ఆలయ ధర్శనం .. ఆరోగ్యం పదిలం
మనం నిత్య జీవితంలో దేవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవటం ఒక దైనందిన జీవిత చర్యగా ఏర్పరచుకుంటాం. అలా దేవాలయంలో దైవదర్శనం చేసుకుంటూ మనం కొన్ని నియమాలు పాటిస్తుంటాం. కానీ వాటిని అలా ఎందుకు పాటిస్తున్నామో వాటివెనుక వున్న అంతరార్ధ పరమార్థాలేమిటో మనకు అన్నీ తెలియవు. అవేంటో అందరూ తెలుసుకుంటే బాగుంటుంది.
ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో ఉదయానే్న చన్నీటి స్నానం శుచితోపాటు ఏకాగ్రతను కలిగిస్తుంది. పవిత్ర సమయాల్లో తీర్థాలలో చేసే యిటువంటి స్నానం ముఖ్యంగా కుంభమేళా వంటి పరమయోగులు స్నానమాచరించే చోట ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది. అలాచేస్తూ చేసే సూర్య నమస్కారం శరీర ధారుడ్యాన్ని పెంచుతుంది. పుష్కర సమయాల్లో తీర్థస్నానం కూడా ఎంతో పవిత్రమైనది. దేవాలయంలో ప్రవేశించాక ఆలయ ప్రాకారంలోపల గర్భగుడికి వెలుపల మూడు ప్రదక్షిణలు చేస్తాం. అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆలయ ప్రాంగణంలో పరచబడిన రాళ్ళపై పాదరక్షలు లేని పాదాలతో నడుస్తాం. అలా రాళ్ళపై వున్న సన్నని రంధ్రాలు లేక గరకుదనం వలన వాటిపై మన పాదాల బరువు ఆనినపుడు ఆ ఒత్తిడికి కాళ్ళలోవున్న నరాలు చలనం కలిగి ఇతర అవయవాలు కూడా చక్కగా పనిచేస్తాయి. ప్రదక్షిణలు ముగిశాక గర్భాలయంలో దైవదర్శనం చేసుకొని వెలుపలికి వచ్చాక ఆలయ ప్రాంగణంలో కూర్చుని వెళ్ళటం ఒక ఆచారంగా వస్తున్నది. ఇలా చేయటానికి కారణం ఆలయాల్లో అనేక వృక్షాలు వుంటాయి. వాటికి ఔషధ గుణాలు వుంటాయి. కనుక ఆ చెట్లకు దగ్గరగానే చెట్లు క్రింద గానీ ఆలయ ప్రాంగణంలో ఎక్కడ ప్రశాంతంగా కూర్చున్నా ఆ వృక్షాలకున్న ఔషధశక్తివలన మన ఊపిరితిత్తులను శుభ్రపరచి, శరీరంపై వున్న విషక్రిములను నాశనంచేసి శరీర ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మానసిక ప్రశాంతత లభించి ఏకాగ్రత కుదురుతుంది. ఆలయంలోని చెట్టుకింద వున్న విగ్రహం ముందు కానీ, ఆలయంలో విగ్రహం ముందు కానీ ఉత్తరాభిముఖంగ కూర్చుని ధ్యానం చేస్తే ఉత్తర దిశలోని అయస్కాంత శక్తి ప్రభావానికి లోనై రక్తప్రసరణ సక్రమంగా జరగటానికి దోహదపడుతుంది.
మనం ఆలయంలో చేసే నమస్కారాల పద్ధతిలో కూడా వ్యాయామం దాగుంది. నమస్కారం చేసే విధానంవలన మెడ, తుంటి, మోచేయి, మోకాలు, చీలమండలం మొదలైన శరీర భాగాలన్నీ కదిలి ఆరోగ్యంగా వుండేందుకు దోహదం చేస్తుంది. అన్నింటికన్నా సాష్టంగ నమస్కారం సర్వశ్రేయస్కరం. అదే విధంగా వినాయకుని ముందు తీసే గుంజీలు కూడా వ్యాయామంలో భాగమే. ఆలయంలో అర్చకులు చేసే మంత్రోచ్ఛారణ మనలో చైతన్యాన్ని కలిగిస్తుంది. కొన్ని మంత్రాలు మనకు ఆరోగ్యాన్ని, శక్తిని కలిగిస్తాయి. ఆలయంలో భక్తులకు ఇచ్చే తీర్థంలో కూడా అనేక ఔషధ గుణాలు దాగున్నాయి కనుక తీర్థం స్వీకరించటం వలన ఆరోగ్యంతోపాటు, శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. దైవదర్శనం అనంతరం స్వామికి నివేదించిన ప్రసాదాలు తీసుకోవటం వలన జీర్ణశక్తి, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మన సంస్కృతి, సాంప్రదాయాలను మనకు తెలియచేస్తూ సామాజిక సంబంధ బాంధవ్యాలను పెంచుతున్న మానవతా, ఆధ్యాత్మిక ఆరోగ్య కేంద్రాలు మన దేవాలయాలు.
- కాకరపర్తి సుబ్రహ్మణ్యం
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565