్కు కారడం వంటి సమస్యలు చలికాలంలో కొంతమందికి నరకం చూపిస్తాయి. ఈ స్థితిలో అవసరమైన విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహార పానీయాలు తీసుకోవడం తప్పనిసరి.

డి ప్రెషన్‌ 
చలికాలంలో వృద్ధులు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం కూడా ఎక్కువే. దీనివల్ల వాళ్లకు ప్రతిదీ హీనంగానూ, నిరుపయోగకరంగానూ కనిపిస్తుంది. ఇలాంటి వారికి విటమిన్‌-డి కొంత మేలు చేస్తుంది.

తరచూ మూత్రవిసర్జన 
చలికాలం శరీరాన్ని అంతర్గతంగా వెచ్చగా ఉంచడం కోసం రక్తప్రసరణ చర్మం పైపొరల వరకూ జరగదు. దాంతో రక్తనాళాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా శరీరం ఆ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. మూత్రపిండాలు అధిక రక్తాన్ని తేలికగా వడగట్టడం కోసం దాన్లో కలిసి ఉండే నీటిని మూత్రం రూపంలో బయటికి విసర్జించేస్తూ ఉంటాయి. ఇందువల్లే చలికాలంలో ఎక్కువసార్లు మూత్రవిసర్జన అవుతూ ఉంటుంది.

రోగ నిరోధకశక్తి పెంచుకోవాలి 
చలికాలం జలుబు సహజం అనుకుంటాం. కానీ నిజానికి చలివల్ల జలుబు చేయదు. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల శ్వాసకోశ నాళాల సామర్థ్యం సన్నగిల్లి ఇతరుల నుంచి ఆ వైర్‌సలు తేలికగా మనకు సోకుతాయంతే! కాబట్టి ఈ వైరస్‌లు సోకకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకుంటూ, వ్యాయమాలు చేస్తూ రోగనిరోధక శక్తిని కాపాడుకోవాలి. అలాగే నలుగురితో ప్రత్యేకించి జలుబు సోకిన వాళ్లతో మెలగాల్సి వచ్చినప్పుడు ముక్కుకు కర్ఛీఫ్‌ అడ్డు పెట్టుకోవాలి. ఈ కాలంలో వచ్చే సాధారణ జలుబు, జ్వరాలకు చికిత్స లేదు. మందులు లక్షణాలను అదుపు చేయగలవే గానీ, ఇన్‌ఫెక్షన్‌ని పారదోలగలిగే సామర్థ్యం వాటికి ఉండదు. అందువల్ల ఆ బాధ్యతంతా మన రోగనిరోధక వ్యవస్థ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బలంగా ఉంచుకోవడం ఈ కాలంలో తప్పనిసరి.
ఏమైనా చలికాలం వృద్ధులకు ఒక సవాలుగానే ఉంటుంది. కాకపోతే ఆ రుతువు గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కాస్త అవగాహన పెంచుకుంటే వృద్ధులను శీతాకాలంలోనూ పూర్తి ఆరోగ్యంగా ఉంచడం కష్టమేమీ కాదు. దుస్తులు, ఆహార పానీయాల జాగ్రత్తకే పరిమితం కాకుండా, వారి భావోద్వేగాలు, సామాజిక ప్రభావాల విషయంలో కూడా శ్రద్ధ వహిస్తే వృద్ధులు ఆరోగ్యంగానే కాదు ఆనందంగా కూడా ఉంటారు.

అతిగా చలివేయడం 
కొంతమంది ఉన్నదానికంటే ఎక్కువ చలిని అనుభవిస్తూ ఉంటారు. ఇదొక ఆరోగ్యపరమైన సమస్య. అనీమియా (రక్తహీనత)తో బాధపడేవాళ్లలో తగినన్ని ఎర్ర రక్తకణాలు తయారు కావు. దాంతో శరీర ఉష్ణోగ్రత తగ్గి చలి పెరుగుతుంది. ఈ సమస్య గర్భిణుల్లో ఎక్కువ. హైపోథైరాయిడ్‌తో బాధపడే సీ్త్రలకు కూడా చలి ఎక్కువగా ఉంటుంది. మధుమేహం వల్ల మూత్రపిండాలు దెబ్బతిన్నవాళ్లలో కూడా విపరీతమైన చలి బాధిస్తుంది. ఈ సమస్యలున్నవాళ్లు చలికాలం కదా అందుకే చలి బాధిస్తోంది అని సరిపెట్టుకోకుండా కొన్ని విషయాలను గమనించాలి. బయటినుంచి ఇంట్లోకొచ్చిన ఎంతసేపటికీ చలి అదుపులోకి రాకపోయినా, వెచ్చని ప్రదేశంలో ఉన్నా, చలి పెడుతున్నా సమస్య ఉన్నట్టు గ్రహించి వైద్యుల్ని సంప్రదించాలి.

No comments:

Post a comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list