పిల్లల్లో అలర్జీ
ఒంట్లో.. ఒకటే నస!
ఒకటే దురద. గోకితే దద్దు. తుమ్ము మీద తుమ్ము. ఉక్కిరి బిక్కిరి చేసే ఆయాసం. ఇలా అలర్జీలు తెచ్చిపెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం ఎంతోమంది చిన్నారులు.. ముఖ్యంగా పట్టణప్రాంత పిల్లలు వీటితో పడుతున్న ఇబ్బంది అంతాఇంతా కాదు. అందరిలా ఆడుకోలేక, అందరిలా చదువుకోలేక, అందరిలా నిద్రపోలేక సతమతమైపోతున్నారు. మారిపోతున్న మన జీవనశైలి, ఆహార అలవాట్లు.. పెరిగిపోతున్న కాలుష్యం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. నిజానికి అలర్జీలకు చికిత్స లేక కాదు. క్రమం తప్పకుండా వాడితే వీటిని ఉద్ధృతం కాకుండా చూసుకోవచ్చు. పూర్తిగా నియంత్రణలోనూ ఉంచుకోవచ్చు. కావాల్సిందల్లా తల్లిదండ్రులు వీటిపై అవగాహన పెంచుకోవటం. పిల్లలు పూర్తికాలం మందులు వాడేలా చూడటం. అందుకే చిన్నారులను వేధించే అలర్జీలపై సమగ్ర కథనం అందిస్తోంది ఈ వారం సుఖీభవ!
ప్రస్తుతం మనిషిని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యల్లో అలర్జీలదే ప్రథమస్థానం! ఆధునికతతో పాటు ఇవీ పెరుగుతూ వస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సుమారు 50% మంది ఏదో ఒక అలర్జీతో బాధపడుతున్నారని అంచనా. మనదేశంలోనూ 20-30% మంది జీవితంలో ఎప్పుడో అప్పుడు ఏదో ఒక అలర్జీ బారినపడ్డవారే. ఒకరకంగా దీన్ని మన జీవనశైలితో ముడిపడిన సమస్యగానే చెప్పుకోవచ్చు. నగరాల్లో, పట్టణాల్లో అలర్జీలు ఎక్కువగా కనబడుతుండటమే దీనికి నిదర్శనం. మన వాతావరణం మారిపోయింది, తిండి మారిపోయింది. ఎయిర్ కండిషన్ గదులు, తివాచీలు, సోఫాలు.. ఇలా మన జీవన విధానమే మారిపోయింది. వాతావరణ కాలుష్యమూ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. ఇలాంటివన్నీ అలర్జీలు విజృంభించటానికి అవకాశం కలిగిస్తున్నాయి. చాలామంది అలర్జీని పెద్దవాళ్ల సమస్యగానే భావిస్తుంటారు. కానీ ఇది పిల్లల్లోనూ ఎక్కువే.
ఏమిటీ అలర్జీ?
స్థూలంగా చెప్పాలంటే- రోగనిరోధకవ్యవస్థ మనకు హానిచేయని వాటికీ అతిగా స్పందించటమే అలర్జీ. సాధారణంగా పొగ, దుమ్ముధూళి వంటివి మనకేమీ హానిచేయవు. ఇవి ఒంట్లోకి ప్రవేశించినా రోగనిరోధకశక్తి వీటిని పెద్దగా పట్టించుకోదు (ఇమ్యూన్ టాలరెన్స్). అయితే జన్యుపరంగా అతిగా స్పందించే గుణం గలవారిలో రోగనిరోధక వ్యవస్థ వీటితో అనవసర ‘యుద్ధం’ పెట్టుకుంటుంది! శరీరానికి హాని చేసే సూక్ష్మక్రిముల వంటివిగా భావించి ‘నువ్వు రావొద్దు కదా. ఎందుకొచ్చినవు’ అని కొట్లాటకు దిగుతుంది. ఇమ్యునోగ్లోబులిన్-ఇ అనే యాంటీబాడీలను, ఈస్నోఫిల్స్ వంటి రసాయనాలను పెద్దఎత్తున విడుదల చేసి దాడికి పురమాయిస్తుంది. దీంతో ఆయా భాగాల్లో వాపు ప్రక్రియ మొదలవుతుంది. రక్తనాళాలు విప్పారి, వాటిలోంచి ద్రవం లీకవుతుంది. సున్నితమైన కండరాలు సంకోచిస్తాయి. నాడులు చికాకుకు గురవుతాయి. ఫలితంగా దురద, దద్దు, ఆయాసం వంటి లక్షణాలు బయలుదేరతాయి. ఇదే అలర్జీ. మున్ముందు ఎప్పుడైనా అదే అలర్జీ కారకం వచ్చినా రోగనిరోధకవ్యవస్థ ఇలాగే స్పందిస్తుంది. దీంతో మళ్లీ మళ్లీ అలర్జీ వేధిస్తూనే ఉంటుంది.
ఎందుకు పెరుగుతున్నాయి?
ప్రకృతి నుంచి దూరంగా పోతున్నకొద్దీ అలర్జీలూ ఎక్కువవుతున్నాయి. హాయిగా, సుఖంగా జీవించటానికి సౌకర్యాలు పెంచుకుంటూ పోతున్నాం గానీ అదేస్థాయిలో అలర్జీలు కూడా పెరిగిపోతున్నాయి. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తున్నాయి.
ఆహార అలవాట్లు: ఎలాంటి తిండి తింటే అలాంటి మనిషి తయారవుతాడు. ప్రస్తుతం పిల్లలకు తల్లిపాలు పట్టటం, ఇంట్లో వండి పెట్టటం తగ్గిపోయింది. డబ్బా తిండ్లు, ప్యాక్డ్ ఫుడ్స్, బయటి తిళ్లు ఎక్కువయ్యాయి. వీటిల్లో ఎక్కువకాలం నిల్వ ఉండటానికి, రంగు, రుచి కోసం రకరకాల పదార్థాలు కలుపుతారు. ఇవి కొందరిలో అలర్జీలకు కారణమవుతున్నాయి.
ఇన్‌ఫెక్షన్లు తగ్గటం: ఒకప్పుడు పుట్టిన తొలి ఏడాదిలోనే దొడ్డికి పెట్టటం, న్యుమోనియా, అంటువ్యాధులు.. ఇలా దాదాపు ఏడెనిమిది ఇన్‌ఫెక్షన్లు వస్తుండేవి. టీకాలు అందుబాటులోకి రావటం, పరిశుభ్రత పెరగటంతో ఇప్పుడివి బాగా తగ్గిపోయాయి. కానీ ఇది అలర్జీలు పెరగటానికీ దోహదం చేస్తోంది. ఇన్‌ఫెక్షన్లు వచ్చినపుడు రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజితమై.. వాటిపై పోరాడటానికి తర్ఫీదు పొందుతుంది. శరీరానికి హాని కలిగించేవేంటో, కలిగించనివేంటో గుర్తించే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. ఇన్‌ఫెక్షన్లు రాకపోతే ఈ ప్రక్రియ దారి తప్పుతుంది. దీంతో హానికరమైనవేవో, హాని కలిగించనివేంటో గుర్తించే సామర్థ్యం కొరవడుతుంది. హానిచేయని వాటిని కూడా హానికరమైనవిగా పొరబడి దాడి చేయటం అలర్జీలను తెచ్చిపెడుతోంది.
సోఫాలు, తివాచీలు: ఇళ్లల్లో బట్టతో చేసిన సోఫాలు, తివాచీల వాడకమూ పెరిగింది. వీటిల్లో చేరే తవిటి పురుగులు (డస్ట్ మైట్స్) అలర్జీని ప్రేరేపిస్తాయి. అన్నింటికన్నా ఎక్కువగా అలర్జీలను ప్రేరేపించేవీ ఇవే! అలాగే పెంపుడు జంతువుల నుంచి రాలే బొచ్చు, నూగు, మృత చర్మకణాల వంటివీ అలర్జీలకు దారితీస్తున్నాయి.
* కాలుష్యం: వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగ, వాయువులతో కాలుష్యం రోజురోజుకీ పెరుగుతోంది. క్రిమి సంహారక మందుల మూలంగా తిండీ కలుషితమవుతోంది. ఇవీ అలర్జీలకు దోహదం చేస్తున్నాయి.
నివారణే కీలకం
* అలర్జీ కారకాలను గుర్తించి పిల్లలను వాటికి దూరంగా ఉండేలా చూడటం చాలా ముఖ్యం.
* సిజేరియన్ కాన్పులో పుట్టిన పిల్లలకు అలర్జీల ముప్పు ఎక్కువ. అందువల్ల వీలైనంతవరకు సహజ కాన్పయ్యేలా చూసుకోవాలి.
* పోత పాలతో అలర్జీలు రావొచ్చు. కాబట్టి 6 నెలల వరకు విధిగా తల్లిపాలే పట్టాలి.
* బయటి తిండ్లు వద్దు. ఇంట్లో వండిన తాజా ఆహారమే తినిపించాలి.
* విటమిన్ డి లోపం రాకుండా పిల్లలకు రోజూ కాస్త ఎండ తగలనివ్వాలి. ఏడాది వరకు విటమిన్ డి సిరప్ ఇవ్వాలి.
* స్నానం చేయించాక సాంబ్రాణి వంటి వాటితో పొగ వేయొద్దు. అలాగే పిల్లలున్న ఇంట్లో సిగరెట్లు, బీడీలు కాల్చొద్దు.
* ఇంట్లో తివాచీలు లేకుండా, గోడలకు చెమ్మ, నాచు పట్టకుండా చూసుకోవాలి.
* దోమలను తరిమేందుకు జేట్స్, కాయిల్స్, మ్యాట్స్, వెపరైజర్లకు బదులు దోమతెరలు వాడుకోవటం మంచిది.
అలర్జీ కారకాలు
* తవిటి పురుగులు (డస్ట్ మైట్స్)
* పుప్పొడి
* దుమ్ము ధూళి
* వాహనాలు, సిగరెట్ల పొగ
* పెంపుడు జంతువుల బొచ్చు
* గోడలకు పట్టే చెమ్మ, నాచు
* సెంట్లు
* పోపు వాసనలు
* చల్లటి నీరు, గాలి
* బొద్దింకలు, తేనెటీగల వంటి కీటకాలు
* కొన్నిరకాల మందులు
అలర్జీ.. రకరకాలు
అలర్జీలు శరీరంలో ఎక్కడైనా తలెత్తొచ్చు. ఎవరికైనా రావొచ్చు. కుటుంబంలో ఎవరికైనా అలర్జీలు గలవారికి వీటి ముప్పు ఎక్కువ. అయితే జన్యువులు ఉన్నంత మాత్రాన అందరికీ రావాలనేమీ లేదు. వీటికి పుప్పొడి వంటి కారకాలు తోడైనప్పుడు కొందరిలో అలర్జీ ప్రేరేపితమవుతుంది. ప్రస్తుతం దీనికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తక్షణం ఉపశమనం కలిగించే రిలీవర్లు, నియంత్రణలో ఉంచే కంట్రోలర్లతో మంచి ఫలితం కనబడుతుంది. అయితే చాలామంది లక్షణాలు తగ్గగానే మందులు మానేస్తుంటారు. దీంతో సమస్య మళ్లీ తిరగబెడుతుంది. కాబట్టి డాక్టర్లు చెప్పినంత కాలం చికిత్స ఇప్పించాలి.
చర్మ అలర్జీ
దీని ప్రధాన లక్షణాలు దురద, దద్దు. రెండు నెలలకు పైగా దురద విడవకుండా వేధిస్తుంటే చర్మ అలర్జీగా నిర్ధరించొచ్చు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అటోపిక్ డెర్మటైటిస్ (ఎగ్జిమా). ఇది చర్మం పొడిబారటంతో మొదలై.. తీవ్రమైన దురద, దద్దుతో తెగ వేధిస్తుంది. కొందరు ఎప్పుడూ గోకుతూనే ఉంటారు. తరచుగా దద్దు రావటం వల్ల చర్మం మందంగానూ తయారవుతుంది. సొన, రసి కూడా కారొచ్చు. చాలావరకు ఇది వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతుంది. అయితే కొంతమందిలో మోచేతులు, మోకాళ్ల ముడతల్లో స్వల్పంగా ఉండిపోవచ్చు. చర్మ అలర్జీలతో బాధపడే పిల్లలకు పోతపాలు, తెల్ల గుడ్డు, చేపలు ఇవ్వకపోవటం మంచిది. అలాగే సబ్బులు కూడా ఎక్కువగా వాడొద్దు. వీటితో చర్మం మరింత పొడిబారుతుంది. సబ్బులు అవసరమైతే గ్లిజరిన్ సబ్బులే వాడాలి. అలాగే ఉన్ని దుస్తుల వంటివి వేయొద్దు. కాటన్ దుస్తులు.. అదీ వదులుగా, మెత్తగా ఉన్నవే వేయాలి. చర్మానికి ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు తలెత్తినా వెంటనే చికిత్స చేయించాలి.
చికిత్స: అటోపిక్ డెర్మటైటిస్ తీవ్రంగా ఉన్నప్పుడు స్టిరాయిడ్ పూతలతో తక్షణం ఉపశమనం కలుగుతుంది. అనంతరం మాయిశ్చరైజర్ క్రీములు వాడుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. దురద తగ్గుముఖం పడుతుంది.
ముక్కు అలర్జీ
పిల్లల్లో అన్నింటికన్నా ఎక్కువగా కనబడే అలర్జీ ఇదే. ప్రతి ఆరుగురిలో ఒకరు దీంతో బాధపడుతున్నారని అంచనా. చాలామంది దీన్ని జలుబు, దగ్గుగా భావిస్తుంటారు. మామూలు జలుబు వారం, పది రోజుల కన్నా ఎక్కువుండదు. ముక్కు దురద కూడా అంతగా ఉండదు. తుమ్ము మీద తుమ్ములు రావు. కాబట్టి ఎవరికైనా 2 వారాలకు మించి జలుబు వేధిస్తుంటే అలర్జీగా అనుమానించాలి. ఇక 4 వారాలకు పైగా తుమ్ములు, ముక్కు దురద, ముక్కు బిగుసుకుపోవటం, ముక్కు కారటం వంటివి ఉంటే ముక్కు అలర్జీ అనే నిర్ధరించుకోవాలి. దీంతో పెద్ద సమస్య ఏంటంటే పిల్లల నిద్ర దెబ్బతినటం. దీంతో బడిలో కునికిపాట్లు పడుతుంటారు. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతాయి. పాఠాలు మనసుకు ఎక్కవు. చదువు వెనకబడుతుంది. అందరిలా ఆడుకోలేరు కూడా. ముక్కు బిగుసుకుపోయి నోటితోనూ శ్వాస తీస్తుంటారు. కొందరు నిద్రలో శ్వాస ఆగిపోయి.. ఉక్కిరి బిక్కిరయ్యి హఠాత్తుగా, భయంతో లేస్తుంటారు కూడా. సైనస్ గదులు, కళ్లు, చెవి నుంచి ముక్కులోకి వచ్చే మార్గాలు మూసుకుపోవటం వల్ల వీరిలో చాలామందికి సైనసైటిస్, చెవినొప్పి, చెవిలో చీము కారటం, కళ్లు ఎర్రబడటం, దురద వంటివీ ఉండొచ్చు. ముక్కు అలర్జీతో మరో పెద్ద సమస్య ఆస్థమా ముప్పు. ఇవి రెండూ జోడు గుర్రాలు. చాలామంది పిల్లల్లో ఇవి రెండూ కలిసే కనబడుతుంటాయి.
చికిత్స: వీరికి సిట్రిజన్, లోరటడిన్, ఫెక్సిఫెనడిన్ వంటి కొత్తతరం మందులు వాడుకోవటం మంచిది. ఇవి పిల్లల మెదడును ప్రభావితం చెయ్యవు. మెదడు ఎగుదలను దెబ్బతీయవు. సురక్షితంగా వాడుకోవచ్చు. రోజూ ముక్కులోకి మొమెటజోన్ స్ప్రే వాడితే అలర్జీ నియంత్రణలో ఉంటుంది. కంటి అలర్జీలూ నియంత్రణలో ఉంటాయి. ముక్కు అలర్జీకి ఇప్పుడు ఇమ్యునోథెరపీ కూడా అందుబాటులో ఉంది. ఇందులో ముందుగా అలర్జీ కారకాలను గుర్తించి.. వీటినే స్వల్ప మోతాదులో ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. నాలుక కింద వేసేవీ ఉన్నాయి. దీంతో రోగనిరోధకవ్యవస్థ బలోపేతమై సమస్య పూర్తిగా నయమైపోతుంది. ఒకట్రెండు అలర్జీ కారకాలు గలవారికిది బాగా పనిచేస్తుంది.
ఆస్థమా
పిల్లల పాలిట ఇప్పుడిదొక భూతంలా తయారైంది. సంపన్నులు, పేదలనే తేడా లేకుండా అన్ని వర్గాల పిల్లలనూ వేధిస్తోంది. దీని ప్రధాన లక్షణం దగ్గు. ముఖ్యంగా రాత్రిపూట దగ్గు ఎక్కువ. ఆయాసం, పిల్లికూతలూ ఉండొచ్చు. కొందరికి ఆటలు ఆడుతున్నప్పుడూ దగ్గు, ఆయాసం రావొచ్చు. ఇలాంటి లక్షణాలు తరచుగా, మళ్లీ మళ్లీ కనబడుతుండటం.. సాల్‌బుటమాల్ వంటి మందులతో తగ్గుతుంటే ఆస్థమాగా నిర్ధరిస్తారు.
చికిత్స: ఆస్థమాకు నోటి ద్వారా పీల్చుకునే ఇన్‌హేలర్లు బాగా ఉపయోగపడతాయి. తక్షణం ఉపశమనం కలిగించే రిలీవర్లు (నీలం, ఆకుపచ్చ మూతగలవి).. మళ్లీ మళ్లీ రాకుండా చూసే కంట్రోలర్లు (ఎరుపు, వూదా, లేత గులాబీ రంగు మూతగలవి) అందుబాటులో ఉన్నాయి. కొందరు వీటిని జీవితాంతం వాడాల్సి ఉంటుందని, అలవాటు అవుతాయని, కీడు చేస్తాయనే అపోహలతో మధ్యలోనే ఆపేస్తుంటారు. ఇన్‌హేలర్లలో మందు చాలా తక్కువ మోతాదులోనే ఉంటుంది. అదీ అవసరమైన చోటుకే వెళ్తుంది. అందువల్ల సమర్థవంతంగా, సురక్షితంగా పనిచేస్తుంది. దుష్ప్రభావాలేవీ ఉండవు. వరుసగా 6 నెలల పాటు కంట్రోలర్లు వాడాక ఆస్థమా లక్షణాలేవీ లేకపోతే మందు మోతాదును సగం వరకు తగ్గించొచ్చు. తర్వాత మరో 3 నెలలు వాడాక లక్షణాలేవీ లేకపోతే ఏడాది వరకు వాడుకొని పూర్తిగా ఆపేయొచ్చు. అయితే మళ్లీ వచ్చే అవకాశం ఉందేమో గమనిస్తూ ఉండాలి.
స్వైన్‌ఫ్లూ
జర భద్రం!
స్వైన్‌ఫ్లూ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటోంది. ముఖ్యంగా రోగనిరోధకశక్తి తగ్గినవారికి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి, గర్భిణులకు, పిల్లలకు శరాఘాతంగా పరిణమిస్తోంది. నిజానికి స్వైన్‌ఫ్లూ మనకు కొత్తదేమీ కాదు. 2009 నుంచీ చూస్తున్నదే. అప్పట్నుంచీ పోయినట్టే పోయి మళ్లీ మళ్లీ విజృంభిస్తోంది. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉండటం, జాగరూకతతో మెలగటం చాలా అవసరం.
స్వైన్‌ఫ్లూకు ‘హెచ్1ఎన్1’ వైరస్ మూలం. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టే చాలా వేగంగా విస్తరిస్తుంది. స్వైన్‌ఫ్లూ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వైరస్ వెలువడి గాలిలో కలుస్తుంది. ఆ గాలిని పీలిస్తే ఇతరులకూ సోకుతుంది. సాధారణంగా ఫ్లూ జ్వరంలో కనబడే జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కుకారం వంటి లక్షణాలే స్వైన్‌ఫ్లూలోనూ ఉంటాయి. కొందరికి వాంతులు, విరేచనాలు కూడా కావొచ్చు. ఇలాంటివి కనబడినప్పుడు ఇంట్లోనే ఉండి.. విశ్రాంతి తీసుకోవటం, జ్వరం తగ్గటానికి మాత్రలు వేసుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ లక్షణాలు ముదురుతుంటే మాత్రం తాత్సారం పనికిరాదు. ఈ దశలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాల మీదికి రావొచ్చు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు మొదలైన 48 గంటల తర్వాత కూడా లక్షణాల తీవ్రత తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. గర్భిణులు, పిల్లలు, వృద్ధులతో పాటు మధుమేహం, గుండెజబ్బు వంటి దీర్ఘకాలిక సమస్యలు గలవారి విషయంలో నిర్లక్ష్యం అసలే పనికిరాదు.
పరిశుభ్రత-టీకాతో నివారణ
స్వైన్‌ఫ్లూ వచ్చాక బాధపడేకన్నా రాకుండా చూసుకోవటమే మేలు. ఫ్లూ లక్షణాలు కనబడితే వీలైనంతవరకు బయటకు రాకుండా చూసుకోవటం మంచిది. దగ్గినపుడు, తుమ్మినపుడు నోటికి, ముక్కుకు గుడ్డ అడ్డం పెట్టుకోవాలి. ఒకవేళ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ముక్కుకు, నోటికి మాస్క్ ధరించాలి. కనీసం రుమాలునైనా చుట్టుకోవాలి. ఇక ఇతరులు కూడా ఫ్లూ లక్షణాలున్నవారితో చేతులు కలపటం, కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం చేయకూడదు. దగ్గేవారికి, తుమ్మేవారికి కాస్త దూరంగా ఉండటం మేలు. స్వైన్‌ఫ్లూ రాకుండా చూసుకోవటానికి ఇప్పుడు టీకా కూడా అందుబాటులో ఉంది. ఇది మిగతా ఫ్లూ వైరస్‌ల నుంచీ రక్షణ కల్పిస్తుంది. అయితే దీన్ని జబ్బు వచ్చాక తీసుకుంటే లాభం లేదు. దగ్గు, జలుబు ఉన్నప్పుడు అసలే తీసుకోకూడదు. సాధారణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే తీసుకోవాలి. ఆరేళ్లలోపు పిల్లలు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, గర్భిణులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, వైద్యసిబ్బంది కచ్చితంగా టీకా తీసుకోవటం మంచిది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565