పెళ్లితో ఆరోగ్యం, ఆయుష్షు పెంపు!
పెళ్లితో ఇల్లు, పిల్లలు.. అనేక ఇతర బరువు బాధ్యతలు వచ్చిపడతాయని నేటి యువత దాన్ని వాయిదా వేయడమే కాదు, కొందరు ఆ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండడమే మేలనుకుంటున్నారు. ఒంటరి జీవితాన్ని గడపడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని బ్రిటన్‌లోని ఆస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వివాహ బంధం ఆరోగ్యాన్ని కాపాడుతుందని, ముఖ్యంగా ఆయుర్దాయాన్ని పెంచడంలో కీలకపాత్ర వహిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు!
గుండెజబ్బులకు కారణమయ్యే రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్, టైప్-2 మధుమేహ వ్యాధులతో బాధపడే వ్యక్తులపై దాదాపు పదేళ్లపాటు పరిశోధనలు జరిపారు ఆస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఈ జబ్బుల కారణంగా పొంచి ఉన్న మరణముప్పు ఒంటరిగా జీవించేవారి కంటే వివాహ బంధం కొనసాగించే వారిలో తక్కువగా ఉంటోందని తేలింది.
* చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారిలో అవివాహితులు, విడాకులు తీసుకున్నవారి కంటే వివాహితులు పదహారు శాతం ఎక్కువ కాలం జీవించే అవకాశమున్నట్లు వారి అధ్యయనంలో గుర్తించారు.
* మధుమేహ పీడితులలో అవివాహితుల కంటే పద్నాలుగు శాతం ఎక్కువ కాలం వివాహితులు జీవించే అవకాశం ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది.
* అధిక రక్తపోటు బాధితుల్లో ఒంటరిగా జీవించేవారి కంటే పది శాతం ఎక్కువ కాలం పెళ్లయినవారు జీవించే అవకాశమున్నట్లు చెబుతున్నారు.
* గుండెపోటుకు గురైన వారిలో ఒంటరిగా జీవించేవారి కంటే వివాహితులే ఎక్కువకాలం జీవించే అవకాశమున్నట్లు గత పరిశోధనలూ తెలిపాయి. వివాహ బంధం పురుషుల్లోనూ మహిళల్లోనూ గుండె జబ్బులను, వాటి ద్వారా కలిగే మరణ ముప్పులనూ తగ్గిస్తుందని ఫిన్‌లాండ్ వైద్యుల పరిశోధనలో తేలింది.
* క్యాన్సర్‌తో బాధ పడుతున్నవారిలో పెళ్లికానివారి కంటే పెళ్లయినవారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నట్లు 2013లో జరిపిన అధ్యయనాల్లో తేలింది.
* ఎక్కువ కాలం వివాహ బంధం కొనసాగించిన వారిలో ఒత్తిడికి కారణమయ్యే హార్మోనుల ఉత్పత్తి తక్కువగా ఉంటుందని చికాగో యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డారియో మేస్ట్రెపెరీ తన పరిశోధనలో గుర్తించారు.
* ఒంటరిగా జీవించేవారి కంటే వివాహ బంధంలో ఉన్నవారు బైపాస్ సర్జరీ వంటి పెద్దపెద్ద ఆపరేషన్ల తర్వాత మూడు రెట్లు త్వరగా కోలుకునే అవకాశమున్నట్లు రోచెస్టర్ యూనివర్శిటీకి చెందిన కాథలీన్ కింగ్ పరిశోధనలో వెల్లడైంది.
* వివాహ బంధంలో కొనసాగేవారికి జీవితంలో ఎదురయ్యే ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోగల మానసిక స్థైర్యం ఎక్కువని 1991లో అమెరికా శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలింది.
* ఆరోగ్యకరమైన వివాహ బంధాన్ని కొనసాగిస్తున్నవారిలో నిద్రలేమి సమస్యలూ ఉండవని పిట్స్‌బర్గ్ యూనివర్శిటీకి చెందిన సైకాలజిస్టు వెండీ ట్రాక్సెల్ పరిశోధన తేల్చింది.
* విడాకులు తీసుకున్నవారి హృదయాలు గాయపడడమే కాకుండా వారిలో గుండెజబ్బులు, మరణ ముప్పు పదహారు శాతం అధికమన్నట్లు బ్రిటన్‌లోని ఏసీఏఎల్‌ఎం అధ్యయన కేంద్రం జరిపిన తాజా పరిశోధనలో వెల్లడైంది.
* సంతోషకరమైన వివాహ బంధాన్ని కొనసాగించేవారు వైవాహిక జీవితానికి, ప్రాణానికి ఎంతో విలువిస్తారని.. ప్రాణాంతక సాహసాలు చేయడం, మద్యం తీసుకుని వాహనాలు నడపడం వంటి పనులు చేయరని కూడా నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, రోగ నిరోధక శక్తి పెరిగి శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. కుంగుబాటుతనం, నిరుత్సాహం, అనవసర భయాలు, ఒత్తిడి వంటివి దరిచేరవు.
భార్యాభర్తలు ఒకరి క్షేమాన్ని మరొకరు కోరుకుంటూ ఆపద సమయాల్లో అండగా నిలవడం, మానసిక ధైర్యాన్ని అందించడమే వారిపై అనారోగ్య ప్రభావం తక్కువగా ఉండడానికి ముఖ్య కారణమని పరిశోధకుల అభిప్రాయం. అందుకే వీలైనంతవరకు కీచులాటలకు స్వస్తి పలికి వివాహబంధాన్ని ఆనందంగా కొనసాగిస్తే ఇటు ఆరోగ్యం, అటు ఆయుర్దాయమూను. - సంధ్యారాణి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565