MohanPublications Print Books Online store clik Here Devullu.com

మాలికా యోగం-Malika Yogam


వేలాది సంవత్సరాల తర్వాత రానున్న అద్భుత మాలికా యోగం
2017 సెప్టెంబర్ 27 స్వస్తిశ్రీ హేమలంబ నామ సంవత్సర ఆశ్వీజ శుక్ల సప్తమి బుధవారం ఉదయం 9.59 నిముషాలకు మూల నక్షత్రం ప్రారంభం కావటంతో విశేషమైన అరుదైన అద్భుత యోగం ప్రారంభం కానున్నది. ఇక వివరాలలోకి వెళితే ఛాయా గ్రహాలైన రాహువు కర్కాటక రాశిలో ఉండగా కేతువు మకర రాశిలో ఉన్నాడు. సరిగ్గా పై సమయానికి ఖగోళంలో ఉన్న గ్రహ స్థితిని పరిశీలిస్తే ఓ గ్రహ మాలికా యోగం 27 ఉదయం 9.59 నిముషాలకు మూల నక్షత్రంతో ప్రారంభమైనది. సింహరాశిలో కుజ శుక్రులు, కన్యా రాశిలో రవి బుధులు, తులా రాశిలో గురువు, వృశ్చిక రాశిలో శని ఉండగా, చంద్రుడు ఆనాటి ఉదయం 9.59 నిముషాల నుంచి 29 రాత్రి 10.28 నిముషాల వరకు ధనుస్సు రాశిని ఆక్రమించి ఉంటాడు. అంటే దాదాపుగా రెండున్నర రోజుల పాటు ఈ గ్రహమాలిక యోగము కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు వ్యాపించింది. 

ఖగోళంలో గ్రహమాలికా యోగాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. (ఇదేమి కొంతమంది చెప్పే కాలసర్ప దోషము కాదు) దేవి నవరాత్రులలో మూల నక్షత్రంతో భాసిల్లే సరస్వతి ఆవాహనం దగ్గర నుంచి దుర్గాష్టమి, మహర్నవమి పర్వదినాలు ఈ గ్రహమాలికా యోగంలో ఉండటమనేది అత్యంత అరుదైన విశేషం. ముఖ్యంగా శుభ గ్రహమైన గురువు 7 రాశులలో విరాజిల్లే గ్రహమాలికా యోగానికి మధ్యలో ఉన్న తులా రాశిలో ఉండటం న భూతో న భవిష్యతి. 

తులా రాశికి సంకేతం త్రాసు. ఇట్టి త్రాసు ఉన్న రాశిలోనే గురువు ఉండి, అటు 3 రాశులు, ఇటు 3 రాశులకు మధ్యన ఉండటం అద్భుతాలను అందించి న్యాయ నిర్ణేతగా ఉండి తీర్పు ఇవ్వనున్నాడా అన్న చందాన గురువు ఉన్నాడు. ఇక ప్రకృతి రాశి కన్యా రాశిలోకి బుద్ధి కారకుడైన బుధుడు, యోగానికి కొద్దీ గంటల ముందే విచ్చేసి మహాద్భుతమైన బుధాదిత్య అనే లక్ష్మీ యోగాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది కూడా ఒక విశేషమే. 

సెప్టెంబర్ 27వ తేదీ బుధవారం ఉదయం 9.59 నిముషాల నుంచి 29వ తేదీ శుక్రవారం రాత్రి 10.28 నిముషాల వరకు 7 రాశులలో జరిగే గ్రహ మాలికా యోగం పరోక్షంగా ఆర్ధిక అంశాలపైనా ప్రభావాన్ని చూపిస్తుంది. గురు గ్రహం 7 రాశుల మధ్యలో ఉంటూ బుధాదిత్య యోగంతో భాసిల్లే గ్రహమాలికా యోగం మూలా నక్షత్రంతో ప్రారంభమై సరస్వతి పూజ, దుర్గాష్టమి, మహార్నవమనే మూడు పర్వదినాలలో వ్యాపించి ఉన్న సందర్భంగా ద్వాదశ రాశుల వారు దిగువన చెప్పే మహా యోగ తంత్రాన్ని ఆచరించండి. ఏదో గ్రహ సంచారం వస్తున్నది, సమస్యలు తెస్తున్నదని భావించి పరిహారంగా పాటించాలేమో అని అనుకోవద్దు. 

ధర్మ శాస్త్ర నిర్ణయాల ప్రకారం మహర్నవమి పర్వదినాన యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించేవారు శ్వేత తిల ఘృత పాయసాన్నమును బలిహరణముగా వైదిక క్రతువులో చేస్తారు. శ్వేత తిలలు అంటే తెల్ల నువ్వులు. ఘృతము అంటే నెయ్యి. పాయసం చేయాలి అంటే దానికి బియ్యం (తండులాలు) అవసరం. ఈ పాయసం పాలు, సుగంధ ద్రవ్యాలు, బెల్లము తో చేస్తారు. ఇక గ్రహమాలిక యోగంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిలను ఆరాధించే ఈ మూడు రోజులలో శ్వేత తిల మహాయోగ తంత్రాన్ని ప్రతివారు ఆచరిస్తే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ముగురమ్మల మూలపుటమ్మ అనుగ్రహాన్ని పొందుతూ ఆర్ధిక పటిష్టతకు అవసరమయ్యే ఆలోచనలను పొందుతారని చెప్పటంలో సందేహం ఏ మాత్రం లేదు. 

నువ్వులు శని గ్రహానికి ప్రతీకలు. జ్యోతిష రీత్యా చంద్రుడు శనికి అంతర్గత శత్రువు. ప్రతివారు తమ తమ మనోభావాలతోనే జీవన పథంలో అభివృద్ధి చెందుతుంటారు. అధః పాతాళానికి కూరుకుంటుంటారు. ప్రతివారికి మనస్సే చాలా ముఖ్యమైనది. ఇట్టి మనః కారకుడైన చంద్రుడు, శని ఎలాంటి శత్రుత్వాలు లేకుండా దేవి నవరాత్రులలో, ఆర్ధికంగా ఎదగటానికి అవసరమైన మానసిక శక్తిని అందించే యోగ తంత్రమే ఈ గ్రహ మాలికా యోగంలో ఎంతో ఉపయోగపడనుంది. 

కనుక శ్రీ హేమలంబ నామ సంవత్సర దేవి నవరాత్రులలో శ్వేత తిల యోగ తంత్రాన్ని ప్రతి వారు రెండు పద్దతులలో ఆచరించవచ్చు. ముందుగానే ఓ 50 గ్రాములు తెల్ల నువ్వులను కొనండి. కొద్ది నెయ్యితో దోరగా తెల్ల నువ్వులను వేయించండి. 

ఇక 27వ తేదీ బుధవారం సరస్వతి పూజ రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు గల రాహుకాలంలోనూ, మరియు 28 గురువారం దుర్గాష్టమి మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు ఉన్న రాహుకాలంలోనూ, మరియు 29 శుక్రవారం మహర్నవమి రోజున 10.30 నుంచి 12.00 గంటల లోపల ప్రతివారు దోరగా వేయించిన తెల్ల నువ్వులను కుడి చేతిలో ఉంచుకొని సూర్య కాంతి చూపించి (సూర్యుని వైపు చూడాల్సిన అవసరం లేదు) మహా ప్రసాదంగా స్వీకరించండి. 

ఇక రెండవ పద్దతిగా తెల్ల నువ్వులు, బియ్యము, నెయ్యి, బెల్లము, సుగంధ ద్రవ్యాలతో పాయసం చేసుకొని, మీ మీ పూజ మందిరంలోని దేవతలకు నివేదించి, పైన చెప్పిన రాహుకాల సమయాలలో జగన్మాత ప్రసాదంగా స్వీకరించండి. (ఏ సమయంలో నివేదించినను, ఈ రాహుకాల సమయంలో మాత్రమే ప్రసాదంగా స్వీకరించండి) దుర్గాష్టమి గురువారం నాడు భోజనం ముందు చేసినప్పటికీ , రాహుకాలంలోనే ప్రసాదాన్ని తీసుకొనండి. 

దక్షిణాయనం ప్రారంభమయ్యే కర్కాటక రాశి నుంచి, ఉత్తరాయణం ప్రారంభమయ్యే మకర రాశి వరకు 7 రాశులలో మధ్య స్థాన శుభగ్రహ గురువుతో, బుధాదిత్య యోగంతో, మూల నక్షత్ర ప్రారంభంతో, సరస్వతి పూజ, దుర్గాష్టమి, మహర్నవమి రోజులతో వచ్చే ఈ యోగం కొన్ని వేలాది సంవత్సరాల తర్వాత వచ్చినదని చెప్పుకోవటంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.

ఇట్టి గ్రహ మాలికా యోగ పరంపరలో మహాయోగ తంత్రంగా చెప్పుకొనే శ్వేత తిలల ద్వారా జగన్మాత అనుగ్రహాన్ని పొందటానికి అందరూ ప్రయత్నించండి. -దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list