MohanPublications Print Books Online store clik Here Devullu.com

MOHAN PUBLICATIONS Price List

మంగళంపల్లి బాలమురళీకృష్ణ_Mangalampalli Balamuralikrishna


నాదామృత కలశం
మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 - 2016

భారతదేశం గర్వించదగిన ఒక వాగ్గేయకారుడి వాక్కు మూగవోయింది... భూలోకానికి విహారయాత్రకు వచ్చిన గంధర్వుడు తన స్వరార్చన ముగించాడు... తనకు ఖండాంతర ఖ్యాతిని చేకూర్చిన విద్వాంసుడి మృతితో కర్ణాటక సంగీతం దిగులుపడింది.
మంగళంపల్లి బాలమురళీకృష్ణ గంధర్వ లోకాలకు తిరిగి వెళ్లిపోయారు.
బాలమురళి కేవలం గాయకుడే కాదు- సంగీత ప్రియుల ఆత్మసఖుడు! గానం గంధర్వ విద్య కావచ్చుకాని, గాయకులంతా గంధర్వులు కారు. బాలమురళీ గంధర్వుడు మాత్రమే కాడు- బాల సంగీత మేధావి. ఆరో ఏట వేదికపై, పదకొండో ఏట ఆకాశవాణిలో తొలిసారిగా గొంతు విప్పేనాటికే బాలమురళి విద్వాంసుడు కావడం గొప్ప విశేషం. సంగీతంలోని సమస్త పార్శా్వలను సుసంపన్నం చేసిన విద్వాంసులలో బాలమురళిది మొదటివరస. అటు గాత్రంలోను, ఇటు వయొలిన్‌, వీణ, మృదంగం, కంజిర వంటి గాత్ర వాయిద్యాల వాదనంతోను అద్భుత ప్రదర్శన, ప్రతిభ కనబరచిన సంపూర్ణ విద్వాంసుడు బాలమురళి. సంగీత విద్యలో పరిపూర్ణ ప్రజ్ఞతో అసాధారణ స్వరకల్పన, మనోధర్మ విన్యాసాలు ప్రదర్శించి సంగీతజ్ఞులను సమ్మోహితులను చేసిన ప్రతిభాశాలి బాలమురళి. విద్వత్తు విషయంలో ఆయనతో పోల్చదగిన ప్రజ్ఞావంతులను వేళ్లమీద లెక్కించవచ్చు. తూర్పుగోదావరిజిల్లా శంకరగుప్తంలో 86 ఏళ్ల కిత్రం జన్మించిన గోదావరి ముద్దుబిడ్డ గౌతమీ తీరాన పుష్కరాల్లో చేసిందే చివరి కచేరి కావడం యాదృచ్ఛికమే కావచ్చుగాని, గోదావరికి అది ఒక విషాద మాధుర్య స్మృతి శకలం. విద్వత్తు- భావుకతను అణచివేయకపోవడం ఆయనలోని గొప్ప సుగుణం. స్వర ప్రస్తారం విషయంలో సృజన పౌరుషానికే కాదు, సంగీత మాధుర్యానికి సైతం సమాన ప్రాధాన్యం కల్పించిన ప్రతిభామూర్తి బాలమురళి. సాహిత్యం విషయంలో పాండిత్యానికి, జ్ఞానానికి గల తేడా వంటిది ఇది. అదే సమయంలో అచ్చ తెనుగు నుడికారానికి గుడికట్టి చుట్టూ సంగీత ప్రాకారాలను నిర్మించిన గొప్ప సంగీత శిల్పి ఆయన.
సంగీతంలోనే కాక సాహిత్యంలో కూడా దిట్ట కావడంవల్ల పాటతోను, మాటతోను రాణించే అరుదైన విద్య ఆయన సొంతమైంది. వాగ్గేయకారుడిగా ఆధునిక లోకంలో అగ్రస్థానం కట్టబెట్టింది. ఆయనను త్యాగరాజ స్వామి అంశగా భావించినవారున్నారు. అన్నమయ్యగా ఆరాధించినవారూ ఉన్నారు. సంగీతమర్మజ్ఞుల గుండెల్లో ఆయన స్థానం సుస్థిరం. దేశ విదేశాల్లో 25వేలకు పైగా సంగీత కచేరీలు నిర్వహించడమే కాదు, ‘జుగల్‌బందీ’ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సృజనశీలి బాలమురళి.
సంగీత ప్రపంచంలో బాలమురళి అందుకోని అవార్డులు లేవు. పొందని బిరుదులు లేవు. పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ వంటి అత్యున్నత పురస్కారాలతోపాటు సంగీత కళానిధి, నాదజ్యోతి వంటి లెక్కలేనన్ని బిరుదులు ఆయన పేరుముందు సగర్వంగా వచ్చి చేరాయి. లెక్కకు మించిన డాక్టరేట్లు, పేరు చివరన సర్దుకున్నాయి. విదేశాల్లోనూ ఆయనకు ఎన్నో సత్కారాలు, సన్మానాలు జరిగాయి. ఫ్రెంచి ప్రభుత్వం అందించిన ‘షెవిలియర్‌’ పురస్కారం వాటిలో అత్యున్నతమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం, శృంగేరీ పీఠం వంటి ఆధ్యాత్మిక సంస్థలు ఆయనను ఆస్థాన విద్యాంసుడిగా గౌరవించాయి.
వ్యక్తిగా బాలమురళి మూలాలు మరువని మనిషి. ఎన్ని బిరుదులు వరించినా, ఎన్ని సత్కారాలు తరించినా ఆయన నేలపై గట్టిగా నిలబడిన వ్యక్తి. వినయాన్ని ఆధార షడ్జమంగా స్థిరపరచుకొని, గానాన్ని గగనసీమలకు ఎగరేసిన జ్ఞాని. ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో సత్కారాన్ని స్వీకరించిన సందర్భంలో బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రశంసిస్తూ ‘బాలు గట్టిగా ప్రయత్నిస్తే నాలా పాడగలడు. నేను ఎంత ప్రయత్నించినా బాలులా పాడలేను’ అని అనడం ఎస్పీకి దక్కిన అత్యంత ఘనమైన ప్రశంసే కాదు, బాలమురళి వ్యక్తిత్వానికి కలికితురాయి.
‘సలలిత రాగ సుధారస సారం’ (నర్తనశాల), ‘మౌనమే నీ భాష ఓ మూగమనసా’ (గుప్పెడు మనసు), ‘పలుకే బంగారమాయెనా’ (అందాల రాముడు), ‘పాడనా వాణి కల్యాణిగా’ వంటి సినీగీతాలతో శాస్త్రీయ ప్రౌఢ సంగతులను వినిపించి, వాటికి చిరస్థాయిని కల్పించిన బాలమురళి మధ్వాచార్య సినిమాకు జాతీయస్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం అందుకున్నారు.
బాలమురళి అద్భుతమైన హాస్యప్రియుడు. ఒకసారి రాజమండ్రి రైల్వేస్టేషనులో మెయిల్‌ కోసం వేచిఉన్న సందర్భంలో ‘హౌరా నుంచి చెన్నై వెళ్లవలసిన మెయిల్‌ ఒక గంట ఆలస్యంగా నడుచుచున్నది’ అన్న ప్రకటన వినిపించింది. మేమంతా మర్యాద కోసం విచారం వ్యక్తం చేశాం. వెంటనే బాలమురళి అందుకుని ‘అందులో ఆశ్చర్యం ఏముంది? నడుచుచున్నది అని ఆమే ఒప్పుకొన్నది కదా! రైలు పరుగెడితే సరైన సమయానికి రాగలదు కాని నడుస్తుంటే ఆలస్యం కావడం తప్పదుగా’ అని చమత్కరించిన రసజ్ఞుడు ఆయన. రాజకీయ నేతల పెడసరానికి అలిగి కొన్నేళ్లపాటు తెలుగునేలపై కచేరీలు తిరస్కరించిన పౌరుషవంతుడు ఆయన.
మనిషి వెళ్లిపోయినా మాట మిగిలింది. పాట మిగిలింది. ఆయనతో అద్భుతమైన జ్ఞాపకాలు మిగిలాయి. మిగిలే ఉంటాయి. వెయ్యేళ్లకోసారి భూమికి షికారువచ్చే గంధర్వుడికి సంగీత ప్రపంచం విషాద వదనంతో వీడ్కోలు పలుకుతోంది- మౌనంగా!
- ఎర్రాప్రగడ రామకృష్ణ

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

జాతకచక్రం