శూర్పణఖ
విజయం వెనుకాల ప్రోత్సాహం, ధైర్యం లాంటివే ఉంటాయనుకోవడం పొరపాటు. అంతులేని ఆవేదన, అరణ్యరోదన, సంపూర్ణమైన త్యాగం జీవితాల్ని నింపేసి తెర వెనుక పాత్రల్లా, అసలు కారణమైనా, ఇసుమంతైనా విలువ కట్టలేని జీవచిత్రంలా కనిపించేవి కోకొల్లలు. కానీ ప్రధాన పాత్రలే ప్రాముఖ్యాన్ని సంతరించుకొని ఆదర్శాన్ని తమ ఖాతాల్లో వేసుకోవడం పరిపాటే. లోక కల్యాణం వెనుక కనుమరుగైన త్యాగలైన్నో ఆదర్శానికి అవకాశం ఇవ్వకపోలేదు. కానీ అర్థం చేసుకునేంత పరిపక్వతే మనలో లేదు. అపార్థంలో సుస్పష్టమయ్యే కారణాలు అర్థం చేసుకొనే ప్రయత్నంలో ముందుకు రాకపోవడమే అందుకు నిదర్శనం. ఒక స్త్రీగా.. అందాన్నీ, ప్రకృతినీ అమితంగా ప్రేమించగలిగే వ్యక్తిగా, తన పని పూర్తి కాగానే ఎవ్వరినీ దోషులుగా చూడని పరిపక్వతే తన నైజంగా మలుచుకున్న శూర్పణఖ పరోక్ష మహనీయతను పొందడంలో తప్పులేదు. కాగల కార్యం తనద్వారా జరిగినందుకు ఒకింత గర్వపడి, తాను ప్రపంచం ముందు అంద విహీనంగానూ, కఠోరమైన, సూక్ష్మమైన బుద్ధిగల స్త్రీగానూ శూర్పణఖ మిగిలిపోయింది .
రామకథలో ఏమాత్రం ప్రాధాన్యతా లేని పాత్ర శూర్పణఖ. రాక్షసజాతి, భయంకర రూపం, నిలువెల్లా నిండిన పొగరు ఆమె రూపాన్నీ, వ్యక్తిత్వాన్నీ మన మనసుల్లో స్థిరం చేశాయి. కానీ ఆమె చర్యలో కనిపించే క్షణికావేశం ఖరీదు శూర్పణఖే చెల్లించినా, దాని ఫలితం మంచికి రూపమై నిలిచింది. మనిషైనా, రాక్షసైనా మనసులో కలిగే కోరికలను అదుపులో ఉంచుకోవడం కష్టతరమే. కానీ దాని మూలంగా తన జీవితాన్నే జీవచ్ఛవంగా మార్చుకున్న కన్నీటి ఉదంతం శూర్పణఖది.
గోదావరీ నదీ ప్రాంతంలో సీతారామ లక్ష్మణులు తీరిగ్గా మాట్లాడుకుంటున్న సందర్భంలో శూర్పణఖ రాముణ్ని చూసి ఇష్టపడింది. అంతే, అందమైన రూపంతో వారి ముందుకు వచ్చి రామునిపై ఇష్టాన్ని ప్రకటించింది. నీవెవరనీ, నీతో ఉన్నవారి పరిచయమేంటని నిర్భయంగా ప్రశ్నించింది. రాముడు తన గురించి చెప్పి సీత తన భార్యనీ, లక్ష్మణుడు తన తమ్ముడనీ, వారు అడవికి వచ్చిన కారణంతో సహా వివరించి, నువ్వెవరనీ ప్రశ్నిస్తాడు. రాముని సూటిదనం నచ్చిన శూర్పణఖ మరింత సంతోషంతో విశ్వావసుడి కూతురుననీ, రావణుడి సోదరిననీ, కుంభకర్ణుడూ, విభీషణుడూ తన తోబుట్టువులనీ గర్వంగా చెబుతుంది. ఈ దండకారణ్యమంతా నాదేననీ, రాజ్యం, రాజకీయం తనకు పడవనీ, అందుకే ప్రకృతి నీడలో యథేచ్చగా విహరించే రారాణిని నేననీ తన పరిచయాన్ని గొప్పగా ప్రకటిస్తుంది.
శూర్పణఖ రాముడితో తనను పెళ్లి చేసుకోమనీ, లేదంటే నన్ను కాదనడానికి కారణమైన సీతనూ, లక్ష్మణుడినీ తినేస్తాననీ అంటుంది. నవ్విన రాముడు నాకు పళ్లైపోయిందీ, ఇదుగో నా భార్య సీత. అదుగో లక్ష్మణుడిని అడిగి చూడమని అంటాడు. వారి హాస్యానికి కోపంతో రగిలిపోయిన శూర్పణఖ తన రాక్షసత్వాన్ని ప్రదర్శించేంతలోనే, లక్ష్మణుడు కత్తితో శూర్పణఖ చెవులూ, ముక్కూ కోసేశాడు. అంతే దండకారణ్యం తన రోదనకు అదిరిపడింది. దండకారణ్య ప్రాంతం తన జనస్థానం, దాన్ని తన మరో సోదరుడైన ఖరుడు పాలిస్తున్నాడు. తన బాధను, వేదననూ చెప్పుకోవడానికి ఖరున్ని చేరింది శూర్పణఖ. జరిగిందంతా వివరించి వారి వినాశనం జరగాలని శాసించింది. దాని ఖరీదు ఖరునితో ఘోర యుద్ధం, పధ్నాలుగు వేల రాక్షససేన హతమయ్యారు. ఖరుడూ నేలకొరిగాడు. ఇదంతా చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో లంకను చేరింది శూర్పణఖ.
Surpanaka
రాక్షస జనస్థానం రాముని వల్ల నాశనమై పోయిందనీ, లక్ష్మణుడి వల్ల తాను విరూపగా మారిపోయాననీ, రాముని భార్య అయిన సీతను నీ పట్టపురాణిని చేద్దామనుకునే యత్నంలో ఇదంతా జరిగిందనీ, రామున్ని పరాభవించడం శక్తితో అసంభవమనీ, యుక్తితో సాధించాలనీ, అందుకు సీతను లంకకు తీసుకురావడమే తరుణోపాయమనీ ఆలోచించి నిర్ణయం తీసుకోమని పదేపదే చెబుతుంది. ఒక రకంగా రావణున్ని ప్రలోభపెట్టి సీతను అపహరించేందుకు సన్నద్ధం చేసింది. శూర్పణఖ అనుకున్నట్లే జరిగింది. లోకకళ్యాణం తథ్యమని మనసులో నిశ్చయించుకొని లంకనుండి అరణ్యానికి కదిలింది. తన కురూపితనానికి ప్రకృతిలోని అందం ఔషధమైంది. తన కోపానికీ, కసికీ, ఆవేశానికీ ప్రకృతే సమాధానమైంది.
చిన్నతనం నుంచే అరణ్యవాసంలోనే పెరిగిన శూర్పణఖకు బంగారు లంక రుచించలేదు. అందుకే తన బాధను పంచుకునే ప్రకృతి ఒడిలోకి చేరింది. తన అందవిహీనమైన రూపాన్ని జీర్ణించుకోవడానికి, తనలో జరిగిన సంఘర్షణకూ అనంత ప్రకృతే ఆలవాలమైంది. అరణ్య విహారంలో కలిగే హాయి అందమైన లంకలో లేదనుకుంది. అందుకే ప్రకృతికే అంకితమై జీవితాన్ని భరించింది.
సీతాపహరణం జరుగకపోతే రామ రావణ యుద్ధం జరిగేదే కాదు. రావణ సంహారం జరుగక పోయుంటే శాంతికి స్థానమే ఉండేది కాదు. అందుకని ఆ మహత్కార్యానికి తాను హేతువుగా మారింది. తన రూపాన్నే బలిచ్చింది. ప్రాణత్యాగాన్ని మించిన గొప్పతనం శూర్పణఖ జీవితంలో ధ్వనిస్తుంది. లక్ష్మణుడు శూర్పణఖను ఆనాడే చంపేస్తే కథ వేరేలా ఉండేదేమో. స్త్రీని చంపడం అధర్మమనే కారణం కాస్త పక్కకు పెడితే అంతకన్నా గొప్ప త్యాగం శూర్పణఖ రూపంలో నిగ్గుతేలింది.
-ప్రమద్వర
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565