అత్యంత పవిత్రం.. నాగవల్లీ దళం
నాగవల్లీ దళం.. ఇటు ధార్మిక కార్యక్రమాల్లోను, అటు సామాజిక కార్యక్రమాల్లోను, ఆధ్యాత్మికంగానూ, ఆరోగ్యపరంగానూ కూడా నాగవల్లీదళం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. నాగవల్లీదళం అంటే తమలపాకే. తమలపాకును సకల దేవతల స్థానంగా చెబుతారు. ఆకు తొడిమలో లక్ష్మీదేవి, మధ్యభాగంలో పార్వతీదేవి, కొసభాగంలో సరస్వతీ దేవి కొలువై ఉంటారని అంటారు. మిగతా దేవతలందరూ ఆకులోని మిగతాభాగాల్లో కుదురుకుని ఉంటారట.
ముఖ్యంగా ఆంజనేయుని పూజలో తమలపాకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆంజనేయుడు ఎక్కువగా తమలపాకుతోటల్లోను, అరటి తోటల్లోను విహరిస్తాడని పురాణ వచనం. హనుమంతునికి తమలపాకు మాలవేస్తే సకల సంపదలు చేకూరుతాయని, గ్రహదోషాలు కాని దృష్టిదోషాలు కానీ హనుమంతునికి తమలపాకు మాల సమర్పించడం ద్వారా దూరం చేసుకోవచ్చు.
చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సైతం తమలపాకు మాలను ఆంజనేయునికి సమర్పిస్తేచాలు వారు ఆరోగ్యభాగ్యాలతో విలసిల్లుతారు. వ్యాపారాల్లో నష్టాలు చవిచూస్తున్నవారు, శనిదృష్టితో బాధపడుతున్నవారు కూడా తమలపాకుల మాలను ఆంజనేయునికి సమర్పించినట్లయితే ఆ బాధలనుంచి విముక్తులవుతారు. ఆ మాల సమర్పించి ఆకుపూజను నిర్వహించి ప్రసాదంగా ఆ తమలపాకులను తిన్నవారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అని హనుమంతుని చరిత్ర చెబుతోంది.
త్రేతాయుగంలో సీతమ్మవారిని రావణాసురుడు అపహరించుకుని వెళ్లిన తరువాత అశోకవనంలో దాచాడు. హనుమంతుడు సీతానే్వషణలో లంకకు ప్రయాణమయ్యాడట. సీతమ్మకోసం వెదికి వెదికి అలసిపోయి చివరకు అశోకవనంలో కనబడిన సీతమ్మను చూచి అపరిమితానందం పొందాడట. అపుడు ఆ శోకదేవతగా నున్న సీతమ్మకు శ్రీరాముని ఉదంతాన్ని వినిపించి ఆనందం కలిగించగా సీతమ్మ తమలపాకు మాలను చేసి హనుమంతునిక సమర్పించి తనకు సంతోషాన్నిచ్చిన హనుమంతుని దీవించిందట.
ఓసారి శ్రీరామచంద్రులు తమలపాకులు తింటున్నప్పుడు ఆంజనేయులవారు ఇవి ఎందుకు సేవిస్తున్నారని అడుగగా ఆరోగ్యంకోసం అని రాముడు జవాబు చెప్పాడట. దానితో అప్పట్నుంచి తాను కూడా తమలపాకులు సేవించడం అలవర్చుకున్నాడట రామభక్త ఆంజనేయుడు. ఇట్లాంటి పుక్కిట పురాణాలుగా అనుకొన్నా నేటి సైన్సు పరిశోధకులు చెప్పే విషయాలు కూడా తమలపాకులో ఔషధగుణాలున్నట్లు ఉన్నాయి కనుక తమలపాకు ఆంజనేయుని సమర్పించి అటు ఆరోగ్యసంపదను, పరలోక సంపదను సంపాదించుకుందాం.
- మావూరు విజయలక్ష్మి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565