ఆధ్యాత్మిక త్రివేణి
భాద్రపద బహుళ అమావాస్య మొదలు ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి వరకూ భక్తి పారవశ్యంలో ఓలలాడేందుకు తెలుగు రాష్ర్టాలు సిద్ధమవుతున్నాయి. వేలుపుటమ్మ బతుకమ్మ పండగ పూల గుబాళింపుతో శ్రీకారం చుట్టుకొని, ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గమ్మ కరుణా వీక్షణాలతో కొనసాగి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలతో ముగిసే ఈ వేడుకలన్నీ ఆద్యంతం నేత్రపర్వం... త్రిలింగ దేశం ఆధ్యాత్మిక త్రివేణీ సంగమం...
దుర్గ మాయమ్మ...
శరన్నవరాత్రుల్లో రోజుకో అవతారంతో భక్తజనసందోహానికి కన్నులవండువ చేసే కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా గణుతికెక్కిన కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే దేశం నలుమూలలనుంచి వచ్చే భక్తులు... భవానీ దీక్షాపరులతో విజయవాడ నగరం జన సంద్రమే అవుతుంది. నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే అన్నీ శుభాలే కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి అంటే ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీన సర్వకవచాలంకార దుర్గాదేవి అవతారంతో మొదలై, విజయదశమి రోజైన 30వ తేదీన రాజరాజేశ్వరీ దేవి అలంకారంతో ఈ వేడుకలు సమాప్తమవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో శక్తిపీఠాలున్న ఆలంపూర్ (జోగులాంబ), శ్రీశైలం (భ్రమరాంబ), ద్రాక్షారామం (మాణిక్యాంబ), పిఠాపురం (పురుహూతిక) ఆలయాల్లో కూడా అమ్మవారి ఉత్సవాలకోసం అతి వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పూల నైవేద్యం
తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ పల్లెపట్టుల సమైక్య జీవనానికి ప్రతీక. పేదా గొప్పా తారతమ్యం లేకుండా మహిళలంతా కలిసికట్టుగా చేసుకొనే ఉమ్మడి వేడుక. బాధ్రపద అమావాస్య... అంటే మహాలయ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై, ఆశ్వీయుజ శుద్ధ అష్టమి లేదా నవమి నాడు సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ పూల జాతరలో రోజుకో నైవేద్యంతో అమ్మవారిని ఆరాధిస్తారు. తీరుకొక్క పేరుఁతో, రంగురంగుల పూలతో తీర్చిదిద్దే బతుకమ్మల్ని చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు. ‘‘బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో.... బంగారు బతకమ్మ ఉయ్యాలో....’’ అంటూ బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ ఆటలాడతారు. దగ్గర్లోని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవైన ఆరంభమై, ఇరవై ఎనిమిదితో ముగిసే బతుకమ్మ పండగకోసం తెలంగాణలోనే కాదు, విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు సైతం సన్నద్ధమవుతున్నారు.
బ్రహ్మమే కాదు...
బ్రహ్మోత్సవమూ ఒక్కటే
ఉత్సవాలు ఎన్నయినా ఉండొచ్చు. కానీ అవన్నీ తిరుమల కోనేటి రాయుడి బ్రహ్మోత్సవం తరువాతే. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి వైభవాన్ని చూడ్డానికి రెండు కళ్ళూ చాలవంటారు భక్తులు. ఒకసారైనా ఈ వేడుకని దర్శించుకొని తరించాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. తిరువీధుల్లో ఊరేగే దేవదేవుడి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 23న మొదలై అక్టోబర్ ఒకటో తేదీ వరకూ కొనసాగుతాయి. కోయిల్ అళ్వార్ తిరుమంజనంతో సన్నాహాలు మొదలవుతాయి. సెప్టెంబర్ 22న అంకురార్పణ జరుగుతుంది. ఉత్సవాల్లో ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలతో, వివిధ వాహనాలపై దేవేరిలతో కలిసి ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజున ధ్వజారోహణంతో మొదలై, చివరిరోజన ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565