MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఎదిగిన కొలదీ ఒదగమనీ...-Namaskaram

ఎదిగిన కొలదీ ఒదగమనీ...
నమస్కారం అనే పదానికి అర్ధం ‘అయ్యా! అమ్మా! మీలోని ఉత్తమ లక్షణాలను గౌరవిస్తున్నాం. మేము కూడా ఆ ఉత్తమ లక్షణాలను పొందగోరుతున్నాము’ అని.
‘నమస్’ అనే పదానికి అర్ధం ‘తనకన్నా హెచ్చు శక్తిమంతులు చాలామందే ఉంటారని గ్రహించుకుని ఎన్నడూ హెచ్చులకుపోకుండా తగ్గి ఉండడం’. ‘ఎప్పుడూ మనం తగ్గి ఉండాలా? ఎందుకు?- అనేది అందరి సందేహం. ‘ఎందుకంటే-తగ్గి ఉన్నవాడు మాత్రమే మిగతా అందరి సహాయాన్ని, స్నేహాన్ని పొందగలుగుతాడు. వీలు కుదిరినప్పుడు అందరి సహాయంతో అభివృద్ధి పొందగలుగుతాడు కాబట్టి’ అనేది అందరు విజ్ఞుల సమాధానం. అందరి స్నేహము, సహాయము, శుభాకాంక్షలు కేవలం తగ్గి ఉన్నవారికి మాత్రమే లభిస్తాయి తప్ప తామే గొప్పవారం అనేవారికి ఎన్నడూ లభించవు. మనమే గొప్పవారం అని మనం అనుకున్నట్టయితే మనల్ని అందరూ అసహ్యించుకోవడం ప్రారంభిస్తారు కాబట్టి ‘నీరు పల్లమెరుగు’ అనే సామెత వుంది తెలుసా!
ఏదైనా పైనుంచే వస్తుంది కిందకివస్తుంది. అందువల్లనే మనం సుస్థిరమైన అభివృద్ధిని సాధించదలచుకుంటే ఎల్లప్పుడు తగ్గి ఉండడం అవసరం అవుతుంది. అలా తగ్గి ఉండడానికి మన మనస్సులకు తగిన తర్ఫీదు ఇవ్వాలంటే చిన్నప్పటినుంచే చిన్నపిల్లలు పెద్దలను గౌరవించడం నేర్చుకునేట్టు చేయాలి.
మామూలుగా నిలబడి ఎదుటివారికి నమస్కరిస్తే నమస్కారం పెట్టేవాళ్లు నమస్కారం స్వీకరించేవాళ్లు సమాన స్థాయి ఉన్నవారు అనే భావన కలుగుతుంది. పిల్లలు అలా పెద్దలకు నమస్కరిస్తే తాము తక్కువ వారు అనే భావన ఎన్నటికీ పిల్లల్లో కలగదు. తాము తక్కువవాళ్లం అని భావించలేకపోతే అభివృద్ధిని సాధించడం పిల్లలలో సాధ్యం కాదు.
పిల్లల్లో ‘అహం’ భావం పెరగనీయరాదు.
‘అహం’్భవం-అంటే ‘నేను మిగతా వాళ్లకంటె శక్తి కలవాడ్ని. గొప్పవాణ్ణి’ అనే భావన. అలా తాను గొప్పవాణ్ణి అనుకునే వ్యక్తి ఇక ఏమాత్రము అభివృద్ధి సాధించడం జరగదు. కేవలం ఇతరులతో శత్రుత్వాన్ని పెంచుకుని తరచుగా తగాదాలకు దిగుతూ దుఃఖపడడం అనేక కష్టనష్టాలపాలు కావడం మాత్రమే జరుగుతుంది. మనం సుఖంగా జీవించాలంటే కావాల్సింది ప్రధానంగా డబ్బు కాదు. మన తోటివారినందరినీ మనవారుగానే భావిస్తూ వారితో ప్రేమగా మాట్లాడగల్గడం. వారి సుఖాన్ని కాంక్షిస్తూ అన్నివిధాలా వారికి సహకరించడం ముఖ్యం. దానిలోని ప్రధాన అంశమే చిన్నవాళ్లు అందరు పెద్దవాళ్ల కాళ్లకు దణ్ణం పెట్టే సాంప్రదాయం రూపొందించడం. ‘దణ్ణం పెట్టడం’ అంటే ‘మీ పరిచయం వల్ల నా జీవితం ధన్యం అయింది’-అని పెద్దవారిని చిన్నవాళ్లు గౌరవించడం అన్నమాట.
‘్ధన్యం’ అనే పదమే ‘దణ్ణం’గా పలకబడుతోంది. పిల్లల స్థాయినుండే పెద్దలను గౌరవించడం నేర్పడానికే ‘పాదాలకు నమస్కారం’ చేయడం అనే ఆచారం ఏర్పడింది.
‘నేను మీ పాదరేణువును’ అని కొందరు వ్యక్తులు మహనీయ వ్యక్తుల వద్ద అనడంలో అర్ధం-‘మీ పాదాలకు అంటిన మట్టిలోని నలుసువంటి వాణ్ణి’ అని. మహాత్ముల ఎదుట మనల్ని అంత చిన్నవాడిగా, తక్కువ వాడుగా భావించగలగడంలోనే మనం భవిష్యత్తులో ఉన్నతులం కావడానికి తగు పునాదుల్ని వేసుకుంటున్నాం అన్న మాట.
-సన్నిధానం యజ్ఞ నారాయణ మూర్తి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list