మహా శక్తిపీఠం పురుహూతికా క్షేత్రం-
Puruhutika devi
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ అంటూ ఆ శక్తిస్వరూపిణిని ఏ రూపంలో స్తుతించినా నేనున్నానంటూ అభయమిస్తుంది. భక్తులు ఆర్తితో పిలిస్తే చాలు... తన ఉగ్రరూపాన్ని సైతం పక్కనపెట్టి అమ్మలా అక్కున చేర్చుకుంటుందని ఓ నమ్మకం. తనను నమ్మిన వారికి ఎంత పెద్ద కష్టమొచ్చినా దూదిపిందెలా తేల్చేస్తుందని ఓ భరోసా. అలాంటి అమ్మకు నెలవైనదీ, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటీ పిఠాపురంలో కొలువైన పురూహుతికా అమ్మవారి ఆలయం.
ప్రసిద్ధ శైవక్షేత్రాలన్నింటిలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం విశిష్టమైంది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. అష్టాదశ శక్తిపీఠాల్లోని దశమ శక్తిపీఠం ఇక్కడే కొలువుదీరింది. స్వయంభూ దత్తాత్రేయుడి జన్మస్థలం కూడా ఇదే. ఆయన అవతారంలోనే శ్రీపాద వల్లభుడూ, కుక్కుటేశ్వరస్వామీ కొలువై ఉన్నారు. వ్యాసమహర్షి తన శిష్య బృందంతో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు స్థల పురాణాలు పేర్కొంటున్నాయి. ‘ప్రపంచంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ ఇక్కడే కొలువయ్యాయా అన్నట్టు ఉంది ఈ పీఠికాపురం’ అని శ్రీనాథుడు ఈ ప్రాంతాన్ని అభివర్ణించినట్లు భీమేశ్వర పురాణం తెలియజేస్తోంది.
స్థల పురాణం...
దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞంలో తన భర్త అయిన శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవీ ఆ యజ్ఞవాటికలోనే ఆత్మాహుతి చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన శంకరుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు. భార్యపై ఉన్న అనురాగంతో ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయ తాండవం చేశాడు మహేశ్వరుడు. లయకారకుడైన ఆయన తన కార్యాన్ని నెరవేర్చకపోవడంతో భూభారం పెరిగిపోవడమే కాకుండా రాక్షసుల తాకిడి కూడా ఎక్కువయింది. దీన్ని గమనించిన ఆది పరాశక్తి సతీదేవి మృతదేహాన్ని ఖండించమని శ్రీమహావిష్ణువుని ఆజ్ఞాపించింది. అమ్మ ఆనతిమేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీ మృతదేహాన్ని విచ్ఛిన్నం చేయగా, అవి ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో పడ్డాయనీ, ఇలా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే ఈ యుగంలో శక్తిపీఠాలుగా పూజలందుకుంటున్నాయనీ పురాణాలు తెలియజేస్తున్నాయి. వీటిలో పిరుదుల భాగం పడిన ప్రాంతం పిఠాపురం. మిక్కిలి ప్రసిద్ధిచెందిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది పదవది. పురూహుతికా దేవిగా అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటోంది. తొలుత ఈ ప్రాంతాన్ని పీఠికాపురంగా పిలిచినప్పటికీ కాలక్రమంలో పిఠాపురంగా స్థిరపడింది.
విశేష పూజలు...
పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వరస్వామి సన్నిధిలో కొలువైన అమ్మవారికి నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయి. ఆదిశక్తి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందన్న నమ్మకంతో ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పురూహుతికా శక్తిపీఠంలో ప్రతి శుక్రవారం రోజూ, పర్వదినాల్లోనూ కుంకుమార్చనలను విశిష్టంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రోజూ శత చండీయాగాన్ని నిర్వహిస్తారు. అమ్మవారి దీక్ష చేపట్టిన భక్తులు తొమ్మిది రోజులపాటు ఈ క్షేత్రంలో పూజలు చేస్తారు.
దత్తుడి జన్మస్థలం
దత్తాత్రేయుడి జన్మస్థానంగా పిఠాపురం ప్రసిద్ధిగాంచింది. గుజరాత్, మహారాష్ట్ర, వారణాసి, ఒడిశా, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ జరిగే వేదపారాయణం కూడా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీంతోపాటు పిఠాపురం పట్టణంలో వేణుగోపాలస్వామి, గుడివీధిలో శ్రీపాదవల్లభుడి ఆలయం కొలువుతీరాయి.
ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలు కాశీ విశిష్టతను తెలియజేసేవిధంగా ఉంటాయి. దసరా నవరాత్రుల్లో పురూహుతికా అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. పాదగయ క్షేత్రంలో నిత్యం 200 మందికి అన్నదానం చేస్తారు. అలాగే దుర్గామాలధారణ చేసిన భక్తులకు ఇక్కడ భోజన సదుపాయం ఉంటుంది.
పూర్వికులకు శైవక్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. పాదగయ పుష్కరిణిలో స్నానమాచరించి పిండ ప్రదానాలు ఇచ్చేందుకు దేశం నలుమూలల నుంచీ చాలామంది ఇక్కడికి వస్తుంటారు. శివనామస్మరణలతో నిత్యం మార్మోగే ఈ క్షేత్రం గయాసురుడి పాదాలకు సాక్ష్యంగా నిలిచి పాదగయగా కీర్తికెక్కింది.
ఎలా వెళ్లాలంటే...
కాకినాడ-అన్నవరం మధ్యన ఉన్న ఈ క్షేత్రం అన్నవరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సామర్లకోటకు 11 కి.మీ., రాజమహేంద్రవరానికి 70 కి.మీ. దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి రైలు, రోడ్డుమార్గాలు ఉన్నాయి. హైదరాబాదు నుంచి వచ్చేవారు సామర్లకోట రైల్వే స్టేషన్‌కు వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు రైలు సౌకర్యం ఉంది.
- పెదపూడి చిన్నబాబు, న్యూస్‌టుడే పిఠాపురం
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565