కాకతీయ కళావైభవం
పుణ్య తీర్థం
ఆ గ్రామం మూడు సుప్రసిద్ధ శైవ ఆలయాలకు నెలవు... ఒక్క ముక్కంటికే కాదు, బ్రహ్మ, విష్ణువులకు సైతం ఆలయాలు ఉండటం మరోప్రత్యేకత. త్రిమూర్తులలోని లయకారకుడైన శివుడు ఎరుకేశ్వరుడు, నామేశ్వరునిగా అవతరించగా స్థితికారకుడైన విష్ణువు చెన్నకేశ్వరునిగా వెలిశారు. శాపగ్రస్తుడైన బ్రహ్మదేవుడు సైతం సరస్వతీదేవితో కలిసి హంసవాహనారూఢుడై దర్శనమిస్తాడిక్కడ. కాకతీయ కాలం నాటి ఆధ్యాత్మికశోభకు, శిల్పకళా వైభవానికి తార్కాణం 800 ఏళ్లనాటి ‘పిల్లలమర్రి’ దేవాలయాలు. కాకతీయుల ఏలుబడిలో ఒక ఆధ్యాత్మిక, కళాక్షేత్రంగా విలసిల్లింది పిల్లలమర్రి. కవులు, పామరులను మెప్పించిన పిల్లలమర్రి పినవీరభద్రుడిని తన బిడ్డగా నిలుపుకున్న కమనీయ సీమ ఇది.
ముక్కంటికి... మూడు ఆలయాలు...
పిల్లలమర్రిలో మూడు ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఉన్నాయి. 13వ శతాబ్దంలో వీటిని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ గుడులు దాదాపు 150 సంవత్సరాలపాటు ౖÐð భవోపేతంగా వెలిగాయి. ఆ తర్వాత పరదేశీ పాలనలో దోపిడీలకు గురయ్యాయి, మధ్య మధ్య పునః ప్రతిష్టలు పొందాయి. బేతిరెడ్డి భార్య ఎరుకసానమ్మ క్రీ.శ.1208లో ఎరుకేశ్వర దేవస్థానం కట్టించారు. కాకతీయ శిల్పకళావైభవానికి చాటిచెప్పేలా ఆలయం చాల ఎత్తుగా... గోపురం చాలా దూరం వరకు కనిపిస్తుంది. నల్లరాయితో చెక్కిన దీని ముఖమండప స్తంభాలు చాలా నునుపుగా అద్దం మాదిరిగా కనిస్తాయి. ఈ స్తంభాలను తాకితే సప్తస్వరాలు వినపడతాయి. ఆలయంలోని స్వామిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుస్తారని ప్రతీతి. బేతిరెడ్డి సోదరుడైన నామిరెడ్డి తన పేరిట నామేశ్వర ఆలయం నిర్మించగా తన తల్లిదండ్రుల పేరిట త్రికూటాలయం నిర్మించారు. క్రీ.శ.1202లో నిర్మించిన ఈ ఆలయంలో నల్లరాతిపై చెక్కిన శిల్పాలు, ద్వారాలు, ముఖమండపాలపై లతలు, పుష్పాలు, వివిధ భంగిమలలో నృత్యాలు, కళాకారులు, గాయకులు, వాద్యకారులు, దేవతావిగ్రహాలు తదితర శిల్పాలు చూపరులను కళ్లు తిప్పుకోనివ్వవు.
నల్లరాయి శిల్పుల చేతిలో పడి మైనంవలె కరిగిపోయిందా అన్నంత అద్భుతంగా ఉంటుంది. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తాయి. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతిదూలాలపై భారత రామాయణ గా«థలు, క్షీరసాగర మధనం వర్ణచిత్రాలు చెక్కబడ్డాయి. నామేశ్వర ఆలయం పక్కనే ఒకే మండపంలో శివునికి మూడు వేర్వేరు ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. మూడు ఆలయాలకు కలిపి ఒకే నంది ఉండటం ఇక్కడ విశేషం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి సేవలో వీరంగాలు వేయటం, అగ్నిగుండాలు కాల్చటం మొదలైన వేడుకలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ జాతర వేడుకలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.
చెన్నకేవ, బ్రహ్మాలయాలు
పిల్లలమర్రి శైవం, వైష్ణవం కలిసి పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. శివకేశవులకు భేదాలు లేవని చాటిచెప్పేలా మూడు ప్రసిద్ధ శివాలయాలు ఉన్న పిల్లలమర్రి గ్రామంలోనే 13వ శతాబ్దంలో చెన్నకేశవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. గర్భాలయంలో మకరతోరణంలో చెన్నకేశవస్వామివారి రూపలావణ్యం నయన మనోహరం. గర్భాలయం వెలుపల పన్నిద్దరు ఆళ్వారులు కొలువై, నిత్యపూజలందుకుంటున్నారు. క్రీ.శ.1260లో ధ్వంసమైన చెన్నకేశవ స్వామి ఆలయాన్ని 1899 ప్రాంతంలో గ్రామానికి చెందిన వుమ్మెత్తల చక్రయ్య గ్రామస్తుల సహకారంతో తిరిగి నిర్మించినట్లు చెబుతారు. నామేశ్వర ఆలయానికి ఎడమవైపున గల బ్రహ్మాలయంలో బ్రహ్మ సరస్వతీమాతతో çకలసి దర్శనమిస్తాడు. మహాదేవుని సేవ కోసం బ్రహ్మాసరస్వతులు హంసవాహనంపై ఇక్కడికి వస్తుంటారని స్థలపురాణం చెబుతోంది.
పిల్లల మర్రి ఎలా చేరుకోవాలంటే..?
పురాతన ఆలయాలకు నెలవైన పిల్లల మర్రికి చేరుకోవడం సులువే. సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి గ్రామం హైదరాబాద్ నుంచి 134 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ నుంచి విరివిగా సూర్యాపేటకు బస్సులు ఉంటాయి. సూర్యాపేటలో దిగితే ఆక్కడినుంచి వాహనాల్లో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామానికి చేరుకోవచ్చు.
- నాగరాజు కాకోళ్ల, సాక్షి, సూర్యాపేట
టాగ్లు: Temples, Shiva, ఆలయాలు, శివుడు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565