ఒకరికి మోదం, ఒకరికి ఖేదం
ఘటోత్కచుడు విజృంభించి కౌరవసేనను చిత్తు చిత్తుగా చంపుతుంటే సహించలేని కర్ణుడు ఎంతోకాలంగా అర్జునుడిని చంపదలచి తన వద్ద దాచుకున్న, ఇంద్రుడు తనకు ఇచ్చిన శక్తిని ఆతనిపై ప్రయోగించాడు. శత్రు శరీర సంహారకమైన ఆ శక్తి కర్ణుని బాహుమధ్యమున ప్రజ్వలిస్తుండగనే చూసి ఘటోత్కచుడు భయపడ్డాడు. తన శరీరాన్ని పెద్దగా పెంచాడు. ఇంతలోనే కర్ణునిచే విడువబడిన ఆ శక్తి ఆ రాక్షసుని మాయను అణచి, వాని హృదయాన్ని చీల్చంది. ఘటోత్కచుడు భూమిపై పడుతూ ఒక అక్షేహిణి సైన్యాన్ని నాశనం చేశాడు. తానూ చనిపోయాడు. దాన్ని చూసి పాండవ్ఞలంతా ఎంతో దుఃఖించారు. కానీ శ్రీకృష్ణుడు మాత్రము ఎంతో సంతోషముతో సింహనాదము చేశాడు. రథ పగ్గములను విడిచి అర్జునుడిని గట్టిగా కౌగిలించుకొన్నాడు. అతని వీపుపై చఱచాడు. సంతోషపరవశుడై గంతులు వేశాడు.
రథమధ్యములో నిలచి మరీ సింహనాదం చేశాడు. దాన్ని చూసిన అర్జునుడు చింతాక్రాంతుడై శ్రీకృష్ణునితో ”ఓ మధుసూదనా! నీవిపుడిట్టులతి హర్షము నొందుటకు సమయము కాదు. ఘటోత్కచుడు హతుడగుట నిది శోకస్థానమై యున్నది. వాడు మరణించుటను మన సైన్యములన్నియు విముఖములై యున్నవి. వాని పతనముచే మనము సైతము ఉద్వేగ మొందవలసి వచ్చెను. ఓ జనార్థనా! నీవ్ఞ సంతసించుటకించులేని కారణము గానరాకున్నయది. కావ్ఞన ఓ సత్యనిధీ! ఇపుడునీవ్ఞ సంతసించుటకు నిమిత్తమును సత్యముగా దెలుపుము. రహస్యముగా దేని వినగోరుచున్నవాడను. ఓ మధుసూదనా! సముద్రపు సంక్షోభమును మేరువ్ఞ చలనమును బోలిన మా ధైర్యపు వికారమునకిది స్థానమైయుండ, నీవిపుడు సంతసింపనేటికి? నీ ఈ కృత్యమతి పేలవమని తలంచుచున్నాడని అని అన్నాడు-(పుట 826-ద్రోణపర్వము- శ్రీమదాంధ్ర వచన మహాభారతము). అర్జునుడు మనలాంటివాడే. మనకున్నది చాలా చాలా చిన్నచూపు. మనకు తెలిసింది అత్యంత అల్పము.
ఎంతో స్వల్పము. మనకు ఏది మంచో, ఏది చెడో తెలియదు. ఎప్పుడు ఆనందించాలో, ఎప్పుడు దుఃఖించాలో తెలియదు. ఏదో కొంత అనారోగ్యమైతే దుఃఖిస్తాము. కొంత డబ్బు వస్తే సంతోషిస్తాము. కొన్ని సమయాల్లో అనారోగ్యం వల్ల కూడా మేలు కలువవచ్చునని, డబ్బు రావటం వల్ల అయినవారు దూరమవ్ఞతారని, మనశ్శాంతి కరువవ్ఞతుందని గ్రహించలేము. ఆ తర్వాత ఎప్పుడో, అదీ నిశితంగా ఆలోచిస్తే అదంతా తెలిసివస్తుంది. కానీ శ్రీకృష్ణపరమాత్ముడు మనలాగా సామాన్య మానవ్ఞడు కాడు, సంపూర్ణ జ్ఞాని, త్రికాలజ్ఞుడు, సర్వజ్ఞుడు, ఏది మంచో, ఏది చెడో, ఎప్పుడు సంతోషపడాలో, ఎప్పుడు దుఃఖించాలో బాగా తెలిసినవాడు. కపటము ఏ మాత్రమూ లేనివాడు. నిజానికి ఆప్తబంధువ్ఞ ఒకడు చనిపోయి పాండవ్ఞలంతా దుఃఖసముద్రంలో మునిగి ఉన్నప్పుడు శ్రీకృష్ణుని స్థానంలో మనము ఎవరున్నా ఎంతో దుఃఖాన్ని కలిగి వ్ఞన్నట్టు నటించేవాళ్లము. సంతోషంతో ఎగిరి గంతులువేయటం అందరి దృష్టిలో ఎబ్బెట్టుగా ఉంటుందని భావించే వాళ్లం. అది సమయము, సందర్భము తెలియని అజ్ఞానులు చేసే పని అని భావించి దుఃఖపు ముసుగును ధరించేవాళ్లం, మొసలి కన్నీటికి కార్చేవాళ్లం. కానీ శ్రీకృష్ణపరమాత్ముడు అలాంటి వ్యక్తికాడు. లోపల ఏముందో దాన్నే నిర్భయంగా, నిర్లజ్జగా, నిష్కపటంగా వ్యక్తపరచేవాడు. అందుకే అలా గంతులు వేశాడు. ప్రస్తుతం కల్గిన ప్రమాదాన్నే కాదు, కాబోయే మంచిని చూడగల్గిన నేర్పుగలవాడు ఆయన. ఇంతకూ ఆయన సంతోషానికి కారణం? మహాభారతాన్ని తెరచి చూద్దాం.
సంతోషానికి కారణమేమి? అని అడిగిన అర్జునునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ”ఓ అర్జునా! రాధేయుని ఈ మహాశక్తి ఘటోత్కచుని మూలమున వ్యయపడుట, ఇపుడు యుద్ధమున కర్ణుడు హతుడయ్యెనని తలంపుము. యుద్ధమున కుమారస్వామిలాంటి వాడైన ఆ రాధేయుడు ఆ మహాశక్తిని చేత ధరిస్తే వాని యెదుట నిలబడు మగవాడు ఈలోకమున లేడు. గాండీవధరుడవై నీవ్ఞను, చక్రవాసుడై నేనును వీనిని జయింపజాల కుండుదుము. ఇపుడు వీడు ఘటోత్కచునిపై వేసిన ఈ శక్తిని నిన్ను చంపవలెనని ఇంతకాలము దాచుకొన్నాడు. నిన్ను రక్షించవలెనన్న తలంపుతో నేనే ఆ రాధేయుని మోహపెట్టి ఆ శక్తిని వినియో గించి ఘటోత్కచుని చంపించితిని. వీడు ఘటోత్కచుని చంపకుండెనేని నేనే ఆతనిని చంపవలసి యుండింది. ఈ రాక్షసుడు బ్రాహ్మణద్వేషి, యజ్ఞవిరోధియై యాగములను చెఱచినట్టి పాపి. కావ్ఞన వీని నిట్లు పడద్రోయించితిని. శ్రీకృష్ణుడు సాత్యకి అడిగాడు, ”ఓ దేవా! అమితశక్తిని కర్ణుని పార్ధు నిపై ఏల ప్రయోగింపలేదు? అని అతనితో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు-”ఓ సాత్యకీ! దుర్యోధన, దుశ్శాసన, శకుని, సైంధవ్ఞలు ఎప్పుడూ కర్ణునితో ఆ శక్తిని అర్జునుడిని చంపటా నికే వాడమని చెప్పేవారు. వాడూ అదే తలంపుతో ఉండే వాడు. నేనే ఆ రాధేయుని మోహ పెట్టితిని. పార్ధుని మృత్యుముఖము నుండి తప్పిస్తిని. పార్థుని రక్షించుటలో గల ఆదరము, తల్లితండ్రులనుగాని, సోదరులగు మిమ్ములను గాని, నా ప్రాణములను గాని రక్షించుటలో నాకులేదు. పార్థుడు లేకపోతే త్రైలోక్యాధిపత్యమున కన్న దుర్లభ మైనది కూడా నాకు రుచింపదు. ధనంజయుడు ఇప్పుడు చచ్చిబ్రతికెనని తలంచి సంతోషపడు తున్నాను. దీనివల్ల తెలుస్తుంది ఆపరమాత్ముడు తన భక్తుడైన అర్జునుడిని రక్షించటానికి, యజ్ఞవిరోధి, బ్రాహ్మణ ద్వేషియైన ఘటోత్కచుని శిక్షించటానికి సంకల్పించాడని, అది నెరవేరినందుకు సంతోషించాడని.
– రాచమడుగు శ్రీనివాసులు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565