MohanPublications Print Books Online store clik Here Devullu.com

డేటా పొదుపు చేద్దాం ఇలా!-Saving Data

డేటా పొదుపు చేద్దాం ఇలా!
మొన్నటి వరకూ ఒక జీబీ డేటా నెలంతా వాడేవారు. ఇప్పుడలా కాదు.. ప్రముఖ టెలీకాం కంపెనీలు రోజుకు కనీసం ఒక జీబీ 4జీ డేటా ఇస్తున్న రోజులివి. ఆ ఒక్క జీబీ కూడా నెటిజన్లకు సరిపోవటంలేదు. రోజులో మధ్యాహ్నం లోపే 1జీబీ డేటా పూర్తవుతోంది. డేటాపై నియంత్రణ లేకపోవటం వల్లే ఇలా జరుగుతుంటుంది. డేటా వృథా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్‌ పాటించాల్సిందే.
అలర్ట్స్‌ను సెట్‌ చేసుకోండి!
డేటా వృథా కాకుండా ఉండాలంటే ఎంత వినియోగిస్తున్నారో తెలియాలి. ఇందుకోసం మొబైల్‌ డేటా లిమిట్‌ను సెట్‌ చేసుకోవాలి. మీరు లిమిట్‌ను సెట్‌ చేసుకున్న డేటాను వినియోగించుకోగానే అలర్ట్‌ రూపంలో సందేశం వస్తుంది. దీంతో డేటా ఎంత వాడుతున్నారో తెలిసిపోతూ ఉంటుంది. మొబైల్‌ డేటా లిమిట్‌ను సెట్‌ చేసుకోవడానికి సెట్టింగ్స్‌లో డేటా యూసేజ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
బ్రాక్‌గ్రౌండ్‌ డేటాకు చెక్‌
ఫోన్‌ వాడకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని యాప్స్‌ రన్‌ అవుతూ ఉంటాయి. ఇవి మొబైల్‌ డేటాను తినేస్తుంటాయి. యాప్‌ ఓపెన్‌ చేయక
పోయినా నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ యాప్‌ రన్‌ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ నోటిఫికేషన్లు వైఫై ఉన్నప్పుడు మాత్రమే రావాలి.. డేటా ఉపయోగిస్తున్నప్పుడు రాకూడదు అనుకుంటే సెట్టింగ్స్‌లో డేటా యూసేజ్‌లోకి వెళ్లి కుడివైపున ఉన్న త్రీడాట్స్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి ‘రిస్ట్రిక్ట్‌ మొబైల్‌ డేటా’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
ఫేస్‌బుక్‌ లైట్‌
ఫేస్‌బుక్‌ అద్భుతమైన యాప్‌ అనడంలో సందేహం లేదు. కానీ దానివల్ల ఫోన్‌ వేగం తగ్గిపోతుంది. ఇది నిపుణులు చెబుతున్న మాటే. మొబైల్‌ డేటా వినియోగం కూడా ఎక్కువగా జరుగుతుంది. దీన్ని అరికట్టడం కోసమే ఫేస్‌బుక్‌ లైట్‌ యాప్‌ను తీసుకొచ్చింది. మొబైల్‌డేటాను సేవ్‌ చేసుకోవాలనుకునే వారు దీన్ని ఎంచుకోవచ్చు. 
వాట్సప్‌లో ఆటో డౌన్‌లోడ్‌
తెలియకుండానే ఎక్కువ డేటా వినియోగం జరిగేది వాట్స్‌పలోనే. రోజూ వాట్స్‌పలో ఫొటోలు, వీడియోలు, ఆడియో ఫైల్స్‌ వస్తుంటాయి. ఆ ఫైల్స్‌ అన్నీ ఆటో డౌన్‌లోడ్‌ కావడం వల్ల డేటా వినియోగం పెరిగిపోతూ ఉంటుంది. ఆటో డౌన్‌లోడ్‌ను డిసేబుల్‌లో పెట్టుకోవడం ద్వారా డేటా వృథాను అరికట్టుకోవచ్చు. ఇందుకోసం వాట్స్‌పలో కుడిపైపున ఉన్న త్రీడాట్స్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. తరువాత డేటా యూసేజ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే మీడియా ఆటో డౌన్‌లోడ్‌ అప్షన్‌ కనిపిస్తుంది. అందులో ‘వెన్‌ యూజింగ్‌ మొబైల్‌ డేటా’లో అన్నింటిని డిస్‌సెలక్ట్‌ చేస్తే సరిపోతుంది. 
అప్‌డేట్లన్నీ వైఫైతోనే!
మొబైల్‌లో డేటా ఎక్కువగా యాప్స్‌ అప్‌డేట్స్‌ కోసం ఎక్కువ ఖర్చవుతూ ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్‌లో ఇరవై యాప్స్‌ ఉన్నట్లయితే అవి రెగ్యులర్‌గా అప్‌డేట్‌ అవుతూనే ఉంటాయి. మీకు తెలియకుండానే డేటా వృథా అవుతూనే ఉంటుంది. దీన్ని నియంత్రించుకోవాలంటే యాప్స్‌ అప్‌డేట్‌ వైఫై కనెక్టివిటీ ఉన్నప్పుడు మాత్రమే అయ్యేలా సెట్‌ చేసుకోవాలి. ఇందుకోసం ప్లేస్టోర్‌ యాప్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌లో ఆటో అప్‌డేట్‌ యాప్స్‌లో ‘ఆటో అప్‌డేట్‌ వెన్‌ వైఫై ఓన్లీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
డేటా కంప్రెషన్‌
గూగుల్‌ పాపులర్‌ బ్రౌజర్‌ క్రోమ్‌ వాడుతున్నట్లయితే డేటా వినియోగం 50 శాతం వరకు తగ్గించుకోవచ్చు. డేటా కంప్రెస్‌ కావడం వల్ల బ్రౌజింగ్‌ వేగం కూడా పెరుగుతుంది. ఇందుకోసం క్రోమ్‌ ఓపెన్‌ చేశాక కుడివైపున ఉన్న త్రీడాట్స్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయండి. ఇప్పుడు సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా సేవర్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌లో పెట్టుకుంటే చాలు. 
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో సైతం...
ఫేస్‌బుక్‌ చూస్తున్నప్పుడు వీడియోలు ఆటో ప్లే కావడం గమనించే ఉంటారు. దీనివల్ల కూడా డేటా వినియోగం పెరిగిపోతుంది. ఈ వృథాని అరికట్టాలంటే ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేశాక సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్‌ ఆప్షన్‌లో ‘వీడియో ఆటోప్లే’ని ఎంచుకోవాలి. ఇందులో ‘నెవర్‌ ప్లే వీడియోస్‌ ఆటోమెటికల్లీ’ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. ట్విట్టర్‌లోనూ ఇదే విధంగా వీడియోలు ఆటోప్లే కాకుండా డిసేబుల్‌లో పెట్టుకోవాలి. 
పాటలు ఆఫ్‌లైన్‌లో వినండి
మొబైల్‌లో పాటలు వినడం కోసమే డేటాను వినియోగించుకోవడం కరెక్ట్‌ కాదు. డేటా వినియోగాన్ని తగ్గించుకోవాలంటే ‘వింక్‌’ వంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని వైఫై కనెక్ట్‌ అయిన సమయంలో పాటలు డౌన్‌లోడ్‌ అయ్యేలా సెట్టింగ్స్‌ చేసుకోవాలి. ఈ పాటలను డేటాను ఆన్‌ చేయకుండా ఆఫ్‌లైన్‌లో వినొచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డేటా వృథాని అరికట్టుకోవచ్చు.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list