పంచాక్షరి నిలయాలు పంచారామాలు
పరమశివుడికి ప్రీతికరమైన మాసం కార్తీకం. ఈ నెలలో శైవ క్షేత్రాలను సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఆధ్యాత్మికత పరిఢవిల్లే కార్తీకంలో ముక్కంటి ఆలయాలన్నీ కిక్కిరిసి ఉంటాయి. ఇక తెలుగునాట ఆ శశిధరుడు వెలసిన దివ్యక్షేత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి పంచారామాలు. పంచాక్షరికి నిలయాలైన పంచారామ క్షేత్రాలను దర్శించుకుందాం.
ఆత్మలింగం ఆనవాళ్లు
పంచారామ క్షేత్రాల స్థల పురాణం స్కందపురాణంలో కనిపిస్తుంది. పూర్వం తారకాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి.. ఆత్మలింగాన్ని సంపాదిస్తాడు. వరగర్వంతో ముల్లోకాలనూ పీడిస్తుంటాడు. తారాకాసురుడి నుంచి విముక్తి ప్రసాదించాలని దేవతలంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా, శివపార్వతుల కుమారుని చేతుల్లో తారాకాసురుడు మరణిస్తాడని చెబుతాడు. శివపార్వతుల సంతానమైన కుమారస్వామి తారకాసురుడిపైకి యుద్ధానికి వెళ్తాడు. ఆ అసురుడి కంఠంలో కొలువై ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. ఈ క్రమంలో ఆత్మలింగం ఐదు ముక్కలుగా ఐదు ప్రదేశాల్లో పడుతుంది. దేవతలు వాటిని ఆయా ప్రాంతాలలో ప్రతిష్ఠించారు. ఈ ఐదు ప్రాంతాలనే పంచారామలుగా పిలుస్తున్నారు. ఎలా వెళ్లాలి..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రముఖ పట్టణాల నుంచి పంచారామాలకు బస్సు సౌకర్యం ఉంది. పంచారామ క్షేత్రాలను సులభంగా దర్శించుకోవాలంటే ముందుగా రాజమండ్రి లేదా కాకినాడ చేరుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి బస్సులోగాని, ప్రైవేట్ వాహనాల్లో గాని అమరావతి మినహా మిగిలిన నాలుగు క్షేత్రాలు దర్శించుకోవచ్చు. తిరుగు ప్రయాణంలో విజయవాడ చేరుకుని అమరావతి దర్శించుకుంటే సరిపోతుంది.
ఎంతెంత దూరం
- ద్రాక్షారామం.. రాజమండ్రి నుంచి 44 కి.మీ, కాకినాడ నుంచి 34 కి.మీ దూరంలో ఉంటుంది.
- ద్రాక్షారామం నుంచి క్షీరారామానికి (పాలకొల్లు) 73 కి.మీ దూరం. విజయవాడ నుంచి 130 కి.మీల దూరం.
- క్షీరారామం నుంచి సోమారామం (గునుపూడి) 23 కి.మీల దూరంలో ఉంటుంది. ద్రాక్షారామం నుంచి 108 కి.మీల దూరం.
- సోమారామం నుంచి కుమారారామానికి (సామర్లకోట) దూరం 120 కి.మీ. ద్రాక్షారామం నుంచి 43 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 50 కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది.
- గుంటూరు నుంచి అమరావతికి దూరం 32 కి.మీ. విజయవాడ నుంచి 40 కి.మీ దూరంలో ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఈ పంచారామ క్షేత్రాలు వెలిశాయి. ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం, సోమారామం, కుమారారామం ఈ ఐదు దివ్యక్షేత్రాలు పంచారామాలుగా వెలిశాయి. పౌరాణిక ప్రాముఖ్యం ఉన్న ఈ పుణ్యధామాలకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యం ఉంది. శివతత్వానికి ఆలవాలంగా విలసిల్లే ఈ క్షేత్రాలకు సకుటుంబంగా వెళ్తే ఆధ్యాత్మిక ఆనందం కలగడంతో పాటు మంచి విహార యాత్రగానూ మిగిలిపోతుంది.
పంచారామాలలో మొదటిదిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా విలసిల్లుతున్న పవిత్ర క్షేత్రం ద్రాక్షారామం. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. ఈ ఆలయంలో మహాలింగం ఎత్తు సుమారు 60 అడుగులు. గర్భాలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. మహాలింగానికి అర్చకులు పైఅంతస్తు నుంచి అభిషేకాదులు నిర్వహిస్తారు. ఇక్కడి శివలింగం సగం నలుపు, సగం తెలుపు వర్ణంలో ఉంటుంది.
దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించిన ప్రదేశం కావడంతో దీనికి ద్రాక్షారామం పేరు వచ్చిందని చెబుతుంటారు. ద్రాక్షారామం పార్వతీదేవి జన్మస్థలమని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీచక్రస్థిత మాణిక్యాంబదేవిగా విరాజిల్లుతోంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఇదీ ఒకటి. ఈ ఆలయ నిర్మాణం మహోన్నతంగా ఉంటుంది. దీనిని చాళుక్యరాజైన భీముడు నిర్మించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. సప్తమహర్షులు అఖండ గోదావరిని ఏడు పాయలుగా విభజించిన చోటిది. గలగల పారే గోదావరి భక్తులకు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది.
పంచారామాలలో అమరావతి రెండవది. ఇది గుంటూరు జిల్లాలో కృష్ణానది తీరంలో ఉంది. నవ్యాంధ్రకు భవ్యరాజధానిగా నిర్మితమవుతున్న అమరావతికి పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ స్వామివారు అమరేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమరేశ్వర లింగం ఎత్తు 35 అడుగులు. గర్భాలయంలో 15 అడుగుల లింగం కనిపిస్తుంది. మిగతా 20 అడుగులు భూమిలోపల ఉందని చెబుతారు. ఈ లింగాన్ని దేవతల రాజయిన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం. అందుకే ఈ క్షేత్రానికి అమరావతి అనే పేరు వచ్చిందంటారు.
ఆంధ్రుల తొలి రాజధానిగా కూడా అమరావతి ఘన చరిత్రను కలిగి ఉంది. అమరావతి కేంద్రంగా శాతవాహనుల రాజ్యపాలన సాగింది. అపురూప శిల్ప సంపదకు నెలవైన ఈ క్షేత్రం తర్వాతి కాలంలో బౌద్ధారామంగా భాసిల్లింది. సుమారు రెండువేల సంవత్సరాల కిందటి ఆనవాళ్లు నేటికీ ఇక్కడ చూడవచ్చు. అమరావతి దర్శనం ఆధ్యాత్మిక, వైజ్ఞానిక విహారయాత్రగా నిలిచిపోతుంది.
క్షీరారామం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. ఈ క్షేత్రం నరసాపురానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడి మహాలింగాన్ని త్రేతాయుగంలో సీతారాములు ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ శివలింగం పాలవలె శ్వేత వర్ణంలో కనిపిస్తుంటుంది. లింగం పైభాగం మొనదేలి ఉండటం వలన స్వామివారిని ‘కొప్పు రామలింగేశ్వరుడు’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు ఈశాన్య ముఖస్వరూపుడుగా దర్శనమిస్తాడు.
క్షీరారామానికి ఆ పేరు రావడం వెనుక ఓ పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. కౌశిక ముని కుమారుడు ఉపమన్యుడు శివుడిని నిత్యాభిషేకానికి కావాల్సిన క్షీరాన్ని కోరాడట. పరమేశ్వరుడు స్వయంగా క్షీరపుష్కరిణిని అనుగ్రహించి క్షీర సముద్రం నుంచి పుష్కరిణికి పాలు స్రవించేలా చేశాడట. అలా ఈ క్షేత్రం క్షీరారామంగా పేరొందింది. కాలక్రమంలో పాలకొల్లుగా మారింది. ఇక్కడ 9 అంతస్తులతో నిర్మించిన 125 అడుగుల ఆలయ గోపురం అపురూప శిల్పసంపదతో విశేషంగా ఆకట్టుకుంటుంది. చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు.
పంచారామాల్లో సోమారామం నాల్గవది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలోని గునుపూడిలో ఉంటుంది. ఇక్కడి స్వామివారిని ఉమాసోమేశ్వరునిగా పిలుస్తారు. ఈ శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం అమావాస్య నాటికి గోధుమరంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేనాటికి ధవళకాంతులీనుతుంది. సోమేశ్వర లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం మూలానే ఇలాంటి ప్రత్యేకత సంతరించుకుందని చెబుతుంటారు. సోముడు ప్రతిష్ఠించిన లింగం ఉండటం చేత ఈ క్షేత్రానికి సోమారామం అన్న పేరు స్థిరపడింది.
పంచారామాల్లో చివరిది కుమారారామం. ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంది. ఇక్కడి శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి కుమారరామం అన్న పేరు వచ్చింది. 14 అడుగుల ఎత్తున్న భీమేశ్వరలింగం భక్తులకు దర్శనమిస్తుంది. రెండతస్తుల మంటపం గల గర్భాలయం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు బాలాత్రిపురసుందరిగా పూజలు అందుకుంటోంది. కుమారారామం పరిసరాలు పచ్చటి ప్రకృతికి ఆలవాలంగా అలరిస్తాయి. ఈ పట్టణానికి చాళుక్య భీమవరం అన్న పేరు కూడా ఉంది. పూర్వం చాళుక్య రాజు భీముడు ఈ పట్టణాన్ని నిర్మించి, రాజధానిగా చేసుకుని పాలించాడని చారిత్రక ఆధారాలున్నాయి. సామర్లకోటకు 14 కిలోమీటర్ల దూరంలో శక్తిపీఠమైన పిఠాపురం ఉంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565