MohanPublications Print Books Online store clik Here Devullu.com

వాక్కాయతో వారెవ్వా! - Food Dishes With Cranberry

వాక్కాయతో వారెవ్వా! 
కాస్త పులుపు, వగరుగా ఉండే వాక్కాయలు ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతాయి. వాటిని అచ్చంగా అలాగే తినడం కాదు.. పప్పు, పచ్చడి మొదలు రకరకాల పదార్థాలూ చేసుకోవచ్చు. ఎలాగో చూసేయండి మరి.
మునక్కాయతో... 
కావల్సినవి: వాక్కాయలు- పది, వంకాయలు- పావుకేజీ, మునక్కాడలు - రెండు, పచ్చిమిర్చి- నాలుగు, ఉల్లిపాయలు-రెండు, జీలకర్ర పొడి- అర టేబుల్‌స్పూను, ధనియాలపొడి - చెంచా, ఉప్పు- తగినంత, కారం- టేబుల్‌ స్పూను, పసుపు- పావుచెంచా, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు. తాలింపు కోసం: మినపప్పు, పచ్చిసెనగపప్పు - రెండూ కలిపి చెంచా, ఆవాలూ, జీలకర్ర - అరచెంచా చొప్పున, కరివేపాకు రెబ్బలు - రెండు. 
తయారీ: ముందుగా ఉల్లిపాయలూ, పచ్చిమిర్చిని చిన్నముక్కల్లా తరగాలి. ఆ తరవాత వంకాయలు, ములక్కాడల్ని ముక్కల్లా కోయాలి. వాక్కాయల్లోని గింజలు తీసేసి ముక్కల్లా కోసుకోవాలి. పొయ్యి వెలిగించి బాణలిపెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక తాలింపు కోసం తీసుకున్న వాటిని వేసి వేయించాలి. ఆపై ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవీ వేగాక వంకాయ, మునక్కాడ ముక్కలు వేసి మూత పెట్టేయాలి. ఇవి బాగా మగ్గాక కోసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలూ వేయాలి. ఇవి కూడా మెత్తగా అయ్యాక పసుపూ, ధనియాలపొడీ, కారం, జీలకర్రపొడీ, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మంట తగ్గిస్తే.. కాసేపటికి కూరలా తయారవుతుంది. అప్పుడు దింపేయాలి.
కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి
కావల్సినవి: కొబ్బరి ముక్కలు - పావుకప్పు, వాక్కాయలు - అరకప్పు, పచ్చిమిర్చి - ఐదు, ఎండుమిర్చి - ఎనిమిది, ఆవాలు - చెంచా, మెంతులు - పావుచెంచా, ధనియాలు - అరచెంచా, సెనగపప్పు - చెంచా, మినప్పప్పు - చెంచా, నూనె - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, ఇంగువ - చిటికెడు. 
తయారీ: పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఇంగువా, ఎండుమిర్చీ, ఆవాలూ, మెంతులూ, ధనియాలూ, సెనగపప్పూ, మినప్పప్పు వేయాలి. అవి ఎర్రగా వేగాక దింపేయాలి. ఈ తాలింపూ, కొబ్బరి ముక్కలూ, గింజలు తీసేసిన వాక్కాయలూ, పచ్చిమిర్చీ, తగినంత ఉప్పు మిక్సిలో తీసుకుని మెత్తగా చేసుకుంటే చాలు. కావాలనుకుంటే దీనిపై మరోసారి తాలింపు పెట్టుకోవచ్చు.
వూరగాయ
కావల్సినవి: వాక్కాయలు- కప్పు, మెంతులు- చెంచా, ఆవాలు - టేబుల్‌స్పూను, కారం-రెండు టేబుల్‌ స్పూన్లు, పసుపు- అరచెంచా, ఉప్పు- తగినంత. 
తాలింపు కోసం: మెంతులూ, ఆవాలూ- అరచెంచా చొప్పన, ఇంగువ-కొద్దిగా, నూనె- మూడు నుంచి ఐదు టేబుల్‌ స్పూన్లు 
తయారీ: ముందుగా పొయ్యి వెలిగించి మంట మధ్యస్థంగా ఉంచాలి. దానిపై బాణలీ పెట్టి మెంతుల్ని నూనె లేకుండా రంగు మారేవరకూ వేయించి తీసుకోవాలి. అవి చల్లారాక ఆవాలు కూడా కలిపి మిక్సీలో పొడిలా చేసుకోవాలి. మరోపక్క వాక్కాయల్ని కడిగి ఆరబెట్టుకోవాలి. వాటిని సగానికి కోసి మధ్యలో గింజల్ని తీసేయాలి. లేదంటే చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు మరో వెడల్పాటి పింగాణీ పాత్రను తీసుకుని అందులో వాక్కాయ ముక్కలూ, కారం, మెంతిపొడీ, ఆవపొడీ, పసుపూ, ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు బాణలీలో నూనె వేడిచేసి తాలింపు వేయాలి. అవి వేగాక చివరిలో ఇంగువ వేసి, పక్కన పెట్టుకున్న వాక్కాయ కారంలో వేసి బాగా కలపాలి. దీన్ని గాలి చొరని డబ్బాలోకి తీసి పెట్టుకుంటే నిల్వ ఉంటుంది.
పప్పు
కావల్సినవి: కందిపప్పు - కప్పు, వాక్కాయలు - పది, పచ్చిమిర్చి - రెండు, ఎండుమిర్చి - మూడు, ఆవాలు - చెంచా, జీలకర్ర - చెంచా, సెనగపప్పు, మినప్పప్పు - రెండూ కలిపి చెంచా, నూనె - రెండు చెంచాలు, పసుపు - అరచెంచా, ఉప్పు - తగినంత, కరివేపాకు - రెండు రెబ్బలు, కారం - చెంచా. 
తయారీ: కందిపప్పును శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్లు పోసి.. మెత్తగా ఉడికించి తీసుకోవాలి. వాక్కాయల్లోని గింజలు తీసేసి ముక్కల్లా కోసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి.. నూనె వేయాలి. అది వేడయ్యాక ఎండుమిర్చీ, ఆవాలూ, జీలకర్రా, సెనగపప్పూ, మినప్పప్పు వేయాలి. అవి వేగాక పచ్చిమిర్చి తరుగూ, కరివేపాకూ, పసుపూ, వాక్కాయ ముక్కలు వేసి మంట తగ్గించాలి. మధ్యమధ్య వేయిస్తుంటే కాసేపటికి వాక్కాయ ముక్కలు వేగుతాయి. అప్పుడు తగినంత ఉప్పూ, కారం, ఉడికించి పెట్టుకున్న కందిపపప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.
చికెన్‌ వాక్కాయ..
కావల్సినవి: వాక్కాయలు- కప్పు, చికెన్‌- అరకేజీ, ఉల్లిపాయలు- రెండు, కొత్తిమీర, పుదీనా - కట్ట చొప్పున, కారం - రెండు చెంచాలు, పసుపు - చిటికెడు, ఎండు కొబ్బరి తురుము- టేబుల్‌స్పూను, గరం మసాలా- చెంచా, ధనియాలపొడి- చెంచా, అల్లం వెల్లుల్లి ముద్ద- టేబుల్‌ స్పూను, ఉప్పు- తగినంత, నూనె- పావుకప్పు. 
తయారీ: వాక్కాయల్లో గింజలు తీసేయ్యాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయలి. అది వేడయ్యాక అల్లం వెల్లుల్లి ముద్దా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరవాత వాక్కాయ ముక్కలూ, తగినంత ఉప్పూ, కారం, పసుపూ, గరంమసాలా, ధనియాలపొడీ, కొబ్బరిపొడి వేసి కలిపి మంట తగ్గించాలి. రెండు నిమిషాలయ్యాక చికెన్‌ వేసి వేగించి అరకప్పు నీళ్లు పోసి మూత పెట్టేయాలి. చికెన్‌ఉడికాక కొత్తిమీరా, పుదీనా తరుగు వేసి దింపేయాలి.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list