MohanPublications Print Books Online store clik Here Devullu.com

అమరగిరి అమరేశ్వరస్వామి ఆలయం _Amaragiri Amaresvaraswami Temple



అమరగిరి అమరేశ్వరస్వామి ఆలయం 

‘కృష్ణానదిలో స్నానం... అమరేశ్వరుని దర్శనం’ మోక్షదాయకం అన్నారు పెద్దలు. తెలుగునేల మీద ఉన్న పంచారామాలలో ప్రథమమైనదిగా భావించే అమరేశ్వరస్వామి ఆలయం గుంటూరు జిల్లా కృష్ణానది ఒడ్డున వందల ఏళ్లుగా పూజలందుకుంటున్నది. ఇక్కడ వెలసిన బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామిని దర్శించి తరించటానికి భక్తజనం నిత్యం అమరావతిని సందర్శిస్తుంటారు. శ్రీశైలానికి ఈశాన్య భాగాన కృష్ణానది దక్షిణపు గట్టున ఉన్న ఈ క్షేత్రం దేవతలు, గంధర్వులు, ఋషులు సేవించిన మహిమ గల క్షేత్రంగా భక్తులు భావిస్తారు.
కలియుగ వైకుంఠం
అమరావతి సమీపంలో అమరావతి-విజయవాడ రూట్‌లో తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న  వైకుంఠపుర క్షేత్రం దివ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధ్ది కెక్కింది.ఈ  క్షేత్రంలో కొండ పైన గుహలో,  కొండ కింద  స్వయంభువుగా శ్రీవెంకటేశ్వరుడు వెలసి పూజలందుకుంటున్నాడు. అమరావతిని పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిని కైలాసంగాను, వైకుంఠపురాన్ని వైకుంఠంగాను భావించి ఇచ్చట వెంకటేశ్వరునికి అనేక మాన్యాలిచ్చి తమ భక్తిని చాటుకున్నాడు. ఈ క్షేత్రంలో కృష్ణానది ఉత్తరంగా ప్రవహించి ఉత్తర వాహినిగా పేరుగాంచింది.  పచ్చని చెట్లతో, కొండలతో కృష్ణానది పరవళ్ళతో  అనేక అందాలను సంతరించుకున్న ఈ క్షేత్రంలో సినిమా షూటింగులు కూడా తరచు జరుగుతుంటాయి.
తారకాసురుని వధ
పూర్వం తారకాసురుడనే రాక్షసుడు దేవదానవులు క్షీరసాగరాన్ని మథించినప్పుడు ఉద్భవించిన అమృతలింగాన్ని అపహరించి తన కంఠాన ధరించి మహా పరాక్రమవంతుడయ్యాడు. తర్వాత అతడి ఆగడాలు శ్రుతిమించి దేవేంద్రునికి తన పదవి పోతుందేమోననే భయం పట్టుకుంది. దాంతో పరమ శివుణ్ణి ఆశ్రయించగా శివుడు తన కుమారుడైన కుమారస్వామిని సకల సైన్య సమేతుడిగా వెళ్లి తారకాసురుణ్ణి వధించమని ఆదేశించాడు. అయితే ఎన్ని అస్త్రాలు వేసినా తారకాసుడు చనిపోలేదు. ఇందుకు కారణం అతడి మెడలో ఉన్న అమృతలింగమే అని గ్రహించిన కుమారస్వామి తన శక్తిఘాతంతో ఆ అమృతలింగాన్ని ఛేదించగా అది అయిదు ముక్కలుగా అయిదు ప్రాంతాలలో పడింది. మొదటి ముక్క పడిన ప్రాంతమే అమరారామం.
మిగిలినవి కుమారారామం, ద్రాక్షారామం, భీమారామం, క్షీరారామం. అమరారామంలో పడిన ముక్కను  దేవగురువైన బృహస్పతితో కలిసి వెతుక్కుంటూ వచ్చిన దేవేంద్రుడికి అప్పటికే అది లింగాకారం ధరించి దర్శనమిచ్చింది. వెంటనే దేవేంద్రుడు దానిని ప్రతిష్ఠించగా రోజురోజుకూ తన పరిమాణాన్ని పెంచుకుంటూ పోయింది. ‘నువ్వు ఎంత పెరిగితే నేను అంత పెద్ద గుడిని కడతాను’ అని దేవేంద్రుడు మొదట బీరాలు పోయినా తర్వాత పెరుగుతున్న లింగాన్ని చూసి భయపడి శరణుకోరడంతో, శివుడు తన పెంపుదలను చాలించాడని కథనం. పెరుగుతున్న పరిమాణాన్ని ఆపడానికి ఇంద్రుడు లింగం నెత్తిన శీల కొట్టి మారేడు దళాలతో పూజించాడని మరో కథనం.
శీల కొట్టినప్పుడు మూడు ధారలు- జలధార, క్షీరధార, రక్తధార - లింగం నుంచి వచ్చాయని, వాటి చారలు ఇప్పటికీ ఉన్నాయని భక్తులు భావిస్తారు. ఏకశిలా రూపంగా 27 అడుగుల ఎత్తున, మూడు అడుగుల కైవారం కలిగిన ఈ లింగం జగద్విఖ్యాతం. ఓంకారానికి ప్రతిరూపంగా స్వామి వారి నుదుట మూడు చిన్న గుంటలు నేటికి దర్శనమిస్తాయి.
 కృష్ణానది ప్రవాహం
రాక్షసగురువు శుక్రాచార్యుడు తన గణాలతో వచ్చి భవిష్యత్తులో సహ్యాద్రి పర్వతం మీద కృష్ణవేణి అనే నది పుట్టి ఇటువైపుగా ప్రవహిస్తుంది కనుక దాని ప్రవాహానికి అమరేశ్వరుడు మునిగిపోవచ్చునేమో అనే సందేహం వెలిబుచ్చాడు. అందుకు బృహస్పతి సమాధానమిస్తూ, అమరేశ్వరుడు వెలసిన దీన్ని క్రౌంచగిరి అంటారనీ, దీని అడుగు పాతాళం దాకా ఉందనీ, దానివల్ల ఈ లింగం స్థిరంగా ఉంటుందనీ, కృష్ణమ్మ ఈ గిరి పక్క నుంచి వంక తిరిగి పారుతుందే తప్ప ఎన్నటికీ దీనిని ముంచెత్తదనీ బదులు చెప్పాడు. దీనికి ఆధారంగా ఇప్పటికీ కృష్ణానది ఈ క్షేత్రాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉంది.
ఆలయం తెరచి ఉండే వేళలు
మామూలు రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరచి ఉంటుంది. ప్రస్తుత కార్తికమాసాన్ని పురస్కరించుకుని  ఉదయం 5.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సా. 4 గంటల నుండి రాత్రి 8.30 వరకు గుడిని తెరచి ఉంచుతారు. కార్తీకమాసం పౌర్ణమి, సోమవారాలలో ఉ.3 నుండి రాత్రి 10 వరకు, ఆదివారాలలో ఉ. 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు.
ఎలా చేరుకోవాలి?
రాష్ట్రం నలుమూలల నుంచి అమరావతికి చేరుకోవటానికి మూడు రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఒకటి అమరావతి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నుంచి ప్రతి 15 నిముషాలకు బస్సు సౌకర్యం ఉంది. రెండవది అమరావతి నుంచి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ నుంచి ప్రతి 30 నిముషాలకు ఒక బస్ సర్వీసు ఉంది. మూడవది 33 కిలోమీటర్ల దూరంలో సత్తెనపల్లి నుంచి ప్రతి అరగంటకో బస్ సర్వీస్ ఉంది.

బుద్ధుడు నడయాడిన భూమి
ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన  అమరావతి పర్యాటకంగా దేశ, విదేశీ యాత్రికులతో నిత్యం కళకళలాడుతుంది. బుద్ధుడు నడయాడిన భూమిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆరామంలోని మహాచైత్యంలో బుద్ధుని ధాతువులు నిక్షిప్తమై ఉన్నాయి. దీనివల్ల ప్రపంచంలోని బౌద్ధ మతస్థులు జీవితంలో ఒకసారైనా అమరావతిని తప్పనిసరిగా సందర్శించాలని భావిస్తారు.
చారిత్రక ప్రసిద్ధి
దేవాలయంలో గల వివిధ శాసనాలు ద్వారా అమరేశ్వరుణ్ణి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నుంచి వివిధ రాజవంశీయులు సేవించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా పల్లవ, రెడ్డి, కోటకేతు రాజులు అమరేశ్వరుని సేవించినట్లు చరిత్ర చెపుతోంది. శ్రీకృష్ణదేవరాయలు అమరేశ్వరుని దర్శించి తులాభారం తూగినట్లు, బ్రాహ్మణులకు దానాలిచ్చినట్లు ఆధారాలున్నాయి. అలాగే 18వ శతాబ్దంలో చింతపల్లిని రాజధానిగా చేసుకుని దక్షిణాంధ్రదేశాన్ని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఆలయాన్ని పునరుద్ధ్దరించి మూడు ప్రాకారాలతో 101 లింగాలను ప్రతిష్ఠించారు. నేటికీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులే అనువంశీక ధర్మకర్తలుగా స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అమరావతి క్షేత్రం హరిహర క్షేత్రంగా కూడా పిలవబడుతుంది. ఆలయంలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి క్షేత్రపాలకునిగా విరాజిల్లుతూ శివ కేశవులకు భేదం లేదని చాటుతున్నాడు.  - ఆర్.హెచ్. ప్రసాద్, సాక్షి, అమరావతి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list