అన్నార్తుల సేవయే అన్నపూర్ణేశ్వరీ ఉపాసన
‘త స్మద్వా ఏతస్మాదాత్మనః ఆకాశస్సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభోన్నం అన్నాత్పురుషః సవా ఏష పురుషోన్నరసమయః’’ పరబ్రహ్మతత్త్వం నుండి ఆకాశము ఉద్భవించింది. ఆకాశము నుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి ఓషధులు, ఓషధులనుండి అన్నము (ఆహారము), అన్నము నుండి ప్రాణి పుడుతున్నాయి. పురుషాది ప్రాణికోటి అంతా అన్నరసమయము. అన్నరసముతో నిండియున్నది అన్నపూర్ణ. కనుక, సకల ప్రాణుల స్వరూ పం అన్నపూర్ణాదేవిగా సంభావించ బడుతోంది. అన్నపూర్ణా దేవి పరమేశ్వరుని ఇల్లాలు. కాశీ విశే్వశ్వరి అలనాడు శివుని పరీక్షలో వ్యాసుడు ఆకలితో నక నకలాడిపోతూ ఓర్చు కోలేక ముల్లోకాల్లో అధీశ్వరురాలైన కాశీనగరాణినే శపించబోతాడు. ఈశ్వ రుని ప్రతిరూపమే కాశిగా ఉంటే ఆ కాశీనే కోపాగ్ని జ్వాలలో మండి స్తానంటున్నాడీ వ్యాసుడు ఆ వ్యాసుని ఆకలి తీర్చే తల్లిగా నేనూరుకోలేను అంటూ స్వయంగా పార్వతీమాతయే అన్నపూర్ణయై గరిట పట్టింది.
కాశీనగరంలో ఆకలి అల్లాడువారు ఎవరూ ఉండకూడదని నిశ్చయంచిం ది. 108 రకాల ఆహారాన్ని తయారు చేసి వ్యాసునికి అతని శిష్యులకు కడుపార భోజనం పెట్టిందాతల్లి. ఆ తల్లి భోజనం తిని క్షుద్బాధ తీరాక తాను చేసిన తప్పును తెలుసు కొన్నాడు వ్యాసుడు. అపుడు గళమెత్తి తన్ను క్షమించి కాపాడమని శివుణ్ణి వేడుకున్నాడు. తనలాగే ఇంకెవ్వరూ ఆకలితో ఉండకూడదమ్మా ఈ కాశీ నగరానికి చేరినవారికి ఆకలి బాధను నీవే తీర్చాలి సుమా అంటున్న వ్యాసునికి అభయం ఇచ్చిందా తల్లి. అందుకే ఒక్క కాశీనగరంలోనే ప్రతి దేవాలయంలోను అన్నపూర్ణయై అన్న దాన సంకల్పాన్ని ప్రేరేపిస్తోంది ఆతల్లి. అందుకే ఏ నగరంలోనైనా ఏ వూరిలోనైనా చిన్న గుడి యైనా పెద్ద గుడి యైనా సరే అక్కడ ప్రసాద రూపంలోనో, అన్నదాన రూపంలోనే అన్నార్తులకు అన్నప్రసాదం లభిస్తోంది. ఈ అన్నపూర్ణవిలువ తెలుసుకోమని ఆదిశంకరాచార్యులు నిత్యానందకరీ వరాభయకరీ అంటూ స్తుతి చేశారు. సర్వజనావళికి ఆ అన్నపూర్ణ ఆశీస్సు లు లభించాలంటే కేవలం ధర్మ మూర్తులుగా ఉంటేచాలు. సత్యా న్ని పలుకుతూ ధర్మాన్ని ఆచరిస్తే ఆతల్లి దీవనలు ఎల్లవేళలా వెన్నంటే ఉంటాయ. తమకున్నంతలో తోటివారికి కాస్త ఆకలిని తీర్చాలన్న ధ్యాసను అందరూ కలిగి ఉండాలి.
ఎవరి గృహంలో అన్నమును అందరూ భగవంతుని ప్రసాదంగా సేవిస్తారో ఎవరు ఇతరులకు తనకున్నదాంట్లో కొంత ప్రసాదరూపంలో ఇస్తారో- వారి పాపాలన్నీ దగ్ధమైపోతాయి. వారి యింట్లో సుఖశాంతులు వెలుస్తాయ. గృహం- నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఆరోగ్యంగా భాసిల్లుతుంది. వీటిని ప్రసాదించే జగన్మాత- అన్నపూర్ణాదేవి. అని అధర్వవేదంచెబుతుంది.
‘‘అహమన్న మహమన్న మహమన్నమ్ అహమన్నాదోహ మన్నా దోహమన్నాదః ఆదిత్యాజ్ఞాయతే వృష్టిః వృష్టేరన్నం తతః ప్రజాః’’ అని, స్మృతులు సూర్యుని వలన మంచి వర్షములు, వర్షమువలన మంచి అన్న ము, అన్నము నుండి ప్రజలు పుడుతున్నారని, అన్నమును ముందు సూర్యునికి నివేదించి తర్వాత ఆరగించాలని చెబు తాయ. సూర్యునిలోని శక్తియే- అన్నపూర్ణాదేవి. కనుక ఆ తల్లి కరుణను పొందాలంటే సత్య ధర్మాలను పాటించాలి. తనకున్న దాంట్లో కాస్త దానం చేస్తే చాలు ఆ తల్లి దయామృతం లభించినట్లే. దీనులకు అన్నము ఉదకము దానము చేయటం- ధర్మము. దాన్ని ఆచరిస్తే శ్రేయస్సు, ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని మహాభారతంచెబుతుంది.
కనుక ఆ తల్లి ఆరాధన కులమత ప్రేమయం లేకుండా సర్వజనావళి చేద్దాం.అన్నార్తులనేవారు మన భారత దేశం లోనేకాదు సర్వలోకాల్లో లేకుం డా చేద్దాం. ఇదే ధర్మం కనుక ధర్మాన్ని ఆచరిద్దాం. ధర్మాన్ని రక్షితే ఆ ధర్మమే మనలను రక్షిస్తుంది.
- సాయ అఖిల్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565