MohanPublications Print Books Online store clik Here Devullu.com

అక్షరాలు_ChaitanyaSakti




జ్ఞానానందం

ఉదయం నిద్ర లేచింది మొదలు, మనిషి పాట్లన్నీ ఆనందానికే! ఆంజనేయుడు ప్రతిచోటా రాముణ్ని శోధించినట్లు, మనిషి తనకు అందుబాటులో ఉన్న అన్నింటిలోనూ ఆనందం వెతుక్కుంటూ ఉంటాడు. ఈ వెతుకులాట జీవన పర్యంతం కొనసాగుతూనే ఉంటుంది. అతడికి ఎప్పటికో అసలు నిజం అర్థమవుతుంది- హనుమంతుడి హృదయంలోనే శ్రీరాముడు కొలువై ఉన్నట్లు... తన మనసే ఆనందనిలయమని!
మనిషి జీవితంలో అధికభాగం భౌతిక ఆనందంతోనే గడిచిపోతుంది. అందుకు కారణం అజ్ఞానాంధకారం! చీకటిలా అజ్ఞానమూ అతడికి చిత్తభ్రమ కల్పిస్తుంది. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు అనిపించడమే దాని లక్షణం. చిత్తడినేల మీద నడకలా ఉంటుంది ఆ జీవనయానం!
జారుతూ, పడుతూ లేస్తూ... గమ్యం తెలియక అల్లారుస్తూ... కంటకాలతో ఇక్కట్లపాలవుతూ ఎన్నో అనుభవాలు! ఆస్తికత్వ అవస్థల కన్నా నాస్తికత్వమే మేలేమోనని అనిపించే విహ్వలత్వం... ఆదిశంకరులు చెప్పిన దురవస్థలన్నీ మనిషి అనుభవంలోకి వస్తాయి. అరిషడ్వర్గాలనే ఆరుకొండలు దాటిన తరవాత ఏడో కొండమీద శ్రీనివాసుడి దివ్యదర్శనం అయినట్లు- అతడు నిరంతర ప్రయత్నంతో, ఒక్కో అడ్డంకినీ అధిగమిస్తూ అంతర్యామి వైపు పయనించాలి. తన అంతరంగమే అంతర్యామి నిలయమని గ్రహించాలి. అలా గ్రహించడానికి మనిషికి జ్ఞానం ఉండాలి.
నిదురించే విత్తనంలా, జ్ఞానం మనిషిలోనే నిక్షిప్తమై ఉంటుంది. దానికి తృష్ణ అనే తడి తగలాలి. జ్ఞానతృష్ణ (దాహం) మొదలయ్యాక, అది అలా కొనసాగుతుంటుంది. ప్రశ్నలు సమాధానాలు, ఆలోచనలు అనుభవాలు, ఇదే గమ్యం కావచ్చునన్న భ్రమ... అంతలోనే ‘కాదు కాదు’ (నేతి=న+ఇతి=ఇది కాదు) అనే స్పృహగా- ఆధ్యాత్మిక ఒంటరి ప్రయాణం బహుకాలం సాగిపోతుంటుంది. ఆ ప్రయాణంలో ఎన్నో మజిలీలు, ఎందరెందరో మహనీయుల పరిచయాలు, వారితో జరిగే సత్సంగమే స్ఫటిక జలంలా మానవుడిలోని జ్ఞానబీజానికి వూపిరులూదుతుంది. ఆ తరవాత మొక్క ఎదిగి వృక్షమయ్యేదాకా అతడి జ్ఞానతృష్ణ తీరదు, తృప్తి కలగదు.
మహా వృక్షమయ్యాక నింగికేసి చూస్తూ ‘నేను చాలా అల్పజీవిని, నా జ్ఞానం అత్యల్పం’ అనుకోవడమే మనిషి గమ్యం చేరతాడనడానికి సూచిక. ‘నేనేమీ కాను’ అనుకోవడమే జ్ఞాన స్థితి. ‘జ్ఞానం అనంతం’ అని అర్థమయ్యాక, ఆ జ్ఞాన సముద్రం పరమాత్మకు చెమట బిందువుతో సమం అనీ మనిషి గ్రహిస్తాడు. అప్పుడు ఆయన గురించిన ఎరుక అతడికి కలుగుతుంది. దైవం గురించిన భావరూపాలన్నీ కల్పనలు కావు, అవి నిజాలు అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. ఆనంద సముద్రంలో మునుగుతూ తేలుతూ పరవశిస్తాడు. మానవుడి బాల్యచేష్టల్ని పరమాత్మ మందహాసంతో వీక్షిస్తూ ఆనందిస్తుంటాడని పురాణాలు చెబుతాయి.
తడి ఆరని మనిషి మనసుకు ప్రాపంచిక భ్రమలు అంటుకోవు. ఎందుకంటే, అతడు ఆస్వాదించేది ఆనందామృత లేపనం. భ్రమల్ని దహించగల శక్తి దానికి ఉంటుంది. ఏ ఆనందం, ఏ అనుభూతి చెందాక మానవుడు వేరేవాటికి ఆశపడడో- అదే జ్ఞానానందం. దాన్ని అనుభూతి చెందడానికి ప్రతి సాధకుడూ పట్టుదలగా కృషి చేయాలి.
హయగ్రీవుడు జ్ఞానానందమయుడు, నిర్మలుడు. ఆయన స్ఫటికంలా స్వచ్ఛమైనవాడని పురాణేతిహాసాలు వర్ణిస్తాయి. అన్ని విద్యలకూ హయగ్రీవుడే ఆధారభూతుడని చెబుతాయి. ఆ దైవం ఉపాసనతో ప్రతి మనిషీ పొందాల్సింది ఆత్మజ్ఞాన విద్య. అప్పుడే అతడికి సంపూర్ణ జ్ఞానానందం లభిస్తుంది.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌




స్వభావం
చిన్న చిన్న తేడాలున్నా, ఈ లోకంలో మనుషులందరూ చూడటానికి ఒకే విధంగా కనిపిస్తారు. తరచి చూస్తే, వారి స్వభావాలు ఎంతో భిన్నంగా ఉంటాయి.
పుట్టినప్పుడు మనిషికి ఎలాంటి గుణాలూ ఉండవు. అతడు అన్నింటినీ సమభావనతో చూస్తాడు. కాలంతో పాటు ఎదుగుతున్నకొద్దీ, ప్రతి వ్యక్తిలోనూ వివిధ రకాలైన గుణాలు చోటు చేసుకుంటాయి.
కొంతమంది ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. ఎటువంటి పరిస్థితిలోనైనా శాంతమూర్తుల్లా వ్యవహరిస్తారు. మరికొందరు కోపిష్ఠులుగా తయారవుతారు. ఆవేశపరులుగా ఉంటూ- ప్రతి చిన్న విషయానికీ అందరిమీదా ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తుంటారు. అందరూ మనుషులే అయినా, పలు సందర్భాల్లో వారి స్వభావాలు వేరుగా ఉంటుం టాయి. అనేక తేడాలు కనిపిస్తుంటాయి.
వివిధ స్వభావాలకు వశులైన మనుషులు జీవితంలో ఎప్పటికీ మారలేరా అన్నదే ప్రశ్న. మారలేకపోవడమన్న ప్రసక్తే లేదు. స్వభావాలు మార్చుకుంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’... అంటాడు వేమన. సాధన వల్ల అన్నీ సాధ్యమవుతాయి. అసాధ్యమంటూ ఏదీ ఉండదు. దీక్ష, ఆసక్తి ఉండాలే కాని- నిరంతర సాధన ద్వారా ఎటువంటి మనిషైనా తన దుష్ట స్వభావాన్ని మార్చుకోవచ్చు.
కోపాన్ని శాంతంతో, దుష్టత్వాన్ని సాధుత్వంతో జయించవచ్చంటుంది మహాభారతం. లోభత్వాన్ని దానగుణంతో, అసత్యాన్ని సత్యంతో ఓడించవచ్చని ఆ ఇతిహాసంలోని ఉద్యోగపర్వం చెబుతుంది. ఇదే స్ఫూర్తిగా మనిషి జీవితయాత్ర సాగించాలి. సత్వగుణమే మనిషిని మహనీయుడిగా మారుస్తుంది. ధ్యానం, సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం అతణ్ని సదా సన్మార్గం వైపు నడిపిస్తాయి. మార్పు ఎప్పుడూ మంచి వైపు సాగాలి తప్ప, చెడుకు దారితీయకూడదు.
అరణ్యవాసం సందర్భంగా ధర్మరాజును ఒకరోజు ద్రౌపది నిలదీస్తుంది. ‘అన్నివేళలా మీరు ధర్మం అంటుంటారు. ధర్మపాలన గురించి అందరికీ చెబుతుంటారు. ఆ ధర్మం మీకు ఏమిచ్చింది? అధర్మపరుడైన సుయోధనుడు రారాజుగా ఉంటూ, సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. ధర్మచింతన గల మీరు కుటుంబసమేతంగా అడవుల పాలయ్యారు. అటువంటప్పుడు, ధర్మాన్ని ఆచరించి ప్రయోజనం ఏమిటి?’ అని భర్తను ఆమె ప్రశ్నిస్తుంది.
అప్పుడు ధర్మరాజు శాంతంగా బదులిస్తాడు. ‘ధర్మాన్ని ఆచరించడం నా సహజ స్వభావం. ఏదో వస్తుందనో, రావాలనో నేను ధర్మాచరణ సాగించడం లేదు. ధర్మంతో వ్యాపారం చేయకూడదు. అలా చేసేవాడు నీచుడు!’ అంటాడాయన. ధర్మాన్ని ఆచరించడమే తన స్వభావం అని ధర్మజుడు అనగలిగాడంటే, ఆయన ఎంతటి ధర్మపరుడో సులువుగా అర్థం చేసుకోవచ్చు.
ధర్మాన్ని స్వభావంగా చేసుకున్నవారే లోకంలో అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఫలాపేక్ష లేని ధర్మగుణమే మనిషిని రక్షిస్తుంది. దీపం వెలుగులు విరజిమ్మినట్లు- సదాలోచనలు, సత్కర్మల వల్ల మనిషి ధర్మస్వరూపుడిగా వెలుగొందుతాడు.
వృక్షం కావడానికి బీజం తన రూపాన్ని మార్చుకుంటుంది. వంచితేనే వెదురు వేణువుగా మారుతుంది. శిలను చెక్కితేనే, కోరుకున్న దేవతామూర్తి కళ్లముందు నిలుస్తుంది. ప్రకృతి మొత్తం త్యాగగుణంతో అలరారుతుంటుంది. అలాగే మనిషీ తనలోని దుర్గుణాలు వీడి, త్యాగగుణం అలవరచుకోవాలి. పరోపకార స్వభావం వల్ల, అతడి అంతరంగం నిర్మలమవుతుంది.
వ్యక్తుల సమూహమే సమాజం. వ్యక్తిలో మార్పు- సామాజిక వ్యవస్థలో పరివర్తనకు నాంది పలుకుతుంది. ప్రతి మనిషీ సమాజ శ్రేయస్సే పరమావధిగా భావించి స్వార్థరాహిత్యం, పరోపకార గుణంతో ప్రవర్తిస్తే - తన జన్మను సార్థకం చేసుకున్నవాడవుతాడు!              - విశ్వనాథ రమ



                                 చైతన్యశక్తి 
నాశనం(క్షరం) కానిది అక్షరం’ అని లాక్షణికులు చెప్పిన మాట. జ్ఞాన జగత్తుకు అక్షరం పునాది వంటిది. మనసులోని భావాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగపడేది భాష. ఆ భావాన్ని పదిలపరచుకునే సంకేత రూపమే అక్షరం. దానికి ఎన్నో అర్థాలున్నాయి. వాటిలో ‘పరబ్రహ్మ’ అనేది ఒకటి. అంతటా నిండి ఉండి, అందర్నీ జాగృతపరచే శుద్ధ చైతన్యమూర్తి పరబ్రహ్మ. ఆయన చేసే పనినే వేరే రూపంలో అక్షరాలు చేస్తాయి కాబట్టి, వాటిని ‘పరబ్రహ్మ స్వరూపం’ అంటారు.

నోటినుంచి వెలువడిన భాషను చేత్తో రాసినప్పుడు పొందే స్థితినే ‘వాంగ్మయం’ అంటారు. దానికి అక్షరమే ఆధారం. ఆ అక్షర రూపుడు శ్రీమహావిష్ణువు అని తిక్కన విరచిత భారతంలోని శాంతి పర్వం చెబుతుంది. శివుడి డమరుక శబ్దం నుంచి అక్షరాలు పుట్టాయని, అందుకే వాటిని మహేశ్వర సూత్రాలుగా పిలుస్తారని సంస్కృత వ్యాకరణ గ్రంథం పాణినీయం (సిద్ధాంత కౌముది) వివరిస్తుంది.

సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల ప్రతిరూపం అక్షరమని ఇలా స్పష్టమవుతోంది. అందువల్లనే అక్షరాలు అంత శక్తిమంతమైనవంటారు. శస్త్రానికి (మంత్రించి ప్రయోగించే ఆయుధం) ఉన్నంత శక్తి అక్షరానికి ఉందంటారు ప్రాజ్ఞులు. ఓంకారమే శారీరక, మానసిక, పరిసరాల ఆరోగ్యానికి మూలమని వేదాలు చెబుతున్నాయి. అందుకే అక్షరానికి ‘ఓంకారం’ అనే అర్థం ఉంది.

వంపులు తిరిగితేనే అక్షరం ఆకారాన్ని సంతరించుకుంటుంది. అందుకే అక్షరానికి వర్ణం (ఆకారం) అనే పేరుంది. దాన్ని స్వరయుక్తంగా ఉచ్చరిస్తే పూర్తిభావం వస్తుంది. అందుకే ‘స్వరం’ అనీ మరో పేరుంది.

అక్షరాలకు అధిష్ఠాన గ్రహాలున్నాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అ నుంచి అం అక్షరం వరకు సూర్యుడు అధిపతి. లోకాన్ని చైతన్య పరచేవాడు సూర్యుడు. అక్షరాల్లో అచ్చులు (అ-అం) చేసే పనీ అదే. హల్లులకు సంపూర్ణత్వాన్నిచ్చి చైతన్యపరచడమే. (ఉదాహరణకు:- క్‌+అ=క, క్‌+ఆ=కా, క్‌+ఇ=కి... ఇలా) హల్లులకు (అసలు రూపం. క్‌, ఖ్‌, గ్‌... ఇలా) ప్రాణాల నిస్తాయి కాబట్టి అచ్చులకు ప్రాణాలనీ పేరుంది.

క-వర్గానికి (క, ఖ, గ, ఘ వంటివి) అంగారకుడు, చ-వర్గానికి బుధుడు, ట-వర్గానికి శుక్రుడు, త-వర్గానికి బృహస్పతి, ప-వర్గానికి శని, య నుంచి మిగిలిన అక్షరాలకు చంద్రుడు అధిష్ఠాన గ్రహాలు. గ్రహసంచారం వల్లనే ప్రకృతి గమనం నిలకడగా సాగు తోందంటారు.ఉచ్చస్థితి-నీచస్థితి, లాభం-నష్టం, వృద్ధి- క్షయం, నిలకడ-అస్థిరత్వం వంటి అనేక మార్పులకీ గ్రహ సంచారమే కారణమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ విషయాన్ని గమనించిన రుషులు, పురాణ పురుషులు, పండితులు- ఏ పరిస్థితులకైనా నిలిచి ఉండి సత్ఫలితాలనిచ్చే అక్షరాలను ఎంపిక చేశారు. వాటిని సమన్వయపరచి, స్వరపరచిన సాహిత్యాన్ని మానవాళికి అందించారు. అవే- వేదభాష్యాలు, ఉపనిషత్తులు, పురాణాలు మొదలైనవి. వీటితోపాటు అర్థవంతమైన పదాల్నీ వారు సృష్టించారు. ఆ పదాల మేళవింపే- అనంతమైన సాహిత్యం.

అక్షరానికి వికృతి అక్కర. (అక్కర=అవసరం). ప్రతి మానవుడికీ విద్య అవసరమని స్పష్టం చేస్తోందీ పదం. ఈ భావాన్ని ప్రతిఫలింపజేస్తూ ఒక కవి- లోకంలో అన్ని విద్యలకీ అక్షరమే తల్లి (అక్షరంబు తల్లి అఖిల విద్యలకెల్ల), అక్షరమే లోకాన్ని రక్షించేది (అక్షరంబు లోక రక్షకంబు). అక్షరాస్యుడు కానివాడికి ఎక్కడా ఏవీ దొరకవు (అక్షరంబు లేని అబలునకెందును భిక్ష పుట్టబోదు పృథ్విలోన) అన్నాడు. అక్షరుడే అనంత విశ్వానికి ఆది అని తిరువళ్ళువరు తీర్మానించారు.

ఒక్కొక్క అక్షరంలో ఒక్కో శక్తి ఇమిడి ఉంటుంది. అందువల్ల దేవతలను బీజాక్షర రూపంలో ఆవాహన చేస్తారు. పదంగా మారిన అక్షరాలను ఎక్కడ ఎలా కలిపి పలకాలో, ఎలా విరిచి పలకాలో తెలుసుకొని ఉండాలి. లేకుంటే అవి అపశబ్దాలుగా మారి, దాని ఫలితంగా మంచి జరగడానికి బదులు చెడు జరిగే ప్రమాదం ఉంటుంది. అక్షర జ్ఞానంతోపాటు; ప్రయోగించే విషయంలోనూ ఎంతో జ్ఞానం, జాగ్రత్త అవసరం.
- అయ్యగారి శ్రీనివాసరావు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list