రాగి వర్ణం... సరికొత్త ఫ్యాషన్ రాగం
‘చూడగానే ఎదుటివాళ్లను ప్రేమలో పడేసే రొమాంటిక్ కలరేమిటా’ అని శోధించిన వర్ణ నిపుణులకి అంతిమంగా దొరికిన సమాధానమే కాపర్. అందుకే ఇప్పటికే ఎంతో ప్రాచుర్యం పొందిన బంగారమూ వెండి వంటి తోటి మెటాలిక్ రంగుల్నీ, నీలమూ పచ్చల్లాంటి రత్నాల సౌందర్యాన్నీ, నారింజా ఎరుపూ వర్ణాలతో నిండిన హరివిల్లు అందాల్నీ, గులాబీ వంగ వంటి పూలరంగుల్నీ పక్కకు నెట్టేసి తెరమీదకొచ్చింది తాజా ఫ్యాషన్ కలర్ తామ్రం ఉరఫ్ కాపర్ ఉరఫ్ రాగి. ఆ రాగి సోయగాలమీద ఓ లుక్కేస్తే...
ప్రకృతిలో విరిసిన పువ్వులే రంగుల పుట్టిల్లు అని కవివర్యులూ, కాదు హరివిల్లే అనీ కాంతి నిపుణులూ, లేదు లేదు...నేలమాళిగే రంగులనిధి అని ఖనిజ పరిశోధకులూ...ఇలా ఎవరికి వాళ్లు రంగుల పుట్టుపూర్వోత్తరాల గురించి భాష్యాలు చెబుతుంటారు. మొత్తమ్మీద సృష్టిలోని రంగులన్నీ పువ్వులనుంచో హరివిల్లునుంచో ఖనిజాలనుంచో పుట్టినవే. ఆ పేర్లతో ప్రసిద్ధి చెందినవే. అయితే, వీటన్నింటిలోకెల్లా అందమైన రంగేదీ అంటే, ‘నాకు నప్పిన రంగే’ అని ఎవరికి వాళ్లు చెప్పుకోవచ్చుగాక. కానీ ప్రపంచ వర్ణశాస్త్రనిపుణులు మాత్రం కాలానుగుణంగా మారుతోన్న వ్యక్తుల మనస్తత్వాల్నీ జీవనశైలినీ అంచనావేస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలోనూ సౌందర్యోత్పత్తుల తయారీలోనూ గృహాలంకరణలోనూ ఉపయోగించేందుకు ప్రత్యేకంగా కొన్ని రంగుల్ని ఎంపికచేస్తుంటారు. అలా గ్లోబల్ కలర్ రిసెర్చ్‌కు చెందిన నిపుణులు ఇటీవల ఎంపికచేసిన రంగుల్లో కాపర్ ఒకటి. దాంతో ఇప్పుడిది ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ప్రియుల్ని కట్టిపడేస్తోంది.
గోధుమరంగుతో కూడిన నారింజఎరుపునే రాగిరంగుగా కొందరు వర్ణిస్తే, పింకీ రెడ్ లేదా పింకీ ఆరెంజే తామ్ర వర్ణమని మరికొందరు అభివర్ణిస్తారు. ఎరుపురంగుకి చెల్లోఅక్కో అంటూ చుట్టరికాన్నీ కలిపేస్తారు ఇంకొందరు. మొత్తమ్మీద ఇదీ అని చెప్పలేని ఒకలాంటి మెరుపుతో కూడిన ఎరుపే కాపర్. రాగికి ఉన్న మరో పేరే ఆరమ్ రబ్రమ్...లాటిన్ భాషలో రెడ్‌గోల్డ్ అని అర్థం. ఎర్రబంగారంగా పేరొందిన ఆ రాగి వాడకం ఇటీవల అంతటా పెరిగిందన్నది తెలిసిందే.
కాపర్ ఫ్యాషన్!
ఖనిజంగా దాని వాడకం సంగతి పక్కనబెడితే, డిజైనర్లంతా ఆ రంగుమీద కొత్తగా మమకారాన్ని పెంచుకోవడంతో అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలమీద కాపర్ కలర్ హల్‌చల్ చేస్తోంది. గోధుమా తెలుపూ పసుపూ... ఇలా కాపర్‌తో మ్యాచయ్యే రంగులు చాలానే ఉన్నప్పటికీ నీలిపచ్చ దీనికి చూడచక్కని జోడీ అంటూ రకరకాల కాపర్ సమ్మేళనాల్నీ సృష్టించేస్తున్నారు నయా ఫ్యాషనిస్టులు. కేవలం డ్రస్సులూ యాక్సెసరీల రూపకల్పనలతో ఫ్యాషన్ లోకమే కాదు, కాస్మొటిక్ ప్రపంచం సైతం రాగి రంగు సౌందర్యంమీద మనసు పారేసుకుంది. ఫలితం... లిప్‌స్టిక్కులూ నెయిల్‌పాలిషులూ ఫేసుపౌడర్లూ ఐమేకప్పుల్లో కూడా కాపర్ హవా నడుస్తోంది. పైగా రాగివర్ణం శృంగార ప్రేరితమనీ, కోరికనీ ప్రేమనీ సూచిస్తుందనీ కలర్‌థెరపిస్టులు నొక్కి మరీ చెప్పడంతో దీనిమీద మోజు మరింత పెరిగిందనే చెప్పాలి. పాశ్చాత్యదేశాల్లో అమ్మాయిల హాటెస్ట్ హెయిర్ కలరూ కాపరేనట. దాంతో బాలీవుడ్ భామల జుట్టుకీ ఆ రంగు అతుక్కుంటోంది.
ప్రకృతి సోయగం!
శీతకాలపు గృహాలంకరణలోనూ కాపర్ రంగుదే హవా. నులివెచ్చని భానూదయం, చల్లచల్లని సూర్యాస్తమయ వేళల్లో ఆకాశంలో కనువిందుచేసే నారింజఎరుపు సౌందర్యాన్నీ, లేలేత రాగి రంగు సొగసుల్ని అద్దుకున్న చిగురుటాకుల్నీ తలపించేలా కాపర్ వర్ణం పడకింటిలో ఉన్నా హాల్లో ఉన్నా మనసును మధురోహల్లో ముంచెత్తుతుందట. రకరకాల థీమ్ వెడ్డింగుల్లోనూ కాపర్ వర్ణానికి ఆదరణ పెరుగుతోంది. వేడుకకు ఆహ్వానం పలికే కార్డుల నుంచి కేకుల వరకూ అన్నీ ఆ రంగుల్లోనే మెరుస్తూ అతిథుల్ని ఆకర్షిస్తున్నాయి. ఇక, సంపన్నుల విందుభోజనాల్లో గ్లాసుల నుంచి గిన్నెల వరకూ అన్నింటా రాగి ఆతిథ్యమే కనువిందు చేస్తోంది. ఒకప్పుడు ఇంట్లో ఓ మూల కిటికీలో రాగిచెంబు కనిపిస్తేనే ముఖం చిట్లించుకునే యువత నేడు, అదే రాగి వస్తువులతో భోజనాల బల్లల్ని నింపేయడం విశేషం. వంటపాత్రల్లో రాగి వాడకంవల్ల, ఆ ఖనిజం ఒంట్లోకి చేరడంతోబాటు, అనేక సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తుందన్న శాస్త్రీయ పరిశోధనల కారణంగానే రాగి పూర్వవైభవాన్ని దక్కించుకుందని చెప్పొచ్చు.
వస్తువుల రూపంలోనే కాదు, రెడ్‌గోల్డ్ అన్న పదాన్ని నిజం చేస్తూ ఆభరణాల రూపంలోనూ రాగి వాడకం పెరుగుతోంది. గతంలో కేవలం గిరిజన తెగలకు మాత్రమే పరిమితమైన రాగి నగల సోకులు, ఇప్పుడు ఆధునికుల్నీ అలరిస్తున్నాయి. అందమైన నెక్లెసులూ చెవిపోగులూ బ్రేస్‌లెట్లూ ఉంగరాలూ... ఇలా అన్నింటా తామ్రం మెరుస్తూ నేటి తరాన్ని మురిపిస్తోంది. ఆరోగ్యాన్ని పంచిస్తుందన్న కారణంతోనూ వీటిని ధరించేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మనమూ ఆ రాగి రంగుని ఆనందంగా స్వాగతించేద్దామా..!
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565