విధురనీతి.. నేడూ ఆచరించదగ్గదే
కౌరవ పాండవ యుద్ధం ముగిసింది. కౌరవ పక్షం వారు మరణించారు. ఇక మిగిలింది ధృతరాష్ట్ర గాంధారీలు మాత్రమే. వారిద్దరూ ధర్మరాజు పంచన బతుకుతున్నారు. ధృతరాష్ట్రుడు దుష్టుడు. ఆయనకు రాత్రులు నిద్రపట్టటంలేదు. చెడు సంకల్పం ఉన్నవాడికి అన్నం, నీళ్లు సహించవు, నిద్ర రాదు. మొదటినుంచి ధృతరాష్ట్రుడివల్లే ధర్మపథాన నడిచే పాండవులకు కష్టాలు. భగవంతుడు వారి పక్షం ఉన్నా, కాలం కలిసి రావాలని చూశారు. ధర్మం గెలిచింది. విదురుడు మంచివాడు. మొదటినుంచి ధృతరాష్ట్రుడికి మంచి చెప్పుకుంటూ వచ్చాడు కాని వినలేదు, మూర్ఖుడు. మమకారంతో ధృతరాష్ట్రుడు, చెలిమితో కర్ణుడు ఇద్దరూ దుర్యోధనుడికి ధైర్యం నూరిపోశారు. ఫలితం అనుభవించారు. ఇప్పుడు దుఃఖిస్తున్నాడు. నిద్రలేమితో కుమిలిపోతున్నాడు. అప్పుడు మంచిమాటలకోసం సోదర విదురున్ని పిలిపించుకొని కొన్ని మంచి మాటలు చెప్పమని అర్థించాడు. ఇప్పటికైనా తన దారికి వచ్చినందుకు విదురుడు సంతోషించి ధృతరాష్ట్రునికి మంచి మాటలు వినిపిస్తున్నాడు.
సోదరా ధృతరాష్ట్రా, మధుర పదార్థాలు ఒక్కడు తినకూడదు. నీ దగ్గరున్న మధుర పదార్థాలు ఇతరులతో పంచుకొని తినాలి. ఒకవేళ ఎదురుగా ఎవరూ లేకుంటే, దైవానికి నివేదించి తినాలి. అప్పుడది ప్రసాదం అవుతుంది. ప్రసాదం అంటే ప్రసన్నత నీకు కలుగుతుంది.
అందరూ నిద్రపోతుంటే రాత్రి నీ ఒక్కడివి మేల్కొని ఉండకూడదు. నీవు కూడా నిద్రపోవటానికి ప్రయత్నించు లేకుంటే చెడు ఆలోచనలు, కామప్రేరణలు కలుగుతాయి. ఎంతకూ నిద్ర రాకుంటే భగవన్నామం కానీ ఏదైనా మంచి పుస్తకం చదువుకుంటూ ఉండటం కానీ లేక శ్వాసమీద ధ్యాస ఉంచి నిద్రపోవటానికి ప్రయత్నించు. రాత్రి సమయం పాపకార్యాలకు దోహదపడుతుంది. రాత్రి ఎప్పటికీ ఒంటరిగా ఉండకూడదు. ఏదైనా సమస్యలు ఎదురైనపుడు ఒంటరిగా ఆలోచించకు. రెండవవాన్ని సలహా అడుగు. సమస్య పరిష్కరించుకో. మంచివాడిని సంప్రదించు. ప్రతి చిన్న విషయానికి రెండవవాన్ని సంప్రదించకు. గట్టి సమస్యలకీ, నీవల్ల కానిదానికీ రెండవవాడిని సలహా అడిగి తెలుసుకో. ధృతరాష్ట్రుడికి ఎన్నో సమస్యలు వచ్చినవి కానీ అతను ఎవరితో సంప్రదించుకుండా ఒంటరిగానే ఆలోచించి పరిష్కరించుకున్నాడు. చెప్పినా వినే వాడు కాదు. చివరకు ఆయననొక్కడే మిగిలాడు. రహదారిలో నీవొక్కడివి ప్రయాణించవద్దు. ఎవరితోనైనా కలిసి ప్రయాణించు. లేకుంటే ఎవరైనా వచ్చేవరకు కూర్చొని, వచ్చిన తరువాత వారితో కలిసి ప్రయాణించు. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు ఆదుకోవడానికి అక్కరకు వస్తాడు. లేక ప్రమాద సమాచారము ఇతరులకు తెలియజేస్తాడు.
కీ.శే. రాధాకృష్ణమూర్తి దేశ రాష్టప్రతికి చిన్నతనంలో ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. అతడికి కొత్తగా చిన్న వయసులోనే ఉపనయనం అయింది. ఉపనయనంలో చెవులకు బంగారు చెవి పోగులు కుట్టిస్తారు. ఆ సందర్భంలో పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒంటరిగా వెళుతున్నప్పుడు దొంగలు అతని వెంటబడి బంగారు పోగులు చెవినుండి గట్టిగా లాగగా, చెవి నుండి రక్తం వచ్చింది. పిల్లవాడు ఇంటికెళ్లి సంగతంతా చెప్పి ఏడ్చాడు. మరునాడు జ్వరంతో బాధపడ్డాడు. కోలుకున్న తరువాత ఎపుడూ ఒంటరిగా వెళ్లలేదట అని అతను రాసిన పుస్తకాల్లో తెలియజేశాడు. విదురనీతి ధృతరాష్ట్రునికైనా, ఈ విషయాలన్నీ అందరికీ వర్తించేటట్లు తెలియజేశాడు.
రాజా! ఇప్పటికైనా తెలివితెచ్చుకో. ధర్మరాజుకే ద్రోహం చేసి అతడి పంచన పడి ఉండటం మంచిదికాదు. నాతో వనవాసానికిరా. కొంతకాలంతపస్సుచేసి ఆ తరువాత భగవంతుని చేరే మార్గం చూసుకుందాం. ముక్తి పొందుదామని మంచి మాటలు చెప్పి ఇతనితో కలిసి ఆ అర్థరాత్రి ధర్మరాజుకు చెబితే వదలడని ఆ రాత్రి బయలుదేరి విదురుడు, ధృతరాష్ట్రుడు, గాంధారీతో వనవాసానికి వెళ్లారు.
రామాయణంలో విభీషణుడు, భారతంలో విదురుడు ఇద్దరూ మహానుభావులు. ధర్మంనెరిగినవారు. మరొకరికి బోధించే సంస్కారవంతులు, ఆదర్శప్రాయులు.
-జమలాపురం ప్రసాదరావు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565