శ్రీరాముని గొప్పతనం గురించి అందరికీ తెలుసు.. ప్రతినాయకుడైన రావణుడి గురించి గొప్పగా వర్ణించగలమా? రావణుని రూపం అత్యద్భుతం.. ధైర్యం నిరుపమానం.. తేజస్సు అసదృశం.. రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు.. అధర్మానికి ఒడిగట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు.. అయితే రావణుని శివభక్తి అనుపమానం.. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశాడు.. ఆ మహాదేవుడు ఎంతకూ కరుగపోయేసరికి శిరసు ఖండించుకొని స్వామికి సమర్పించుకున్నాడు. ఖండించుకున్న స్థానంలో మరొక శిరస్సు ఉద్భవించేది! ఇలా పదిసార్లు జరిగింది.. అందుకే రావణుడు దశకంఠుడయ్యాడు.. ఈ పది తలలు మనలోని గుణాలకు ప్రతీకలంటారు..మరి ఆ గుణాలేంటో.. వాటికి రావణుడి జీవితం ఎలా అన్వయమైందో చదువండి..
మోహం
చెడు ఆలోచనలైన.. కామ, క్రోధ, మద మాత్సర్యం వంటిదే అసూయలోంచి పుట్టేదే మోహం. ఈ గుణాలన్నీ రావణుడిలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే మోహ స్వరూపంగా రావణుడిని
పోలుస్తారు. ఈ గుణం పాళ్లు ఎక్కువగా ఉండడంతోనే అతని వినాశనం జరిగింది.
కామం
ఒకరి భావాలను నియంత్రించకూడదు. ఒకరి మీద అధికారం చెలాయించకూడదు. తెలివిని మాత్రమే అంచనా వేసి వారి ప్రాముఖ్యాన్ని గురించి నొక్కి చెప్పడం హైందవ సంప్రదాయం ప్రకారం తప్పుగా పరిగణిస్తారు. కానీ, రావణుడు తనను తాను నాశనం చేసుకోవడానికి మరొక వ్యక్తి భార్యను అపహరించాడు. అక్కడ ఒకరి భావాలను నియత్రించాడు.
క్రోధం
తన కోపమే తనకు శత్రువు అని పెద్దలు ఊరికే అనలేదు. రావణుడి విషయంలో కూడా ఈ సామెత వర్తిస్తుంది. రావణుడు తమ్ముడు విభీషణుడిపై కోపంతో రాజ్య బహిష్కరణ విధిస్తాడు. దాంతో అతనే శత్రువుగా మారి లంక వినాశనం, రావణుడి మరణానికి కారణమయ్యాడు.
అహంభావం
కొన్ని కోణాల్లో చూస్తే రావణుడు అహంభావి అని అర్థమవుతుంది. దానికి ఒక ఉదాహరణ.. రావణుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు. కానీ ఆ దేవుడు కరుణించకపోయేసరికి ఆ కైలాస పర్వతాన్నే పెకిలించి వేస్తాడు. తను అనుకున్నడంటే ఆ సమయంలో అన్ని జరిగిపోవాలనుకునేవాడే రావణుడు. అంతటి అహంభావం అతనిది.
బుద్ధి రాహిత్యం
గొప్ప చక్రవర్తి మహాబలి ఒక మాట చెబుతాడు రావణుడి గురించి. పది భావోద్వేగాల్లో తొమ్మిది మాత్రమే ఆయనకు వర్తిస్తాయి. ఒక్క తెలివి మాత్రం ఆయనకు వర్తించదు. బుద్ధిబలంతో అన్ని పనులు చేసుకోగలం. ఒకవేళ ఆ ఒక్కటి ఉండి ఉంటే ఆయన చరితార్థుడు అయ్యేవాడన్నాడు ఆ చక్రవర్తి.
జ్ఞానం వృథా
రావణుడు గొప్ప వైదిక పండితుడు. అతని జన్మ ద్వారా, వేద జ్ఞానం ద్వారా అతడు బ్రహ్మజ్ఞానిగా పరిగణించబడ్డాడు. ఆయన సంస్కృత పండితుడు. రావణుడు ఎన్నో రచనలు చేశాడు. మంచి ఆయుర్వేద వైద్యుడు. కాకపోతే ఆ జ్ఞానాన్ని మంచి కోసం కాకుండా అన్యాయమైన ఆలోచనలకు ఉపయోగించాడు. తెలివిని మంచి కోసం ఉపయోగిస్తే రావణుడు మంచి పరిపాలకుడయ్యేవాడు.
అసూయ
ఒక వ్యక్తి నుంచి దీవెన పొందడం అంత సులువు కాదు. ఇతరుల మంచి కోరినప్పుడు మాత్రమే ఆ దీవెనలు అందుతాయి. కానీ రావణుడు ఎక్కడా ఎవరి మంచీ కోరలేదు. అసూయ, ద్వేషాలతో రగిలిపోయేవాడు. అందుకే ఆయన వినాశనం తప్పలేదు.
రాక్షసమాయ
రావణుడు ఆలోచనా పరుడే! ఆ ఆలోచనలతోనే మూడు లోకాలకు అధిపతి అయ్యాడు. తన నిగూఢమైన ఆలోచనలతో రావణుడు ఈ లోకాలను స్వాధీనం చేసుకోగలిగాడు. మానవులను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోగలిగాడు. అలాగే రాక్షసగణాన్ని తన ఆలోచనలతో కట్టిపడేసి రాక్షసాధిపతిగా చలామణి కాగలిగాడు.
లోభం
మనిషికి ఆశ ఉండొచ్చు. అత్యాశ ఉండకూడదంటారు. కానీ రావణుడికి ఈ గుణం కూడా ఎక్కువే. వాస్తవానికి లంకా నగరం చాలా చిన్నది. రావణుడు ఇతర రాజ్యాల నుంచి కొల్లగొట్టి తన నగరాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించుకున్నాడు. వారి ఏడుపే ఆయనకు తగిలి ఉండొచ్చు.
పాపాల ఫలితం
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతారు. గర్వం మన బుద్ధిని చిన్నగా చేస్తుంది. అది అత్యంత ప్రమాదకరం. తెలియకుండా అది ఒక ఉచ్చులా మారి మనల్నే నాశనం చేస్తుంది. దేవుడి వరంతో మరణం లేదని విర్రవీగిన రావణుడు ఎంత భక్తుడైనా అతని పాపం అతన్ని వెంటాడకుండా ఉండలేదు కదా!
మరో అర్థం..
రావణుడి పది తలలకు మరో అర్థం కూడా ఉందంటున్నది శాస్త్రం. దాని ప్రకారం ఆరు శాస్ర్తాలు, నాలుగు వేదాలకు గుర్తుగా ఆ పది తలలు ఉన్నాయని పండితులు చెబుతారు. ఇంతకీ అవేమిటంటే..
-సాంఖ్యాక శాస్త్రం
-యోగశాస్త్రం
-న్యాయశాస్త్రం
-వైశాశిక శాస్త్రం
-పూర్వమీమాంస
- ఉత్తర మీమాంస
-రుగ్వేదం
- యజుర్వేదం
-సామవేదం
- అథర్వణ వేదం
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565