సంపత్కరం యజ్ఞోపవీత ధారణం
యజ్ఞోపవీతము అనే పదము ‘యజ్ఞము’ ‘ఉపవీతం’ అనే రెండు పదాల కలయకవల్లఏర్పడింది. యజ్ఞము అంటే ‘యాగము’ ‘ఉపనీతము’ అంటే ‘దారము’అనే అర్థాలు ఉన్నాయి. యజ్ఞో పవీతం అంటే యాగకర్మ చేత పునీతమైన దారము అని అర్ధము. ఎడమ భుజముమీదుగా కుడి పార్శ్వమున వ్రేలాడు జందెము అనే అర్థమూ ఉంది. ఉపనయనం చేసుకుని జంధ్యాన్నివేసుకున్న వ్యక్తి త్రికాల సంధ్యావందనం చేయుటకు, గాయత్రీ పూజ చేయుటకు, ఇతర పూజలు చేయించుటకు అర్హుడవుతాడు. యజ్ఞోపవీతాన్ని ధరించడానికి ముందు ఆచమనం, సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత యజ్ఞోపవీతాన్ని పూజించాలి. ఆ తర్వాత రెండు చేతులయొక్క బొటన వ్రేళ్లతోనూ, యజ్ఞోపవీతాన్ని తీసుకుని ‘యజ్ఞోపవీతం, పరమం పవిత్రం, .... అనే శ్లోకాన్ని పఠించి మొదట కుడిచేయి ఉంచి ముడి ముందుగా వచ్చునట్లుగా ధరించాలి. నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన అనంతరం పాత (జిగి) యజ్ఞోపవీతాన్ని విసర్జించాలి. యజ్ఞోపవీతం, యది జీర్ణవంతం, ..... అనే శ్లోకాన్ని పఠిస్తూ పాత జంధ్యాన్ని క్రిందినుంచి తీసివేయాలి అంటారు. పాత జంధ్యాన్ని నదిలో గానీ, ఎక్కడైనా ఎవ్వరూ తొక్కని ప్రాంతంలో విడవాలి. తరువాత యధాశక్తి గాయత్రీ మంత్రాన్ని జపించాలి. ఇట్లా చేస్తారు కనుకనే విప్రులను ద్విజులు అంటారు. ద్విజులు రెండు జన్మలు కలిగినవారు అని ఒకటి అమ్మ కడుపునుంచి పుట్టడం ఒక జన్మ అయతే ఈ గాయత్రీ ధేవిని ఉపాసించి యజ్ఞోప వీతాన్ని ధరించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందడం రెండవ జన్మ అన్నమాట. ఇంతటి పవిత్రతకు, దైవత్వానికి సంకేతమైన యజ్ఞోపవీతాన్ని ధరించుటకు కొన్ని నియమాలు రూపొందించారు మన పూర్వులు. వాటినన్నింటిని గురువుగారి నుంచి గ్రహించాలన్నది పెద్దలమాట. జంధ్యం 96 బెత్తలుండాలి. మూడు పోగులుండాలి. నాభివరకే ఉండాలనేది కూడా నియమమే.నాభికి క్రింద ఉంటే తపస్సు, కీర్తి క్షీణిస్తాయ అంటారు. ఆవగింజంత లావు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ లావు ఉంటే కీర్తి నశిస్తుంది. మరీ పల్చగా ఉంటే ధన హాని కలుగుతుందంటారు. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసకోవాలని అంటారు. ఉపనయనాన్ని ఎనిమిది సంవత్సరాల వయస్సు దాటిన బాలురకు పనె్నండు సంవత్సరాల వయస్సులోపు బాలురకు ఉపనయనం చేయాలనేది ఒక నియమం. ఉపనయనం చేసిన బాలురకు ఒంటి ముడి ఉన్న అంటే మూడు పోగుల జంధ్యాన్ని ధరింపచేస్తారు. ఈ మూడు పోగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు. కాగా వివాహమైన వారు మూడు ముడులువున్న అంటే తొమ్మిది పోగులున్న యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. యజ్ఞోపవీతానికి వున్న ముడి కి ‘బ్రహ్మముడి’అని పేరు. నవ తంతువుల్లో ఓంకారము, నాగదేవతలు, సోముడు, పితరులు, ప్రజాపతి, వాయు వు, సూర్యుడు, ఇతర దేవదేవులు, ఉత్తమ దేవగుణాలు కొలువై ఉంటారు. ఇంతటి మహిమా న్వితమైన యజ్ఞోప వీతాన్ని మొట్టమొదట గా బ్రహ్మ తయారు చేశాడంటారు. అలా బ్రహ్మ తయారు చేసిన జంధ్యానికి లోక సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టాడని, లయకారకుడు సకల శుభంకరుడైన రుద్రుడు ముడివేశాడని అంటారు. ఆ తరువాత సకల సౌభాగ్యదాయని సకల జ్ఞానరాశి అయన సావిత్రీ దేవి అభిమంత్రించింది దాని వల్లనే ఈ యజ్ఞోపవీతానికి అంతటి పవిత్రత చేకూరింది. శారీరక, మానసిక పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధమని మన పెద్దలు చెబుతారు.
-చోడిశెట్టి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565